మన మతానికి స్వేచ్ఛ లేదు..
ఆలయాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది..
సంప్రదాయ గురుకులాలు మూతపడ్డాయి..
వేదాభ్యాసం చేసే వాళ్లు లేకుండా పోతున్నారు..
గోమాతలు వీధుల్లో తిరుగుతున్నాయి..
ఆలయాల నుంచి వచ్చే డబ్బులు ఎక్కడో ఖర్చు చేస్తున్నారు..
మతపరమైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి..
ఊపందుకుంటున్న సనాతన ధర్మ బోర్డు
సరిగ్గా ఇలాంటి డిమాండ్ల నుంచే సనాతన ధర్మ బోర్డు నినాదం పుట్టుకొచ్చింది. ఇప్పుడు జరుగుతున్న మహా కుంభమేళాలోనే దీనికి బీజం పడింది. అవును హిందువుల పరిస్థితి బాగా లేదు. ఐక్యత లేదు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సీరియస్ నెస్ లేదంటూ అన్ని అఖాడాలు అంటే సాధువుల కూటమి ఏకగ్రీవంగా తీర్మానించిన విషయమిది. గత కొన్ని రోజులుగా సనాతన ధర్మ బోర్డ్ ఏర్పాటు చేయాల్సిందేనన్న డిమాండ్ ను కుంభమేళా వేదికగా సాధు సంతులు వినిపిస్తూ వచ్చారు. దాన్ని ఇప్పుడు క్లైమాక్స్ కు తీసుకొచ్చారు. తాజాగా కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్న నినాదంతో కదిలారు. ఇక మార్పు రావాల్సిందే అని గొంతెత్తారు. హిందువులకు పరమపవిత్రమైన కుంభమేళా ప్రాంగణంలోనే దీనికి పునాది పడాలనుకున్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే దిశగా మొదటి అడుగైతే వేశారు.
సనాతనం అంటే ఎవరికి వారే అర్థాలెందుకు?
సనాతన ధర్మం అంటేనే ఇదో పెద్ద సబ్జెక్ట్ అన్నట్లుగా మారిపోయింది. ఎవరికి వారే అర్థాలు ఇచ్చుకోవడం కూడా జరిగాయి. చర్చలు జరిగాయి. వాదోపవాదాలూ నడిచాయి. అన్ని మతాలకు బోర్డులు ఉన్నాయి. హిందువులకు ఎందుకు ఉండొద్దు.. హిందూ ఆలయాల నుంచి వచ్చే డబ్బుల్ని ఎక్కడో ఖర్చు పెట్టడం ఎందుకు.. మతపరంగా ఇక్కడ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి కదా అన్నది సాధు సంతుల డిమాండ్లు.
హిందువులకు ప్రత్యేక బోర్డు ఎందుకు ఉండొద్దు?
చెప్పాలంటే వక్ఫ్ బోర్డ్ మాదిరి హిందువులకూ ఓ బోర్డ్ ఉండాలన్నది వాదన. అయితే ఇది రాజ్యాంగపరంగా చట్టసభల్లో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే సాధువుల కూటములు స్వయంగా తమకు తామే ఈ చర్చను తెరపైకి తెచ్చి కుంభమేళాలో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా అడుగులు వేశారు.
మహంత్ రవీంద్రపురి సారథ్యం..
సనాతన ధర్మ బోర్డ్ అన్న సబ్జెక్ట్ ను ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక వేత్త దేవకినందన్ ఠాకూర్ తెరపైకి తెచ్చారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపురి కూడా ఈ వ్యవహారంపై కీలకంగా ఫోకస్ పెట్టారు. అఖాడాలతో మీటింగ్ లు పెట్టారు. ఈ బోర్డ్ వస్తే తక్షణం ఏమేం పనులు చేయాలి.. సంప్రదాయాలను ఎలా ఫాలో కావాలి.. ఏం చేయకూడదు.. ఇవన్నీ ఫిక్స్ చేశారు. మహాకుంభ్ నగర్‌లోని సెక్టార్ 17లో నిర్వహించిన ధర్మ సభను మతస్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకొంటామన్నారు. సనాతన్ బోర్డు రాజ్యాంగ ముసాయిదాను ప్రకటించారు. ఈ ధర్మసభకు అన్ని అఖాడాల ప్రతినిధులు, నలుగురు శంకరాచార్యుల ప్రతినిధులు హాజరయ్యారు. ఇది సాధు సంతులు కోరుకుంటున్నదే కాదు.. సినీ రాజకీయ ఆధ్యాత్మిక సామాన్య ప్రజలు కూడా చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
– ఒకటి.. మతపరమైన స్థలాల పరిరక్షణలో భాగంగా పురాతన దేవాలయాలు అలాగే తీర్థయాత్రల రక్షణ, ప్రచారం చేయడం
– రెండోది.. ఆధ్యాత్మిక విద్య అంటే సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు, సంప్రదాయాలను బోధించడానికి సంస్థలను స్థాపించడం, విశ్వవ్యాప్తం చేయడం.
– మూడోది యువతను ఏకం చేయడం.. ఇందులో భాగంగా యూత్ ను మతం అలాగే సంస్కృతితో లింక్ చేయడానికి ఆధునిక మాధ్యమాలను వాడడం.
– నాలుగోది కీలకమైన సామాజిక సామరస్యం. అంటే హిందూ మతంలోని వివిధ శాఖలు అలాగే సంప్రదాయాలను ఏకం చేయడం. ఈ విషయంలో చాలా భిన్నమైన అభిప్రాయాలు, వాదాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉంటాయి. మరి అంతా ఒక్కతాటిపైకి వచ్చేందుకు పీఠాలు, మఠాలు ఒప్పుకుంటాయా లేదా అన్నది కీలకంగా మారే విషయం.
– ఇక ఐదవది గ్లోబల్ ఐడెంటిటీ అంటే సనాతన ధర్మ సూత్రాలను అంతర్జాతీయంగా వ్యాప్తి చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు.
కాబట్టి ఈ సనాతన బోర్డ్ ద్వారా మత మార్పిడులను అరికట్టడం, దేవాలయాల ఆస్తులను పరిరక్షించడం, ధార్మిక సంస్థలను సక్రమంగా వినియోగించుకోవడం లక్ష్యంగా అడుగులు వేద్దామనుకుంటున్నారు. మరి ఈ ప్రయత్నం ముందుకెళ్తుందా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? రాజ్యాంగ బద్ధంగా బోర్డు ఏర్పాటు సాధ్యమేనా? దేశం నలు దిక్కుల్లో ఉన్న పీఠాలు, మఠాలు ఒప్పుకుంటాయా?
భిన్న శాఖలు, సైద్ధాంతిక గందరగోళం
సనాతన ధర్మ బోర్డ్ గురించి ఇప్పుడే కాదు.. గతంలోనూ చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేకపోయాయి. ఎందుకంటే భిన్న శాఖలు, సైద్ధాంతిక గందరగోళం, అనేక సంప్రదాయాలు, ఎవరికి తోచిన సిద్ధాంతాలు ఇన్ని వ్యవస్థల మధ్య దేశధర్మాల్ని ఉద్ధరించే వారెవరు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో ఆదిశంకరాచార్యులవారు అవతరించి ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఇప్పటికీ నిలిచి ఉందంటే అది ఆదిశంకరుల పుణ్యమే అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్లు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితిలో శంకరాచార్యులు అవతరించారు. ఆయన వేసిన ప్రతి అడుగూ ఒక పీఠమైంది. పలికిన ప్రతి పలుకూ స్తోత్రమైంది. చేసిన ప్రతి ప్రతిపాదనా శాసనమైంది.
అన్ని మఠాలు, పీఠాలు, శాఖలు ఒక్కతాటిపైకి వస్తాయా?
ధర్మానికీ, ధర్మానికీ మధ్య వైరం.. మతంలో ఉన్న శాఖల మధ్య దూరం.. పెరిగిన సందర్భంలో కథ మార్చేశారు. తాను స్థాపించిన వైదిక మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి నాలుగు పీఠాలను స్థాపించారు జగద్గురువు. తూర్పున పూరి, దక్షిణంలో శృంగగిరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరంలో బదరి క్షేత్రంలో పీఠాలను నెలకొల్పారు. తన ప్రధాన శిష్యులను ఈ పీఠాలకు అధిపతులుగా నియమించారు. ఈ నాలుగు పీఠాలు సనాతన ధర్మానికి నాలుగు దిక్కుల రక్షణ కవచాలై నిలబడ్డాయి. మరి ఇప్పుడు సనాతన బోర్డు ఏర్పాటుతో మ్యాటర్ మారుతుందా? బోర్డు డిమాండ్ చేసినంత ఈజీగా.. అన్ని మఠాలు, పీఠాలు, శాఖలు ఒక్కతాటిపైకి వస్తాయా అన్న క్వశ్చన్ వస్తోంది. బోర్డు చెప్పింది అందరూ వింటారా?
సనాతన్ ధర్మ రక్షా బోర్డు ఏర్పాటుపై గతంలో పిల్
సనాతన బోర్డు ఏర్పాటయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుందని, వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు, సనాతన బోర్డు ఎందుకు కాదు? అన్న ప్రశ్నల నుంచి ఉద్యమమైతే ఊపందుకుంది. గతంలో సనాతన్ ధర్మ రక్షా బోర్డు ఏర్పాటును కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సందర్భం ఉంది. అలాంటి బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా తాము అధికారులను ఆదేశించలేమని, ఇది విధాన పరమైన నిర్ణయం కావడంతో కోర్టుకు రావడానికి బదులు ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని గతేడాది నవంబర్ లో ఢిల్లీ హైకోర్టు సూచించింది.
ప్రభుత్వం దగ్గరికి వెళ్లాలని పిటిషనర్ కు సూచన
పిటిషనర్ తరఫు న్యాయవాది ఇతర మతాల్లో వారికి సంబంధించిన బోర్డులు ఉన్నాయని, ఇతర మతాలను అనుసరించే వారి నుంచి రక్షణ కోసం బోర్డు అవసరం ఉందని నాడు వాదనలు వినిపించారు. తమ రిప్రజెంటేషన్‌పై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కోర్టుకు వచ్చామన్నారు. అయితే పిటిషనర్ కోరినట్టు తాము ఆదేశాలివ్వలేని కోర్టు అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇస్తూ రిట్ పిటిషన్‌ను క్లోజ్ చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజకీయంగానూ సనాతన ధర్మం చుట్టూ ప్రకంపనలు
రాజకీయంగానూ సనాతన ధర్మ విషయం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. గతేడాది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతనంపై చేసిన కామెంట్లు వివాదంగా మారాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ, దానిని తుడిచేయాలన్నారు. అయితే వీటికి పరోక్షంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో కీ కామెంట్స్ చేశారు. సనాతనాన్ని ఎవరూ తుడిచేయలేరని, వారే తుడిచిపెట్టుకుపోతారన్నారు.
సనాతనాన్ని ఎవరూ తుడిచేయలేరన్న పవన్ కల్యాణ్
సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సనానత హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న హిందూ ఆలయాల పవిత్రత కాపాడేందుకు దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఏ రాష్ట్రంలోని ఆలయం అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఒకటే సనాతన ధర్మం ఉందని, ఈ సారూప్యతను ఒకే వేదిక మీదకు తీసుకురావాలని, అందుకే ఏదైనా బోర్డు గానీ, వేదిక గానీ తీసుకురావాలన్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉందన్నారు.
సనాతన హిందూ ధర్మ బోర్డుపై ఆలోచన చేయాలన్న పవన్
ఎవరు తుడిచిపెట్టుకుపోతారో లెట్స్ వెయిట్ అంటూ సీ అని అప్పట్లోనే ఉదయనిధి రిప్లై ఇచ్చారు. సో ఈ టాపిక్ రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది. మరిప్పుడు సనాతన ధర్మ బోర్డ్ ఏర్పాటు చుట్టూ జరుగుతున్న చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.