BigTV English

TDP Alliance Govt: కూటమి స్కెచ్.. విశాఖ మేయర్‌కి కౌంట్ డౌన్..

TDP Alliance Govt: కూటమి స్కెచ్.. విశాఖ మేయర్‌కి కౌంట్ డౌన్..

TDP Alliance Govt: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠం విశాఖ.. ఇప్పుడు ఆ విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మేయర్‌ని మార్చాలనుకున్నా అందుకు కాలపరిమితి ఆర్డినెన్స్ అడ్డుపడింది. ఇప్పుడు మేయర్ మార్పుకు లైన్ క్లియర్ అవ్వడంతో కూటమి ప్రభుత్వం వైసీపీని దెబ్బ కొట్టడానికి మరో అడుగు ముందుకేస్తుంది. కొత్తగా వైసీపీ నుండి కూటమిలో కార్పొరేటర్లు జాయిన్ అయితే టీడీపీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోగలదా? ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు? విశాఖ కౌన్సిల్లో బలాబలాలు ఎలా మారబోతున్నాయి.


విశాఖలో వైసీపీకి 58 మంది కార్పోరేటర్లు

విశాఖపట్నం నగరంలో వైసిపి బలం కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ నగరంలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలవకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని మాత్రం చేజిక్కించుకుంది. 58 మంది మున్సిపల్ కార్పొరేటర్లను గెలిపించుకుని గత నాలుగేళ్లుగా విశాఖ మేయర్ పీఠాన్ని ఏకచత్రాధిపత్యంతో ఏలుతుంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చినా మేయర్ పీఠాన్ని మాత్రం కదపలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.


వైసీపీ కార్పోరేటర్లను తమ వైపు తిప్పుకుంటున్న కూటమి పార్టీలు

విశాఖ కార్పొరేషన్ లోని వైసిపి కార్పొరేటర్ల సంఖ్యను తగ్గించడానికి బడా ప్లాన్ వేసిన కూటమి పార్టీలు వైసిపి నుండి తమ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక్కో కార్పొరేటర్‌ని తమ వైపు తిప్పుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీకి చెందిన కార్పొరేటర్లలో నలుగురు టీడీపీలో, అయిదుగురు జనసేనలో చేరారు. ఇండిపెండెంట్లుగా ఉన్న నలుగురు కార్పొరేటర్లు కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో కౌన్సిల్లో టిడిపి బలం పెరిగింది. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో టిడిపి విజయం సాధించింది. అప్పటి నుంచి విశాఖ కౌన్సిల్లో వైసీపీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది.

మేయర్‌గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న గొలగాని వెంకటరమణ

విశాఖ మేయర్‌గా వైసీపీ నుండి కొనసాగుతున్న గొలగాని వెంకట కుమారి బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జంప్ అవ్వడమే కాకుండా.. మేయర్ ను కూడా దించేసి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్లను పదవిలో కూర్చోబెట్టుతుండడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి నాలుగు సంవత్సరాల వరకు మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్లని, ఆఖరికి పంచాయితీ ప్రెసిడెంట్లని అవిశ్వాస తీర్మానంతో దించకుండా ఉండేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అప్పటినుండి ఇప్పటివరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ , పంచాయితీ ప్రెసిడెంట్లను ని పదవి నుంచి తొలగించి కొత్త వాళ్లను పదవిలో కూర్చోబెట్టడానికి అవకాశం లేకుండా పోయింది.

అమరావతిలో టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ కార్పోరేటర్లు

విశాఖ మేయర్‌గా వైసీపీ కార్పొరేటర్ గొలగాని వెంకట కుమారి పదవీకాలం నాలుగేళ్లు పూర్తి అవడంతో టిడిపి తన గేమ్ ప్లాన్ ను స్టార్ట్ చేసింది. ఇప్పటికే వైసీపీ నుండి టిడిపిలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లు తాజాగా అమరావతిలో టిడిపి కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పటివరకు విశాఖ కార్పొరేషన్ లో అధికారాన్ని చలాయిస్తున్న వైసిపి బలం తగ్గిపోవడమే కాకుండా మేయర్ పీఠం కూడా చేజారిపోనుంది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి టిడిపి సహా కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా టీడీపీలో చేరిన 9 మంది కార్పోరేటర్లు

విశాఖ నగర పాలక సంస్థలో మొత్తం 98 మంది మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని ఇప్పటివరకు భర్తీ చేయలేదు. 57 మంది కార్పొరేటర్ల బలమున్న వైసీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని వెంకట కుమారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టి ఇప్పటివరకు పాలన కొనసాగిస్తూ వచ్చింది. మేయర్ ను పదవి నుండి తప్పించాలని నిర్ణయించుకున్న కూటమి పార్టీలు తమ పార్టీల్లోకి వచ్చే వాళ్లను జాయిన్ చేసుకునే పనిలో పడ్డాయి. తాజాగా టిడిపిలో 9 మంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడంతో ఒక్కసారిగా లెక్కలన్నీ తారుమారైపోతున్నాయి.

విశాఖ కౌన్సిల్లో 39కి తగ్గిపోయిన వైసీపీ బలం

ప్రస్తుతం 57 మంది కార్పొరేటర్లు ఉన్న వైసిపి బలం 39 మంది కార్పొరేటర్లకు పడిపోవడం, వైసీపీతో పాటు ఇండిపెండెంట్లుగా ఉన్న కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో టిడిపి సహా కూటమి బలం అమాంతంగా పెరిగిపోయింది. కొత్తగా జాయిన్ అయిన వాళ్లతో కలిపి టిడిపి నుంచి 47 మంది కార్పొరేటర్లు, జనసేనకు ఎనిమిది మంది కార్పొరేటర్లు, సిపిఎం, సిపిఐ, బిజెపిలకు ఒక్కొక్క కార్పొరేటర్ మున్సిపల్ కౌన్సిల్లో కొనసాగుతున్నారు. టిడిపి, జనసేన, బిజెపిలకు మొత్తం ఓట్లు 56 ఉండడం, వాటికి తోడు విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉండడంతో మొత్తం కూటమి బలం 68 కి చేరింది.

వైసీపీ నుండి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోనున్న టీడీపీ

మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉన్న విశాఖ కౌన్సిల్లో 64 మంది కార్పొరేటర్ల బలం ఉంటే విశాఖ మేయర్ పీఠాన్ని టిడిపి చేజిక్కించుకోవచ్చు. ఇప్పటికే పార్టీ మారిన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపి టీడీపీ కూటమి బలం 68కి చేరింది. దాంతో వైసీపీ నుండి టీడీపీ కూటమి మేయర్ పీఠాన్ని ఈజీగా చేజిక్కించుకోనుంది. విశాఖ నగరంలో వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు. ఉత్తరాంధ్రలో కేవలం అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ తప్ప ఇంకెవరూ ఆ పార్టీ నుంచి గెలవలేదు. అయినా విశాఖ మేయర్ పీఠం తమ ఖాతాలో ఉండటంతో వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చాయి.

టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మేయర్ వెంకటకుమారి

ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం కూడా చేజారిపోయి టిడిపి ఖాతాలోకి వెళ్లిపోతుండడంతో వైసిపి నేతలు డైలమాలో పడుతున్నారంట. అదలా ఉంటే ప్రస్తుత మేయర్ గా ఉన్న గొలగని వెంకట కుమారి కూడా ఇంకో ఏడాది తనను మేయర్ గా కొనసాగిస్తే టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. వైసీపీ నుండి కార్పొరేటర్లు కూటమి పార్టీల్లోకి వెళ్లిపోవడం, మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టడం టీడీపీలోనే విభేదాలకు కారణమవుతోందంట.

విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుకు బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధిష్టానం

విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకునే బాధ్యతలను విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుకు టిడిపి అధిష్టానం అప్పగించిందంట. ఎమ్మెల్యే గణబాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లు వైసిపి కార్పొరేటర్లను టిడిపిలోకి జాయిన్ అయ్యేలాగా మంత్రాంగం నడిపి వ్యవహారం మొత్తాన్ని చక్కపెడుతున్నారంట. దీనిపై విశాఖ ఎంపీ భరత్‌కు గాని, విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు గండి బాబ్జికి గాని ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ వ్యవహారం మొత్తంపై మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేయడానికి వారు సిద్ధమవుతున్నారంట.

టీడీపీ విభేదాలతో మేయర్ మార్పు వాయిదా పడుతుందా?

మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమిలోని కార్పొరేటర్లు అందరు సిద్ధంగా ఉన్న సమయంలో టిడిపిలోనే ఇంటర్నల్ గా విభేదాలు రావడంతో విశాఖ నగర మేయర్ మార్పు ప్రస్తుతం ఉండకపోవచ్చు అంటున్నారు. దాంతో వైసిపి వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయంట. ఇప్పటికే మేయర్ మార్పుకు రంగం సిద్ధం అయినా టిడిపిలోనే విభేదాలు బయటపడుతుండటంతో విశాఖ నగర మేయర్ మార్పు ప్రస్తుతం ఉంటుందా ఉండదా అనే సందేహాలు నెలకొన్నాయి. మరి ఈ వ్యవహారంపై కూటమి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×