Telangana SSC Exams 2025: మార్చి 21 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21న మొదలైన పరీక్షలు ఏప్రిల్ నాలుగు వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 2650 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఎగ్జామినేషన్ డైరెక్టర్ వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు దాదాపు 5,09,403 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అందులో బాలురు సుమారు 2,58,895 కాగా, బాలికలు దాదాపు 2,50,508 మంది ఉన్నారు. 2650 పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాలలకు హాల్ టిక్కెట్లను ఇప్పటికే పంపారు.
విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సంబంధిత పాఠశాల నుంచి పొందవచ్చు. లేదంటే ప్రభుత్వం (www.bse.telangana.gov.in) వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు చేశారు అధికారులు. పరీక్ష ఉదయం 09.30 గంటల నుంచి మొదలవుతుంది. కేవలం 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు.
ఏర్పాట్లు రెడీ
వాతావరణం, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఏర్పాట్లు రెడీ చేశారు. ఫస్ట్ లాంగ్వేజ్- కాంపోజిట్ కోర్సుకు సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు మాత్రమే ఉంటుంది. సైన్స్ సబ్జెక్టు రెండు భాగాలు ఉంటాయి.పార్ట్-I ఫిజికల్ సైన్స్, పార్ట్-II బయోలాజికల్ సైన్స్ ఉంటాయి. వీటిని ఉదయం 9.30 నుండి ఉదయం 11.00 వరకు రెండు వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు.
ALSO READ: ఫామ్ హౌజ్ ను ముట్టడిస్తాం
సెంటర్ల వద్ద 144 సెక్షన్
విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రం ఎక్కడో తెలుసుకోవాలి. తద్వారా పరీక్ష రోజున కేంద్రానికి వేగంగా చేరుకోవచ్చు. పరీక్షలను సజావుగా జరగడానికి పాఠశాల విద్య డైరెక్టర్, సీనియర్ అధికారులను జిల్లా స్థాయి పరిశీలకులుగా నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరీక్షలు జరిగిన సమయంలో ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలు మూసి వేస్తారు. 144 ఫ్లయింగ్, స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.సమస్యాత్మక కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ప్రతి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ రూమ్‌లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
వాటికి నిషేధం
ఎప్పటిమాదిరిగానే పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను నిషేధించారు. విద్యార్థులు, సిబ్బంది ఆయా కేంద్రాలకు సెల్ ఫోన్ లు తీసుకెళ్లడం నిషేధించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు ఉండాలి. బయటి వ్యక్తులు ఎగ్జామ్ కేంద్రంలోకి అనుమతించరు.
అభ్యర్థులు తమతో పాటు తీసుకెళ్లడానికి కొన్నివస్తువులను మాత్రమే అనుమతిస్తారు. హాల్ టికెట్, పెన్, పెన్సిల్, స్కేల్, షార్పెనర్, ఎరేజర్, జామెట్రిక్ పరికరాలు మాత్రమే. విద్యార్థులు ఈ విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఓఎంఆర్ షీటులో వివరాలు తెలుసుకోవాలి.
ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే విద్యార్థులు ప్రతి పేజీలో వారి హాల్ టికెట్ నెంబర్ రాయాలి. అలాగే ఆన్సర్ బుక్ లెట్ పై హాల్ టికెట్ నంబర్ లేదా పేరును రాయకూడదు. బుక్ లెట్, బిట్ పేపర్, గ్రాఫ్ లేదా మ్యాప్‌లో ఏ భాగంలోని పేరు రాయకూడదు.