AP BJP: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనలు బీజేపీని లైట్‌గా తీసుకుంటున్నాయా? బీజేపీ జాతీయ అగ్రనేతలు వస్తే తప్ప, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వారికి కనిపించడం లేదా? నామినేటెడ్ పదవుల్లోనే కాక, ఎక్కడా కూడా ఏపీ బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదా? రాయలసీమ పర్యటనలో బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు మాధవ్‌కు ఎదురైన అనుభవం ఏమిటి? నేతలు, కార్యకర్తలు మాధవ్‌కు చెప్పినది ఏమిటి? నెక్స్ట్ మాధవ్ ఏం చేయబోతున్నారు? రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్సీ మాధవ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?
రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ రాయలసీమ పర్యటన పూర్తి చేశారు. కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తొలి విడతగా పర్యటించిన ఆయన, బిజీగా కార్యకలాపాలు కొనసాగించారు. ‘చాయ్ వాలా’ కార్యక్రమంతో మొదలై, రాత్రి వరకు ఆయన బిజీగా ఉన్నారు. ఉదయం ‘చాయ్ వాలా’ కార్యక్రమం, తర్వాత పుణ్యక్షేత్రాల దర్శనం, ఆ జిల్లాల్లో పేరు పొందిన వ్యక్తులను కలవడం, బీజేపీ నేతల సమావేశాల్లో పాల్గొనడం, కమిటీలతో భేటీ అవ్వడం ఇలా పార్టీ క్యాడర్‌లో జోష్ నింపేలా ఆయన రాయలసీమ పర్యటన సాగింది. కానీ, ప్రతి చోటా మాధవ్‌కు బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తల నుంచి “కూటమిలో ఉన్నామా లేమా?” అనే ప్రశ్నలే ఎదురయ్యాయి.
పార్టీ క్యాడర్‌లో జోష్ నింపేలా మాథవ్ రాయలసీమ పర్యటన
ప్రధానంగా ఎన్‌డీఏ కూటమిలో బీజేపీదే కీలక పాత్ర. కానీ, ఏపీలో బీజేపీ పేరు ఎక్కడా వినిపించడం లేదు. చంద్రబాబు, పవన్ కూడా తమ కార్యక్రమాల్లో బీజేపీ ప్రస్తావన తీసుకురావడం మానేశారు. రాయలసీమ పర్యటనలో కూడా మాధవ్‌కు ఇవే ప్రశ్నలు క్యాడర్ సంధించింది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలను పట్టించుకోవాలని మాధవ్‌కు చురకలు అంటించారు. బీజేపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. మిగతా జిల్లాల్లో కూడా మాధవ్‌కు ముఖ్య నేతల నుంచి ఇదే అనుభవం ఎదురైంది.
బీజేపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టిన పార్టీ నేతలు
స్థానికంగా దేవాలయాలు, గ్రంథాలయాలు, నామినేటెడ్ పదవులు, ఏవీ బీజేపీకి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆదినారాయణ రెడ్డి మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇచ్చిన మార్కెట్ కమిటీల్లో కూడా ఒకటి లేదా రెండు మాత్రమే దక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి గెలుపులో రాత్రిపగలు కష్టపడ్డామని, కూటమిలో ఉన్నప్పటికీ పదవులు కేటాయించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఏపీలో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. కానీ, జనసేనకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా బీజేపీకి ఇవ్వడం లేదని మాధవ్ ముందు ఆ పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి సముచిత ప్రాధాన్యం దక్కేలా చూడాలని ఆదినారాయణ రెడ్డి గట్టిగా కోరారు.
పదవుల్లో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వాలంటున్న మాధవ్
నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించిన మాధవ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నూతన అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత చంద్రబాబు, పవన్‌ను కలిసిన నేపథ్యంలో, కూటమి మంచి వాతావరణంలో కొనసాగాలంటే పదవుల పంపకాల్లో తమకు కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన మీడియా సమావేశంలో నేరుగా చెప్పారు. తాజాగా రాయలసీమ పర్యటనలో కమలం నేతల విన్నపాలు ఎక్కువ కావడంతో, పార్టీ క్యాడర్ నిరుత్సాహం చెందకుండా బీజేపీకి నామినేటెడ్ పదవుల సంఖ్య పెంచాలని చంద్రబాబు, పవన్‌తో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!
జిల్లాల పర్యటన తర్వాత మాధవ్ భేటీ అవుతారా?
ఆగస్టు 4 నుంచి 7 వరకు రెండవ విడత, ఆగస్టు 10 నుంచి 13 వరకు మూడవ విడత జిల్లాల పర్యటనను మాధవ్ ప్లాన్ చేసుకున్నారు. దీంతో, చంద్రబాబు, పవన్‌తో భేటీ జిల్లాల పర్యటన మధ్యలో ఉంటుందా, లేక పర్యటనలు ముగిసిన తర్వాత ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, ఏడాది తర్వాత కమలనాథుల్లో నూతనోత్సాహం తేవాలంటే, ఆశావాహుల ఆశలు మాధవ్ తీర్చాల్సిందే. ఆ దిశగా అడుగులు పడతాయా లేదా, మాధవ్ విన్నపాన్ని చంద్రబాబు, పవన్ స్వీకరిస్తారా లేదా అన్నది చూడాలి.