New Bride Incident: నిన్నటికి నిన్న.. భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘోరం మరువకముందే.. సత్యసాయి జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉదయం పెళ్లి చేసుకున్న నవ వధువు.. సాయంత్రానికి ప్రాణాలు తీసుకుంది. అసలు.. నవ వధువులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పాపం.. తల్లిదండ్రులదేనా? కారణమేదైనా.. ఎవ్వరితోనూ తమ బాధను చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకున్నా లాభం లేదని.. వాళ్లే నిర్ణయం తీసేసుకుంటున్నారు. బతుకు మీద ఎన్నో ఆశలున్నా.. బాధను దిగమింగలేక.. తనువు చాలిస్తున్నారు.
ఉదయం పెళ్లి చేసుకొని సాయంత్రానికి ఉరేసుకున్న హర్షిత
ఇటీవలకాలంలో చోటు చేసుకుంటున్న నవ వధువుల ఆత్మహత్యలు ఆందోళన పెంచుతున్నాయ్. సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో విషాదకరమైన ఘటన జరిగింది. ఉదయం అందరిముందు సంతోషంగా పెళ్లి చేసుకున్నట్లు కనిపించిన కొత్త పెళ్లికూతురు హర్షిత.. రాత్రికి ఆత్మహత్య చేసుకుంది. అప్పటివరకు బంధువుల కోలాహలంతో నిండిన ఆ ప్రాంతం.. ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో.. హర్షితకు సోమవారం వివాహం జరిగింది. అదే రోజు రాత్రి గదిలోకి వెళ్లి.. హర్షిత ఉరేసుకుంది. ఆమెకు ఇష్టంలేని పెళ్లి చేశారనే కారణంతోనే.. ఇలా చేసిందనే ప్రచారం జరుగుతోంది.
కేసును కీలక మలుపు తిప్పిన మృతురాలి తండ్రి స్టేట్‌మెంట్
అయితే అసలు మృతురాలు ఎందుకు సూసైడ్ చేసుకుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న ఉదయం వరకు అల్లుడు మంచివాడు అన్న అమ్మాయి తండ్రి.. ఇప్పుడు మాట మార్చాడు. మొదట తన కూతురికి పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కాని నిన్న సాయంత్రం అయ్యే సరికి అల్లుడికి డ్రగ్స్ అలవాటు ఉందని .. ఇవన్ని తమతో చెప్పుకోలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు తండ్రి. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు మృతురాలి కాల్‌డేటా, పోస్టు మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్రెండ్సే చంపేశారా?
అయితే ఆ పెళ్లి కూతురు ఉరి వేసుకునే సమయంలో కొద్దిసేపటి క్రితం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కలిసారు.. అందులో ఒక యువకుడు నలుగురు అమ్మాయిలు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆ అరగంటలో ఏం జరిగింది.. ఆ అరగంట తర్వాతే వధువు ఆత్మహత్య చేసుకుంది.. అసలు ఏంటి.. ఎందుకు వాళ్ళు వచ్చారు ఏం మాట్లాడారు.. అంటే పెళ్లీ కూతురిని వాళ్లే చనిపోయేలా ఏమైన మాట్లాడారా అనే దానిపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా పెళ్లి సమయంలో కాని.. ఎంగేజ్మెంట్ ఫోటోలో కాని చూసినట్లయితే ఆ వధువు మొఖంలో ఎక్కడ కూడా సంతోషం అనేదే లేదు. అంటే బలవంతంగా వివాహం చేయడం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుంది అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా
ఆడపిల్లలకు ఇష్టంలేని పెళ్లిళ్లు చేస్తే అంతేనా?
కూతురి పెళ్లి అంటే.. తమకు తప్పని బాధ్యతనే ఆలోచనతో.. ఎవరో ఒకరికి కట్టబెట్టేసి, బరువు దించుకొని, చేతులు దులిపేసుకునే తల్లిదండ్రులందరికీ.. ఏపీలో జరిగిన ఈ రెండు విషాద ఘటనలే.. బిగ్ ఎగ్జాంపుల్. తొందరగా పెళ్లి చేసేయాలనే ఆలోచనతో.. ఎవరికి ఇచ్చి చేస్తున్నారో.. ఎలాంటి వాడికి ఇచ్చి చేస్తున్నారో లాంటివేవీ తెలుసుకోకుండా కొందరు.. అసలు తమ కూతురుకి పెళ్లి ఇష్టమా? కాదా? అనేది ప్టటించుకోకుండా.. తమ ఇష్టానికి.. ఎవరో ఒకరి చేతిలో పెట్టేసి.. బరువు దించుకోవాలనే ఆలోచనతో ఇంకొందరు.. తొందరపడి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కానీ.. తర్వాత ఆ వేదనని అనుభవించలేక.. భర్త వేధింపులని భరించలేక.. ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. అటు భర్త పోరు పడలేక.. ఇష్టం లేని వాడితో జీవితాన్ని పంచుకోలేక.. నవ వధువులు చితికిపోతున్నారు. ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులారా.. మీ పిల్లల విషయంలో ఒక్కసారి ఆలోచించండి. వారికి ఇష్టమైతేనే పెళ్లి చేయండి. నచ్చిన వాడికే ఇచ్చి కట్టబెట్టండి. లేకపోతే.. ఇలాంటి అనర్థాలు జరుగుతూనే ఉంటాయ్. ఎంతోమంది అమ్మాయిల ప్రాణాలు పోతూనే ఉంటాయ్.