BigTV English

Goddess Sita Temple: బీహార్ ఎన్నికలకు కొత్త ఎజెండా.. ఆ ప్రాంతంలో సీతా దేవి ఆలయ నిర్మాణం

Goddess Sita Temple: బీహార్ ఎన్నికలకు కొత్త ఎజెండా.. ఆ ప్రాంతంలో సీతా దేవి ఆలయ నిర్మాణం

భవ్యమైన సీతాదేవి మందిర నిర్మాణం

సీతాదేవి జన్మస్థానంగా భావించే ఈ ప్రాంతంలో త్వరలోనే అతిపెద్దదైన జానకి మాత ఆలయం నిర్మాణం జరగబోతోంది. బీహార్ లోని సీతామర్హి పట్టణంలో జనకమహారాజుకు సీతాదేవి దొరికింది అనేది స్థల పురాణం. ఇక్కడ ఉండే సీతాదేవి విగ్రహం బంగారు ఆభరణాలతో ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే సీతా ఉత్సవానికి చాలా మంది భక్తులు వస్తుంటారు కూడా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకంటే భవ్యమైన జానకి మాత మందిర నిర్మాణం త్వరలోనే జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా అహ్మదాబాద్ సభలో ప్రకటించారు. శాశ్వత్ మిథిలా మహోత్సవ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. ఇప్పటికే అయోధ్యలో రామాలయం పూర్తి చేశామని ఇక బీహార్ లో సీతాదేవి మందిరం నిర్మిస్తామన్నారు.


త్వరలోనే మందిర నిర్మాణమన్న అమిత్ షా

నిజానికి బీహార్ మిథిలాంచల్ లో సీతాదేవి మందిర నిర్మాణంపై లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనే అమిత్ షా ప్రస్తావించారు. ఇక్కడ భవ్యమైన మందిరం నిర్మించి తీరుతామన్నారు. జానకి జన్మస్థలానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే మరోసారి ఈ ప్రతిపాదనలో వేగం పెంచుతున్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతోనే టెంపుల్ విషయంలో స్పీడ్ పెంచుతున్నారంటున్నారు.

గుజరాత్ అభివృద్ధిలో మిథిలాంచల్ ప్రజల సహకారం

గుజరాత్ అభివృద్ధిలో మిథిలాంచల్ అలాగే బీహార్ ప్రజల సహకారం ఎంతో ఉందన్నారు అమిత్ షా. సీతాదేవి కోసం అద్భుతమైన ఆలయం నిర్మిస్తామన్నారు అమిత్ షా. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీహార్ వెళ్లినప్పుడు, రామమందిరం నిర్మించామని, ఇప్పుడు సీతామాత కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సీతాదేవి కోసం నిర్మించే ఆలయం మొత్తం ప్రపంచానికి మహిళా శక్తి సందేశాన్ని ఇస్తుందని, అలాగే జీవితం ఎలా ఆదర్శంగా ఉండాలో తెలియజేస్తుందని అన్నారు.

సీతామర్హిలో 50 ఎకరాల సేకరణ

విదేహ ప్రజలు కలిసి జీవించినంత కాలం వారిని ఎవరూ ఓడించలేరని బుద్ధుడు చాలాసార్లు చెప్పారని, మిథిలాంచల్ ప్రజాస్వామ్యానికి బలమైన శక్తిగా చరిత్రాకంగా రుజువు చేసిందని గుర్తు చేశారు. సో సీతామర్హిలో సీతాదేవి ఆలయం కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. సీతామర్హిని సీత దేవి జన్మస్థలంగా భావిస్తారు. అక్కడ కొత్త ఆలయాన్ని నిర్మించడం కోసం ఇప్పుడున్న ఆలయం చుట్టూ 50 ఎకరాలను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఆలయ నిర్మాణాన్ని ప్రభుత్వం కాకుండా.. అయోధ్య ట్రస్టులాగానే ఒక పబ్లిక్‌ ట్రస్టు నిర్మించేలా, ఆ ట్రస్టే విరాళాలు సేకరించేలా చేస్తున్నారు. నిజానికి అక్కడ వందేళ్ల క్రితం నిర్మించిన పురాతన ఆలయం ఉంది. అయితే అది చాలా పాతబడిపోవడంతో ఇప్పుడు కొత్తగా పెద్ద ఆలయం రాబోతోంది.

ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో బీహార్ కు చాలా ప్రాధాన్యం ఇచ్చింది

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని చేసుకుంటున్నారని కాంగ్రెస్ ఇప్పటికే NDA పై ఆరోపణలు గుప్పించింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో బిహార్ కు చాలా ప్రాధాన్యం ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు సీతాదేవి మందిర నిర్మాణం కూడా కీలకంగా మారుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించబోతోంది.

బీహార్ సీతామర్హిలోని పునౌరా ధామ్ లో సీతామందిరం

దేశంలో ఎక్కడ చూసినా సీతారాముడు ఇద్దరూ కొలువు దీరిన ఆలయాలే ఉంటాయి. కానీ జానకీ మాత ఒక్కరే భక్తులకు దర్శనం ఇచ్చే ఆలయం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. బీహార్ సీతామర్హిలోని పునౌరా ధామ్ లో సీతామందిరం ఉంది. అయితే ఈ ఆలయాన్ని మరింత విస్తరించే ప్రణాళికలు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి.

సీతాదేవి పెద్ద ఆలయ నిర్మాణంపై ప్రణాళికలు

సీతాదేవి జన్మ స్థలాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే ఇక్కడ పెద్ద ఆలయలాంటిది ఏమీ లేదు. శతాబ్దం క్రితం నిర్మించిన పురాతన ఆలయం మాత్రం ఉంది. అయితే దీన్ని విస్తరించి అతిపెద్ద ఆలయం నిర్మించే ప్రణాళికలు జరుగుతున్నాయి. సీతాదేవి స్థల పురాణం గురించి చారిత్రక గాథలెన్నో ఉన్నాయి. మిథిల రాజ్యంలో ఒక ఏడాది అనావృష్టితో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే అప్పుడు పండితుల సూచనతో జనక మహారాజు యాగం చేశాడని, అందులో భాగంగా ఇంద్రుడిని మెప్పించడానికి స్వయంగా నాగలితో పంట పొలాన్ని దున్నుతుండగా.. జనకుడికి ఓ పెట్టెలాంటిది తగులుతుంది. తెరిచిచూస్తే చిన్నారి సీతమ్మ కనిపిస్తుంది. ఇదంతా జరిగింది సీతామర్హిలోనే అన్నది హైందవుల విశ్వాసం. అందుకే ఈ ప్రాంతాన్ని సీతాదేవి జన్మస్థలం గుర్తుగా చిన్న మందిర నిర్మాణం జరిగింది.

సీతామర్హి సీతాదేవి జన్మస్థానంగా నమ్మకం

సీతామర్హి సీతామాత జన్మస్థలమని బీహార్ టూరిజం శాఖ గుర్తించి పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. నవరాత్రి ఉత్సవాలు అలాగే శ్రీరామ నవమి పండుగల సమయంలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. 2023 డిసెంబర్ 13న బీహార్ సీఎం నితీష్ కుమార్ సీతామర్హిలోని పునౌర ధామ్ వద్ద సీతాదేవి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునౌరధామ్‌లో భారీ ద్వారం, ప్రదక్షిణలు చేసే మార్గం, సీతమ్మ వాటిక, లవ కుశ వాటిక, పార్కింగ్, వసతి ఇలా చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. సీతాదేవికి ఇప్పుడు కొత్తగా నిర్మించే ఆలయాన్ని అయోధ్య రామమందిరం శైలిలో నిర్మించాలనుకుంటున్నారు.

51 శక్తి పీఠాల నుంచి మట్టి తీసుకొచ్చే ఆలోచన

ప్రధాన ఆలయంలో కింది భాగం వృత్తాకారంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఆ చుట్టూ సీతాదేవికి చెందిన 108 విగ్రహాలు ఉంచేలా చూస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం 51 శక్తి పీఠాల నుంచి మట్టి తీసుకొచ్చేలా కార్యాచరణ రెడీ అవుతోంది. రామాయణంలో ప్రస్తావించిన 15 ముఖ్యమైన ప్రదేశాల సమాహారం రామాయణ సర్క్యూట్లో సీతామర్హి ఒక ప్రధాన భాగం. టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు NDA ప్రభుత్వం ఈ సర్క్యూట్‌ను గుర్తించింది. పునౌరా ధామ్ లోని సీతాదేవి ఆలయం వెనుక జానకి కుండ్ అనే సరస్సు కూడా ఉంది. ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దర్శనం చేసుకుంటారు.

అయోధ్య తర్వాత సీతాదేవి మందిర దర్శనం

హిందువులకు సీతామర్హి అంటే ఎంతో ప్రాముఖ్యత. ఇది అయోధ్యకు శ్రీరాముడికి ఉన్న ప్రాముఖ్యతకు సమాంతరంగా ఉంటుందని స్థానిక భక్తుల నమ్మకం. అయోధ్య రాముడికి ఎంత ప్రాధాన్యమైందో.. సీతామర్హి సీతకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందన్నది స్థానికుల మాట. ఈ సీతాదేవి ఆలయం అభివృద్ధి చెందితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అయోధ్యలోని బాలరాముడి సందర్శించిన తర్వాత నేరుగా సీతామాత జన్మస్థలానికి కూడా వచ్చి దర్శించుకుంటారన్న అంచనాతో ఉన్నారు. శ్రీరామ నవమి మాదిరిగానే.. సీతామర్హిలో ఏటా వైశాఖమాసం శుక్లపక్షం తొమ్మిదో రోజును సీతానవమిగా జరుపుకోవడం విశిష్టత.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×