ఫిరాయింపుల సబ్జెక్ట్ కు డెప్త్ ఎక్కువగా ఉంది. ఈ యాంటీ డిఫెక్షన్ లా లో లూప్ హోల్స్ ను ఎవరికి వారే తమకు అన్వయించుకుంటున్నారు. అటు కోర్టులు కూడా భిన్న సందర్భాల్లో భిన్నమైన తీర్పులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అదే సమయంలో శాసన వ్యవస్థలో, స్పీకర్ నిర్ణయాధికారాల్లో పూర్తిగా, నేరుగా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉండడంతో కథ మారుతోంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై గులాబీ నేతలు వరుసగా హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే గత పదేళ్లలో చేయాల్సిందంతా చేసి ఫిరాయింపులకు మూలకారణంగా నిలిచి ఇప్పుడు హడావుడి చేయడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోందంటున్నారు హస్తం నేతలు.
తాము చేస్తే పవిత్రం, అవతలి వారు చేస్తే మహాపాపం అన్నట్లుంది ఇప్పటి బీఆర్ఎస్ నేతల తీరు. ఒకప్పుడు పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి.. పార్టీలకు పార్టీలనే కలుపుకోవడం, ఇతర పార్టీలను చీల్చడం, రాజకీయ వ్యూహాలు అమలు చేశారు. ఇప్పుడు ఏమీ ఎరగనట్లు, ఫిరాయింపులు అన్న పదమే విననట్లు డీల్ చేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం సైలెంట్ గా అవతలి పార్టీలను ఖాళీ చేసిన ఘనత కేసీఆర్ ది. రాత్రికి రాత్రే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చాలా ఈజీగా కలిపేసుకున్నారు.
ఫిరాయింపుల్లోనూ కేసీఆర్ టెక్నికల్ లూప్ హోల్స్ ను వాడుకున్నారు. యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఎల్పీలను సైలెంట్ గా ప్యాక్ చేసేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతిపక్షాలు ఉండాలి. కానీ రాజకీయ పునరేకీకరణ అని, ఇంకేవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పేసి అప్పట్లో ఎమ్మెల్యేలను కలిపేసుకున్నారు కేసీఆర్. అందులో కొందరికి తాయిలాల కింద మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు. ఇది తప్పే కాదన్నారు. అప్పటి స్పీకర్ కూడా సైలెంట్ గా ఉండిపోయారు. అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని చెప్పుకున్నారు.
తమది సన్నాసుల మఠం కాదు.. ఫక్తు రాజకీయ పార్టీ అని లెక్కలేనన్ని సార్లు చెప్పారు కేసీఆర్. రాజకీయ పార్టీ రాజకీయం తప్ప ఇంకేం చేస్తుందని ఎదురుకూడా ప్రశ్నించారు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా… తమ దాకా వస్తేగానీ అసలు బాధ తెలియదంటారు. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ నుంచే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే సరికి అనర్హత వేటు వేయాలని, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని, రకరకాల సుద్దులు చెబుతున్నారంటున్నారు. ఈ వ్యవహారంలో అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తామని.. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని కడియం శ్రీహరి అంటున్నారు. గతంలో పక్క రాష్ట్రాలలో కూడా కోర్టులు ఈ తరహా తీర్పులు ఇచ్చాయని.. ఫిరాయింపులపై ఒక్కో కోర్టు ఒక్కో తీర్పులు ఇస్తున్నాయని అన్నారు. అసలు ఫిరాయింపులకు మూలకారకులే బీఆర్ఎస్ నేతలని ఫైర్ అయ్యారు.
Also Read: బీసీ కుల గణనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు… 3 నెలల్లోపు..
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి డీకోడ్ చేద్దాం. 2014లో తెలంగాణ రావడం, అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ గెలవడం చకచకా జరిగిపోయాయి. అప్పట్లో గులాబీ పార్టీ కేవలం 63 సీట్లతో అత్తెసరు మెజార్టీతో మాత్రమే గెలిచింది. మెజార్టీ కంటే 3 సీట్లే ఎక్కువ. ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇబ్బంది తప్పదనుకున్నారో మరేంటోగానీ… అప్పుడే కేసీఆర్ పొలిటికల్ గేమ్ షురూ చేశారు. రాజకీయ పునరేకీకరణ కోసం అంతా కలిసి రావాలంటూ ఒక విచిత్రమైన పిలుపు ఇచ్చారు. సీన్ కట్ చేస్తే 2014లో ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప ఇద్దరినీ టీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో మాధవరం కృష్ణారావు, చల్లా ధర్మారెడ్డి, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, కృష్ణారెడ్డి, వివేకానంద్, రాజేందర్‌రెడ్డి ఇలా మొత్తం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను దశలవారీగా ఆకర్షించి టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయించుకున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీ రెండే సీట్లను గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర్‌రావు ను కూడా 2021లో చేర్చుకుని టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ చేయించారు కేసీఆర్.
అటు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకి వచ్చారు కేసీఆర్. అప్పుడు బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ రెండు పక్షాల వారినీ పార్టీలో చేర్చుకుని బలహీనంగా ఉన్నామనుకున్న చోట బలం పెంచుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ను మరింతగా బలహీన పరిచేందుకు.. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఇందులోనే 12 మంది ఎమ్మెల్యేలకు గాలం వేసి జాయిన్ చేసుకున్నారు. ఆత్రం సక్కు, జాజాల సురేందర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, హర్ష వర్దన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇది అందరికీ తెలిసిన హిస్టరీ.
బీఆర్ఎస్ నేతలకూ తెలుసు, కాంగ్రెస్ నేతలకు తెలుసు, జనానికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలు ఫిరాయింపులపై ఓరేంజ్ లో ఊగిపోతున్నారు. అప్పట్లో ఒకరిద్దరు మారిన వెంటనే కంప్లైంట్ ఇస్తే స్పీకర్ పట్టించుకోలేదు. గతంలో అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినందుకు గద్వాల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. నాడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన డీకే అరుణ ను ఎమ్మెల్యేగా ప్రకటించినా కోర్టు ఆదేశాలను అప్పటి స్పీకర్ అమలు చేయలేదు. సో ఇవే ఫిరాయింపులు అప్పట్లో బీఆర్ఎస్ కు ప్లస్ అయ్యాయి, ఇప్పుడు అవే మైనస్ అయ్యాయి. 4 వారాల తర్వాత ఏం జరుగుతుందన్నదే అసలు విషయం. డివిజన్ బెంచ్ కు వెళ్లడం, ఆ తర్వాత మ్యాటర్ సుప్రీం కోర్టుకు వెళ్లడం, ఇవన్నీ జరగడం ఖాయమే. అయితే వీటికి చాలా టైం పట్టే అవకాశాలున్నాయి. అంత సులువుగా తేలదు. ఈలోగా బీఆర్ఎస్ నుంచి మరో 16 మంది వచ్చి చేరితే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ఎల్పీలో విలీనమైతే యాంటీ డిఫెక్షన్ చట్టమే వర్తించదు.