Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు.. కలెక్షన్ కింగ్ పేరున్న మోహన్ బాబు వేదిక ఎక్కితే సిద్ధాంతాలు, వేదాంతాలు ఏకరువు పెడతారు. విద్యా సంస్థలను దేవాలయాలుగా వర్ణిస్తారు. వాస్తవంలో కూడా ఆయన విద్యా సంస్థలకు మంచి క్రేజ్ ఉన్నది. శ్రీవిద్యా నికేతన్ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) వరకు విద్యార్థులు పోటీ పడి మరీ అందులో చేరుతారు. కానీ, అక్కడ పరిస్థితులు బయట ప్రచారంలో ఉన్నవాటికి భిన్నంగా ఉన్నాయని ఇప్పుడు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనతో చెబుతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. స్టూడెంట్ ఫీజులను కలెక్షన్లు అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఎంబీయూపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) సహా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు అందించారు. ఏం జరిగిందో వివరంగా చూద్దాం.
మంచు ఫ్యామిలీ 1992లో శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరికొన్ని విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. ఇలా తొమ్మిది విద్యా సంస్థలను కలుపుకుని 2002లో తిరుతిలోనే మోహన్ బాబు యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. దీనికి అటానమస్ యూనివర్సిటీగా గుర్తింపు పొందారు. యూజీసీ అనుబంధంలోనే ఈ యూనివర్సిటీని నడిపిస్తున్నారు. ఈ యూనివర్సిటీకి చాన్సిలర్‌గా పద్మ శ్రీ, డాక్టర్. మోహన్ బాబు స్వయంగా బాధ్యతల్లో ఉన్నారు. తాజాగా.. ఈ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు వర్సిటీకి షాక్ ఇచ్చారు. వర్సిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐసీటీఈ నిబంధనలను ఈ ఎంబీయూ తుంగలొ తొక్కుతున్నదని ఆరోపించారు. నిబందనలకు విరుద్ధంగా ఫీజులు ఇబ్బడిముబ్బడిగా పెంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బలవంతంగా యూనిఫామ్‌లు కొనుగోలు చేయిస్తున్నారని, డే స్కాలర్లు కూడా కచ్చితంగా మెస్‌లోనే తినాలనే రూల్ పెట్టారని, బస్ ఫీజులు వసూలు చేస్తూ సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలు గుప్పించారు. ఇదేమని వారు ప్రశ్నిస్తే.. బౌన్సర్లు పెట్టి బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వారు.. ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతా కలిసి మోహన్ బాబు యూనివర్సిటీపై ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మంత్రి నారా లోకేశ్‌కు, ఏఐసీటీఈకి ఫిర్యాదు ఇచ్చారు.
Also Read: Hitech City Land Issue: మళ్లీ తెరపైకి.. 35 వేల కోట్ల స్కాం
ఈ వ్యవహారంపై ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఈశ్వరయ్య బిగ్ టీవీతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న మోహన్ బాబు యూనివర్సిటీపై యాక్షన్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడి విద్యార్థులు, పేరెంట్స్ తమ దృష్టికి తెచ్చిన వివరాలతో తాము కంప్లైంట్ చేశామని తెలిపారు. ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి ఫీజులు వసూలు చేయాలని, కానీ, ఎంబీయూ మాత్రం.. బిల్డింగ్ ఫీజు అని, ఫ్యూచర్ ఫీజు అని విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. బస్సులో పోవడానికి ఫీజులు వసూలు చేసి విద్యార్థులు అందరు కూర్చుని ప్రయాణించే ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించారు. సీట్లు లేక విద్యార్థులు 45 నిమిషాలపాటు నిలబడే ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయని, ఫీజులు తీసుకున్నప్పుడు దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందని వివరించారు. ఇదేమని అడిగితే బౌన్సర్లను చూపి బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ వంద మంది వరకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఈ బౌన్సర్లు విద్యార్థులతోపాటు పేరెంట్స్‌తోనూ ఒకట్రెండు సార్లు అమర్యాదకరంగా వ్యవహరించారని చెప్పారు. ఈ విషయాన్ని పేరెంట్స్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ సరైన రీతిలో స్పందించలేదని ఈశ్వరయ్య వివరించారు.
మెస్ మధ్యాహ్నం 2.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఉంటుందని, అది విద్యార్థులకు సరైన సమయం కాదని ఈశ్వరయ్య తెలిపారు. ఇక ఆ యూనివర్సిటీలోని అధ్యాపకవర్గం గురించి మాట్లాడుతూ.. అక్కడ పని చేస్తున్న లెక్చరర్లను ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా నైపుణ్యాలు, అర్హతలను పరిగణనలోకి తీసుకుని నియమించుకోలేదని ఆరోపించారు. అకడమిక్ ఇయర్ మొదలై రెండు మాసాలు కూడా పూర్తి కాకముందే.. వారి కాంట్రాక్టు కూడా ముగియకముందే సుమారు 15 మంది లెక్చరర్లు రాజీనామా చేశారని వివరించారు. కొంతమంది ఉపాధ్యాయులకు సరైన వేతనాలు అందక హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తున్నారన్నారు. తాము కట్టిన ఫీజుకు కనీసం 40 శాతం న్యాయం కూడా జరగడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఈశ్వరయ్య వివరించారు.
Also Read: HYDRA: వాడ్రా రావాలి.. ఓరుగల్లు మారాలి!.. స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 2
రాష్ట్రంలోని కాలేజీల్లో ఫీజులను క్రమబద్ధీకరించడానికి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉన్నదని ఈశ్వరయ్య వివరించారు. ఒక్కో ఇంజినీరింగ్ కాలేజీ.. అది అందించే సౌకర్యాలను బట్టి ఫీజులు వసూలు చేసుకోవడానికి ఈ కమిటీ అవకాశం ఇస్తుందని, కానీ, మోహన్ బాబు యూనివర్సిటీ విషయానికి వస్తే వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉన్నదని ఆరోపించారు. ఎంబీయూలో స్టేట్ రెగ్యులేటరీ కమిటీ, ఏఐసీటీఈ రూల్స్ పని చేయడం లేదన్నారు. శ్రీవిద్యానికేతన్ కూడా ఇలాగే లక్షల ఫీజులు వసూలు చేసిందని, ఇప్పుడు ఎంబీయూ కూడా వసూలు చేస్తున్నదని తెలిపారు. క్యాంపస్ పెద్దగా ఉన్నదని, అక్కడ సీటు కావాలంటే లక్షలు చెల్లించుకోవాల్సిందేననే పద్ధతి ఉన్నదని చెప్పారు. మోహన్ బాబు ఏమి చేసినా చెల్లుబాటవుతుందని, ఆయనను అడిగేవారు ఉండరనే పరిస్థితి ఉన్నదని ఈశ్వరయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.