KCR vs MLA Jagadish Reddy: ఆ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బాగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా ? కారు పార్టీని వలస వ్యవహారం భయపెడుతుందా ? ఆ ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో.. కారు పార్టీని నడిపించే నాయకులే కరువయ్యారా ? ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గులాబీ బాస్‌ని కలవరపెడుతున్న మరో మ్యాటర్ ఏంటి ? ఆ నియోజకవర్గం ఏది.. అక్కడ పరిస్థితి ఏంటో.. వాచ్ ది స్టోరీ..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు గడ్డు కాలం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు గడ్డు కాలం నడుస్తోందట. 12 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో కారు పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తోందట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ లో చేరిన నాయకులంతా తిరిగి హస్తం గూటికి చేరుకుంటున్నారట. ఓ వైపు వలసల పరంపర కొనసాగుతుండగా.. చేరికలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో కారు పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోవడంతో.. కార్యకర్తలకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని టాక్ నడుస్తోంది.
2019 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి గెలుపు
మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీమారాక.. నియోజకవర్గంలో కారు నడిపే డ్రైవర్ లేక క్యాడర్ మొత్తం పక్కచూపులు చేస్తోందట. 2019 ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి గెలుపొందినా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో ఓటమి పాలయ్యారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయానికి సైదిరెడ్డి పార్టీ మారి బీజేపీలో చేరారు. దాంతో ఆయన్ను కమలం పార్టీ నల్గొండ ఎంపీగా బరిలో దింపింది. కానీ ఆయన అక్కడ కూడా ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారట.
ఏడాది నుంచి నియోజకవర్గానికి బీఆర్ఎస్ నుంచి నో ఇంచార్జ్
ఏడాది కాలంగా నియోజకవర్గానికి బీఆర్ఎస్ కొత్త ఇంచార్జ్‌ను నియమించకపోవడంతో.. పార్టీ శ్రేణులు కూడా పరేషన్ అవుతున్నారట. నియోజకవర్గానికి ఓ మాజీమంత్రిని బాధ్యతలు తీసుకోవాలని కేసీఆర్ సూచిస్తున్నా.. ఆయన మాత్రం నాకొద్దని చెబుతున్నారట. నడిపించే వారు లేక.. కొత్త వారు రాక.. క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సైదిరెడ్డి పార్టీ మారే సమయంలో కొందరు లీడర్లు మాత్రమే ఆయన వెంట నడిచినా.. మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి తోడు సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగడానికి.. ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి.. ఇప్పుడు అత్యంత దయనీయంగా తయారైందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి ఆమంచి క్రిష్ణ మోహన్..?
హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ విజయం
ఇక హుజూరాబాద్ నియోజకవర్గం మొదట నుంచి కాంగ్రెస్ కంచుకోట. 2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి గట్టిగా పాతుకుపోయిందట. 2018లో ఉత్తం కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. అధిష్టానం ఆదేశంశాల మేరకు నల్గొండ ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో 2019లో జరిగిన ఉపఎన్నికల్లో.. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన సైదిరెడ్డి గెలుపొందారు. అయితే అప్పటికీ నియోజకవర్గంలో కారుపార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని చెబుతున్నారు.
2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ విక్టరీ
కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.. 2009 నుంచి ఇక్కడ నుండి ప్రాతినిత్యం వహిస్తుండడంతో.. కాంగ్రెస్ పార్టీకి మొదటినుంచి ఇక్కడ గట్టి పట్టు ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న క్యాడర్‌ని అయినా.. నడిపించే నాయకుడు లేకుండా పోయారని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతోన్నారట. తమను ముందుకు నడిపే లీడర్ కావాలంటూ వారంతా హైకమాండ్‌ను కోరుతున్నారట. కనీసం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు పెద్దదిక్కుగా ఉన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డిని అయినా.. హుజూర్ నగర్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నా.. ఆయన మాత్రం ససేమీరా అంటున్నట్టు సమాచారం.
గులాబీ బాస్ ను కలవరపెడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు
మరోవైపు గులాబీ బాస్‌ను స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం కూడా కలవరపెడుతుందట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులతో పాటు బడా, చోటా లీడర్లు అందరూ గంపగుత్తగా కాంగ్రెస్ గూటికి చేరిపోవడం బీఆర్ఎస్ అధినేతకు తలనొప్పిగా మారిందట. దీంతో రాబోయే రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో కారు పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. గడ్డు కాలాన్ని అధిగమించేందుకు బీఆర్ఎస్ ఏం యాక్షన్ తీసుకుంటుంది. పార్టీ క్యాడర్‌ని మళ్లీ యాక్టివ్ చేసే బాధ్యతలను కేసీఆర్ ఎవరికి ఇస్తారు ? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కి పరాభవం తప్పదా అని చర్చ నడుస్తోంది.