KCR Master Plan: 7 నెలల లాంగ్ రెస్ట్ తర్వాత గులాబీ బాస్ జనంలోకి వచ్చారు. పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టారు. ఇంత చేసి భవిష్యత్ పై దిశానిర్దేశం చేస్తారని చాలా మంది గులాబీ లీడర్లు అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ ఉద్యమ చరిత్ర – బీఆర్ఎస్ పాత్రపై గంటలు గంటలు మాట్లాడారు. మళ్లీ సెంటిమెంట్ రగిల్చి లాభపడే ఉద్దేశమే తప్ప.. భవిష్యత్ లో ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం అన్న పాయింట్లు లేకుండా పోయాయన్న వాదన వినిపిస్తోంది. ఆత్మ స్తుతి, పరనింద ఇదేనా గులాబీ బాస్ కొత్త సందేశం?
కేసీఆర్ ఇచ్చిన కొత్త సందేశమేంటి?
7 నెలల సుదీర్ఘమైన రెస్ట్ తర్వాత కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటికొచ్చారు. వస్తూనే నేరుగా పాస్ పోర్ట్ ఆఫీస్ కు వెళ్లి రెన్యువల్ చేయించుకున్నారు. ఆ తర్వాతి రోజు హాస్పిటల్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మధ్యలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. చూసిన వారికి ఇది ఏమనిపిస్తుంది? తప్పనిసరి పనుల కోసం బయటికొచ్చి మధ్యలో పార్టీ మీటింగ్ పెట్టినట్లుగా ఉంది. ఇంతా చేసిన మాజీ సీఎం కేసీఆర్.. కొత్తగా ఏదైనా సందేశం ఇచ్చారా అంటే అదీ లేదు.
తెలంగాణ ఉద్యమ చరిత్రపై పాఠాలు
మరోసారి తెలంగాణ ఉద్యమ చరిత్ర, అందులో కేసీఆర్ పాత్ర, సెంటిమెంట్ చుట్టూనే మ్యాటర్ మొత్తం తిప్పారు. పార్టీ నేతలతో మాట్లాడిన స్పీచ్ లో ఎక్కువ దానికే కేటాయించారు. ఎక్కడైనా చేసిన పని గెలిపిస్తుంది. నిలబెడుతుంది. ఇంకా ఎన్నాళ్లు సెంటిమెంట్ ను పట్టుకుంటారన్న విమర్శలను ప్రత్యర్థులు వినిపిస్తున్నారు. ఇంత చేసి గత పదేళ్లలో ఉద్యమకారులకు కేసీఆర్ ఏపాటి గౌరవం ఇచ్చారన్న ప్రశ్నలు వచ్చి పడుతున్నాయ్.
జనం అత్యాశకుపోయి ఓట్లేశారన్న డైలాగ్ లు
బీఆర్ఎస్ భవన్ లో ఈనెల 19న విస్తృతస్థాయి మీటింగ్ పెట్టిన కేసీఆర్.. అధికార పార్టీపై చేసిన ప్రతి విమర్శకు ప్రత్యర్థులు కౌంటర్ ఇస్తున్నారు. పదేళ్ల పాలనలో అంతా బాగా చేస్తే.. అరచేతిలో వైకుంఠం చూపించకుండా మైమరపింపచేస్తే ఎందుకు ఓడినట్లు? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. పైగా.. జనం అత్యాశకు పోయి, తులం బంగారం కోసం కాంగ్రెస్ కు ఓట్లు వేశారన్న డైలాగ్ కొడుతూ.. ఓట్లేసిన ప్రజలదే తప్పు అన్నట్లుగా వ్యవహారం నడిపిస్తున్నారు. పదేళ్లలో జరగనివి.. ఏడాదిన్నరలోనే జరిగిపోవాలన్న పాయింట్ ను పట్టుకోవడం కేసీఆర్ రేంజ్ కు సరైనదేనా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
విస్తృతస్థాయి మీటింగ్ లో దశదిశ తేలలేదా?
రాకరాక జనంలోకి వచ్చి పార్టీని ఎలా జనంలోకి తీసుకెళ్లాలన్న విషయంపై దిశానిర్దేశం చేసుకోవాలి. కానీ విస్తృతస్థాయి మీటింగ్ లో అలా జరగలేదు. ఏదో అనుకుని ఇంకేదో చెప్పారా.. అన్న టాక్ ఇంటర్నల్ గా నడుస్తోంది. తమ పాలన భేష్, కాంగ్రెస్ పాలన బేకార్ అన్నట్లుగా మాట్లాడారు. అన్ని రంగాలు పడకేశాయన్నారు. అన్ని వర్గాల వారు రోడ్డున పడ్డారన్నారు. ప్రతిపక్ష నేతగా ఇవన్నీ రొటీన్ డైలాగ్సే. అయితే కొంత వరకైనా కనెక్ట్ అయ్యేలా ఉండాలి కదా అన్న పాయింట్ ను ప్రత్యర్థులు వినిపిస్తున్నారు.
జనానికి దూరంగా ఉంటే నష్టమని తెలియదా?
నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది. అన్నది కేసీఆర్ చూసుకోవడం లేదా అన్న పాయింట్ కూడా చర్చకు వస్తోంది. నడిపించే నాయకుడు జనానికి దూరంగా.. ఉంటే నష్టం ఎవరికి అన్నది కూడా ఆలోచించడం లేదా అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి.. ప్రభుత్వం ఏవైనా తప్పులు చేస్తే నిలదీయడం, ఎండగట్టడం, సలహాలు ఇవ్వడం వంటివి కూడా చేయకపోతే ఎలా అన్న పాయింట్ కూడా తెరపైకి వస్తోంది. అంతెందుకు కులగణనలో పాల్గొనకుండా తిరిగి ఆ సర్వేపైనే విమర్శలు చేయడం.. ఇవన్నీ జనం అబ్జర్వ్ చేసే అంశాలే.
ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి దూరమెందుకు?
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మరింతగా పడిపోయింది. తమకు తెలంగాణలో తిరుగే లేదు అనుకున్న గులాబీ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు సున్నా. ఇది ఎవరూ ఊహించలేదు. అయితే రాష్ట్రంలోనే ఓడారు.. ఇక ఎంపీ సీట్లు గెలిపించడం ఎందుకని జనం దూరం పెట్టేశారు. ఇప్పుడు ఏకంగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి వరుసగా పోటీ పెట్టకపోవడం కూడా వేరే సిగ్నల్స్ ను పార్టీ శ్రేణుల్లోకి, జనంలోకి తీసుకెళ్తోంది.
కీలక సమయంలో అస్త్ర సన్యాసంపై ప్రశ్నలు
అంతెందుకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా సొంతంగా ప్రాతినిథ్యం వహించే చోట కూడా అభ్యర్థిని పెట్టి తమ స్టామినా ఏ పొజిషన్ లో ఉందో చూసుకోవాల్సిన టైంలో అస్త్ర సన్యాసం ఏంటన్న ప్రశ్నలకు కూడా తాజా మీటింగ్ లో జవాబు రాకుండా పోయింది. బీఆర్ఎస్ టిక్కెట్ వస్తుందని నమ్ముకున్న రవీందర్ సింగ్ లాంటి లీడర్లు.. ఇండిపెండెంట్ గా నామినేషన్లు వేసుకున్నారు. ఇదేనా గులాబీ బాస్ తమ లీడర్లు, క్యాడర్ కు ఇచ్చుకునే సందేశం?
ఉత్సాహం రావాలంటే జనంలో ఉండాల్సిందేనా?
సో తిరిగి పుంజుకున్నాం.. జనంలోనే ఉన్నాం.. అని చెప్పుకోవాల్సిన పోటీలో దూరం ఉండడం గులాబీ పార్టీకి చాలా నష్టం చేసే అంశం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫాంహౌజ్ సీఎం అన్న ప్రచారం జరిగి అది ఓటమికి దారి తీసింది. ఇప్పుడు కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ముందుండి నడపాల్సిన టైంలో ఏకంగా 7 నెలల గ్యాప్ తర్వాత ఫాంహౌజ్ నుంచి బయటకు వచ్చారు. ఇలా జరిగితే క్యాడర్ లో జోష్ పెరిగేదెలా.. లీడర్లలో ఉత్సాహం వచ్చేదెలా అన్నది గులాబీ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న డిబేట్. పనిలో పనిగా కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ సీజనల్ పొలిటీషియన్ అంటూ, ఆయన ఫాంహౌజ్ లో పర్మినెంట్ గా రెస్ట్ తీసుకుంటేనే బెటర్ అని కౌంటర్లు కూడా ఇస్తున్నారు.
బీఆర్ఎస్ స్పేస్ ను ఆక్రమిస్తున్న బీజేపీ
పని అయిపోయిందనుకున్న పార్టీలు లేచాయి. లేచిన పార్టీలు పడిపోయిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. అయితే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ స్పేస్ ను బీజేపీ క్రమంగా ఆక్రమిస్తూ వస్తోంది. ఇది ఆ పార్టీకి అన్నిటికంటే పెద్ద సవాల్. అలాంటి విషయాలపై దిశానిర్దేశాలు లేకుండా పోవడమే పెద్ద మైనస్ అన్న టాక్ ఆ పార్టీలోనే వినిపిస్తోంది.
సీఎం హోదాలో ప్రధానిని ఎన్నిసార్లు కలిశారు?
కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 ఎంపీ సీట్లున్నా నిధులు తేలేదన్నారు కేసీఆర్. మరి అదే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి.. ఎన్నిసార్లు ప్రధానిని కలిశారన్న పాయింట్ వినిపిస్తోంది. అటు కృష్ణా జలాలను కాపాడుకోవడం తెలియట్లేదన్నారు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంగమేశ్వరం పనులు జరుగుతుంటే ఏం చేశారన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట్ల బైపోల్స్ రావడం ఖాయమే అంటున్నారు కేసీఆర్. బైపోల్స్ కు పోటీ చేసే ఉత్సాహం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేదా.. ధైర్యం చాలట్లేదా.. గతంలో బలం ఉన్నా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఎందుకు లాగేశారన్న ప్రశ్నలకు జవాబులు లేవు.
ఎమ్మెల్సీకి పోటీకి వెనుకంజ ఎందుకు?
పార్టీ పని అయిపోయిందని సొంత పార్టీ వాళ్లే ప్రచారం చేయడంతోనే పది మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని కేసీఆర్ మీటింగ్ లో అన్నారు. కానీ అక్కడ జరిగింది నిజంగా అదే ఫ్యాక్టరా.. అంటే కాదన్న జవాబు వస్తోంది. మరోవైపు కేసీఆర్ పవర్ లో ఉన్నప్పుడు కేంద్రంతో అంటీ ముట్టనట్లు ఉండడం, ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినా కనీసం వెళ్లి కలవకపోవడం, అలక పాన్పు ఎక్కడం, ఎడమొహం పెడమొహం అన్నట్లుగా డీల్ చేయడం ఇవన్నీ జరిగాయి. కేంద్రంతో గట్టిగా కొట్లాడలేదు.. అడగాల్సినవి అడగలేదు. ఫాలోఅప్ చేయాల్సినవి చేయలేదు.. మరి వచ్చేవి ఎలా వస్తాయన్న ప్రశ్నలకు జవాబు లేకుండా పోయింది.
తాజా మీటింగ్ లో బీజేపీపై మాట్లాడలేకపోయారా?
ఇంత చేసి తాజా విస్తృతస్థాయి మీటింగ్ లో గులాబీ బాస్ బీజేపీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదంటున్నారు. ఇంతకు ముందు కూడా బీజేపీని పెద్దగా టార్గెట్ చేయడం లేదు. బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ కు డేంజర్ గా మారింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకే వెళ్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇది క్లారిఫై అయింది. అలాంటప్పుడు బీజేపీ విషయంలో సాఫ్ట్ గా ఉంటే ఇంకా సమస్యలు ఎదురవుతాయి. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీని టార్గెట్ చేసే పరిస్థితిలో కూడా లేరంటున్నారు.
బీజేపీకి పరోక్ష సపోర్ట్ ఇస్తున్నారన్న కాంగ్రెస్
అంతెందుకు ఉత్తర తెలంగాణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా బీజేపీకి పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్నారన్నది కాంగ్రెస్ నేతల విమర్శ. ఇలా ఎన్ని కౌంటర్లు పడ్డా.., మాట మాత్రం మాట్లాడడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వరుస ఓటములతో పార్టీ లీడర్స్, క్యాడర్ అంతా నైరాశ్యంలో ఉండడంతోనే ఎమ్మెల్సీకి పోటీ పెట్టడం లేదని ఓవైపు గులాబీ లీడర్లు చెబుతుంటే.. ఉప ఎన్నికలకు రెడీ అవ్వాలని, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని కేసీఆర్ ఎలా చెబుతారన్న ప్రశ్నలకు మాత్రం జవాబు ఇవ్వలేని పరిస్థితి.
కేసీఆర్ వ్యూహాలకు కాలం చెల్లిపోయిందా?
పరిస్థితి చూస్తుంటే.. పోటీ చేయకపోయినా పర్వాలేదు.. ఓడినా పర్వాలేదు.. కానీ అధికార పార్టీ మాత్రం గెలవొద్దు ఇప్పుడు గులాబీ నాయకత్వం ఇదే కాన్సెప్ట్ తో పని చేస్తోందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. సో ఫైనల్ గా కేసీఆర్ రాజకీయ వ్యూహాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగని సీరియస్ గా తీసుకోవాల్సిన పని కూడా లేదన్నది ప్రత్యర్థుల మాటే. ఎందుకంటే ఆ వ్యూహాలకు కాలం చెల్లిపోయిందంటున్నారు. ఎన్ని చేసినా కథ మారదని గుర్తు చేస్తున్నారు. అయినా ఆశ ఉంటుంది కదా.