Data Recovery Google Back Up | మీ సెల్‌ఫోన్‌లోని డేటా మొత్తం పొరపాటున డిలీట్ అయిపోయిందా? లేదా మీరే డిలీట్ చేసిన అందులో చాలా ముఖ్యమైన ఫైళ్లు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయని గుర్తించి ఆందోళన చెందితే.. ఇకపై అలాంటి సమస్యలుండవు. ఎందుకంటే కొన్ని సులభమైన టిప్స్, పద్ధతుల ద్వారా డిలీట్ అయిన డేటాను రికవరీ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన డేటాను.. గూగుల్ బ్యాకప్, గూగుల్ ఫోటోస్, అడ్వాన్స్‌డ్ ఆండ్రాయిడ్ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో సులభంగా రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్‌ను స్టెప్-బై-స్టెప్‌గా తెలుసుకుందాం.
1. గూగుల్ బ్యాకప్ తో డేటా రికవరీ ఈజీ
ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉపయోగించే వారు గూగుల్ బ్యాకప్‌ను ఎనేబుల్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, యాప్ డేటా, డివైస్ సెట్టింగ్స్, మీడియా ఫైల్స్ అన్నీ మీ గూగుల్ అకౌంట్‌లో సేవ్ అవుతాయి. ఒకవేళ డేటా డిలీట్ అయిపోతే, ఈ బ్యాకప్ నుంచి సులభంగా రికవరీ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం:
ముందుగా మీ ఫోన్‌లోని Settings యాప్‌ను ఓపెన్ చేయండి.
Googleపై క్లిక్ చేయండి.
Backupపై ట్యాప్ చేయండి.
Backup by Google Oneను టర్న్ ఆన్ చేయండి.
ఫొటోస్, వీడియోస్, డివైస్ డేటా వంటి వాటిలో మీరు బ్యాకప్ చేయాలనుకున్న వాటిని ఎంచుకోండి.
Back up now పై క్లిక్ చేయండి.
(నోట్: ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. అలాగే, గూగుల్ బ్యాకప్ ద్వారా ఎస్‌ఎంఎస్ మెసేజ్‌లు, స్పెసిఫిక్ యాప్ డేటాని రికవరీ చేయలేరు.)
అంతే! ఇకపై మీ డేటా బ్యాకప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ డిలీట్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. బ్యాకప్ లో నుంచి రికవరీ చేసుకోవచ్చు.
Also Read: సమ్మర్ వచ్చేస్తోంది.. కూలర్ కొంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి
2.ఆండ్రాయిడ్ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా
కొన్నిసార్లు మనం పొరపాటున ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ చేసేస్తాం. లేదా సిస్టమ్ ఎర్రర్స్, ఫోన్ పాడైపోవడం వంటి సమస్యల వల్ల కూడా డేటా కోల్పోతాం. ఇలాంటి సందర్భాల్లో, డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌లు సహాయపడతాయి. ఇవి ఫోటోస్, వీడియోస్, వాట్సాప్ మెసేజ్‌లు, కాంటాక్ట్స్, ఇతర ఫైల్స్‌ను రికవరీ చేయగలవు.
ఇందుకోసం Tenorshare UltData for Android అనే ఒక ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఉంది. ఇది విండోస్, మ్యాక్ సిస్టమ్స్‌లో పనిచేస్తుంది. ఇది అన్ని బ్రాండ్‌ల ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు డేటాను ప్రివ్యూ చేసుకుని, అవసరమైన ఫైల్స్‌ను రికవరీ చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఇలాంటి అనేక సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగించవచ్చు.
3.గూగుల్ ఫోటోస్ ద్వారా ఫొటోలు రికవరీ చేయడం
మనం డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలు ట్రాష్‌లోకి వెళ్తాయి. సాధారణంగా, బ్యాకప్ చేయని ఫైల్స్ 30 రోజుల వరకు, బ్యాకప్ చేసిన ఫైల్స్ 60 రోజుల వరకు ట్రాష్‌లో ఉంటాయి. ఈ కాలపరిమితిలో మనం డిలీట్ చేసిన ఫైల్స్‌ను రికవరీ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం:
ముందుగా మీ గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేయండి.
లైబ్రరీలో ఫైల్ ఉందో లేదో చూడండి.
ఒకవేళ ఫైల్ ఉంటే, దానిని అన్‌ఆర్కైవ్ చేయండి. అప్పుడు అది మీ గూగుల్ ఫోటోస్‌లో కనిపిస్తుంది.
ఒకవేళ ఫైల్ లైబ్రరీలో లేకుంటే, ట్రాష్‌లో చూడండి. అక్కడ ఉంటే, దానిని రీస్టోర్ చేయండి.
టిప్: మీ ఫొటోలు, వీడియోలు సురక్షితంగా ఉండాలంటే, గూగుల్ ఫోటోస్‌లో Backup & Syncను ఎనేబుల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల, మీ ఫైల్స్ క్లౌడ్‌లో సేవ్ అవుతాయి.
4.గూగుల్ డ్రైవ్ ద్వారా ఫైల్స్ రికవరీ చేయడం
మీ ఫోన్‌లోని పీడీఎఫ్‌లు, డాక్యుమెంట్స్, స్ప్రెడ్‌షీట్స్ వంటి ఫైల్స్ డిలీట్ అయిపోతే, వాటిని గూగుల్ డ్రైవ్ ద్వారా రికవరీ చేయవచ్చు. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం:
ముందుగా Drive.google.comని ఓపెన్ చేయండి.
ఎడమ వైపున ఉన్న Trashపై క్లిక్ చేయండి.
ట్రాష్‌లో మీ ఫైల్ ఉందో లేదో చూడండి.
ఉంటే, ఆ ఫైల్‌పై రైట్-క్లిక్ చేసి Restoreపై క్లిక్ చేయండి. అంతే! మీ ఫైల్ ఒరిజినల్ లొకేషన్‌లోకి వస్తుంది.
మీ ఫోన్‌లో డేటా డిలీట్ కాకుండా ఎలా కాపాడుకోవాలి?
రెగ్యులర్ బ్యాకప్స్‌ను ఎనేబుల్ చేసుకోండి.
మంచి బ్రాండెడ్ ఎస్‌డీ కార్డ్‌ను ఉపయోగించండి, దాన్ని రెగ్యులర్‌గా ఫార్మాట్ చేయండి.
థర్డ్ పార్టీ యాప్‌లను వాడకండి. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ ఐ స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి.
మీ ఫోన్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేసుకోండి.
ఈ సాధారణ టిప్స్‌ను అనుసరించడం వల్ల, మీ ఫోన్‌లోని డేటా సురక్షితంగా ఉంటుంది. డిలీట్ అయిపోయినా సులభంగా రికవరీ చేసుకోవచ్చు!