Joint Tax Filing: కౌంట్ డౌన్ మొదలైపోయింది. వారంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా 2026-27 కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ఈ బడ్జెట్‌లో కూడా మిడిల్ క్లాస్‌కు భారీ ఊరట దక్కుతుందా? జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తీసుకురాబోతున్నారనే ఊహాగానాలు నిజమవుతాయా? పెళ్లైన జంటల కోసం బడ్జెట్‌లో బంపర్ ఆఫర్ ఉండబోతోందా? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. మధ్యతరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్‌నిచ్చేలా ఏం ప్రకటించబోతున్నారు?
ఇండియా ఇన్‌కమ్ ట్యాక్స్ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా.. చరిత్రాత్మక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోందనే వార్తలు.. దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారాయ్. వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో.. జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం గనక అమల్లోకి వస్తే.. భారత్‌లోనే లక్షలాది కుటుంబాలకు, అదేవిధంగా ఒక్కరే సంపాదిస్తున్న ఇళ్లకు భారీ ఊరట దక్కనుంది. ఇంకాస్త క్లియర్‌గా చెప్పాలంటే.. వివాహమైన జంటలకు పన్ను భారం తగ్గుతుంది. ఇందుకోసం కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రణాళికలను రూపొందిస్తోంది. జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్‌కి సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను.. ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడిన కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు.. ఈ సంస్కరణ వీలు కల్పిస్తుంది.
అసలేంటీ.. జాయింట్ ట్యాక్స్ విధానం? అంటే.. ఇప్పుడున్న ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నా.. ఇంట్లో ఒక్కరే సంపాదిస్తున్నా.. ఎవరి పన్నుని వారు విడివిడిగా లెక్కించుకోవాలి. కొత్త ప్రతిపాదన ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకే యూనిట్‌గా తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిట్నర్స్‌ని ఫైల్ చేయొచ్చు. ఆదాయం లేని భాగస్వామికి లభించే పన్ను మినహాయింపులను కూడా సంపాదిస్తున్న వ్యక్తి.. తన ఆదాయంపై వర్తింపజేసుకునేందుకు వీలుంటుంది. ఈ బడ్జెట్‌లో కేంద్రం గానీ దీనిని అమల్లోకి తెస్తే.. కొన్ని లక్షల కుటుంబాలకు లాభం జరుగుతుంది. ఈ విధానం వల్ల ప్రధానంగా కొన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా.. సింగిల్ ఇన్‌కమ్ ఫ్యామిలీస్‌కి! ఇంట్లో భర్త మాత్రమే సంపాదిస్తూ.. భార్య హౌజ్ వైఫ్‌గా ఉంటే.. ఇప్పటిదాకా భార్యకు వచ్చే ప్రాథమిక పన్ను మినహాయింపులు వృథా అయ్యేవి. అదే.. జాయింట్ ట్యాక్స్ గనక అమల్లోకి వస్తే.. భార్య వాటా పన్ను ప్రయోజనాన్ని కూడా భర్త పొందేందుకు వీలుంటుంది. దీనివల్ల.. పన్ను భారం భారీగా తగ్గుతుంది. ఇక.. అధిక ఆదాయం ఉన్న వారికి కూడా ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వల్ల ఎంతో మేలు ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే.. ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఆదాయం ఉంటే.. ఇద్దరినీ కలిపి లెక్కించడం వల్ల ట్యాక్స్ స్లాబ్ మారే అవకాశం ఉంటుంది. దాంతో.. పన్ను ఆదా అవుతుంది. ఇక.. హోమ్ లోన్స్, ఇతర సెక్షన్ 80సీ పెట్టుబడులు, మెడికల్ ఇన్సూరెన్స్‌ల ప్రీమియంలపై.. ఇద్దరికీ కలిపి గరిష్ఠ పరిమితి వరకు ప్రయోజనం పొందే వీలుంటుంది.
ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తప్పనిసరి ఏమీ కాదు. వివాహిత జంటలు ఇప్పటికే ఉన్న వ్యక్తిగత ట్యాక్స్ ఫైలింగ్ గానీ, కొత్త జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ పద్ధతిలో.. దేనినైనా ఎంచుకోవచ్చు. ఒకవేళ.. జాయింట్ ఫైలింగ్ ఎంచుకోవాలనుకుంటే మాత్రం.. భార్యాభర్తలిద్దరికీ పాన్ కార్డు కంపల్సరీ. ఈ విధానంలో మొత్తం ఫ్యామిలీ ఆదాయంపై.. ప్రత్యేక స్లాబ్ కింద పన్ను విధిస్తారు. జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్‌కి సంబంధించి.. మినహాయింపు పరిమితులు, పన్ను శ్లాబుల్లో మార్పులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తికి.. ప్రాథమిక మినహాయింపు 3 లక్షలు అయితే.. జాయింట్ ఫైలింగ్ ట్యాక్స్ లిమిట్‌ని డబులైనా చేయొచ్చు.. అందుకనుగుణంగా సర్దుబాటు చేయొచ్చు. ఈ విధానం వల్ల.. మధ్యతరగతి కుటుంబాలకు పన్ను విషయంలో ఎంతో రిలీఫ్ దక్కుతుందని చెబుతున్నారు. సర్‌ఛార్జ్ పరిమితులను సవరించడంపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం.. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి సర్‌ఛార్జ్ వర్తిస్తుంది. కొందరు ఆర్థిక నిపుణులు.. ఈ పరిమితిని 75 లక్షలకు పెంచాలని సూచించారు. ఉమ్మడిగా ట్యాక్స్ ఫైలింగ్ చేసే జంటలకు తగిన సర్దుబాట్లు ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే.. ప్రతిపాదిత విధానం కింద ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత ప్రామాణిక మినహాయింపుని పొందుతూనే ఉంటారు.
దేశంలోని మధ్యతరగతి ప్రజల్లో పెరిగిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం దృష్ట్యా.. వారి చేతుల్లో ఖర్చు చేయదగ్గ ఆదాయం పెంచడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ విధానం ఇప్పటికే పాశ్చాత్య దేశాలలో అమల్లో ఉంది. దీనిని ఇప్పుడు భారత్‌లో ప్రవేశపెట్టడం ద్వారా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంతో పాటు, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే దానిపై.. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌తో స్పష్టత వస్తుంది. ఒకవేళ నిర్మలా సీతారామన్ గనక బడ్జెట్‌లో జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ ప్రకటిస్తే.. అది నిజంగానే మధ్యతరగతి ప్రజలకు బిగ్గెస్ట్ ట్యాక్స్ గిఫ్ట్ అవుతుంది. ఆదాయపు పన్ను చెల్లింపు విధానంలో ఇదొక కొత్త శకానికి నాంది పలికినట్లవుతుంది. దీనికోసం.. మిడిల్ క్లాస్ ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానం ఓకే.. మరి.. నిజంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, ట్యాక్స్‌పేయర్లు ఏం కోరుకుంటున్నారు? ఈ బడ్జెట్‌లో భారీ ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తామా? స్లాబ్‌లు, సర్ ఛార్జుల్లో మార్పులు ఉంటాయా?
2026 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో.. లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు, జీతాలు పొందే ఉద్యోగులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు.. మరోసారి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వైపు ఆశతో, నిరీక్షణతో చూస్తున్నారు. ఈ సంవత్సరం పన్నుల నుంచి ఉపశమనానికి సంబంధించి.. అంచనాలు ఎక్కువగా ఉన్నాయ్. ఇదే సమయంలో కొన్ని కీలక డిమాండ్లు చర్చకు వస్తున్నాయ్. వీటిలో మొట్టమొదటిది.. ఒకే ఆదాయపు పన్ను రిటర్న్ ఫామ్! ఇది.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్. ప్రస్తుతం.. పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయ వనరులను బట్టి.. ఏడు వేర్వేరు ఫామ్‌లని ఫిల్ చేసి రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఇది ప్రతిసారీ.. గందరగోళానికి దారితీస్తోంది. రిటర్న్స్ ఫైల్ చేసే క్రమంలో లోపాలకు దారితీస్తోంది. కామన్ ఐటీఆర్ ఫామ్ తీసుకొస్తే.. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ మార్గాలను ఎంచుకొని, సంబంధింత విభాగాలను మాత్రమే చూసేందుకు వీలు కలుగుతుంది. ఇది.. ఐటీఆర్ దాఖలును సులభతరం చేయడమే కాదు పన్ను చెల్లింపుదారులకు ఒత్తిడి లేకుండా చేస్తుందని చాలా నమ్ముతున్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. దాంతో.. ఇలాంటి సంస్కరణకు ఇదే అనువైన సమయం అని.. పన్ను చెల్లింపులుదారులు భావిస్తున్నారు.
కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద స్పష్టమైన నియమాలు ఉండాలని కోరుతున్నారు. 60 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ప్రస్తుత చట్టాన్ని.. ఏప్రిల్ నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ భర్తీ చేస్తుంది. దశాబ్దాలుగా లెక్కలేనన్ని సర్క్యులర్లు, నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇప్పటికీ.. పన్ను చెల్లింపుదారులకు ఏ నియమాలు వర్తిస్తాయో తెలుసుకోవడం కష్టంగా మారింది. అందువల్ల.. కొత్త చట్టం కింద చెల్లుబాటు అయ్యే సూచనలన్నింటిని లిస్ట్ చేసి.. కొత్త సెక్షన్ నెంబర్లను మ్యాప్ చేస్తూ.. ప్రభుత్వం ఓ మాస్టర్ సర్క్యులర్ జారీ చేస్తుందని.. పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ డాక్యుమెంట్‌ని అప్‌డేట్ చేస్తూ వెళితే.. గందరగోళం తగ్గుతుందని చెబుతున్నారు. టీడీఎస్ రూల్స్‌ని కూడా సరళతరం చేయాలనే డిమాండ్ ఉంది. చాలామంది పన్ను చెల్లింపుదారులు ఈ వ్యవస్థ క్లిష్టంగా మారిందని భావిస్తున్నారు. టీడీఎస్ విభాగాల సంఖ్యని తగ్గించడం, తక్కువ ప్రభావ నిబంధనలను విలీనం చేయడం, రేట్లని రెండు,మూడు స్లాబ్స్‌కు మాత్రమే పరిమితం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఫిజికల్ టీడీఎస్ సర్టిఫికెట్ల అవసరాన్ని తొలగించాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయ్. ఎందుకంటే.. అన్ని వివరాలు ఇప్పటికే ఫామ్ 26ఏఎస్ ద్వారా ఆన్‌లైన్‍లో అందుబాటులో ఉన్నాయి. అనవసరమైన ట్యాక్స్ లిటిగేషన్లని నివారించేందుకు.. టీడీఎస్ లెడ్జర్ వ్యవస్థని కూడా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 75 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ని.. కనీసం లక్షకు పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇది పెరిగితే.. చేతికి వచ్చే నికర ఆదాయం పెరుగుతుంది. ఇక.. పన్ను శ్లాబులను సవరించి.. పన్ను రహిత ఆదాయ పరిమితిని మరింత పెంచాలని, పన్ను రేట్లని తగ్గించాలని ఆశిస్తున్నారు. 3 లక్షలుగా ఉన్న పన్ను రహిత పరిమితిని, 4 నుంచి 5 లక్షలకు పెంచాలంటున్నారు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో ఉన్నవారికి సెక్షన్ 80సీ పరిమితి దశాబ్దాకాలంగా మారలేదు. దీనిని.. లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉంది. పెరిగిన వడ్డీ రేట్ల దృష్ట్యా.. హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే 2 లక్షల మినహాయింపుని 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చడంపైనే దృష్టి పెడుతోంది. ఆ లెక్కన.. ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా.. చిన్నపాటి పన్ను తగ్గింపులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ద్రవ్యలోటుని అదుపులో ఉంచాల్సి ఉన్నందున.. భారీ మార్పుల కంటే.. చిరు ఉపశమనాలే ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈసారి మధ్యతరగతికి ఊరటనిచ్చేలా సర్ ఛార్జ్ స్ట్రక్చర్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశముంది. ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ, పారదర్శకతపై దృష్టి పెడుతోంది. అందువల్ల.. ప్రజలను కొత్త పన్ను విధానం వైపు మళ్లించేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.
దేశంలో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్‌ని ఎదుర్కోవడంలోనూ.. పన్ను విధానం సాయపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. దాంతో.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయ్. అందువల్ల.. కాలుష్యం వల్ల ప్రభావితమవుతున్న ప్రజారోగ్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని.. కొత్త పన్ను విధానంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాల కోసం డిమాండ్ పెరుగుతోంది. పన్ను చెల్లింపుదారులు దీనిని మినహాయింపుగా పరిగణించాలని వాదిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్.. సరళమైన, న్యాయమైన పన్నులతో ఉండాలని కోరుతున్నారు. బడ్జెట్‌కు కౌంట్ డౌన్ మొదలైపోవడంతో.. పన్నుల విషయంలో ప్రజల్లో ఉన్న ఆందోళనల్ని, అంచనాలను.. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు.
Story by: Anup, Big Tv