Big Stories

Budget Glossary : బడ్జెట్ అర్థం కావాలంటే.. ఇవి తెలియాల్సిందే..!

Budget Glossary : బడ్జెట్(Budget) అంటేనే లెక్కల గజిబిజి. పదబంధ ప్రహేళిక. బడ్జెట్‌ అర్థం కావాలంటే ముందుగా అందులో వాడే పదాల గురించి తెలుసుకోవాలి. అవేమిటో చూద్దాం..

- Advertisement -

ప్రణాళికా వ్యయం(Planned Expenditure)
ఆదాయ వనరులు, ఆస్తుల సృష్టికి ప్రభుత్వం పెట్టే ఖర్చునే ప్రణాళికా వ్యయం అంటారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఈ ఖాతాలో ఉంటాయి. ఆయా మంత్రిత్వ శాఖ‌ల‌తో మాట్లాడాక..ఈ లెక్కలకు తుదిరూపు ఇస్తారు.

- Advertisement -

ప్రణాళికేతర వ్యయం(Unplanned Expenditure)
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, కళలు, క్రీడలు, వివిధ రంగాలకు వెచ్చించే నిధులు, సర్కారు తెచ్చిన అప్పుపై కట్టీ వడ్డీ, రుణ చెల్లింపులు.. ఇవన్నీ ప్రణాళికేతర వ్యయం కిందకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.

మూలధన బడ్జెట్(Capital budgeting)
మూలధన ఆదాయం, ఖ‌ర్చుల పట్టికగా దీనిని చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తో పాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. వివిధ వ‌న‌రుల ద్వారా స‌మ‌కూరే ఆదాయం, చేసే ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి. ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు కూడా మూల‌ధ‌న వ్యయం కిందకే వస్తుంది.

మూలధన వ్యయం(Capital expenditure)
ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు. అన్ని ఆదాయ‌, వ్యయాలు సాధార‌ణంగా క్యాపిట‌ల్ అకౌంట్‌లో వేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు పెట్టుబ‌డుల ఉస‌సంహ‌ర‌ణ ద్వారా సేక‌రించిన నిధుల‌ను ఆస్తిగా ప్రభుత్వం ప‌రిగ‌ణిస్తుంది. వీటిని అమ్మి సొమ్ము చేసుకున్న వివ‌రాల‌ను క్యాపిట‌ల్ బడ్జెట్‌లో చూపిస్తారు.

బడ్జెట్ ఫండ్స్‌
ఇవి మూడు భాగాలుగా ఉంటాయి. బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్ అని వ్యవహరిస్తారు.
వసూళ్లు-వ్యయాలు అనే రెండు విభాగాలతో ఈ మూడు భాగాలూ రూపొందుతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ నుంచి చేసే వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

కన్సాలిడేటెడ్ ఫండ్(Consolidated Fund): ప్రభుత్వానికి ఇది ఒక రకంగా గుండెకాయ వంటిది. అన్ని రకాల ఆదాయాలు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై లభించే వడ్డీ ఈ ఖాతాకి చేరతాయి. అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులూ ఈ ఫండ్ నుంచే వెచ్చించాలి.

కంటింజెన్సీ ఫండ్(Contingency Fund): ఇది రూ.500 కోట్లతో ఏర్పాటైన నిధి. ఆకస్మికంగా ఎదురయ్యే ఖర్చుల కోసం ఈ నిధిని వినియోగించవచ్చు. రాష్ట్రపతి సంతకంతో ఆ నిధులను ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఈ నిధి నుంచి తీసే మొత్తాన్ని తిరిగి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ అకౌంట్(Public Account ): ఈ ఖాతాకు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా బ్యాంకర్‌లాగా పనిచేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకు వస్తాయి.

రెవెన్యూ బడ్జెట్(Revenue Budget), క్యాపిటల్ బడ్జెట్(Capital budget)
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు రెండింటినీ బడ్జెట్‌లో రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో ఒకటి రెవెన్యూ ఖాతా. రెండోది క్యాపిటల్ ఖాతా. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి చేరే, తీసే నిధులను రెవెన్యూ బడ్జెట్(రెవెన్యూ ఖాతా), క్యాపిటల్ బడ్జెట్(క్యాపిటల్ ఖాతా)గా పరిగణిస్తారు.

పన్నుల వంటి అన్ని రకాలు ఆదాయాలు, వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి అన్ని రకాల వ్యయాలు అన్నీ రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయ, వ్యయాలుగా చెప్పొచ్చు. ఇక.. ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయంతో వచ్చే ఆదాయాలు, వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు క్యాపిటల్ విభాగపు ఆదాయ, వ్యయాలుగా ఉంటాయి.

పబ్లిక్ డెట్(Public Debt)
ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పులు చేస్తుంది. అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు. మొత్తం ప్రభుత్వ అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పుగా అంటే ఒక్కొక్కరిపై ఎంత అప్పు భారం ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం దేశీయంగా, విదేశాల నుంచి కూడా అప్పులు తెస్తుంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ అంతరంగిక అప్పుల్లో ట్రెజ‌రీ బిల్లులు, వేస్ అండ్ మీన్స్‌, చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌కు సంబంధించిన సెక్యూరిటీలు ఉంటాయి.

ద్రవ్య లోటు(Fiscal deficit)
సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి వ్యయం చేస్తుంది. ఇలా అదనంగా కావల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది. ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలనే ద్రవ్యలోటు, విత్తలోటు(ఫిస్కల్ డెఫిసిట్)గా వ్యవహరిస్తారు. ద్రవ్యలోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.

ప్రాథ‌మిక లోటు(Primary Deficit)
రెవెన్యూ వ్యయంలో వ‌డ్డీ చెల్లింపులు, స‌బ్సిడీలు వంటివి క‌లిసి ఉంటాయి. ప్రాథ‌మిక లోటు త‌గ్గుతుందంటే ప్రభుత్వ ఆదాయ వృద్ధి బాగుంద‌ని అర్థం. అందుకే బ‌డ్జెట్ లోటును జీడీపీలో ఎంత శాతం ఉంద‌నేది చెబుతారు.

రెవెన్యూ లోటు(Revenue Budget)
ప్రభుత్వం తన రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయాలను ఎక్కువగా చేసినప్పుడు ఏర్పడే లోటును రెవెన్యూ లోటుగా పరిగణిస్తారు. సాధారణంగా రెవెన్యూ లోటు సున్నాగా ఉండాలి. అలా ఉంటే ప్రభుత్వం చేసిన రెవెన్యూ వ్యయం కేవలం వినియోగానికి కాకుండా ఒక సంపదను సృష్టించినట్లు లెక్క. లేక‌పోతే ఆర్థిక స్థితి ప్రమాదంలో పడినట్టు భావిస్తారు.

కరెంటు ఖాతా లోటు(Current Account Deficit)
వస్తు, సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.

ప్రత్యక్ష పన్నులు(Direct Taxes), పరోక్ష పన్నులు(Indirect Taxes)
పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులే ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నుల భారం ప్రజలపై నేరుగా పడుతుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను.. ఇత్యాదివన్నీ ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి. పరోక్ష పన్నుల భారం పౌరుడిపై నేరుగా పడదు. విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, సేవా పన్ను, విలాస పన్ను, వినోద పన్ను తదితర పన్నుల స్థానంలో ప్రవేశపెట్టిన జీఎస్‌టీ- పరోక్ష పన్నులకు ఉదాహరణలు.

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(Long term capital gains tax)
షేర్లు కొన్న తర్వాత ఏడాదిలోపు వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను స్వల్ప కాలిక మూలధన లాభాలు అంటారు. ఇలా లభించే లాభాలను మన ఆదాయంలో కలిపి.. దానికి వర్తించే శ్లాబ్ మేరకు పన్ను విధిస్తారు. ఏడాది కన్నా ఎక్కువ వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటారు. వీటిపై ప్రస్తుతం పన్ను 10 శాతంగా ఉంది.

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్(Ways and means advances)
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్‌బీఐ ఆర్థిక సహకారాన్ని పొందుతాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్ప కాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు. వేస్ అండ్ మీన్స్ ద్వారా ప్రభుత్వ సంస్థల ఆదాయ‌, వ్యయ నిర్వహణ సులభతరమవుతుంది.

ట్రెజరీ బిల్లులు(Treasury Bills)
స్వల్పకాలికంగా డ‌బ్బును వాడుకునేందుకు ఉప‌యోగించే బిల్లుల‌ను ప్రభుత్వ ప‌రిభాష‌లో ట్రెజ‌రీ బిల్లులుగా వ్యవహరిస్తారు. సాధార‌ణంగా వీటి గ‌డువు ఏడాది లోపే ఉంటుంది. వీటి కోసం ప్రభుత్వం పెట్టుబ‌డిదారుల నుంచి నిధుల‌ను సేక‌రిస్తుంది. మ‌దుప‌ర్లు స్వల్పకాలంలో త‌మ దగ్గర ఉన్న నిధుల‌ను ఇందులో పెట్టుబ‌డులుగా పెట్టవచ్చు. వీటిని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణీత కాలంలో వేలం వేస్తుంది. వీటికి ఉన్న ఫేస్ వాల్యూ కంటే త‌క్కువ విలువ‌కే మార్కెట్లోకి విడుద‌ల చేస్తారు. వీటిని ప్రభుత్వ బాండ్లు(డెట్ సెక్యూరిటీ) అని వ్యవహరిస్తారు.

స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)(GDP)
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టి చూపే కీలకాంశాల్లో ఇది ఒకటి.

పెట్టుబడుల ఉపసంహరణ(Disinvestment)
ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని ‘పెట్టుబడుల ఉపసంహరణ’ అంటారు.

ఆర్థిక బిల్లు(Financial Bill)
కొత్త పన్నులను, అమల్లో ఉన్న పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే దీనిని ప్రవేశపెడతారు.

రెపో రేటు(Repo rate)
ఆర్‌బీఐ తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News