Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నవంబర్ 11న జరగబోయే ఉపఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్షన్‌రెడ్డి ఓటర్లకు కీలక సూచనలు జారీ చేశారు. ఉపఎన్నికలో ఓటు వేయాలనుకునే ప్రతి ఓటరు తప్పనిసరిగా.. చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం (ఫోటో ఐడీ)తో రావాలని.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. ఓటరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ముందు తన ఫోటో ఐడీ కార్డు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే EPIC లేని వారు కూడా నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. అటువంటి వారు కింద తెలిపిన పన్నెండు రకాల ఫోటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపించవచ్చని ఆయన తెలిపారు.
-ఆధార్ కార్డు
– ఎంఎన్‌ఆర్‌ఈజీఏ ఉద్యోగ కార్డు
-బ్యాంకు లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటో ఉన్న పాస్‌బుక్
-హెల్త్ ఇన్ష్యూరెన్స్ స్మార్ట్ కార్డు (ఆయుష్మాన్ భారత్ సహా)
-డ్రైవింగ్ లైసెన్స్
– పాన్ కార్డు
-నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్) స్మార్ట్ కార్డు
-భారత పాస్‌పోర్టు
-ఫొటోతో ఉన్న పెన్షన్ పత్రం
-ప్రభుత్వ, పీఎస్‌యూ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి ఐడీ కార్డు
-ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు పత్రం
-సామాజిక న్యాయశాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్ ఐడీ (UDID) కార్డు
విదేశీ ఓటర్లు (Representation of the People Act, 1950 లోని సెక్షన్ 20A ప్రకారం నమోదు అయిన వారు) తమ మూల భారత పాస్‌పోర్టు చూపించాలి.
ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ముందుగానే ధృవీకరించుకోవాలి. పోలింగ్ కేంద్రంలో గుర్తింపు పత్రం లేకుండా వస్తే ఓటు వేయడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరి ఓటు హక్కు వృథా కాకుండా ముందుగానే సిద్ధం కావాలి అని సూచించారు.
ఎన్నికల కమిషన్ నుంచి ఓటర్లకు పంపించే ‘వోటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లు’ కేవలం సమాచారం కోసం మాత్రమే, అవి గుర్తింపు పత్రాలుగా పరిగణించరాదని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ తేదీకి కనీసం ఐదు రోజుల ముందు ఆ స్లిప్‌లను పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈసారి ఎన్నికలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ సదుపాయం ఉంటుందని ఎన్నికల అధికారి వివరించారు. జూబ్లీహిల్స్ వంటి పట్టణ నియోజకవర్గంలో ఓటర్ల చైతన్యం చాలా ముఖ్యం. ప్రతి ఓటరు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించాలి అని సుధర్షన్‌రెడ్డి అన్నారు.
అలాగే, పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడ్డాయని, వీరికి ర్యాంపులు, వీల్‌చెయర్లు, సహాయక సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
Also Read: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్లు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకుని, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి నవంబర్ 11న బాధ్యతగా ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్షన్‌రెడ్డి పిలుపునిచ్చారు.