CM Progress Report: తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీకి సీఎం రేవంత్ రెడ్డి అంతిమవీడ్కోలు పలికారు. అందెశ్రీ పాడె మోసి ఆశు కవికి సీఎం రేవంత్ రెడ్డి అశ్రునివాళి అర్పించారు. ఢిల్లీ బ్లాస్ట్ పై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూబ్లీ బైపోల్ నేపథ్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ఆత్మనే చంపేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవీ ఈ వీక్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనులు. ఇంతకీ ఈ వారంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలేంటి? తీసుకున్న నిర్ణయాలేంటి?
09-11-2025 (ఆదివారం) మీట్ ద ప్రెస్
జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూడా మీడియా ముందుంచారు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు గతమే తప్ప.. భవిష్యత్ లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారని విమర్శించారు.
09-11-2025 (ఆదివారం) రిజర్వేషన్ ల వల్లే ఆలస్యం
లక్ష కోట్ల కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు.
10-11-2025 (సోమవారం) సీఎం దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తుచేశారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గారు స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
10-11-2025 (సోమవారం) మధుర జ్ఞాపకాలు
కవి అందెశ్రీ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జయ జయహే తెలంగాణ గేయాన్ని సంగీత స్వరకల్పన సమకూర్చే సమయంలో గంటల కొద్దీ అందెశ్రీతో గడిపిన క్షణాలు ఎప్పటికి మర్చిపోలేను అన్నారు. అందె శ్రీతో ఆనాడు దిగిన ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి X వేదికగా పోస్ట్ చేశారు.
10-11-2025 (సోమవారం) సీఎం విచారం
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశంలో పేలుడు జరగడం దేశ భద్రతకు పెద్ద సవాల్ అని ఆయన వ్యాఖ్యానించారు. నిరపరాధుల ప్రాణాలు బలైపోవడం బాధాకరమని ట్వీట్‌లో పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
11-11-2025 (మంగళవారం) కలామ్ యాదిలో
స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి నివాళులర్పించారు. అబుల్ కలామ్ జయంతి రోజున జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారందరికీ ముఖ్యమంత్రి శుభాభినందనలు తెలియజేశారు.
11-11-2025 (మంగళవారం) కన్నీటి నివాళి
కవి అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అందెశ్రీ పార్థీవ దేహాన్ని సందర్శించి వారికి నివాళులర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ గారి ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో సీఎం రేవంత్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళి అర్పించారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందెశ్రీ పాడె మోశారు.
11-11-2025 (మంగళవారం) ఓదార్పు
అందెశ్రీ సతీమణి మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు.
11-11-2025 (మంగళవారం) అందెశ్రీకి పద్మశ్రీ
చివరి శ్వాస వరకు జీవితం సర్వస్వాన్ని ధారపోసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గొప్ప పాత్రను పోషించిన ప్రజాకవి అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ..’ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రథమ అంశంగా చేర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ పేరును శాశ్వతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అందెశ్రీ గారికి పద్మశ్మీ అవార్డును అందించి గౌరవించుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. అందెశ్రీని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతాం అన్నారు.
12-11-2025 (బుధవారం) అభ్యర్థులకు అండగా..
తెలంగాణ నుంచి యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో పరీక్షలకు సిద్ధమయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం గత ఏడాది రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించి అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా సింగరేణి సంస్థ అధ్వర్యంలో 202 మందికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించింది. తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన మెయిన్స్ ఫలితాల్లో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది విజేతలుగా నిలిచారు. మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు గతేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంటర్వ్యూలకు సన్నద్ధం అయ్యేందుకు మరో లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు.
13-11-2025 (గురువారం) కాళోజీ యాదిలో
ప్రజా కవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అక్షరమే ఆయుధంగా, అణిచివేతను ధిక్కరిస్తూ బతుకంతా తెలంగాణకు అంకితమిచ్చిన ఉద్యమకారుడు కాళోజీ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
13-11-2025 (గురువారం) గ్లోబల్ సమాధానం తెలంగాణ
దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఢిల్లీలో జరిగిన యూఎస్ – ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని వివరించారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ORR–RRR మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని చెప్పారు. ఇండియాలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని, హైదరాబాద్‌లో ఆ ట్రెండ్ ను మార్చాలని తాము అనుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమైన రోడ్లకు.. గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్వంటి కంపెనీ పేర్లను పెడతామని అన్నారు. సదస్సు ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ ను ప్రదర్శించారు. సీఎం ఆహ్వానంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతామని సదస్సు అధ్యక్షుడు ముఖేష్ తెలిపారు.
14-11-2025 (శుక్రవారం) నెహ్రుకు నివాళి
భారతదేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని చిన్నారులందరికీ సీఎం రేవంత్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
14-11-2025 (శుక్రవారం) అభినందనలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సీఎం ఇంటికి వెళ్లిన నవీన్ యాదవ్ ను శాలువా, బొకేతో సీఎం సన్మానించారు. భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక తమ బాధ్యత అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
14-11-2025 (శుక్రవారం) అవి తగ్గించుకోవాలి..
హరీశ్‌రావు అసూయను.. కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న ఆయన.. అది వారసత్వ సంపద కాదు అని గుర్తు చేశారు.
14-11-2025 (శుక్రవారం) యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు
కేసీఆర్ ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక క్రియాశీల రాజకీయాల్లో లేరని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూద్దామన్నారు.
14-11-2025 (శుక్రవారం) సీఎం విచారం
ప్రఖ్యాత పర్యావరణ వేత్త, వృక్షమాత, పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వేలాదిగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్క నిస్వార్థ సేవలను సమాజం ఎప్పటికీ మరిచిపోలేదని అన్నారు. దేశవ్యాప్తంగా అటవీ సంపదను పెంచడానికి తిమ్మక్క ఎంతో స్ఫూర్తిని నింపారని గుర్తుచేశారు. చెట్లను నాటడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లో 8 మంది!
14-11-2025 (శుక్రవారం) వైభవంగా నిర్వహిద్దాం..
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8 వ తేదీన రెండో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధికి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని వచ్చే డిసెంబర్ 9 వ తేదీన ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్ రోడ్ మ్యాప్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Story By Venkatesh, Bigtv