Bhupesh Subbarami Reddy: ఐదేళ్ల పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. కష్టాల్లో ఉన్న పార్టీ కేడర్‌కి అండగా నిలిచారు. సమస్యాత్మకమైన ఆ సెగ్మెంట్లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు . ఖచ్చితంగా గెలిచే ఆ సీటును చివరి నిముషంలో త్యాగం చేయాల్ని వచ్చింది. అధిష్టానం ఒత్తిడితో పోటీకి దూరంగా ఉండి పోయి కూటమి విజయానికి కృషి చేశారు. అయితే న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన అధిష్టానం ఆ ఊసే ఎత్తడం లేదంటిప్పుడు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్న ఆ యువ నేతకు ఎలాంటి ప్రాధాన్యతా లభించక పోవడంతో అక్కడ పార్టీ కేడర్ తీవ్ర నిరాశతో కుంగిపోతుంది. ఇంతకీ ఆ యంగ్ లీడర్ ఎవరు?.. ఆ నియోజకవర్గంలో ఆయన గురించి వినిపిస్తున్న టాక్ ఏంటి?
ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం జమ్మలమడుగు. ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడు ప్రత్యేకత ఉంటుంది ఈ నియోజకవర్గానికి. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ సెగ్మెంట్లో ఇప్పటికీ ఆ వాసనలు పూర్తిగా పోలేదు. పార్టీ ఏదైనా సరే కార్యకర్తలు తమ నాయకుడి కోసం ప్రాణాలకు సైతం తెగిస్తుంటారు. తమ నేత కోసం ఎంత దాకైనా వెళ్తారక్కడ. నాయకులు కూడా ఆ నియోజకవర్గంలో కేడర్ని కాపాడుకోవడానికి అంతే పట్టుదలతో నిలబడతారన్న పేరుంది. దాదాపు అరశతాబ్దం క్రితమే జమ్మలమడుగులో ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయి. దేవగుడి వర్సెస్ గుండ్లకుంట, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య ఆ రాజకీయ వైరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
2014లో వైసీపీ నుండి గెలిచిన దేవగుడి ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి అయ్యాక జమ్మలమడుగు రాజకీయం మారిపోయింది. అప్పుడు వరకు బద్ధ శత్రువులైన ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఒకే పార్టీ గూటికి చేరడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరి మధ్య సయోధ్య కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నానా తంటాలు పడాల్సి వచ్చింది. రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీని చేసి సముదాయించాల్సి వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో ఆదినారాయణ రెడ్డి బిజెపి గూటికి చేరారు. మరోవైపు రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇద్దరు సీనియర్లు తమ దారి తాము చూసుకోవడంతో జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలను అధిష్టానం యువ నేత దేవగుడి భూపేష్ రెడ్డికి కట్టబెట్టింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడే ఈ భూపేష్‌రెడ్డి. వైసీపీ పాలనలో అష్టకష్టాలు పడిన టీడీపీ కేడర్‌కు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి భూపేష్‌రెడ్డి కష్ట పడ్డారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని సర్వేలు స్పష్టం చేసే స్థాయికి తీసుకొచ్చారు. ఆ క్రమంలో 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ టికెట్ భూపేష్‌రెడ్డికే వస్తుందని అందరూ భావించారు.
అయితే కూటమి సీట్ల సర్దుబాబు భూపేష్ రెడ్డి సీటు కిందకు నీళ్లు తెచ్చింది. పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటు బీజేపీకి దక్కుతుందని ప్రచారం జరిగింది. పొత్తులో భాగంగా ఇక్కడి సీటు బీజేపీకి కేటాయిస్తారేమోననే ఆందోళనతో ఎన్నికల ముందు భుపేష్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తన బాబాయ్ మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుండటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. తాను పార్టీకి చేసిన సేవలను నారా లోకేశ్, చంద్రబాబు నాయుడు గుర్తించారని తనకే టికెట్ వస్తుందని భూపేష్ గద్గద స్వరంతో ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా పరిణామాలు ఎలా ఉన్నా భవిష్యత్తులో కార్యకర్తలు, అభిమానులంతా తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, టీడీపీతోనే తన పయనమని స్పష్టం చేశారు.
అయితే పొత్తుల లెక్కల్లో జమ్మలమడుగు బీజేపీ ఖాతాలోకే వెళ్లింది. భూపేష్ రెడ్డి బాబాయ్ ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు. తప్పని పరిస్థితుల్లో కడప ఎంపీగా భూపేష్ రెడ్డి పోటీ చేయాల్సి వచ్చింది. జమ్మలమడుగులో పూర్తిస్థాయి గ్రౌండ్ వర్క్ చేసుకున్న భూపేష్ రెడ్డిని ఆదినారాయణరెడ్డి కోసం బలి పశువు చేశారని అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. అయినా భూపేష్ రెడ్డి ఎంపీ స్థానానికి పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీనే ఇచ్చారు. అయితే భూపేష్ రెడ్డి పార్టీ కోసం అంతచేసినా ఎన్నికల తర్వాత తనకి ఏ పదవి రాకపోవడంతో భూపేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.
Also Read: రూటు మార్చిన జగన్.. 2.0 వెనుక పెద్ద స్కెచ్చే..?
కష్టకాలంలో టిడిపి బలోపేతానికి ఎంతో కృషి చేసిన తనను పార్టీ పట్టించుకోవడం పార్టీ శ్రేణుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. అదే సమయంలో ఆయన సీటు ఎగరేసుకుపోయిన బాబాయ్ ప్రభుత్వ విప్ పదవి చేపట్టడం భూపేష్ వర్గానికి అసలు మింగుడు పడటం లేదంట. ఆ క్రమంలో బాబాయ్ కి పదవి దక్కిందని ఆనందంగా ఉండాలో .. తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని బాధపడాలో అర్థం కాని గందరగోళంలో భూపేష్ ఉన్నారంట . మరోవైపు కేడర్ సైతం ఆదినారాయణ రెడ్డి చుట్టూ చేరడం కూడా ఆయనకు పుండు మీద కారం చల్లినట్లు అవుతుందంట.
ఏపీలో మూడు విడతలలో నామినేటెడ్ భర్తీ జరిగింది. వాటిలో భూపేష్ ఊసే లేదు. పార్టీ బేలోపేతం కోసం పనిచేసి, పార్టీ కోసం త్యాగాలు చేసిన నేతల్ని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు చెపుతుండటంతో నామినేటెడ్ పోస్టులపై భూపేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారట. తనకు ఏదైనా కీలక నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారంట. ఈ విషయం ఆలస్యమయ్యే కొద్దీ బాబాయి అబ్బాయి మధ్య మనస్పర్థలు వస్తున్నాయంటున్నారు. ఆ మధ్య మద్యం షాపుల వ్యవహారంలో జరిగిన గొడవని ఆ కోణంలోనే చూడాలంటున్నారు. కడప జిల్లా కొండాపురం మండలంలో బీజేపీ, టీడీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్లింది వ్యవహారం. మరి భూపేష్‌రెడ్డికి టీడీపీ అధిష్టానం ఎలా న్యాయం చేస్తుందో? జమ్మలమడుగు రాజకీయం ఎప్పటికి సెట్ రైట్ అవుతుందో చూడాలి.