భారతీయ రైల్వే సంస్థ రోజు రోజుకు మరిన్ని ఆధునిక హంగులను అద్దుకుంటున్నది. అత్యధిక రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సామాన్యులకు సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ మేరకు వచ్చే మూడేళ్లలో కీలక టార్గెట్లు పెట్టుకున్నది. ఈ కాల పరిధిలో 200 కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వాటితో పాటు 17,500 జనరల్ బోగీలను తయారు చేయాలని నిర్ణయించింది. 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రైళ్ల తయారీకి మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో అందుబాటులోకి రానున్న అమృత్ భారత్ రైళ్లతో తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీని మరింత పెంచాలని రైల్వేశాఖ భావిస్తున్నది.
5 ఏండ్లలో రూ. 4.6 లక్షల కోట్ల ప్రాజెక్టులు
వచ్చే 5 సంవత్సరాల్లో రూ. 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. “వచ్చే 5 ఏండ్లలో రూ. 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తాం. ఈ ప్రాజెక్టులలో భాగంగా కొత్త లైన్లను ఏర్పాటు చేస్తాం. డబ్లింగ్, నాలుగు లైన్లు చేస్తాం. కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు సహా పలు రకాల పనులు చేపడతాం. ఈ ఏడాది మార్చి చివరలోగా 1,400 జనరల్ బోగీలు తయారు కాబోతున్నాయి. మార్చి 31 నాటికి 1600 కోట్ల టన్నుల సరుకు రవాణా చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాం. ఈ ఫైనాన్సియల్ ఇయర్ ఎండింగ్ వరకు 100 శాతం విద్యుదీకరణ పూర్తి చేస్తాం” అని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
రైల్వేకు రూ. 2.65 లక్షల కోట్ల బడ్జెట్
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వేకు పెద్దపీట వేసింది. 2025-26 సంవత్సరానికి గాను 2.65 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ఇందులో రూ.2.52 లక్షల కోట్ల సాధారణ ఆదాయం కాగా, రూ.200 కోట్ల నిర్భయ ఫండ్, అంతర్గత వనరుల నుంచి రూ.3వేల కోట్లు, బడ్జెటేతర వనరుల నుంచి రూ.10వేల కోట్లు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకులు, సరకు రవాణా ద్వారా రూ.3.02 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
Read Also: 158 ఏండ్ల క్రితం పట్టాలెక్కిన రైలు, ఇప్పటికీ నడుస్తోంది, ఎక్కడో తెలుసా?
గత బడ్జెట్ లో రూ. 1,16, 514 కోట్లు మంజూరు
ఇక గత రైల్వే బడ్జెట్ విషయానికి వస్తే.. 2024-25 సవరించిన అంచనాల్లో రైల్వే భద్రతకు రూ.1,14,062 కోట్లు కేటాయించారు. 2025-26 బడ్జెట్ అంచనాల్లో రూ.1,16,514 కోట్లు ఇచ్చారు. ఇక ఏడాదికి 4వేల కి.మీ కొత్త లైన్లు నిర్మిస్తున్నారు. గత పదేళ్లలో 31,180 కి.మీ. కొత్త ట్రాక్ లు నిర్మించారు. వచ్చే ఐదేళ్లలో 44 వేల కిలో మీటర్ల పరిధిలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
Read Also: జమ్మూ- శ్రీనగర్ రూట్ లో పరుగులు తీసే తొలి రైలు వందే భారత్ కాదా? ఇదీ అసలు కథ!
Read Also: అర్జెంట్ గా రైల్లో వెళ్లాలా? డోంట్ వర్రీ.. 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు!