China Renames: పాకిస్తాన్, చైనా.. పేర్లు మాత్రమే వేరు. రెండు దేశాల బుద్ధి ఒక్కటే. పాక్‌ది మాత్రమే కాదు చైనా డ్రాగన్ తోక కూడా వంకరే. ఇప్పటికే.. ఇది అనేకసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు.. మరోసారి తన బుద్ధి ఏమీ మారలేదని నిరూపించుకుంది డ్రాగన్ కంట్రీ. మన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి దుస్సాహసం చేసింది. ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మారుస్తున్నట్లు ప్రకటించింది. దీనికి భారత్ దీటుగా స్పందించింది. డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఉన్నట్టుండి.. చైనా ఇలా ఎందుకు చేసినట్లు?
తన వక్రబుద్ధి చూపించిన డ్రాగన్
జిత్తులమారి చైనా.. మళ్లీ దొంగ నాటకాలాడుతోంది. భారత్-చైనా మధ్య ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనుకుంటున్న టైమ్‌లో.. డ్రాగన్ తన వక్రబుద్ధి చూపించింది. భారత్ ఎన్నిసార్లు కౌంటర్ ఇచ్చినా.. ఎన్నిసార్లు గట్టి బుద్ధి చెప్పినా.. చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చెప్పుకునే ప్రయత్నాలు మానడం లేదు. ఇప్పుడు కూడా అలాంటి దుస్సాహసమే చేసింది. ఈసారి ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరుని జాంగ్నాన్‌గా పేర్కొంటూ.. సౌత్ టిబెట్‌లోని ప్రాంతంగా తన మ్యాప్‌లో చూపించింది చైనా. అంతేకాదు.. అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను కూడా మార్చి.. మ్యాప్‌ని రిలీజ్ చేసింది. ఈసారి భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. క్రియేటివ్‌గా పేర్లు మార్చినంత మాత్రాన.. నిజాలు మారతాయా? అంటూ ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చింది. ఈ తరహా చర్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడవని భారత్ హెచ్చరించింది.
పేర్ల మార్పు ప్రయత్నాలను తిరస్కరించిన భారత్
అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి.. భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. చైనా వక్రబుద్ధిపై మండిపడింది. పేర్ల మార్పు ప్రయత్నాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి.. చైనా విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు గమనించామని.. ఇది భారత్ వైఖరికి విరుద్ధమని.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.. రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను తాము తిరస్కరిస్తామని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్.. భారత్‌లో అంతర్భాగమని, విడదీయరాని భాగమని.. పేర్లు మార్చినంత మాత్రాన.. ఈ వాస్తవాన్ని మార్చలేరని.. రణ్‌ధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అరుణాచల్ ప్రజలు.. భారత్‌లోని ఇతర పౌరులతో సమానంగా అన్ని హక్కులను అనుభవిస్తున్నారని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేస్తున్న తప్పుడు ప్రచారాలు, వాదనలకు.. భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు.. చైనీస్, టిబెటన్ పేర్లు
అరుణాచల్ ప్రదేశ్.. తమ భూభాగంలో భాగమని చెప్పుకుంటున్న చైనా.. అనేక ప్రదేశాల పేర్లతో తరచుగా మ్యాప్‌లను విడుదల చేసింది. గతేడాది.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు.. చైనీస్, టిబెటన్ పేర్లు పెట్టింది. డ్రాగన్ కుట్రలను.. భారత్ పదే పదే ఎండగడుతోంది. చైనా గతంలోనూ.. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ.. నాలుగు లిస్టులను రిలీజ్ చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ.. ఓ లిస్ట్ విడుదల చేసింది. ఆ తర్వాత.. 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లు మార్చుతూ.. చైనా లిస్ట్ రిలీజ్ చేసింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌పై.. భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది.
అరుణాచల్ సౌత్ టిబెట్‌లో అంతర్భాగమని చైనా వాదన
ఇప్పటికే.. టిబెట్‌ని తనలో కలిపేసుకున్న చైనా.. సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ కూడా సౌత్ టిబెట్‌లో అంతర్భాగమని వాదిస్తోంది. కానీ.. ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం.. డ్రాగన్ కంట్రీకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఈ వివాదంతో.. మరోసారి భారత్-చైనా సరిహద్దు సమస్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. అరుణాచల్‌పై చైనా వాదనలు.. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అరుణాచల్ ప్రదేశ్.. మన దేశంలో అంతర్భాగంగా మారిపోయింది. 1962 యుద్ధం తర్వాత నుంచి.. అరుణాచల్ ప్రదేశ్ తమదని చైనా వాదిస్తోంది. అయితే.. డ్రాగన్ వాదనలను తిరస్కరిస్తూ.. అరుణాచల్ ఇండియాలో అంతర్భాగమని స్పష్టం చేస్తూ వస్తోంది భారత్.
అరుణాచల్ ప్రాంతంలోని నీటి వనరుల వినియోగంపై ఆందోళనలు
చైనా.. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదించడం వెనుక ఓ కారణముంది. ఆ ప్రాంతంలోని నీటి వనరుల వినియోగంపై అనేక ఆందోళనలున్నాయ్. ఇందుకు టిబెట్‌లోని మెడోగ్ కౌంటీలో యార్లుంగ్ సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించాలని చైనా భావిస్తోంది. ఇదే నది.. భారత్‌లోకి సియాంగ్ రివర్‌గా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత.. అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. చైనా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టును.. వాటర్ బాంబుగా అభివర్ణిస్తున్నారు అరుణాచల్ బీజేపీ నేతలు. ఏకంగా.. 60 వేల మెగా వాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేయగల కెపాసిటీ గల హైడల్ ప్రాజెక్టుని నిర్మించాలని చైనా ఇప్పటికే నిర్ణయించింది.
అరుణాచల్, అస్సాం ఇతర దేశాలు దెబ్బతింటాయనే హెచ్చరిక
ఇది భారత్ సహా దిగువ నదీ తీర దేశాలపై ఉపయోగించబోయే వాటర్ బాంబుగా చెబుతున్నారు. చైనా గనక ఆ ప్రాజెక్ట్‌ని కట్టి.. ఒక్కసారిగా నీటిని విడుదల చేయాలని నిర్ణయిస్తే.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ సహా ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలు నాశనమవుతాయనే హెచ్చరికలున్నాయ్. చైనా వైపు నుంచి అకస్మాత్తుగా వచ్చే వాటర్ రిలీజ్ నుంచి తలెత్తే.. విపత్తు ప్రమాదాలను నిలువరించేందుకు.. అరుణాచల్ ప్రదేశ్‌లోనే కౌంటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయ్. భారీ హైడల్ ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతోనే.. అరుణాచల్ ప్రదేశ్.. సౌత్ టిబెట్‌లోని భూభాగమని వాదిస్తోందనే చర్చ కొనసాగుతోంది.
చైనా మళ్లీ రెచ్చగొడుతోంది. తనదైన జిత్తులమారి చర్యలతో.. భారత్‌ని కవ్విస్తోంది. ఏళ్ల తర్వాత ఇండియా-చైనా సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొన్న సమయంలో.. డ్రాగన్ కంట్రీ మళ్లీ తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని వాదిస్తూ.. భారత్‌ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. సరిగ్గా.. పాక్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న టైమ్‌లో.. అరుణాచల్‌ని సౌత్ టిబెట్‌లో భాగంగా చూపుతూ మ్యాప్‌ని రిలీజ్ చేయడమేంటి? ఇన్నాళ్లూ.. సైలెంట్‌గా ఉన్న డ్రాగన్.. భారత్‌ని కవ్వించేందుకే ఇలా చేస్తోందా?
సరిహద్దుల్లో మళ్లీ బలుపు చూపిస్తున్న చైనా
ఈ ప్రశ్న ఎప్పుడు తలెత్తినా.. ఎవరు సంధించినా.. సమాధానం మారదు. చైనాని ఇప్పుడే కాదు.. ఎప్పుడూ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే.. డ్రాగన్ బుద్ధి అలాంటిది. సానుకూలంగా ఉన్నట్లే ఉండి.. మళ్లీ కవ్విస్తుంది. సందర్భంతో సంబంధం లేకుండా రెచ్చగొడుతుంది. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి.. పిచ్చి వేషాలు వేస్తుంది చైనా. ఇదే.. డ్రాగన్ కుటిల బుద్ధి. కుట్ర సిద్ధాంతం. దుష్ట పన్నాగాలతో ఏదో రకంగా భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది జిన్ పింగ్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా అరుణాచల్‌ని తమ భూభాగంగా క్లెయిమ్ చేస్తూ.. ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాల పేర్లు మార్చడం చూస్తుంటే.. చైనా వైఖరేంటో స్పష్టంగా అర్థమవుతోంది. చైనా చర్యలు..
భారత్‌లో చైనా గ్లోబల్ టైమ్స్‌పై నిషేధం
భారత్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే.. అరుణాచల్ విషయంలో చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాదు.. దాంతో పాటు మరో షాక్ కూడా ఇచ్చింది. డ్రాగన్ కంట్రీ మౌత్ పీస్‌గా ఉన్న గ్లోబల్ టైమ్స్‌ని.. మన దేశంలో బ్యాన్ చేసింది. గ్లోబల్ టైమ్స్ ఎక్స్ అకౌంట్‌ని నిషేధించింది. భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని కఠిన చర్యలు తీసుకుంది. ఇదే గ్లోబల్ టైమ్స్.. పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పైనా తప్పుడు ప్రచారం చేసినట్లు కేంద్రం గుర్తించింది. ఫేక్ ఫోటోలను సర్క్యులేట్ చేసింది. ఇండియాకు చెందిన రఫేల్ ఫైటర్ జెట్ కూలిందని, ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌లు దెబ్బతిన్నాయని.. పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు నిర్ధారించి.. భారత సర్కార్ చర్యలు తీసుకుంది. గ్లోబల్ టైమ్స్‌తో పాటు.. చైనాకు చెందిన ఇంకొన్ని న్యూస్ ఏజెన్సీలపైనా చర్యలు తీసుకుంది.
Also Read: ఆదిమూలపు రివెంజ్.. వైసీపీ విలవిల?
అరుణాచల్‌ని చైనాలో కలిపేసుకునేందుకు ప్రయత్నాలు
అయినా.. పాకిస్తాన్ తానా అంటే.. చైనా తందానా అనడం.. ఇప్పుడు కామనైపోయింది. అందుకోసమే.. ప్రధాని మోడీ ఇటీవలే.. న్యూక్లియర్ శక్తి ఉన్న దేశాల బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చిచెప్పారు. అదంపూర్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాక్‌తో పాటు.. ఇటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. భారత్ జోలికి వస్తే.. ఎవరినైనా మట్టికరిపిస్తామని హెచ్చరించారు మోడీ. నిజానికి అరుణాచల్ విషయంలో భారత్-చైనా మధ్య నెలకొన్న వివాదం ఈమధ్యకాలంలో చర్చనీయాంశంగా మారింది. ఎలాగైనా అరుణాచల్‌ని తమ భూభాగంలో కలిపేసుకోవాలని.. చైనా భావిస్తోంది. కానీ.. భారత్ మాత్రం ఆ చాన్స్ ఇవ్వడం లేదు. అయినప్పటికీ చైనా తన కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
సరిహద్దుల్లో భారత్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న చైనా
చైనా.. ఆసియాలో ఆధిపత్య శక్తిగా తమను అంగీకరించేలా.. అన్ని దేశాలను బలవంతంగా ఒప్పించాలని చూస్తోంది. కానీ.. అది కుదరట్లేదు. అందుకోసమే.. ఏదోరకంగా సరిహద్దుల్లో భారత్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. అయితే.. చైనా బుద్ధి తెలిసిన భారత్.. డ్రాగన్‌కి సరైనరీతిలో బుద్ధి చెప్పేందుకు.. సరిహద్దుల్లో అన్ని మౌలిక సదుపాయాలు పెంచుకుంటోంది. రోడ్లు, ఇతర సౌకర్యాలను మెరుగుపరుస్తోంది భారత ప్రభుత్వం. ఇవన్నీ.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరికి త్వరగా చేరుకునేందుకు ఉపయోగపడతాయ్. ఇవన్నీ చూసి.. డ్రాగన్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
ప్రస్తుతం 1959 నాటి సరిహద్దునే వాస్తవాధీన రేఖగా చెబుతున్న చైనా
ప్రస్తుతం 1959 నాటి సరిహద్దునే.. చైనా వాస్తవాధీన రేఖగా చెబుతోంది. 1993 నుంచి సరిహద్దు విషయంలో.. భారత్-చైనా మధ్య 5 ఒప్పందాలు జరిగాయి. వాటన్నింటిని డ్రాగన్ కంట్రీ.. యథేచ్ఛగా ఉల్లంఘించింది. దాంతో.. ఎన్నిరకాలుగా చూసుకున్నా.. చైనా బుద్ధి మారదు. ఆ దేశాన్ని కూడా అంత ఈజీగా నమ్మలేం. పైగా.. సరిహద్దు వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదు. అదొక.. సుదీర్ఘమైన వ్యవహారం. అందువల్ల.. భవిష్యత్తులో చైనా చేయబోయే సర్‌ప్రైజ్ ఎటాక్‌లను ఎదుర్కొనేందుకు.. భారత్ సిద్ధంగా ఉండాలి. అనుక్షణం.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలను గమనిస్తూ ఉండాలని.. ఆర్మీలో పనిచేసిన మాజీ అధికారులు చెబుతున్నారు.