BigTV English

BRS Leaders: బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట.. ఆ జిల్లాలో ఇన్చార్జ్ పదవి కోసం సిగపట్లు

BRS Leaders: బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట.. ఆ జిల్లాలో ఇన్చార్జ్ పదవి కోసం సిగపట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో గులాబీ పార్టీ ఇంత వరకు గెలవలేదు ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికలలో కారు పార్టీకి అక్కడ విజయం దక్కలేదు .. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావులు తర్వాత పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. పార్టీ పిరాయించిన తాటి వెంకటేశ్వర్లుని 2018లో మెచ్చా నాగేశ్వరరావు ఓడిస్తే.. 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావును ఓటర్లు ఓడించి ఇంటికి పంపించారు.

అలాంటి అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు గులాబీ కేడర్‌ని తీవ్ర గందరగోళంలోకి నెడుతోందంట. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న తాటి వెంకటేశ్వర్లు … జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావులను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు …తాను ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉంటే గత ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావుకు డిపాజిట్లు కూడా వచ్చేవి కావని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. నాగేశ్వరరావు ఇటీవల నియోజకవర్గంలోని మామిడి తోటలో తనకు సమాచారం లేకుండా రేగా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేయడంపై తాటి వెంకటేశ్వర్లు గుర్రుగా ఉన్నారంట. దానిపై తన మనసులో ఉన్న బాధను ఆయన తన అనుచరుల ముందు ఏకరువు పెడుతున్నారంట.


నియోజకవర్గంలో ఇలాంటి తోట రాజకీయాలు మానుకొవాలని తాటి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగానే విమర్శించటంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు రోడ్డున పడ్డట్లైంది. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన ఇద్దరు నాయకులు ఇలా ఇంచార్జ్ పదవి కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పార్టీ పరువును కాస్త బజారు కీడుస్తూన్నారంటూ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

వాస్తవానికి గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు తనకు తానే పార్టీ ఇంచార్జ్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చుకు కారణంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఒకరినొకరు విమర్శించుకుంటూ పార్టీ పరువును బజారుకిడిస్తున్నారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో వాస్తవానికి ఈ ఇద్దరి నేతల మధ్య వైరం ఈ నాటిది కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుండి తాటి వెంకటేశ్వర్లు. తెలుగుదేశం పార్టీ నుండి మెచ్చా నాగేశ్వరావు పోటీ చేయగా తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Also Read: కేటీఆర్ కేరళ టూర్.. అసలు కథ ఇదే..

గెలిచిన ఆరు నెలల్లోనే తాటి వెంకటేశ్వర్లు అధికారం చేపట్టిన గులాబీ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు పోటీ చేస్తే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరావు పోటీచేసి విజయం సాధించారు. అయితే మెచ్చా నాగేశ్వరరావు కూడా మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అప్పటినుండి ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ అంతర్గతంగా వైరం కొనసాగుతూనే ఉంది.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఇన్చార్జిలుగా ఎవరిని నియమించలేదు. కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అశ్వరావుపేట ఇన్చార్జ్‌గా ఎవరినీ నియమించలేదని పదపదే ప్రకటిస్తున్నారు . అయితే మెచ్చా నాగేశ్వరావు మాత్రం తానే ఇన్చార్జి అంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తుండటం వాటికి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మద్దతు ఇస్తుండటం. పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వకపోవటం పట్ల తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహాంతో రగిలిపోతున్నారు.

ఇటీవల మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అధ్యక్షతన రాగా కాంతారావు దమ్మపేట మండలంలో పర్యటించారు..ఈ పర్యటనలో భాగంగా మెచ్చా నాగేశ్వరావుకు చెందిన ఓ కొబ్బరి తోటలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన సున్నం నాగమణి, భూక్యా ప్రసాద్, తాటి వెంకటేశ్వర్లు వంటి ముఖ్యనేతలకు సమాచారం అందలేదు..దీనితో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దమ్మపేట మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరావుల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మెచ్చా నాగేశ్వరావు మామిడి, కొబ్బరి తోట రాజకీయాల మానుకోవాలని , పార్టీలో అందర్నీ కలుపుకుని పోవాలని హితవు పలుకుతూ మాట్లాడారు. ఒక దశలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయుంటే కనీసం బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కేవి కావన్నారు. అలానే రేగా కాంతారావు రాజకీయాల్లో తనకంటే జూనియర్ అని, తాను బూర్గంపాడు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో రేగా కాంతారావు పీఈటీ గా పనిచేస్తూ సెల్యూట్ కొట్టేవాడని అన్నారు.. జిల్లా అధ్యక్షుడిగా పనితీరు మార్చుకొకపోతే తనదారి తాను చూసుకుంటాననీ హెచ్చరికలు జారీ చేశారు. తాటి వెంకటేశ్వర్లు విమర్శల పై స్పందించిన రేగా కాంతారావు పార్టీలో ఉండటం ఇష్టం లేనివారే ఇలా మాట్లాడతారని యద్దేవా చేశారు. దాంతో ఇన్‌డైరెక్ట్‌గా తాటి వెంకటేశ్వర్లును పార్టీలో నుంచి పొమ్మని చెప్పినట్లైందన్న ప్రచారం జరుగుతుంది.

అయితే రేగా కాంతారావు ఇలా స్పందించడానికి అసలు కారణం వేరే వుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తుండటంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బిఆర్ఎస్ కోర్టుకెక్కింది. ఆ స్థానానికి తిరిగి ఉపఎన్నిక వస్తుందేమోనని ఆశలు పెట్టుకున్న రేగా కాంతారావు,, భద్రాచలం నుండి పోటీ చేయాలని భావించారంట..అయితే తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట కాదంటే భద్రాచలానికి అయినా ఇన్చార్జిగా నియమించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతుండటంతో.. తన ఉనికికే ప్రమాదం వస్తుందని గ్రహించిన రేగా కాంతారావు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారంట.

గడిచిన ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ తుడిచిపెట్టుకొని పోవటంతో పార్టీని ముందుకు నడిపే నాథుడే కరువయ్యాడు. ఓ పక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులే కరువయ్యారంటున్నారు. పార్టీలో వున్న అరకొర నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న పార్టీలో ఆ ముగ్గురి మధ్య నడుస్తున్న మూడుముక్కలాట పార్టీ వర్గాలకు అంతుపట్టకుండా తయారవుతుందంట.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×