Rahul Gandhi Sambhal Visit| ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ ప్రాంతలో మసీదు వివాదంపై జరిగిన కాల్పుల్లో మరిణించిన వారిని పరామర్శించడానికి బుధవారం డిసెంబర్ 4, 2024న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ నాయకుల బృందం ఢిల్లీ నుంచి బయలు దేరింది. కానీ వారిని సంభల్ జిల్లా సరిహద్దుల్లోకి రానివ్వకుండా పోలీసులు గాజీపూర్ బార్డర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో గాజీపూర్, ఢిల్లీ మీరట్ హై వే బార్డర్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
పోలీసులతో కలిసి ఒంటరిగానైనా వెళ్లేందుకు నేను సిద్ధం: రాహుల్ గాంధీ
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తాను సంభల్ ప్రజలను, దుర్ఘటన బాధిత కుటుంబాలను కలిసేందుకు వెళుతుంటే పోలీసులు తనను అడ్డకోవడం బాధాకరమని చెప్పారు. “ప్రతిపక్ష నాయకుడిగా నాకు సంభల్ లో ప్రవేశించే అధికారం ఉంది. ఈ అధికారం నాకు రాజ్యాంగం కలిగించింది. పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందంతో కలిసి వెళ్లడం అభ్యంతరకరమైతే.. నేను వారితో కలిసి ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధం”. అని తెలిపారు.
పోలీసుల తీరును వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తప్పుబట్టారు. “రాహుల్ గాంధీ రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఆయనకు రాజ్యాంగం అధికారాలు కూడా కలిగించింది. సంభల్ ప్రాంతంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయనకు అనుమతించాల్సిందే” అని ప్రియాంక గాంధీ అన్నారు.
ALSO READ: రైతులకు ఓపిక నశిస్తే దేశానికి చాలా నష్టం.. కేంద్రంపై ఉపరాష్ట్రపతి ఫైర్
నవంబర్ 30న కూడా సంభల్ ప్రాంతంలో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ నాయకులు వెళ్లడానికి ప్రయత్నించగా.. వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో కలెక్టర్ భారతీయ న్యాయ సంహిత చట్టం సెక్షన్ 163 ప్రకారం.. జిల్లాలో స్థానికేతర ప్రజల ప్రవేశంపై నిషేధం విధించారు. ఈ నిషేధం ఆదివారం డిసెంబర్ 1, 2024 వరకు అమలులో ఉంది. దీంతో కాంగ్రస్ పార్టీ నాయకులు డిసెంబర్ 4న బయలుదేరారు. అయినా కలెక్టర్ వెంటనే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో స్థానికేతరుల ప్రవేశంపై డిసెంబర్ 31 వరకు నిషేధం పొడిగిస్తున్నట్లు తెలిపారు.
సంభల్ ప్రాంతంలోని మొఘల్ సామ్రాజ్య సమయానికి చెందిన పురాతన మసీదు లోపల హిందూ దేవాలయ ఆనవాళ్లున్నాయని కోర్టులో పిటీషన్ వేయగా.. కోర్టు వెంటనే పురావస్తు శాఖతో సర్వే చేయించాలంటే ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణలో, ఆదేశాలు జారీ చేసిన సమయంలో మసీదు కమిటీ సభ్యులెవరూ కోర్టులో లేకపోవడంతో కోర్టు నిర్ణయాలను న్యాయ నిపుణలు తప్పుబడుతున్నారు. పైగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు గంట్లలోనే పురావస్తు శాఖ సర్వే చేపట్టడం, సర్వే సమయంలో పోలీసులు భధ్రత లేకపోవడంతో సంభల్ జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మసీదులో పురావస్తు శాఖ సర్వే చేపట్టిన సమయంలో మసీదు బయట భారీగా జనం గుమిగూడి నిరసనలు చేశారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు మరణించారు. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసు విచారణని స్థానిక కోర్టు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంభల్ జిల్లా ఎస్‌పీ హెచ్చరిక
ఉద్రిక్త పరిస్థితులు ఉన్న దృష్ట్యా సంభల్ జిల్లా స్థానికేతురల ప్రవేశంపై నిషేధం విధించబడిందని.. ఈ మేరకు సెక్షన్ 163 నోటీసులు కాంగ్రెస్ నాయకులు అందజేశామని జిల్ల ఎస్‌పీ క్రిషన్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు బలపూర్వకంగా లోపలికి ప్రవేశిస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని మీడియాతో చెప్పారు.