BRS Party: మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ నేతల వారిలో వారే వార్నింగులు ఇచ్చుకుంటూ రాజకీయ కాక రేపుతున్నారు. పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు, హెచ్చరికలు, పరస్పర ఆరోపణలు తెరమీదకు వస్తూ ప్రతిపక్షాన్ని మరింత అభాసుపాలు చేస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒకే వేదికపై పరస్పరం చేసుకున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పక్కనే ఉండి టార్గెట్ చేస్తున్నా సదరు నేతలు ఏమీ అనలేక ఆక్రోశంతో కుర్చీకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అసలా ఇంటర్నల్ వార్‌కి కారణమేంటి?
మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్‌లో ఎవరికి వారే
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రజాప్రతినిధుల ఆగడాలకు ప్రజలకు విసుగు చెందారు. ఎంపీలు, ఎమ్మెల్యే లు, మంత్రులు, ఎమ్మెల్సీలుగా పదువుల్లో ఉన్నప్పుడు ఎవరికి వారు అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంపీగా కవిత, అప్పటి ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావులు జిల్లా బీఆర్ఎస్‌లో పదవులు వెలగబెట్టారు. అధికారంలో ఉన్నప్పటి నుంచి వారి మధ్య సఖ్యత లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చినా వారి అంతర్గత పోరు బహిర్గతమవుతూనే ఉంది.
సొంత వారికి వార్నింగులు ఇస్తున్న శంకర్‌నాయక్
మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల పలు సందర్భాల్లో నిర్వహించిన పలు సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పార్టీ జిల్లా అధ్యక్షరాలు మాలోతు కవిత, ప్రస్తుత ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావులు ఒక్కరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంత పార్టీ నేతలకే పరుష పదజాలంతో వార్నింగ్‌లు ఇచ్చారు. ఎవరికి వారు మీడియా సమావేశాల్లో, సభల వేదికలపై ఇతర నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదంటూ, ప్రత్యర్థులను కాదు – సొంత నాయకులనే హెచ్చరిస్తున్నారు.
మహబూబాబాద్ బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే
ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కొందరు నాయకులు నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా, సైటర్లు వేస్తూ బాణాలు వదిలారు. కొంతమంది పదవుల కోసం పార్టీనే నెగెటివ్ గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు, అలాంటి వారిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే, మహబూబాబాద్ బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పార్టీ హైకమాండ్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తుందో, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలను ఏ విధంగా పరిష్కరిస్తారో అనేది తేలాల్సి ఉంది.
ఇలాంటి నేతల మధ్య సఖ్యత ఎలా సాధ్యం అన్నది ప్రధాన ప్రశ్న
ఒక్కో నేత ఒక్కో వేదికపై ప్రత్యర్థిని కాకుండా – సొంత నాయకునినే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న తీరు పార్టీని అభాసు పాలు చేస్తోందని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేతల మధ్య సఖ్యత ఎలా సాధ్యం అన్నది ప్రధాన ప్రశ్నగా మారుతోంది. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాజీ ఎంపీ కవిత , ప్రస్తుత ఎమ్మెల్సీ రవీందర్‌రావుల లాంటి నేతల తీరుపై కింది స్థాయి క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
సీనియర్లపై తిరుగుబాటుకు సిద్దమవుతున్న యువ నేతలు
పార్టీ వారి సొంతం అన్నట్లుగా పెత్తనం చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వారికి ప్రాధాన్యత దక్కేలా చేసుకోవడానికే సదరు నేతలు సిగపట్లకు దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారి వైఖరితో విసిగిపోతున్న స్థానిక యువ నేతలు సీనియర్ లీడర్లపై తిరుగుబాటుకు సిద్దమవుతున్నారంట. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం జోక్యం చేసుకుని, ఈ వార్నింగ్స్ వారకు చెక్ పెట్టే చర్యలు తీసుకోకపోతే, జిల్లాలో పార్టీకి మరింత దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.