Hyderabad Crime: హైదరాబాద్ సిటీ శివారు బాచుపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. కేవలం 24 గంటల్లో ఈ కేసు చేధించారు పోలీసులు. మహిళ-యువకుడి మధ్య సహజీవనం చిచ్చుపెట్టింది. దాని ఫలితంగా ఆమెని చంపేశాడు యువకుడు. అయితే ఇద్దరు నేపాలీకి చెందినవారు.
హైదరాబాద్ సిటీలో కలకలం రేపిన ట్రావెల్ బ్యాగులో మహిళ మృతదేహం కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. నేపాల్‌కు చెందిన 33 ఏళ్ల తారా బెహరా బాచుపల్లిలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వర్కర్‌గా పని చేస్తోంది. తారాకు ఇదివరకు వివాహం జరిగింది, ఇద్దరు పిల్లలున్నారు.
నేపాల్‌కి చెందిన 30 ఏళ్ల విజయ్ తోఫా జూబ్లీహిల్స్‌లో తన సోదరుడి దగ్గర ఫాస్ట్ ఫుడ్ షాపులో పని చేసేవాడు. ఆ తర్వాత మానేశాడు. విజయ్ తోఫా-తారా బెహరా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్‌కు దారి తీసింది. ఆ తర్వాత సహజీవనం మొదలుపెట్టారు. ఇక్కడవరకు స్టోరీ బాగానే సాగింది.
ఈ క్రమంలో ఇద్దరు బౌరంపేటలోని ఇందిరమ్మకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. విజయ్ సొంతంగా ఫాస్ట్ ఫుడ్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే తారా గర్భం దాల్చిన విషయం తెలుసుకున్నాడు విజయ్. ఏం చెయ్యాలో అతగాడికి అంతుబట్టలేదు. చివరకు అబార్షన్ చేయించుకోవాలని తారాపై ఒత్తిడి తెచ్చాడు.
ALSO READ: కోటి రివార్డు.. మావోయిస్టు అగ్రనేత సుధాకర ఎన్‌కౌంటర్
అందుకు ఆమె ససేమరా అంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. రోజురోజుకూ ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు విజయ్. సరిగ్గా మే 23న తెల్లవారుజామున వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తారా గొంతుకు చున్నీ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు విజయ్.
చివవరకు నిందితుడు కేపీహెచ్‌బీలో ట్రావెల్ బ్యాగ్‌ని కొనుగోలు చేశాడు. తారా మృత దేహాన్ని అందులో కుక్కేశాడు. బాచుపల్లి-మియాపూర్ రహదారి సమీపంలో నిర్మానుష్యంగా ఉండే లేఅవుట్‌లో ట్రావెల్ బ్యాగ్‌ని విసిరేసి పరారయ్యాడు. జూన్ 4న విజయదుర్గా ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ ప్రహరీ గోడ వద్ద ట్రావెల్ బ్యాగ్ నుంచి తీవ్ర దుర్వాసన రావడం మొదలైంది.
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ను ఓపెన్ చేశారు. అందులో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో షాక్ అయ్యారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసుకు కీలకంగా మారింది. దాని ఆధారంగా వివరాలు సేకరించడం మొదలుపెట్టారు.
గడిచిన పది రోజులుగా ట్రావెల్ బ్యాగ్ కొన్న వారి వివరాలు సేకరించారు. సీసీ విజువల్స్ ద్వారా నిందితుడు ఉండే ఏరియాని ట్రాక్ చేశారు. ఆ తర్వాత విజయ్ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. చివరకు గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న విచారించారు పోలీసులు. తారాను తాను చంపినట్టు ఒప్పుకోవడంతో ఈ కేసు మిస్టరీ వీడింది. అయితే విజయ్‌కి ఎవరు సహకరించారు అనేదానిపై లోతుగా విచారణ మొదలుపెట్టారు.