BigTV English

CM Chandrababu: ఏపీలో కొత్త పండుగ.. మరో మూడు పథకాలు షురూ..

CM Chandrababu: ఏపీలో కొత్త పండుగ.. మరో మూడు పథకాలు షురూ..

26-01-2025 ఆదివారం (ఘనంగా గణతంత్ర వేడుక)
ఆదివారం ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు జరిపింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం చంద్రబాబు తన సతీమణితో కలిసి హాజరైయ్యారు.

27-01-2025 సోమవారం ( నీతిఆయోగ్ నిజాలు)
సీఎం చంద్రబాబు నీతిఆయోగ్‌ నివేదికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతిఆయోగ్‌ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఏపీ 17వ స్థానంలో ఉంది. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ అరాచక, విధ్వంసకర ఆర్థిక విధానాలేనని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తోందని గతంలో తాము చేసిన ఆరోపణలు అక్షరాల నిజం అయ్యాయని అన్నారు సీఎం.


ఐదేళ్లలో ఎడాపెడా లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్‌ ప్రభుత్వం మూలధన వ్యయంపై అతితక్కువ ఖర్చు పెట్టారని విమర్శించారు. దీని వలన రాష్ట్రం ఆర్థిక అస్థిరతకు లోనైందని చంద్రబాబు విమర్శ. 2022-23లో 2 లక్షల 25 వేల కోట్లు ఖర్చు పెడితే అందులో మూలధన వ్యయం 7వేల 244 కోట్లు మాత్రమేనని మండిపడ్డారు చంద్రబాబు.

టీడీపీ హయాంలో 13.21% ఉన్న జీఎస్‌డీపీ వృద్ధి రేటు జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో 9.61 శాతానికి పడిపోయిందని సీఎం లెక్క. దీంతో రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని ఆయన విమర్శ. 2020-21లో కరోనా సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు మైనస్ 1.20 శాతం, తెలంగాణ వృద్ధి రేటు మైనస్ 0.74 ఉంటే.. ఏపీ మాత్రం 5.70 శాతం వృద్ధి రేటు సాధించిందని జగన్ ప్రభుత్వం నీతి ఆయోగ్‌కి తప్పుడు సమాచారం ఇచ్చిందని మండిపడ్డారు.

జగన్ చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని అన్నారు చంద్రబాబు.
ఏడు నెలల్లోనే 6లక్షల 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. వాటి ద్వారా 4లక్షల 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా. గూగుల్, గ్రీన్‌ ఎనర్జీ సహా ఇతర సంస్థలు పెట్టబోయే వాటిని కలుపుకొంటే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు సీఎం. మొత్తంగా 6 నుంచి 7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

27-01-2025 సోమవారం (ప్రజల సంతృప్తికే ప్రాధాన్యం)
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సచివాలయంలో సీఎం సోమవారం సమీక్షించారు. పథకాల అమలుపై లబ్ధిదారుల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్ష జరిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని పనితీరుకు ప్రామాణికంగా భావిస్తామని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు. ప్రజల సంతృప్తి స్థాయికే తొలి ప్రాధాన్యమని, వారి అంచనాల మేరకు ప్రతి ఉద్యోగీ పనిచేయాలన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై పది అంశాల్లో సర్వే నిర్వహించామని చెప్పారు. ఐవీఆర్‌ఎస్‌తో పాటు వివిధ మార్గాల్లో సర్వే జరిగిందని అన్నారు. సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

27-01-2025 సోమవారం (మహిళలకు ఉచిత ఇళ్ల స్థలాలు )
చంద్రబాబు ప్రభుత్వం సోమవారం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఉచిత ఇళ్ల స్థలాల పట్టాలను మహిళల పేరిట అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున బీపీఎల్‌ పరిధిలో ఉన్నవారికి ఇవ్వనున్నారు. తెలుపు రంగు రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని ఈ ఉత్తర్వుల్లో ఉంది. కన్వెయన్స్‌ డీడ్‌ రూపంలో పట్టాలు అందజేస్తామని ప్రభుత్వ వివరణ. జారీ చేసినప్పటి నుంచి పదేళ్ల తర్వాత వాటిపై యాజమాన్య హక్కులను ప్రభుత్వం కల్పిస్తుంది.

28-01-2025 మంగళవారం ( ఎంపీలకు దిశానిర్ధేశం)
మంగళవారం సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సి అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతికి రాబోయే బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా ప్రయత్నించాలన్నారు. గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు అందిలా వ్యూహాత్మకంగా వ్యవహించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12వేల 150 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రానికి టీడీపీ నుంచి అదే తరహా సహకారం ఉండాలని చెప్పారు. దేశ విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కేంద్రానికి పూర్తిగా అండగా ఉండాలని అన్నారు.

28-01-2025 మంగళవారం (జూన్‌లోగా నామినేటెడ్ పదవులు)
రాష్ట్రంలోని నామినేడెడ్ పదవులపై మంగళవారం సీఎం చంద్రబాబు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నామినేటెడ్‌ పదవులన్నీ జూన్‌లోగా భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఆ పదవులు ఆశిస్తున్నవారు పార్టీ విభాగాలైన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లలో సభ్యులై ఉండాలని స్పష్టం చేశారు. ఏ స్థాయి నాయకులైనా క్యూబ్స్‌లో ఉంటేనే పదవులు దక్కుతాయని తేల్చి చెప్పారాయన. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన వారికంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారినే ప్రోత్సహించాలని సూచించారు.

29-01-2025 బుధవారం (పంచగ్రామాలకు శాశ్వత పరిష్కారం)
సింహాచలం ఆలయ భూముల పరిధిలోని పంచ గ్రామాల భూముల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆక్రమణకు గురైన ఆలయ భూములకు ప్రత్యామ్నాయంగా.. 5 వేల 300 కోట్ల విలువైన భూములను ఇతర చోట్ల దేవస్థానానికి కేటాయించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. విశాఖలో దీర్ఘకాలంగా ఉన్న పలు రకాల భూ సమస్యల పరిష్కార చర్యలపై సీఎం.. రెవెన్యూ శాఖ అధికారులు, విశాఖ ప్రజాప్రతినిధులతో సచివాలయంలో సమావేశమయ్యారు. పంచ గ్రామాల్లోని..12 వేల 149 ఇళ్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచలం దేవస్థానానికి ఇచ్చేందుకు సీఎం ఆమోదం తెలిపారు.

30-01-2025 గురువారం (పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం)

గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. 15 పునరుత్పాదక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలకు మండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో
44వేల 778 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు పలు సంస్థలు పంపిన ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టుల ద్వారా 19వేల 580 మందికి ఉపాధి లభిస్తుంది.

అర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు పరిశ్రమకు, బీపీసీఎల్‌ చమురు శుద్ధి కర్మాగారాలకు మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నామని చంద్రబాబు ఈ సమావేశం తెలిపారు. వీటికి అన్ని అనుమతులు త్వరితగతిన అందిస్తామని చెప్పారు. పారిశ్రామిక రంగంలో 20% వృద్ధి సాధించాలన్నదే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. దావోస్‌ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు.

31-01-2025 శుక్రవారం(స్వామివారి సేవలో సీఎం)
శుక్రవారం సీఎం చంద్రాబాబు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నగరేశ్వరస్వామి, మహిషాసురమర్దిని, వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయాన్ని దర్శించారు. ఆ తర్వాత అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో నెలకొల్పిన వాసవీ శాంతిధామ్‌ను సందర్శించారు. 90 అడుగుల పంచలోహ, మరకత వాసవీమాత విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించనున్న గురుపీఠం, యోగా కేంద్రాలకు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అహింస, ఆత్మత్యాగానికి, శాంతికి అమ్మవారు ప్రతిరూపమని, పెనుగొండ మున్ముందు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన చెప్పారు. అక్కడే చంద్రబాబు ఆర్యవైశ్యులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్యవైశ్యులు కష్టపడే గుణం, తెలివితేటలు ఉన్నవారని అన్నారు సీఎం. నీతినిజాయతీలతో వ్యాపారం చేస్తారని అభిప్రాయపడ్డారు.

ఇక బీసీలు టీడీపీకి పార్టీకి పట్టుగొమ్మలని చంద్రబాబు తెలిపారు. బీసీలకు రాజకీయాలు నేర్పించి చట్టసభల్లో పదవులిచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎన్నో కల్పించామన్నారయన. రానున్న కాలంలో ఎన్డీయే ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు.

31-01-2025 శుక్రవారం(పొలిట్‌బ్యూరో నిర్ణయాలు)
సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, సంస్థాగత అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు 60 శాతం పైగా అమలు చేశామని చెప్పారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులిచ్చిన కేంద్రానికి, వాటిని సాధించిన చంద్రబాబుకు పొలిట్‌బ్యూరో ధన్యవాదాలు తెలిపింది. పార్టీ చరిత్రలో మొదటిసారి సభ్యత్వాలు కోటి దాటేలా కృషి చేసిన లోకేశ్‌ను అభినందించింది. బాలకృష్ణతోపాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు తెలిపింది.

పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈసారి మహానాడు మే 27, 28, 29న కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడులో రెండో రోజు పార్టీ జాతీయ అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు. మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.

ఆర్థిక సమస్యలున్నా జూన్‌లోగా సూపర్‌-6లోని మిగతా మూడు హామీల అమలు చేయాలని నిర్ణయించారు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మే నెలలో తల్లికి వందనం, మూడు దఫాలుగా అన్నదాత సుఖీభవ అమలు చేయనున్నారు.

1-02-2025 శనివారం(కనుల పండగగా పింఛన్ల పంపిణీ )

అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో శనివారం పర్యటించారు. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. మొదట సంబేపల్లెలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నాగేశ్వరనాయుడిని ప్రశంసించారు. ఆ తర్వాత ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. పించన్ల పంపిణీ పూర్తి అయిన తర్వాత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ప్రజావేదిక వద్ద సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో ముఖాముఖిలో మాట్లాడారు. నాడు ఐటీని ప్రోత్సహించడం వల్లే, ఇప్పుడు తాము సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సాధించామని వారు చెప్పారు. ఒక్కొక్కరు వారి జీతాల వివరాలు సీఎంతో చెప్పారు. యువత చెప్పిన మాటలకు సీఎం ఇంప్రెస్ అయ్యారు.

రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తామని యువతకు చంద్రబాబు చెప్పారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఏఐ టెక్నాలజీ వినియోగం తెలుసుకోవాలని సూచించారు. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన సాగిస్తే ప్రెజంట్ వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజల చేతుల్లోకి పాలన వచ్చిందని అన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతోనే కేంద్రంలో ఏపీ పలుకుబడి పెరిగిందని చంద్రబాబు చెప్పారు. ఆ పలుకుబడితో విశాఖలో రైల్వే జోన్‌, పోలవరం, అమరావతికి నిధులు సాధిస్తున్నామని అన్నారు. విశాఖ ఉక్కుకు కొత్త వెలుగు తీసుకొస్తున్నామని తెలిపారు. 2047 కల్లా పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే తన టార్గెట్ అని అన్నారు సీఎం.

1-02-2025 శనివారం(కేంద్ర బడ్జెట్‌పై ప్రశంసలు)
కేంద్ర బడ్జెట్‌ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ దార్శనికతను బడ్జెట్‌ ప్రతిబింబిస్తోందని ప్రశంసించనున్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్‌ గుర్తించిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

1-02-2025 శనివారం(కీలక నియామకాలపై ఉత్తర్వులు)
రిటైర్డ్ డీజీపీ ఆర్‌.పి.ఠాకుర్‌కు ప్రభుత్వ సలహాదారుగా సీఎం చంద్రబాబు నియమించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ నుంచి విధులు నిర్వహిస్తారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇక రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీసు గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×