BigTV English

CM Revanth Reddy: జూన్ 14న గద్దర్ అవార్డ్స్ లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారంటే.?

CM Revanth Reddy: జూన్ 14న గద్దర్ అవార్డ్స్ లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారంటే.?

CM Revanth Reddy: సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటనతో కీలక పెట్టుబడులు రాబట్టింది. సత్ఫలితాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం, తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర.. జూన్ 14న గద్దర్ అవార్డ్ ప్రదానం.. ఇవన్నీ ఈవారం కీలక అప్డేట్స్. అవేంటో డిటైల్ గా చూద్దాం.


20-04-2025 ఆదివారం ( హైదరాబాద్ లో ఎకో టౌన్ )

జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. అక్కడ సీఎం బృందానికి జపనీస్ సంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం ఉండనుంది. ఈ సందర్భంగా ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.


హైదరాబాద్ – కిటాక్యూషు నగరాల మధ్య విమాన సర్వీస్

ముఖ్యమంత్రి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు సిటీ ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో అక్కడి మేయర్ వివరించారు. హైదరాబాద్ – కిటాక్యూషు నగరాల మధ్య విమాన సర్వీస్ ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

20-04-2025 ఆదివారం ( ఆర్టీసీలో ఉద్యోగాల జాతర )

ప్రభుత్వ ఉద్యోగాలను క్రమం తప్పకుండా భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆర్టీసీలో ఖాళీలపైనా గుడ్ న్యూస్ అందించింది. TGSRTCలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారు. వీటిలో 2 వేల డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ – ట్రాఫిక్‌, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ – మెకానికల్‌, 25 డిపో మేనేజర్‌- అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 18 అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ పోస్టులు, 23 అసిస్టెంట్‌ ఇంజినీర్‌, 11 సెక్షన్‌ ఆఫీసర్‌, 6 అకౌంట్‌ ఆఫీసర్స్‌, 7 మెడికల్‌ ఆఫీసర్స్‌, 7 మెడికల్‌ ఆఫీసర్స్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు ఉండనున్నాయి.

21-04-2025 సోమవారం ( ఒసాకాలో తెలంగాణ పెవిలియన్ )

జపాన్‌లోని ఒసాకాలో ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఈనెల 21న ప్రారంభించారు. ఎక్స్పోలోని భారత పెవిలియన్‌లో తెలంగాణ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఐదేళ్లకు ఒసాకా ఎక్స్పోను నిర్వహిస్తారు. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న భారత్ లోని తొలి రాష్ట్రం తెలంగాణే. పెట్టుబడుల విషయంలో ఎక్కడ సదస్సులు జరిగినా అక్కడ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయిస్తున్నారు. మన దగ్గర ఉన్న వనరులను అవకాశాలను వివరిస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నారు.

lతెలంగాణలో అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు

ఒసాకాలోనూ సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు. హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఇది ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జపాన్ కే చెందిన మరుబెని కంపెనీ ఈ అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతోంది.

21-04-2025 సోమవారం ( పోచంపల్లిలో మిస్ వరల్డ్ ర్యాంప్ వాక్ )

మే 7 నుంచి 31వ తేదీ వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ పోటీలకు 140 దేశాల నుంచి 3 వేల మంది యువతులు, విదేశీ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. మే 15న విదేశీ యువతులను ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన భూదాన్ పోచంపల్లికి తీసుకెళ్లనుంది ప్రభుత్వం. ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతలను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం, ప్రత్యేకతలను వివరించనున్నారు. చేనేత కార్మికులతో ట్రాన్స్ లేటర్లను పెట్టి ముఖాముఖి కూడా ఏర్పాటు చేస్తారు. అమ్మాయిలంతా పోచంపల్లిలో ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేయనున్నారు. గద్వాల్ సిల్క్, గొల్లభామ కాటన్, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్​ పోచంపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణ హ్యాండ్​లూమ్ అనే థీమ్ తో నూతన  కార్యక్రమం

తెలంగాణ హ్యాండ్​లూమ్ అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనుంది ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే యువతులు చేనేత దుస్తులు ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులను పోచంపల్లికి తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తెచ్చేలా సర్కార్ ప్లాన్ చేసింది. వివిధ దేశాల నుంచి వచ్చే యువతులను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి ఆ ప్రదేశాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట. నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించేలా అధికారులు ప్లాన్​ చేశారు.

22-04-2025 మంగళవారం ( తెలంగాణలో జపాన్ )

తెలంగాణ రైజింగ్ టీమ్ జపాన్ పర్యటన చాలా ఫ్రూట్ ఫుల్ గా సాగింది. ఈనెల 22న సీఎం రేవంత్ బృందం.. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీని సందర్శించింది. అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటో, తెలంగాణ బృందానికి ఘన స్వాగతం పలికారు. హిరోషిమా అంటే నమ్మకానికి, పునర్నిర్మాణానికి చిహ్నమని, ప్రజల ఐక్యతతో ఏదైనా సాధ్యమని నిరూపించిన నగరం నగరం ఇది అని రేవంత్ అన్నారు. హిరోషిమా మాదిరిగానే ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ అని, సకలజనుల పోరాటంతో విజయం సాధించిన రాష్ట్రం తమది అని గుర్తు చేశారు. జపాన్‌కు చెందిన 50కి పైగా కంపెనీలు తెలంగాణలో సక్సెస్ ఫుల్ గా పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

తెలంగాణ ఆటోమోటివ్ & మొబిలిటీ కారిడార్ ఏర్పాటు

క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, మ్యానుఫాక్చరింగ్ రంగాల్లో మరిన్ని కంపెనీలను స్వాగతిస్తున్నామన్నారు సీఎం. పట్టణాభివృద్ధిలో భాగంగా విపత్తు నిరోధక నిర్మాణాలు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ పరిష్కారాల్లో హిరోషిమా అనుసరిస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని హైదరాబాద్‌లో ఉపయోగించే అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ కేంద్రాల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక రంగంలో సహకారాన్ని పెంచే లక్ష్యంతో హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ & మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

22-04-2025 మంగళవారం ( ఫలితమిచ్చిన సివిల్స్ అభయహస్తం )

సివిల్స్ ప్రిపేర్ అయ్యే పేద, మధ్యతరగతి అభ్యర్థులను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం మంచి ఫలితాన్నిచ్చింది. సీఎం రేవంత్ ఆలోచనల నుంచి వచ్చిన ఈ పథకం సరికొత్త దశ దిశను చూపించింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందినవారిలో ఏడుగురు అభ్యర్థులు ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే ఏడుగురు అభ్యర్థులు సివిల్ సర్వీసులకు ఎంపికవడం కీలకంగా మారింది. యువత కలలు, ఆశయాలను నిజం చేసుకునే విధంగా వారికి మద్దతు ఇవ్వడంలో, సాధికారత కల్పించడంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వ ముందుంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

22-04-2025 మంగళవారం ( జూన్ 14న గద్దర్ అవార్డులు )

ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్తగా గద్దర్ అవార్డులను తీసుకొచ్చింది. తెలుగు సినిమాలతో పాటే ఉర్దూ చిత్రాలనూ ప్రోత్సహిస్తామన్నారు భట్టి. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి గద్దర్‌ అని, చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ గద్దర్‌ బాణి, పాటలను అనుకరిస్తారన్నారు. చలన చిత్ర అవార్డులు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు. జూన్‌ 14న గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు.

హెచ్‌ఐసీసీ వేదిగా ఈ కార్యక్రమం జరగనుంది. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో ఇప్పటికే జ్యూరీ ఏర్పాటైంది. జ్యూరీ కమిటీకి ఛైర్ పర్సన్ గా నటి జయసుధ ఉన్నారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందాయి.

23-04-2025 బుధవారం ( జపాన్ టూర్ సక్సెస్ )

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈనెల 16 నుంచి ఏడు రోజుల పాటు జపాన్ లో పర్యటించడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. ఈ పర్యటనలో తెలంగాణకు 12,062 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో దాదాపు 2,44,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.

తెలంగాణ ఏర్పడ్డాక ఇదో మైల్ స్టోన్

ఆ ఒప్పందాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 80,500 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావో‌స్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం 40 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా.. ఈ ఏడాది దావోస్‌ సదస్సులో గతంకంటే మూడు రెట్లు అధికంగా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దీంతో 50 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్‌ పర్యటనల్లో భాగంగా మరో 14,900 కోట్ల మేర పెట్టుబడులను సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇదో మైల్ స్టోన్.

23-04-2025 బుధవారం ( ప్రతిసోమవారం ఖాతాల్లో జమ )

తెలంగాణలో పేదలకోసం పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా, నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి. ఇకపై ప్రతి సోమవారం అందరి ఖాతాల్లో బిల్లులు జమ చేస్తాం అని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 మందిని మే మొదటి వారంలోపు ఎంపిక చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల ఎంపిక సమర్థవంతంగా జరగాలంటే ప్రతి 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలన్నారు. అర్హతలేని వారిని ఎంపిక చేస్తే బాధ్యత వారిదే అంటున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి విడుదలయ్యే బిల్లులు ఇకపై నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకారం ప్రతి సోమవారం లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయన్నారు మంత్రి.

23-04-2025 బుధవారం ( ఇక సరికొత్త రూపంలో హైడ్రా )

నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రా తన లోగో మార్చుకుంది. జల వనరుల శాఖను పోలి ఉండేలా కొత్త లోగోను అధికారులు రూపొందించారు. హైడ్రా అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్‌ల్లో ఈ లోగోను ప్రొఫైల్ పిక్ అప్‌డేట్‌ చేసింది. ఈ లోగోను తెలంగాణ సర్కార్‌ అధికారికంగా ఆమోదించింది. హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫాం, వాహనాలపై కొత్త లోగోను ముద్రించనున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రం తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఆర్‌ఎస్‌సీ వద్దనున్న శాటిలైట్ ఫోటోలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల FTL, బఫర్ జోన్ లను నిర్ధారించేలా ఒప్పందం చేసుకున్నారు.

 24-04-2025 గురువారం ( శెభాష్ తెలంగాణ పోలీసింగ్ )

ఇండియా జస్టిస్ రిపోర్ట్ – 2025లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలవడంతో పోలీస్ అధికారులను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈనె 24న సీఎంను కలిసి ఇండియా జస్టిస్ రిపోర్ట్‌లోని అంశాలను వివరించారు.

25-04-2025 శుక్రవారం ( పెట్టుబడుల వేట )

హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్‌ సమ్మిట్‌ ఈనెల 25న ప్రారంభమైంది. పెట్టుబడులు, న్యాయం, అహింస, ప్రపంచ శాంతి లక్ష్యంగా శ్రీకారం చుట్టారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు దేశ విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. భారత్ సమ్మిట్ ద్వారా శాంతి, న్యాయం పట్ల భారతదేశ ఘన వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. గ్లోబల్ జస్టిస్ అందించడంలో తెలంగాణ వేస్తున్న ప్రతిష్టాత్మకమైన అడుగుగా ఈ కార్యక్రమం నిలిచింది. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్స్‌ వర్సిటీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, RRR – ORR మధ్య రేడియల్ రోడ్లు, క్లస్టర్లు, ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నాలెడ్జ్‌ ఐటీ హబ్‌, ఏఐ సిటీ, ఇందిరా గిరి జల వికాసం, రాజీవ్‌ యువ వికాసం వంటి అంశాలపై భట్టి విదేశీ ప్రతినిధులకు వివరించారు.

 25-04-2025 శుక్రవారం ( ఇక HMDAలోనూ బిల్డ్ నౌ )

రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను ఈజీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్డ్‌ నౌ అప్లికేషన్ ఇక HMDAలోనూ అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మార్చి 20న దీన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్మాణ అనుమతులు GHMC పరిధిలో స్మూత్ గా జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, ఆటోమేషన్‌ వంటి టెక్నాలజీతో అనుమతులు ఇస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా అనుమతులు ఇవ్వడమే బిల్డ్‌ నౌ ముఖ్య ఉద్దేశ్యం. తాజాగా HMDA పరిధిలోనూ ఈ అప్లికేషన్ ద్వారానే అనుమతులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మన్సిపాలిటీల్లోనూ ఈ సేవలు అమలు చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ అప్లికేషన్ ద్వారా వేగంగా ప్రాసెస్ పూర్తవుతుంది. అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేసేలా సింగిల్ విండో ఇంటర్ ఫేస్ ఇది. భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా త్రీడీలో డిస్ ప్లే అవుతుంది. ఇప్పటి వరకు డ్రాయింగ్స్‌ పరిశీలనకే ఎక్కువ రోజులు పట్టేది. కానీ ఎలాంటి భవనాలకైనా ఈ కొత్త అప్లికేషన్ ద్వారా నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీడీసీపీ, ఇతర స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపకశాఖ, నీటిపారుదలశాఖ, రెవెన్యూ, మూసీ నది అభివృద్ధి సంస్థ, తదితర శాఖలన్నీ బిల్డ్‌ నౌతో అనుసంధానం చేశారు.

26-04-2025 శనివారం ( భారత్ సమ్మిట్-HYD డిక్లరేషన్ )

ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా చూపేందుకు భారత్ సమిట్ ను ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. ఈ సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిక్లరేషన్ ను ప్రకటించారు. చివరి రోజు సీఎం రేవంత్, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో గిగ్ వర్క్ పాలసీ పై చర్చ జరిగింది. ఆ తర్వాత విభజన రాజకీయాలు అధిగమించడంపై, పర్యావరణ సమతుల్యతపై, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్ధిక అసమానతలపై, అలాగే శాంతి భద్రతలపై చర్చ జరిగింది. తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ భారత్ సమ్మిట్ లో 100 దేశాలకు పైనే ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు.. 450 మంది దాకా సమావేశానికి హాజరయ్యారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×