Terrrorist Kill J&K Social Activist| జమ్ము కశ్మీర్‌లో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో భారత సైన్యం, భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గాం లోని బైసారాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా కాల్చిచంపిన ఘటనతో కశ్మీర్ లో ప్రస్తుతం అంతా హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఒక సామాజిక కార్యకర్తను కాల్చి చంపారు. ఈ ఘటన పహల్గాం నుంచి 175 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుప్వారా నగరంలో జరిగింది.
పహల్గాం ఘటన తరువాత కశ్మీర్ లో ఒకవైపు ఉగ్రవాదానికి వ్యక్తిరేకంగా ప్రజలు నిరసనలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల బంద్ పాటిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఒకవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు, పోలీసులు, భారత సైన్యం తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడితే షూట్ అండ్ సైట్ ఆర్డర్లు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఉగ్రవాదులు బరితెగించారు. కుప్వారా నగరం కంది ఖాస్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక 45 ఏళ్ల సామాజిక కార్యకర్తను అతని ఇంట్లో దూరి తుపాకులతో కాల్చి చంపారు.
స్థానిక పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం.. కుప్వారాకు చెందిన గులాం రసూల్ మగ్రే అనే 45 ఏళ్ల వ్యక్తి సామాజిక కార్యకర్తగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. ప్రజలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని.. ఉగ్రవాదులకు సాయం చేయకూడదని దేశం కోసం సామాజిక స్పృహ తీసుకొచ్చేందుకు గత కొంత కాలంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులు తుపాకులు చేతబట్టి శనివారం గులాంట రసూల్ ఇంట్లో దూరారు. అతడిని బయటికి తీసుకొచ్చి తుపాలకులతో కాల్పులు జరిపారు. ఆ తరువాత రక్తపు మడుగులో పడి ఉన్న గులాం రసూల్ ను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ గులాం రసూల్ ఇంకా కొనఊపిరితో ఉండడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. గులాం రసూల్ కడుపు భాగం, చేతుల్లో ఉన్న బుల్లెట్లను బయటితీసేందుకు వెంటనే ఆపరేషన్ చేశారు. కానీ ఆపరేషన్ చేశాక చికిత్స పొందుతూ గులాం రసూల్ మరణించాడు.
ఈ ఘటన తరువాత పోలీసులు ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించి వారి కోసం మరింత తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. పహల్గాంలో జరిగిన మారణహోమం తరువాత కొన్ని రోజులకు ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: పహల్గాం ఉగ్రవాది ఇంట్లో భారీ పేలుడు.. త్రుటిలో తప్పించుకున్న భారత సైనికులు
మరోవైపు పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు పీర్ పాంజల్ కొండల్లో దాగి ఉన్నట్లు భారత సైన్యాధికారలకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందింది. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నలుగురు ఉగ్రవాదులు అలీ భాయ్ అలియాస్ తల్హా (పాకిస్థానీ), ఆసిఫ్ ఫౌజీ (పాకిస్థానీ), ఆదిల్ హుస్సేన్ థోకర్ (అనంతనాగ్ నివాసి), మరియు అహ్సాన్ (పుల్వామా నివాసి)లు పహల్గాంలో దాడి చేసినట్లుగా జమ్ము కశ్మీర్ పోలీసులు గుర్తించారు. వీరి ఫొటోలు మీడియా ద్వారా బయటపెట్టారు. వీరంతా పాకిస్తాన్ నిషేధిత లష్కరే తొయెబా ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందారని ప్రస్తుతం కశ్మీర్ లో కొత్తగా స్థాపించిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ కోసం పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదుల కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో ఇప్పటివరకు భద్రతా బలగాలు ఏడుగురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చేసినట్లు తెలిసింది.