05-01-2025 ఆదివారం ( ఫలిస్తున్న సివిల్స్ అభయహస్తం )
సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ సివిల్స్ అభ్యర్థులకు చాలా మేలు చేస్తోంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా మారుతోంది. సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే పేదకుటుంబాల అభ్యర్థులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో గతేడాది ప్రవేశపెట్టిన రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకం సత్ఫలితాలిస్తోంది. సివిల్స్ 2024 ప్రిలిమినరీ ఎగ్జామ్ లో పాసై మెయిన్స్‌కు ఎంపికైన 135 మందికి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఒక్కో అభ్యర్థికి లక్ష చొప్పున ఆగస్టు 26న ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.
వారిలో 20 మంది సివిల్స్ మెయిన్స్ లో సత్తా చాటి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఈనెల 5న ఎంపికైన 20 మంది అభ్యర్థులకు సీఎం మరోసారి ప్రజా భవన్ లో ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ ఆఫీసర్లు రావాలన్న లక్ష్యంతో సీఎం ఈ స్కీంను డిజైన్ చేశారు. వెనుకబడిన రాష్ట్రమైన బిహార్ నుంచి ఎక్కువ ఐఏఎస్‌లు రావడానికి కారణం అక్కడ ఎక్కువ మంది సివిల్స్ పై దృష్టి పెట్టడం వల్లే అని చెప్పారు.
05-01-2025 ఆదివారం ( తెలుగు వెలుగుల కోసం )
రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాల్లో తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జీవోలు కూడా తెలుగులో ఇచ్చేలా దశలవారీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రుణమాఫీ జీవోను తెలుగులో ఇప్పించామన్నారు. ఈనెల 5న హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కోర్టు జడ్జిమెంట్లు కూడా తెలుగులో ఉండాలని, అప్పుడే తీర్పులు సులువుగా అర్థమవుతాయని చెప్పారు. ప్రపంచంలో తెలుగు మాట్లాడేవాళ్లు 18 కోట్ల మందికిపైగా ఉన్నారని అందరికీ గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ స్లోగన్ 2050 ప్లాన్ చేస్తున్నామని తెలుగువారంతా భాగస్వామ్యం కావాలన్నారు.
06-01-2025 సోమవారం ( రీజినల్ రింగ్ రైల్ కోసం )
తెలంగాణ అభివృద్ధి కోసం, కేంద్రం నుంచి అవసరమైన నిధుల కోసం అన్ని సందర్భాలను సీఎం రేవంత్ రెడ్డి వినియోగించుకుంటున్నారు. ఆధునిక హంగులతో నిర్మితమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 6న ప్రారంభించగా.. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతూనే.. హైదరాబాద్ ప్లస్ పాయింట్లను పీఎంకు గుర్తు చేశారు. మెట్రో రైల్ విస్తరణ, రీజినల్ రింగ్ రైల్, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానమీ సాకారంలో భాగంగా తెలంగాణకు సహకారం అందిస్తే 1 ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు.
06-01-2025 సోమవారం ( హైదరాబాద్ అభివృద్ధికి రోడ్ మ్యాప్ )
హైదరాబాద్‌లో మరో భారీ పైవంతెన అందుబాటులోకి తెచ్చింది సర్కారు. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 6 వరుసల్లో నిర్మించిన ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ ఈనెల 6న ప్రారంభించారు. వైఎస్‌ఆర్ హయాంలో 11.5 కిలోమీటర్ల మేర పీవీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం జరిగితే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండో అతి పొడవైన ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిందన్నారు. సిటీలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. పాతబస్తీ ఓల్డ్‌సిటీ కాదు ఒరిజినల్ సిటీ అన్నారు సీఎం.
నిజానికి జూపార్కు-ఆరాంఘర్ ఫ్లైఓవర్‌ను గతేడాది డిసెంబర్‌లోనే ప్రారంభించాల్సి ఉండగా సర్వీసు రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఆలస్యం వల్ల వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని అవసరమైన నిధులు మంజురు చేయడంతో పనులు పూర్తయ్యాయి. 799 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ పాతబస్తీ నుంచి బెంగళూరు నేషనల్ హైవే, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈజీగా వెళ్లేందుకు ఉపయోగపడనుంది. గతంలో ఈ ప్రాంతంలో జూపార్క్ నుంచి ఆరాంఘర్ వెళ్లేందుకు గంట నుంచి గంటన్నర టైం పట్టగా ఇప్పుడు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీనికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టామన్నారు.
06-01-2025 సోమవారం ( సెమీ కండక్టర్స్ జోన్ )
అవసరమైన ప్రతి సందర్భంలో బ్రాండ్ హైదరాబాద్ ను రేవంత్ ప్రభుత్వం ప్రమోట్ చేస్తూనే ఉంది. సోమవారం నాడు సచివాలయంలో పీటీడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగం ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్ ల తయారీ, దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని చెప్పారు శ్రీధర్ బాబు. సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, పునర్నిర్మాణం, ఆటోమేషన్, పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు ప్రాంతీయ కార్యాలయం సింగపూర్‌లో ఉంది. రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడితో ప్రొడక్షన్ యూనిట్ తొలి దశ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పీటీడబ్ల్యూ ఏషియా విభాగం ఎండీ చెప్పారు.
08-01-2025 బుధవారం ( త్వరలో సోలార్ టెండర్లు )
పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. ముఖ్యంగా మహిళా సంఘాలు సోలార్ పవర్ ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో ఉంది. స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహించబోయే సోలార్ పవర్ ప్లాంట్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈనెల 8న చెప్పారు. ఇదే విషయంపై అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేల ఎకరాలు సేకరించాలని కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
09-01-2025 గురువారం ( పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ )
గ్రామపంచాయతీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెల ఫస్ట్ తారీఖు జీతం వచ్చేలా చర్యలు తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరికి ప్రతినెలా 116 కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇకపై వేతనాలు ఏమాత్రం ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని, ప్రతినెలా ఒకటో తేదీన గ్రీన్ ఛానల్‌లో వీరికి జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలన్నారు.
09-01-2025 గురువారం ( వరంగల్ ఎయిర్ పోర్ట్ స్ట్రాటజీ )
వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఒక్క హైదరాబాద్ తప్ప మరెక్కడా ఎయిర్ పోర్టులు లేవు. దీంతో వరంగల్ విమానాశ్రయాన్ని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణ ఇతర అంశాలపై ఈనెల 9న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ సమీక్షించారు. వరంగల్ మహానగరంగా అభివృద్ధి చేందేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలన్నారు.
ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలన్నారు. కొచ్చి విమానాశ్రయం అన్ని వసతులతో ఉంటుందని, దాన్ని అధికారులు పరిశీలించి రావాలని చెప్పారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు ఎయిర్ పోర్టుకు లింకప్ అయ్యేలా చూసుకోవాలన్నారు. ఈ ఎయిర్ పోర్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజలు భవిష్యత్‌లో వరంగల్ విమానాశ్రయం నుంచే రాకపోకలకు వీలుగా రోడ్ల ప్రణాళికలూ రెడీ చేయాలన్నారు.
09-01-2025 గురువారం ( ఒక్క క్లిక్ తో ఈజీగా టిక్కెట్లు బుక్ )
ప్రజలకు సుపరిపాలన అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మరో కీలక ముందడుగు వేసింది. జనం వ్యయ ప్రయాసలు తగ్గించేలా కొత్త కొత్త విధానాలను తెరపైకి తెస్తూనే వస్తోంది. తాజాగా తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ – ESD రూపొందించిన ‘మీ టికెట్’ యాప్‌ను ఈనెల 9న సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాం పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించామన్నారు.
మీ టిక్కెట్ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చు. టూరిస్టులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ యాప్ తో యూపీఐ ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా చెల్లింపులు చేయవచ్చు.
10-01-2025 శుక్రవారం (తెలంగాణ రైజింగ్ 2050)
హైదరాబాద్ బ్రాండ్ గురించి మరోసారి దేశమంతా వివరించే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో సిటీలో జరుగుతున్న తాము చేస్తున్న పనులను వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశం ఈనెల 10న హైదరాబాద్ లో జరగడంతో ఆ సదస్సులో కీలక విషయాలు వెల్లడించారు సీఎం. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు.
55 కిలోమీటర్ల మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టామని, 2050 ప్రణాళికతో మంచినీటి వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్, లింకు రోడ్లు ఉండబోతున్నాయన్నారు. మెట్రో రైలు విస్తరణతో రవాణా సదుపాయం మరింతగా పెరుగుతుందన్నారు. ఫోర్త్ సిటీ కాలుష్యరహితంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రగతికి డ్రై పోర్టు నిర్మాణానికి యోచిస్తున్నామన్నారు. జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషమని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ గురించి చెప్పేందుకు ఈ ప్లాట్ ఫాం మరింతగా ఉపయోగపడింది.
10-01-2025 శుక్రవారం ( ఒకే రోజు 4 కొత్త స్కీములు )
తొలి ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ ప్రభుత్వం రెండో ఏడాదిలో మరింత స్పీడ్ పెంచింది. ఒకే రోజులో 4 కొత్త పథకాలను అమలు చేసేందుకు రంగం రెడీ చేసింది. ఈనెల 10న కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఈ 4 పథకాల అమలు, లబ్దిదారుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నారు.
దరఖాస్తుల పరిశీలన నుంచి లబ్దిదారుల ఎంపిక వరకు పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని, అలసత్వం వహిస్తే వేటు తప్పదని క్లియర్ కట్ గా చెప్పేశారు సీఎం. చివరి లబ్దిదారు వరకు మేలు చేయాలన్నారు. కొందరు కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ అసలు చేయడం లేదని ప్రస్తావించారు సీఎం. ఈనెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటించి తనిఖీ చేస్తానన్నారు సీఎం. సాగు యోగ్యమైన భూముల్లో పంట వేసినా వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలన్నారు.
10-02-2025 శుక్రవారం (నేతన్నకు అభయహస్తం)
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం 168 కోట్ల రూపాయలతో చేనేత అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పేరుతో మూడు రకాల పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు నిధులు కూడా కేటాయిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఈనెల 10న జీవో 3ను జారీ చేశారు.
ఈ ఏడాది తెలంగాణ నేతన్న పొదుపు పథకానికి 15 కోట్లు, చేనేత, పవర్‌లూమ్ కార్మికుల బకాయిలకు 15 కోట్లు, నేతన్న భద్రతలో భాగంగా నేతన్న బీమా పథకానికి 5.25 కోట్లు, నేతన్నకు భరోసా పథకానికి 31 కోట్లు, వేతన ప్రోత్సాహకాలకు 31 కోట్లు మంజూరు చేయనున్నారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకం కింద చేనేత, పవర్‌లూమ్, అనుబంధ కార్మికులు వేతనాల నుంచి నెలవారీగా 8శాతం వాటాధనం జమ చేస్తారు. తెలంగాణ నేతన్న భద్రత పథకంలో నమోదైన కార్మికుడు ఏ కారణంగానైనా మృతిచెందినా 5 లక్షలు అతని నామినీకి అందుతుంది.
10-02-2025 శుక్రవారం ( ఆదివాసీలకు కొత్త స్కీం )
గతంలో నిర్లక్ష్యానికి గురైన రంగాలకు సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈనెల 10న ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో సెక్రటేరియట్ లో సమావేశమయ్యారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాలకు సీఎం వరాల జల్లు కురిపించారు. స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఫ్రీగా ఇచ్చేలా చూడాలన్నారు.
10-02-2025 శుక్రవారం ( 35 ఏళ్ల నిరీక్షణకు తెర )
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పోలీస్ డిపార్ట్ మెంట్ ను సరిగా పట్టించుకోలేదు. కానిస్టేబుళ్ల ప్రమోషన్స్ ను నిర్లక్ష్యం చేశారు. కోర్టుల్లో కేసులున్నాయంటూ ప్రమోషన్లు ఆపేశారు. అయితే ప్రజాపాలనలో రేవంత్ ప్రభుత్వం 187 మందికి సంక్రాంతి కానుకగా ప్రమోషన్ ఇచ్చింది. 1989, 1990 బ్యాచ్ లో ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్స్ కు ప్రభుత్వం ప్రమోట్ చేసింది. హైదరాబాద్ రీజియన్లోని 187 మంది ASI లకు SI లు గా ప్రమోషన్ ఇచ్చింది. DGP జితేందర్ రెడ్డి ఆదేశాలతో మల్టీ జోన్ -2 IG వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ పూర్తి చేసిన రోజునే ప్రమోషన్స్ ఇవ్వడంతో సిబ్బందిలో సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
11-01-2025 శనివారం ( డెవలప్ మెంట్ రివ్యూ )
ఓల్డ్ సిటీలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యవరప్రదాయిని అయిన ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. గోషామహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బిల్డింగ్ నిర్మించబోతున్నారు. ఇది ఎలా ఉండాలన్న విషయంపై ఇప్పటికే చాలా సార్లు రివ్యూల్లో సీఎం రేవంత్ అధికారులకు సూచనలు ఇచ్చారు. తాజాగా మరోసారి బిల్డింగ్ స్పీడ్ గా నిర్మించడం, అందుబాటులోకి తేవడంపై దృష్టి పెట్టాలన్నారు. అటు ఎక్సైజ్, ఇటు విద్యుత్ శాఖల పనితీరుపైనా సీఎం సమీక్షించి ఆదేశాలిచ్చారు.