CM Revanth Reddy: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ కు సమగ్ర పాలసీ రూపకల్పన, సర్కారీ బడుల్లో కొత్త క్లాస్ రూమ్స్, సీఎం రేవంత్ కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంస, హైదరాబాద్ బోనాల ఉత్సవాలకు నిధుల మంజూరు, సక్సెస్ ఫుల్ గా రికార్డు సమయంలోనే రైతు భరోసా కంప్లీట్ చేయడం, 33 జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు, క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు. ఈ వారంలో జరిగిన మరిన్ని కీలక అప్డేట్స్ ఇప్పుడు డిటైల్డ్ గా చూద్దాం.
22-06-2025 ఆదివారం ( కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు )
గతేడాది డిసెంబర్ 9న సెక్రటేరియెట్ లో ఏర్పాటు చేసినట్టుగా తెలంగాణలోని 33 జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. R&B ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ఒక్కో విగ్రహానికి 15.5 లక్షలు చొప్పున ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. విగ్రహాల డిజైన్ బాధ్యతలను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఇన్చార్జ్ వీసీ గంగాధర్ కు అప్పగించింది. అన్ని చోట్లా ఒకేలా విగ్రహం వచ్చేలా డిజైన్ ఖరారు చేయాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించేలా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
23-06-2025 సోమవారం ( క్యాబినెట్ కీలక నిర్ణయాలు )
ఈనెల 23న జరిగిన తెలంగాణ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే డిసెంబర్ 9 వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం, చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజినల్ రింగ్ రోడ్డుకు ఆమోదం, బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి చట్ట, న్యాయ పరమైన పోరాటం కొనసాగించడం, విభజన చట్టంలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఉన్నతస్థాయి కమిటీలో చర్చించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ కోరినట్లుగా పూర్తి వివరాలను అందజేయడం.
2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి
2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు.. వివిధ ప్రోత్సాహకాలతో రూపొందించిన స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం, అలాగే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో రూపొందించిన విజన్ 2047కు ఆమోదం, రాష్టంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధి పరచాలని అనుకున్న నేపథ్యంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని ప్రభుత్వ సలహాదారుగా నియమించడానికి ఆమోదం తెలపడం, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారంలను మున్సిపాలిటీలుగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్‌గ్రెడేషన్‌కు ఆమోదం వంటి కీలక నిర్ణయాలను క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్నారు.
24-06-2025 మంగళవారం ( రైతన్నకు ప్రభుత్వం భరోసా )
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. రైతు భరోసా కింద ఈ నెల 16న రైతు ఖాతాల్లోకి డబ్బు వేయడం ప్రారంభించినప్పటి నుంచి చెప్పిన మాట ప్రకారం 9 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తి చేసిన సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వానికి రైతులు మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత క్రమంలో మహిళలు, తెలంగాణ ఉద్యమకారులైన యువతకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రైతులకు ఏయే కార్యక్రమాలు చేశామో సీఎం రేవంత్ మరోసారి వివరించారు.
25-06-2025 బుధవారం ( HYD కోర్ అర్బన్ రీజియన్ పాలసీ )
పెరుగుతున్న హైదరాబాద్ జనాభా అవసరాలకు తగ్గట్లుగా రాబోయే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్రమైన పాలసీని తయారు చేయాలని ఆదేశించారు. నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ ఈనెల 25న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్
అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు. కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. H-సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలను అధికారులు చెప్పగా, ORR లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం చెప్పారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలను తయారు చేయాలన్నారు.
25-06-2025 బుధవారం ( సర్కారీ బడుల్లో సోలార్ కిచెన్లు )
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతుండడంతో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా కొత్త తరగతి గదులను నిర్మించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఉన్నత ప్రమాణాలతో తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. విద్యా శాఖపై ఈనెల 25న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. జిల్లాల్లో అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రైవేట్ స్కూళ్ల నుంచి 48 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అధికారులు సీఎంకి వివరించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, అందుకు సోలార్ కిచెన్ల ఏర్పాటుపై వెంటనే దృష్టి సారించాలన్నారు సీఎం.
25-06-2025 బుధవారం ( సీఎం రేవంత్ కు టోనీ బ్లెయిర్ ప్రశంస )
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్ – 2047 లక్ష్యంతో పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. రేవంత్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాలను తనను ఆకర్షించాయన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, టోనీ బ్లెయిర్ మీటింగ్ జరిగింది. ఆ భేటీ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు సంబంధించి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ – TBIGC సంస్థతో తెలంగాణ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ కుదుర్చుకుంది.
27-06-2025 శుక్రవారం ( ఇకపై ఇ-క్యాబినెట్ విధానం )
అవసరమైన ప్రతి సందర్భంలో సంస్కరణలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి ఈ-క్యాబినెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. మంత్రివర్గ భేటీలోని ఫైల్స్ అన్నిటినీ డిజిటల్ విధానంలో భద్రపరచాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఆఫీస్, ఈ-ఫైలింగ్ విధానంలో అందుబాటులో ఉన్న బెటర్ మెంట్స్ ను సీఎస్ పరిశీలిస్తున్నారు. చర్చించే అంశాల అజెండా, టేబుల్ ఐటమ్స్ ఇకపై హార్డ్ కాపీ ఉండవు. ఇకపై క్యాబినెట్ ఎజెండా మొదలు.. నిర్ణయాల వరకు ఫైళ్లన్నీ ఈ-ఫైలింగ్ చేయాలని, డిజిటల్ రూపంలో భద్రపరచాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ కొత్త విధానం వల్ల ఫైళ్లు రహస్యంగా, సురక్షితంగా ఉండటంతో పాటు.. డిజిటల్ కాపీలను భద్రపరచటం మరింత కట్టుదిట్టంగా ఉంటుందని భావిస్తోంది. మూడు నెలలకోసారి క్యాబినెట్ మీటింగ్‌ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్‌గా నిర్వహించాలని నిర్ణయించారు.
27-06-2025 శుక్రవారం ( గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం )
తెలంగాణలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలోనే చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ పాలసీ రెడీ చేశారు. సమాజంలోని వివిధ వర్గాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. తాము తీసుకురాబోతున్న గిగ్ వర్కర్ల పాలసీ.. దేశంలోనే ఆదర్శవంతమైన పాలసీగా నిలుస్తుందని కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.50 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, కొత్త చట్టంతో వాళ్లందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి, కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామన్నారు. గిగ్ వర్కర్లకు హక్కులు కల్పిస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆయన స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతోంది. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
28-06-2025 శనివారం ( హైదరాబాద్ లో రయ్ రయ్.. )
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే క్రమంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. రేవంత్ ప్రభుత్వం సిటీలో ట్రాఫిక్ మూమెంట్ మరింత స్పీడ్ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. హైసిటీ పనుల్లో వేగం పెంచుతున్నారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా స్పీడ్ గా కంప్లీట్ చేసే విషయంలో చొరవ చూపుతోంది. తాజాగా 182 కోట్ల ఖర్చుతో చేపట్టిన పీజేఆర్ ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ తో హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి చాలా బెనిఫిట్ గా మారింది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గనుంది. ప్రయాణ టైం కూడా కలిసి వస్తుంది. 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లతో నిర్మించారు. గచ్చిబౌలి ఔటర్ నుంచి కొండాపూర్ రోడ్డు రూట్‌లో రోజూ 50 నుంచి 60 వేల వెహికిల్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. సో ఈ ఫ్లైఓవర్ తో వాహనదారుల ఇంధన ఖర్చులు కలిసి రానున్నాయి.
28-06-2025 శనివారం ( డబుల్ డెక్కర్ కారిడార్ కు లైన్ క్లియర్ )
ఎనిమిదిన్నరేళ్ల నిరీక్షణకు తెరపడింది. నగరంలో తొలి డబుల్ డెక్కర్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని కంటోన్మెంట్ బోర్డు.. కారిడార్ల నిర్మాణానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ క్రమంలో రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య శనివారం ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే ప్రభుత్వ స్థలాలతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతాల్లోని మొత్తం 138 ఎకరాల రక్షణ శాఖ భూములు అవసరం. ఈ భూముల విలువకు తగ్గట్టుగానే జవహర్ నగర్‌లో 330 ఎకరాల భూమిని కేటాయించేందుకు హెచ్‌ఎండీఏ అంగీకరించింది. రక్షణ శాఖ అధికారులు ఆ భూములను పరిశీలించి సుముఖత వ్యక్తం చేయడంతో, ఎంవోయూ కుదిరింది. ఇప్పటికే ఎన్‌హెచ్-44 డెయిరీ ఫాం వరకు నిర్మించే కారిడార్‌కు హెచ్‌ఎండీఏ టెండర్లు కేటాయించింది. దీంతో సికింద్రాబాద్ పాట్నీ నుంచి బోయిన్ పల్లి వరకు ఫాస్ట్ గా ప్రయాణం సాధ్యమవుతుంది.
28-06-2025 శనివారం ( ఆత్మీయ భరోసాపై కసరత్తు )
వానాకాలం సీజన్‌లో రైతులకు రికార్డు సమయంలో పెట్టుబడి సాయం అందించిన రేవంత్ ప్రభుత్వం.. ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న 261 కోట్లను చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. జులై తొలి వారంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తి కాగానే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న, ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న, కనీసం 20 పనిదినాలు పూర్తి చేసిన.. భూమి లేని కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,19,191 మంది ఈ పథకానికి అర్హులుగా లెక్క తేలారు. ఈ ఏడాది జనవరి 26న పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
Story By Vidya Sagar, Bigtv Live