జరగని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియాకం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆగమాగం అవుతోంది. జిల్లా పార్టీకి అధ్యక్షుడు లేకపోవడం ఉన్న నేతలు పార్టీని పట్టించుకోకపోవడం.. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారు బహిష్కరణకు గురవ్వడం ఆ పార్టీలో గందరగోళానికి కారణమవుతోంది. గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పెత్తనం పెరిగిపోయిందట. ఆ క్రమంలో పార్టీలో కాంగ్రెస్ నేతలు.. ఎన్నికలు ఆ తర్వాత వచ్చిన నేతల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోందంట.
గత రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీపై విమర్శలు
అదే కాకుండా గత రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ వ్యవహార శైలితో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బున్న నేతల పెత్తనం పెరగడంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెరిగి…ఇది కాస్తా పార్టీలో అంతర్గత కుమ్మలాటలకు కారణమైందట. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ ఉన్నంత కాలం పెద్దగా ప్రజాబలం లేనివాళ్లు, పైగా వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ల ఆటలు సాగాయనే టాక్ నేతల్లో ఉందట. అయితే, ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క మరికొందరు నేతలకు సైతం ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో గెలవాల్సిన సీటు కాంగ్రెస్ పార్టీ చేతులారా ఓడిపోయిందంటున్నారు. ఒక్క ఆదిలాబాద్ మాత్రమే కాకుండా, చాలా చోట్ల ఎంపీ సీట్లను కోల్పోవాల్సి వచ్చిందంట. రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలవడం వెనక అధిష్టానం పోస్ట్ మార్టం చేసింది. ప్రజల్లో లేని నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చి పెత్తనం చేసిన వారి వల్లనే పార్టీ ఓటమి కావాల్సి వచ్చిందనే నివేదిక అధిష్టానికి చేరిందంట. దీంతో అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టిందంటున్నారు.
బీజేపీ నుంచి వచ్చిన కంది శ్రీనివాస్‌కు కాంగ్రె టికెట్
ఆదిలాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల్లో గండ్రత్ సుజాత, సంజీవరెడ్డి, సాజిద్ ఖాన్ తదితరులు టిక్కెట్టు ఆశించారు. వీళ్ల ముగ్గురిని కాదని, బీజేపీ నుంచి వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించడంతో పదేళ్లు పార్టీకి అండగా ఉన్నాం.. కష్ట కాలంలో పనిచేసిన తమకు అన్యాయం చేశారంటూ కోపోద్రిక్తులైన సదరు నేతలు అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అంతర్గత పోరు ముదురుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కంది శ్రీనివాస్ రెడ్డి స్వయంగా గండ్రత్ సుజాతను ముక్కు చెవులు కోస్తానని వ్యాఖ్యానించడంతో పాటు మిగతా నేతలను దూరం పెట్టడంతో వివాదం మరింతగా రాజుకుంది. అదే ఎన్నికల్లో సుజాత, సాజిద్ ఖాన్ , సంజీవరెడ్డి వర్గం నుంచి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆ ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరించింది.
పాత నేతల చేరిక అనివార్యమైందా?
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటు కోల్పోయింది. ఎంపీ ఎన్నికలకు ముందు బహిష్కృత నేతలను తిరిగి కాంగ్రెస్లోకి తీసుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఆ నేతలు అధిష్టానంతో మాట్లాడటంతో పార్టీ సైతం వారికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది. కానీ, మధ్యలో ఓ నేత వారిని పార్టీలోకి రానీయకుండా అడ్డుపడ్డటం, ఇన్చార్జి మంత్రి సీతక్క, మరోనేత చొరవతో వారు పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారట. ఇక, జిల్లా ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మారిపోవడంతో జిల్లాలో తనదే పెత్తనం అని ముందుకు వెళ్తున్న ఓ నేత ఆగడాలకు కళ్లెం పడటంతో పాత నేతల చేరిక అనివార్యమయ్యిందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడ్డ నేతల రాక కాంగ్రెస్ కు లాభం చేకూరే అంశం కానుంది.
పార్టీ కండువాలు కప్పిన మహేష్ కుమార్ గౌడ్
నియోజకవర్గ ఇన్చార్జి స్థానికంగా ఉండకపోవడం, ఆ పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వంటి అంశాలపై ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు నివేదిక అందిందట. ఇప్పటికే వలస వచ్చిన నేతల వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని చాలనుకున్న అధిష్టానం ఇక పాత నేతలను పార్టీలోకి తీసుకోవడం మేలని భావించి వారిని పార్టీలోకి ఆహ్వానించారనే టాక్ నడుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పారు. దీంతో పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్లో ఏ నేతలను పార్టీలో కొనసాగకుండా ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగించింది.
మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్
అలాంటి పరిస్థితుల్లో ప్రలోభాలు, బెదిరింపులకు భయపడకుండా పార్టీని కాపాడుతూ పదేళ్లుగా అదే కాంగ్రెస్ పార్టీలో నేతలు కొనసాగారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి.. పార్టీ అదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. వీరు టిక్కెట్టు ఆశించడం, మధ్యలో వేరే పార్టీలో నుంచి వ్యక్తికి టిక్కెట్టు ఇవ్వడంతో వీరంతా నారాజ్ అయ్యారు.
డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్టు ఇచ్చారని ఆరోపణలు
డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్టు ఇచ్చారని వీరు ఆరోపణలు గుప్పించారు. దానినే అస్త్రంగా మలుచుకున్న కొందరు నేతలు వారిపై వేటు వేయించారు. అదే సమయంలో వారు తిరిగి పార్టీలోకి రాకుండా చాలా కాలం అడ్డుపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు గండ్రత్ సుజాత్, సాజిద్ ఖాన్, సంజీవ రెడ్డి కాంగ్రెస్ ఘర్ వాపసి నినాదం ఖచ్చితంగా కంది శ్రీనివాస్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లేనని చెబుతున్నారట. మరి ఇప్పుడు కంది శ్రీనివాస్ ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది..?
Story By vamsi krishna, Bigtv