Pinnelli Brothers: ఒకే కేసు .. ఆ కేసుకు సంబంధించి మాచర్ల నియోజకవర్గంలోని వైసిపి కీలక నేతలు పిన్నెల్లి సోదరులు ఇద్దరు విచారణకు హాజరయ్యారు. అయితే పోలీసులు ఇద్దరినీ వివిధ రకాలుగా విచారణ చేపట్టినా.. వారు చెప్పిన సమాధానాలతో ప్రస్తుతం పోలీసులలో సైతం పెద్ద చర్చే నడుస్తుందట. దానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటి? అసలు జరిగిన విచారణ లో పిన్నెల్లి సోదరులు ఏం చెప్పారు? అసలీ రచ్చకు కారణమేంటి?
మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి సోదరుడు వెంకట్రామి రెడ్డి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జవిశెట్టి సోదరుల జంట హత్య కేసులో ఏ6, ఏ7 నిందితులుగా పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారు.. కేసుకు సంబంధించిన అంశంలో తాజాగా మాచర్ల సర్కిల్ కార్యాలయానికి హైకోర్టు న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, రామలక్ష్మణారెడ్డిలతో వీరు హాజరయ్యారు. గురజాల డీఎస్పీ జగదీశ్, మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా వీరిని విచారించారు.
కేసుతో తమకు సంబంధం లేదని చెప్పిన పిన్నెల్లి బ్రదర్స్
వెల్లుర్ధి జంట హత్యలకు సంబంధించిన కేసులో 9 గంటల పాటు పిన్నెల్లి బ్రదర్స్ ని మాచర్ల పోలీసులు విచారించారు.. ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉదయం 10:45 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విచారించిన అధికారులు సుమారు వందకు పైగా ప్రశ్నలు సంధించారంట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ఒకే ఒక్క సమాధానం అసలా కేసుతో తనకు సంబంధం లేదు అనే మాట మాత్రమే చెప్పినట్లు లోగుట్టు వినిపిస్తుంది. అయితే పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణ సమయంలో గట్టిగా ప్రశ్నలు ఏమీ అడగలేదని.. కేసుకు సంబంధించినటువంటి అంశంలో పాత్ర ఏంటి? వారితో ఏమైనా ఫోన్లో మాట్లాడారా? రాజకీయ కోణంలో జరిగిన హత్య కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా అని ప్రశ్నించారంట. అనుమానం ఉంది అందుకే విచారించాల్సి వస్తోందని పేర్కొన్నారంట.
హత్యలు జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారని ప్రశ్నలు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గంటల కొద్దీ విచారణ చేపట్టిన అధికారులు రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిని మాత్రం విచారణ సమయంలో పెద్దగా ఇబ్బంది పెట్టలేదంటున్నారు. ఆయన్ని సాయంత్రం సమయంలో కొద్దిసేపు మాత్రమే ఈ కేసు కు సంబంధించినటువంటి వివరాలను అడిగినట్లు సమాచారం… హత్యలు జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారు? ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా? అనే కోణంలో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పోలీసులు ప్రశ్నలు అడిగినా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు… అసలు వాళ్ళు ఎవరో తనకు తెలియదని బుకాయించారంట.
అన్ని రకాల ప్రూఫ్స్‌ని పిన్నెల్లి బ్రదర్స్ ఉంచిన అధికారులు
అయితే విచారణ అధికారులు అన్ని రకాల ప్రూఫ్స్‌ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ముందు ఉంచారని తెలుస్తోంది.. అయితే ఆ ప్రూఫ్స్ కు సంబంధించినవన్నీ కూడా ఫోన్ డేటాకు సంబంధించినవి అవటంతో, ఆ ఫోన్లో ఉన్న డేటా గాని, ఆ ఫోన్ కి సంబంధించినటువంటి వివరాలు ఇవేవీ తమకు సంబంధం లేదని, నిందితుల్లో ఎవరితో మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదని పిన్నెల్లి బ్రదర్స్ చెప్పారంట.. సిగ్నల్ ఆధారంగా మీ ఫోన్లు ఆరోజు నిందితులకు సంబంధించిన సిగ్నల్స్ కి సమీపంగా వచ్చాయనే విధంగా చెప్తే ఆ ఫోన్లోకి మాకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఫోనే వాడటం లేదని, రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడటానికి కూడా ఈ మధ్యకాలంలో తాము ఎవరితో కూడా ఫోన్లో మాట్లాడలేదని విధంగా ఇద్దరూ కూడా ఒకే రకమైన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: కడపలో గ్రూపు రాజకీయాలు.. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు?
న్యాయ నిపుణుల సూచనలే వారు ఫాలో అవుతున్నారా?
పిన్నెల్లి బ్రదర్స్ న్యాయపరమైనటువంటి అంశాలను అంచనా వేసుకొని న్యాయ నిపుణులు సలహాలు తీసుకొని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు పోలీసు వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్ కు సంబంధం ఉందా లేదా అనే అంశం మరోసారి విచారణ చేపట్టాలని విధంగా విచారణ అధికారులు అంచనాకు వచ్చారట.. ఇదే అంశాన్ని ప్రస్తుతం విచారణ చేపట్టిన పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది.. అయితే రానున్న రోజుల్లో మళ్లీ పిన్నెల్లి బ్రదర్స్‌ని మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయంటున్నాయి పోలీసు వర్గాలు.. ఈసారి బలమైనటువంటి ఆధారాలను సేకరించిన తర్వాతే పిన్నెల్లి బ్రదర్స్ ని విచారించే అవకాశం కనిపిస్తుంది.
Story By Vamsi krishna, Big Tv