MLC Kavitha VS Harish Rao: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత సిద్దిపేటలో పోటీకి సై అంటున్నారా? జన్మనిచ్చిన ఈ గడ్డ రాజకీయ భవిష్యత్తుకు నాంది అవుతుందన కవిత భావిస్తున్నారా?? హరీశ్ టార్గెట్‌గా కవిత చేస్తూ కామెంట్స్ చూస్తుంటే తాను పోటీ చేసే సెగ్మెంట్ విషయంలో ఫిక్స్ అయ్యారనే చర్చ జోరుగా నడుస్తోంది. కవిత సిద్దిపేటలో హరీష్‌రావుపై పోటీకి సిద్దమయ్యారని, ఆ దిశగా కవిత యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది హాట్ టాపిక్‌గా మారిందింప్పుడు.
హరీష్‌రావుపై ఆరోపణలు గుప్పిస్తున్న కవిత
రాజకీయంగా తన టార్గెట్ ఎవరో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫిక్స్ చేసుకున్నారా అనేది చర్చినీయంశంగా మారింది. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, బయటకు వచ్చి.. ఆ తర్వాత కవిత చేస్తున్న విమర్శలు, హరీష్‌రావుపై గుప్పిస్తున్న ఆరోపణలు చూస్తుంటే.. తన ప్రత్యర్ధి ఎవరో చేప్పకనే చేప్పారు అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. తండ్రికి, కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి తనను దూరం చేయడం వెనక హరీష్ రావు పాత్ర చాలానే ఉందని ఆమె గట్టిగా నమ్ముతున్నారన్నది కవిత సన్నిహితులంటున్నారు.
2028 ఎన్నికల్లో పోటీ చేసే సెగ్మెంట్‌పై కవిత కసరత్తు
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా అడుగులు వేసేందుకు కవిత వ్యూహాలు రచిస్తున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటే దానికి కూడా కొన్ని సంకేతాలు ఆమె నుంచి వచ్చాయి. రాజకీయంగా బలోపేతం అవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న కవిత.. 2028 ఎన్నికల్లో తాను పోటీ చేసే సెగ్మెంట్‌పై కూడా కసరత్తు చేస్తున్నారని జాగృతి శ్రేణులు అంటున్నాయి. ఇక కవిత తాజాగా కేసీఆర్ పుట్టిన ఊరు అయిన చింతమడకలో పర్యటించారు. ఈ గ్రామం సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటుంది. కేసీఆర్ సొంత ఊరు అంటే కవితకు కూడా పుట్టిల్లు కింద లెక్క. తన పుట్టినిల్లు అయిన నియోజకవర్గం నుంచే తన ప్రస్తానాన్ని ప్రారంభించేందుకు కవిత సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే కవిత చింతమడకలో చేసిన వ్యాఖ్యలు చూస్తే సిద్దిపేట నుంచే బరిలో దిగేందుకు వ్యూహారచన చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
సిద్దిపేట నుంచి బరిలో దిగేందుకు వ్యూహారచన
సిద్ధిపేట ఎవరి జాగీరు కాదని కవిత చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిద్దిపేట నుంచి అనేక సార్లు కేసీఆర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 నుంచి 1999 వరకు టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్ వరుస విజయాలు సాధించారు. తర్వాత 2001 బైపోల్స్, 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందరు. తర్వాత ఆయన ఎంపీగా గెలిచి.. 2004 బైపోల్స్ నుంచి సిద్దిపేటను తన మేనల్లుడు హరీష్‌రావుకి అప్పజెప్పారు. అక్కడ నుంచి మాజీ మంత్రి హరీష్ వరుసగా ఆరు సార్లు గెలుపొంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ప్రస్తుతం సిద్దిపేటను హరీశ్ అడ్డగా మార్చుకున్న పరిస్ధితి
అంటే సిద్దిపేట కేసీఆర్ ఫ్యామిలీ అడ్డాగా మారిపోయింది. ముందు కేసీఆర్, తర్వాత హరీష్ రావు సిద్దిపేటలో మరో నాయకుడికి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం సిద్దిపేటను హరీశ్ అడ్డగా మార్చుకున్న పరిస్ధితి. దీంతో కవిత ఫోకస్ అంతా ఇప్పుడు సిద్దిపేటపై పెడుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కుమార్తెగా అక్కడ పాగా వేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు విసృత్తంగా ప్రచారం జరుగుతోంది. సిద్దిపేటను ప్రైవేట్ ప్రాపర్టీగా,కేజీఎఫ్‌గా మార్చుకున్నారని ఆమె విమర్శించడం.. ఇక్కడ ఎవరినీ రావద్దు అని నిబంధనలు విధించడం ఇక కుదరదనే హెచ్చరికలు పంపడం వెనక కవిత వ్యూహం ఇదేనంటున్నారు.
హరీష్ రావే టార్గెట్‌గా కవిత వ్యూహరచన
బీఆర్ఎస్‌కి అవినీతి ముద్ర పడడం, గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడం, నాయకులు పార్టీకి దూరం అవ్వడంలోను హరీష్ పాత్ర ఉందని కవిత బలంగా నమ్ముతున్నారట. అందుకే హరీష్ రావే టార్గెట్‌గా కవిత వ్యూహరచన చేస్తున్నారంట. సిద్దిపేటను అడ్డగా మార్చుకున్న హరీశ్ రావును.. అక్కడ ప్రజల ముందే దోషిగా చూపించాలనే ప్రయత్నంలో కవిత ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. 2028లో జరిగే ఎన్నికల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమనే టాక్ అటు సోషల్ మీడియాలోను.. ఇటు బీఆర్ఎస్‌లోను, జాగృతిలోనూ వినిపిస్తోంది. సిద్దిపేట నుంచి ఐదుసార్లు కేసీఆర్ గెలవడం… కేసీఆర్ పుట్టిన ఊరు అక్కడే ఉండడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కవిత భావిస్తున్నారట. అంతే కాదు ఎక్కువ సార్లు గెలిచినందువల్ల హరీష్ రావు మీద ఉన్న వ్యతిరేకత కూడా కలిసి వస్తుందనేది కవిత ఆలోచనగా చెప్తున్నారు. మరి చూడాలి కవిత సిద్దిపేట బరిలో దిగితే పరిణామాలు ఎలా ఉంటాయో?