BigTV English

Musi River Floods: మూసీ ఉగ్రరూపం.. హైడ్రా ఆన్ యాక్షన్..

Musi River Floods: మూసీ ఉగ్రరూపం.. హైడ్రా ఆన్ యాక్షన్..

Musi River Floods: హైదరాబాద్ కు మూసీ ఎన్నో పాఠాలు నేర్పింది. గుణపాఠాలు నేర్పింది. ఒక దశలో నిజాం పాలకులు మూసీ నేర్పిన పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. జంట జలాశయాలు నిర్మించడం ద్వారా హైదరాబాద్ కు వరద ముప్పు తప్పించారు. అయినా సరే గేట్లు ఎత్తితే వెల్లువలా వరద ప్రవాహం ఉంటోంది. పరివాహకం అంతా కొట్టుకుపోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరో స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదా? పరివాహకంలో జనాన్ని వేరే దగ్గరికి తరలించి మూసీ ప్రక్షాళన చేపట్టాల్సిన పరిస్థితి కనిపించట్లేదా?


అందరినీ తరలిస్తే ఎలా అని ప్రశ్నలు

రేవంత్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అనగానే.. విపక్ష పార్టీలు చాలా హడావుడి చేశాయి. మూసీ పరివాహకంలో ఉన్న వాళ్లను ఎలా తరలిస్తారు.. వారికి ఇక్కడే జీవనాధారం. వేరే దగ్గరికి తరలిస్తే వారు పనులు ఎలా చేసుకోవాలి? ఎలా బతకాలి అని క్వశ్చన్ చేశారు. లూటిఫికేషన్ అని ఒకరు, నిర్మాణాలు ఎలా తొలగిస్తారని ఇంకొకరు.. మూసీ పునరుజ్జీవం జరగకుండా పోటీ పడ్డారు. నదీ పరివాహకంలో పర్యటనలు చేశారు. ఒకరోజు ఆలౌట్ పెట్టుకుని నిద్రలు కూడా చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారీ వరద ప్రవాహంతో ఈ బస్తీల కథ మారిపోయింది. మరి బస్తీ జనాన్ని ఇక్కడే ఉండండి అన్న నేతలు వరదల టైంలో వారికి ఏం భరోసా ఇచ్చారు? వారికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?


ఇక ఖాళీ చేయాల్సిందే అంటున్న జనాలు

మూసీలో నిర్మాణాలు ఎలా తొలగిస్తారంటూ గతంలో విపక్షాలు పోరాటాలకు దిగాయి. ఓవైపు నదికి మహర్దశ తీసుకొస్తామని ప్రభుత్వం అంటే.. అలా ఎలా చేస్తారు.. కమీషన్లే తింటారు.. పేదల సంగతేంటని ప్రశ్నించారు. అయితే ఈ వ్యవహారం ఇలా ఉండగానే.. మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే అని గతేడాది హైకోర్టు తీర్పు ఇచ్చింది. సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే పోతున్నాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని చెప్పింది. ప్రభుత్వం గతంలోనే మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు RB-X అని మార్కింగ్ చేసింది. దాంతో ఒక్కసారిగా అలజడి రేగింది. నిజానికి వాళ్లను ఖాళీ చేయించేందుకు టైమ్ ఇచ్చారు. మూసీ నదీ FTL, బఫర్ జోన్ కాదు, రివర్ బెడ్ లో ఉన్న వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. టెంపరరీగా అక్కడ ఉంటున్నా.. వరదల సమస్య, దోమల సమస్య, కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు ఇవన్నీ వారికి సవాళ్లుగా మారాయి. ఓవైపు ప్రజల ఆరోగ్యం, ఇంకోవైపు మూసీ పునరుజ్జీవం ఈ రెండింటినీ ప్రభుత్వం సవాల్ గా తీసుకుంది. తాజాగా వచ్చిన వరద పరిస్థితులు చూస్తుంటే ఎప్పటికైనా ఇక్కడి ఏరియా ఖాళీ చేయాల్సిందే అని స్థానికులు అంటున్నారు.

సామాన్లు తరలించేందుకు రూ.25 వేలు సాయం

మూసీ పునరుజ్జీవం పట్టాలెక్కాలంటే రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. అందుకే సీఎం రేవంత్ మొదటగా ఏమేం చేస్తే వర్కవుట్ అవుతుందో అవన్నీ అమలు చేశారు. మొదట నదీ గర్భంలో ఉన్న వారిని ఇమీడియట్ గా ఖాళీ చేయించారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. సామాన్లు తరలించేందుకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. హైడ్రాతో చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ నుండి ఉస్మానియా హాస్పిటల్ దాకా ఆక్రమణలను తొలగించారు. HMDAపై వరుస రివ్యూల్లో మూసీ గురించి కీలక సూచనలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ వరదలకు విముక్తి జరగాలంటే అది మూసీ పునరుజ్జీవంతోనే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసే విషయంలో సబర్మతి మోడల్‌ను ఫాలో కావాలన్నారు. మూసీ పరివాహకంలో ఉన్న వారికి సరైన పరిహారం అందించి.. మొత్తం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లోనే సీఎం విపక్షాలకు సవాల్ చేశారు. మూసీ పరివాహకంలో కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ 3 నెలలు ఉంటే ఈ ప్రాజెక్టునే ఆపేస్తానన్నారు. పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదంటూనే మూసీ దగ్గర నాలుగు నెలలైనా ఉంటానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అయితే పరిహారం ఇవ్వాలంటున్నారు. ఖాళీ చేసే వారికి పరిహారం ఇస్తామని కచ్చితంగా ఇస్తామని సీఎం పదే పదే చెబుతున్నారు కూడా.

మూసీ పునరుజ్జీవం కోసం నిధులు ఇవ్వాలని, సబర్మతి మాదిరి మూసీని మారుస్తామని కేంద్రాన్ని సీఎం చాలా సందర్భాల్లో కోరారు. సో వందేళ్ల పాటు హైదరాబాద్ సిటీలో వరద సమస్య రిపీట్ కావొద్దంటే మూసీ పునరుజ్జీవమే ముఖ్యమని సీఎం రేవంత్ ఇటీవలి రివ్యూల్లో కూడా చెప్పారు. 104 దేశాల్లోని 258 నదులపై చేసిన స్టడీలో పొల్యూషన్ ఇండెక్స్ లో మూసీ నది మొదటి నుంచి 22వ స్థానంలో ఉంది. అంటే ఎంత కాలుష్యంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. సో నీటి కాలుష్యం నుంచి మూసీని కాపాడాలంటే 90 శాతం STPలే సేవ్ చేస్తాయి. వీటికి తోడు మూసీ వరదలకు విముక్తి జరగాలంటే ప్రక్షాళన ఒక్కటే మార్గం.

చిన్న వర్షానికే గంటల కొద్దీ ట్రాఫిక్ జాంలు

హైదరాబాద్‌లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదు. ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతోంది. మరి ఈ కురిసిన వర్షమంతా సమీప చెరువులు, నాలాల ద్వారా మూసీవైపు వెళ్లాలి. కానీ అదే జరగట్లేదు. గండిపేట, హిమాయత్ సాగర్ దాకా ఒకలా ఉన్న మూసీ.. హైదరాబాద్ సిటీలోకి ఎంట్రీ అయ్యాక చాలా వరకు కుచించుకుపోయింది. పైగా మూసీవైపు వచ్చే వరద కాలువలు కూడా కుచించుకుపోయాయి. అందుకే సిటీలో సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వర్షం పడితే గంటలు గంటలు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే ఈ బాధలన్నీ పోవాలంటే 2030 డిసెంబర్‌ 30 నాటికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి మంచి జీవన ప్రమాణాలు కల్పించేలా రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రక్షణశాఖ భూములివ్వాలని రాజ్‌నాథ్‌కు విన్నపం

మూసీ పునరుజ్జీవ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా పకడ్బందీగా డిజైన్ చేసింది. ఫేజ్​-1లో నార్సింగి నుంచి బాపూఘాట్‌ వరకు 21 కిలోమీటర్ల పొడవున బాగు చేస్తారు. ఫేజ్​-2 నాగోల్‌ నుంచి బాచారం వరకు ఉంటుంది. మొదటి దశ చేపట్టే ప్రాంతంలో మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్‌ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది. బాపూఘాట్ వద్ద నది మధ్యలో ప్రపంచంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆ భూమి ఇవ్వాలని పలుసార్లు రాజ్ నాథ్ సింగ్ కు సీఎం సహా మంత్రులు నివేదించారు. ఇటీవలే మరోసారి గుర్తు చేశారు. అటు టిప్పుఖాన్‌ వంతెన సమీపంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి తారామతి బారాదరి తరహాలో ఓ కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేశారు. మూసీ ఫేజ్​-2 ప్రాజెక్టును నాగోల్‌ తట్టిఅన్నారం నుంచి బాచారం వరకు 10 కిలోమీటర్ల పొడవున చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అక్కడ నదీగర్భంలో ఎలాంటి ఆక్రమణలు లేకపోవడంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టవచ్చని తేల్చారు.

బాపూఘాట్, నాగోల్ మధ్య 10 వేల వరకు నిర్మాణాలు

బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు సుమారు 21 కిలోమీటర్లలో బఫర్‌ జోన్‌లో దాదాపు 10 వేల వరకు నిర్మాణాలున్నాయి. వారికి భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వానికి 15 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. అయితే గతేడాదే హైకోర్టు కూడా వారికి పరిష్కారం చూపాలని మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రభుత్వ గత నిర్ణయం ప్రకారం మూసీ నది రెండు వైపులా 50 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ కింద నిర్మాణాలు తొలగించాలనుకుంటోంది. నిజానికి రివర్ బెడ్ లో ఇండ్లకు మార్కింగ్ చేసినప్పుడు చాలా మందిని ప్రభుత్వమే దగ్గరుండి తరలించింది. వాహనాల్లో సామాన్లు ఎక్కించి, డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించడంతో వారి కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు.

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌తో మూసీకి గోదావరి నీళ్లు

సో నీటి చుట్టే జీవం ఉంది. మానవ మనుగడ ఉంది. అందుకే ఈ మూసీ పునరుజ్జీవం చాలా అభివృద్ధి పనులకు లింకప్ గా ఉంటుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టే ప్రైవేట్ సంస్థలకు పరివాహకంలో సేకరించే భూములను కొన్నేళ్ల పాటు లీజుకు అప్పగించడం ద్వారా ప్రభుత్వంపై పెద్దగా భారం పడబోదనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మూసీ మురిసేలా.. హైదరాబాద్ కు మరో 50 ఏళ్ల పాటు తాగునీటికి ఢోకా లేకుండా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 2, 3కి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకురావడం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు లింక్ చేయడం, మూసీ పునరుజ్జీవం కోసం వాడడం ఇదే జరగబోతోంది. మొత్తం 7,360 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2027 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది మూసీకి లింకే.

సిటీలో 55 కి.మీ. మేర మూసీ ప్రవాహం

ఈ ప్రాజెక్టు హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహాయపడుతుంది. దీంతో మూసీ నది పర్యావరణం బాగుపడుతుంది. రివర్ ఫ్రంట్ లో క్లీన్ వాటర్ తో చుట్టుపక్కల పార్కులు, ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. అదే జరిగితే సీఎం రేవంత్ ఊహించినట్లుగా మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడినట్లు అవుతుంది. హైదరాబాద్ సిటీ నడి మధ్యలోనుంచి మూసీ వెళ్తుంది. గండిపేట్ వరకు ఓకే.. ఆ తర్వాతే మూసీ దుర్గంధభరితంగా మారుతుంది. సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఉంటుంది. ఇదంతా బాగు పడితే ఒక అద్భుతమే అవుతుంది. భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది. మూసీ నది ఓ సబర్మతిగా మారాలి. లండన్ థేమ్స్ మాదిరి వెలిగిపోవాలి. ఇలా జరగాలంటే మాటలు కాదు. పెద్ద ఎత్తున నిధులూ అవసరమే. వచ్చే నిధులతో మూసీకి అటు ఇటు బ్యూటిఫికేషన్ చేసి వదిలేస్తే సరిపోదు. అందులో ప్రవహించే నీళ్లు కూడా అద్భుతంగా ఉండాలి. అది జరగాలంటే అంతా కలిసి రావాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరదలు రిపీట్ కావొద్దంటే జనం కూడా సహకరించాలి. ప్రాణాల మీదికి తెచ్చుకోకుండా స్వచ్ఛందంగా తరలివెళ్లాలి. ప్రభుత్వం విపక్షాలు అన్నీ కలిసి మూసీ పరివాహక జనానికి ఏ ప్యాకేజ్ బెటరో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నా.. విపక్షాలు తాజా వరదల పరిస్థితి చూశాకైనా కలిసి రావాలన్న సూచనలు వస్తున్నాయి.

గతంలో బ్యూటిఫికేషన్‌కే పరిమితమైన మూసీ

లండన్ థేమ్స్ మాదిరి, అహ్మదాబాద్ సబర్మతి మాదిరి హైదరాబాద్ మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో సంకల్పించుకున్నారు. లండన్, సౌత్ కొరియా, జపాన్ సహా చాలా చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి నదులు ఎలా పునరుజ్జీవం అయ్యాయో గుర్తించారు. మన అవసరాలకు తగ్గట్లు మూసీని డెవలప్ చేయాలని నిర్ణయించారు. నిజానికి మూసీని బాగు చేయాలని గతంలో ఆలోచనలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. కేవలం అక్కడక్కడ బ్యూటిఫికేషన్ వరకే పరిమితం అయింది. నదిలో నీళ్లు బాగుండాలి. అంటే పరిశ్రమలు, గృహ వ్యర్థాలు అందులో కలవొద్దు. అప్పుడే బాగు పడుతుంది. సో కథ అక్కడి నుంచే షురూ చేయబోతున్నారు. అందుకే మూసీ నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేయడానికి 39 కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మిస్తారు. నది ఒడ్డున రైతు మార్కెట్‌లు, నైట్ మార్కెట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, బోటింగ్ సౌకర్యాలను, రిలాక్సేషన్ జోన్లు ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. నది నీటిని శుద్ధి చేసి రకరకాల అవసరాల కోసం వాడేలా ప్లాన్ చేస్తున్నారు. మూసీ పరిసర ప్రాంతాల్లో రీసైక్లింగ్ చేసిన వస్తువులు, ఉత్పత్తులతో వాక్‌ వేలు, పార్కింగ్‌ ప్రాంతాలను నిర్మించే ప్రణాళిక రెడీ చేశారు.

Also Read: దారుణం.. ఆ ఊరిలో దళితులను బతుకమ్మ ఆడనివ్వని ఊరి పెద్దలు

వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని రెయిన్‌ గార్డెన్‌లు, గ్రీన్‌ రూఫ్‌లను ఏర్పాటు చేస్తారు. వరదలు, విపత్తుల నిర్వహణకు ఎలివేటెడ్‌ స్ట్రక్చర్లు, ఫ్లడ్‌ బారియర్లు కడుతారు. ఇంకా వరద ముప్పును పసిగట్టడం, నీటి నాణ్యత, నీటి ప్రవాహాలను సమర్థంగా మెయింటేన్ చేయడానికి జియొలాజికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను వాడడం, అలాగే ఏఐతో అంచనా వేయడం వంటివి కూడా చేస్తారు. ఇలాంటి వ్యవస్థలు సింగపూర్, స్పెయిన్, అమెరికాల్లో ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే.. తొలి విడతలో నదీ జలాల శుద్ధితో పాటు వర్షపునీటి నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రెండో దశలో ల్యాండ్‌ స్కేపింగ్‌ను అభివృద్ధి చేసి నది సహజసిద్ధ లక్షణాన్ని పునరుద్ధరించాలనుకుంటోంది. ఇక మూడో విడతలో మూసీ పరీవాహక కారిడార్‌లలో ట్రాన్స్ పోర్ట్ హబ్‌లను ఏర్పాటు చేయాలని, నాలుగో దశలో ఆదాయార్జన కోసం మూసీ చుట్టూ వాణిజ్య, సాంస్కృతిక ఆదాయ వనరులను గుర్తించాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తొలి విడత పనులకు 5,863 కోట్లు అవసరమని అంచనా వేసింది. సో పరిస్థితి ఏంటంటే తాజాగా మూసీకి వచ్చిన వరదలు డేంజరస్ గా మారాయి. చుట్టుపక్కల బస్తీల్లో నడుం లోతు నీళ్లు వచ్చాయి. ఇండ్లు మునిగాయి. ఇలాంటి పరిస్థితి రావొద్దంటే ప్రభుత్వం వెంటనే వీరికి ప్యాకేజీ రెడీ చేసి ఇండ్లు కట్టివ్వాలి. విపక్షాలు కలిసి రావాలి. మూసీని బాగు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఫీలవ్వాలి. అప్పుడే నిజాంలు కట్టిన జంట జలాశయాలకు సార్థకత ఉంటుంది.

Story By Vidya Sagar, Bigtv

Related News

Kadapa TDP Internal Issue: కడపలో గ్రూపు రాజకీయాలు.. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు?

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Big Stories

×