రోజురోజుకు రాజుకుంటున్న స్థానిక ఎన్నికల రగడ
ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే దానిపై కన్ఫ్యూజన్
రిజర్వేషన్ల విషయంలో కోర్టు తీర్పుపైనే ఆధారపడ్డ భవితవ్యం
ముందుగా ఎంపీటీసి, జడ్పీటీసీ ఎన్నికలు
తెలంగాణలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ కూడా విడుదలైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ఇకలు.. ఆ తర్వాత మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి తగినట్టుగా తేదీలను కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఓ అయోమయ పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం బాగానే ఉంది కానీ.. దానికి తగ్గట్టుగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కారణం 42 శాతం బీసీ రిజర్వేషన్లు.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
ఇప్పటికే ఈ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి హైకోర్టును ఆశ్రయించింది. మాధవ రెడ్డి అనే వ్యక్తి ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 8కి విచారణ వాయిదా పడింది.. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ మెుదలుకానుంది. అయితే 9వ తేదీన ఈ ప్రక్రియ మొదలవుతుందా? లేదా? అనేది ఆ రోజు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంది.
గవర్నర్ దగ్గర పెండింగ్‌లో రిజర్వేషన్ల బిల్లు
నిజానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. సుప్రీంకోర్టు తీర్పేమో.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు అని చెబుతోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తుండటంతో 50 శాతం కోటా దాటుతోంది. అందుకే ఈ డైలమా ఏర్పడింది. గతంలో బీహార్‌లో కూడా ఇలానే రిజర్వేషన్లు పెంచితే సుప్రీంకోర్టు కొట్టేసింది. తమిళనాడులో మాత్రం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
తొందరపడి ఖర్చులు చేయకండి అంటూ ఎంపీ ఈటల సూచనలు
ఇవన్నీ పక్కన పెడితే విచారణ సమయంలో హైకోర్టు స్పందించిన తీరు కూడా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే అనుమానాలను పెంచాయి. బీసీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండగా.. ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. ఇప్పుడు విపక్ష నేతలు కూడా ఇదే ప్రశ్నను తెరపైకి తీసుకొస్తున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. స్థానిక పోరు ఇప్పుడు ఉండకపోవచ్చు… అభ్యర్థులు తొందరపడి ఖర్చలు చేయకండి అంటూ సూచనలు చేశారు. అంతేకాదు.. బీసీలకు 42 శాతం కోటా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతోందంటూ ఫైర్ అవుతున్నారు.
బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండానే ఎన్నికలు
ఇదే నిజమై.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలు జరపాలి. బీసీ కోటా అమలు అయ్యాకే ఎన్నికలు అనుకుంటే.. లోకల్ పోరు మరోసారి వాయిదా పడే అవకాశం ఉంటుంది.
లోకల్ పోరు మరోసారి వాయిదా పడే అవకాశం
కానీ ఎన్నికలు జరిగి తీరుతాయంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వారిని రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. అన్ని వర్గాలు సహకరించి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన.
ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కోర్టులకు వెళుతున్నారని ఆరోపణ
అంతేకాదు విపక్షాలు ప్రజలను కావాలనే కన్ఫ్యూజన్‌కు గురి చేస్తున్నాయంటూ ఫైర్ అవుతున్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కోర్టులకు వెళుతున్నారని.. ప్రజలను డైవర్ట్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్.
పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు బీసీ సంఘాల తరపున విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42 శాతం అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు.. హైకోర్టులో అఫిడవిట్ సమర్పించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు
ఏదీ ఏమైనా ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మెుదలైంది. చాలా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తామే అని చాలా మంది నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి నుంచే ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం ఖర్చు పెట్టడం కూడా ప్రారంభించారు. కానీ మరి వారి ఆశలు, ప్రభుత్వ లెక్కలు నిజమవుతాయా? తప్పుతాయా? అనేది అక్టోబర్ 8న తేలనుంది. ఇదంతా ఒకవైపు అయితే ఇప్పటికే వచ్చిన రిజర్వేషన్లు కూడా ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపాయి.
ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతుంది?
ఎస్సీలున్న చోట ఎస్టీలకు.. ఎస్టీలున్న చోట బీసీలకు.. అసలు ఒక్కరు కూడా లేని ఓసీలకు రిజర్వేషన్లు. ఏంటిది అనుకుంటున్నారా? లెటెస్ట్‌గా రిలీజైన అభ్యర్థుల రిజర్వేషన్ పంచాయితీ ఇది. ఇప్పటికే జరుగుతున్న బీసీ రిజర్వేషన్ రచ్చపై క్లారిటీ రాలేదు.. కానీ అంతలోనే అభ్యర్థుల రిజర్వేషన్ లిస్ట్.. కొత్త మంటలను రాజేస్తోంది. అసలెంటీ ఈ వివాదం.. ఎక్కడెక్కడ ఈ వివాదాలు నెలకొన్నాయి.. ? దీనికి అధికారులు చెబుతున్నదేంటి? అధికార పక్ష నేతలు చెబుతున్న సమాధానమేంటి? ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతుంది?
నిర్ధారించిన రిజర్వేషన్లపై మరో రగడ
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్ల వివాదం ఒక ఎత్తైతే.. మరోవైపు ఇప్పటికే నిర్ధారించిన రిజర్వేషన్లపై మరో రగడ మొదలైంది. గ్రామ స్థాయి నుంచి జెడ్పీ స్థానం వరకు ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేశారు. అయితే చాలా ప్రాంతాల్లో దీనికి సంబంధించి వివాదం నెలకొంది.
కలెక్టర్ కు గ్రామస్థుల ఫిర్యాదు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిజర్వేషన్ రగడ కొనసాగుతోంది. వీర్నపల్లి మండలం మద్దిమల్లతండా రిజర్వేషన్ తప్పుగా జరిగిందని కలెక్టర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో వంద శాతం ఎస్టీ జనాభా ఉంటే… సర్పంచ్ బీసీకి రిజర్వ్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు. బీసీలే లేనిచోట వారికి ఎలా రిజర్వ్ చేస్తారని మద్దిమల్లతండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా రిజర్వేషన్ల పంచాయితీ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఎక్కువగా ఎస్టీలు ఉన్నారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఇక్కడ బీసీ రిజర్వేషన్ కల్పించారు. 98 శాతం ఉన్న లంబడాలను కాదని బీసీలకు ఎట్లా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కూసుమంచి మండలం ధర్మాతండాలో 451 మంది ఓటర్లు ఉంటే…అందులో 449 ఎస్టీలే ఉన్నారు. కేవలం ఇద్దరు ఉన్నందుకే బీసీని ఎలా కేటాయిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మంగలితండాలో సర్పంచ్ బీసీ మహిళకు కేటాయించారు. ఇక్కడ 838 మంది ఓటర్లలో ఒకే ఒక్క బీసీ మహిళ ఉంది. దీంతో ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఏర్పడింది. తిరుమలాయపాలెం మండలంలో లాల్సింగ్ తండా సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఇక్కడ 624 మంది ఎస్టీలు ఉంటే.. కేవలం నలుగురే బీసీ ఓటర్లు ఉన్నారు. ఇద్దరిలో అత్తాకోడళ్లు ఉన్నారు. వీరిలో పద్మ అంగన్వాడీ టీచర్ అవ్వడంతో.. గౌతమి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది.
నల్గొండలో కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్ల గందరగోళం
నల్లగొండలో కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లు కొన్ని చొట్ల గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలు లేనిచోట్ల అదే సామాజికవర్గానికి సీటు కేటాయించారు. పంచాయితీ తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు స్థానిక నాయకులు. దామెరచర్ల మండలంలో ఉన్న తండాల్లో సర్పంచ్ బీసీలకు రిజర్వ్ అయ్యింది. బట్ ఇక్కడ ఒక్క బీసీ అభ్యర్థి లేని పరిస్థితి నెలకొంది. తండాల నుంచి నామినేషన్ వేసేందుకు బీసీలు కరువయ్యారు. దీంతో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడింది.
ఎస్సీలు లేకున్నా అదే సమాజిక వర్గానికి రిజర్వేషన్
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారంలో ఎస్సీలు లేకున్నా అదే సామాజికవర్గానికి రిజర్వేషన్ కేటాయించారు. అయితే 2019లోనూ ఇదే సీన్ రిపీట్ కావడంతో రాజారంలో సర్పంచ్ ఎన్నిక జరగలేదు. గతంలో సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. దీంతో పంచాయతీ అధికారులే పాలనను కొనసాగించారు.
నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్‌లో వందశాతం ఎస్టీలు
నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్‌లో వందశాతం ఎస్టీలు ఉండగా.. బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడంతో వ్యతిరేక మొదలైంది. అలా ఎలా కేటాయిస్తారంటూ ఎస్టీలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పెద్దల వరకు వెళ్లిన వివాదం
ఇప్పటికే ఈ రిజర్వేషన్ల కేటాయింపు అంశం కాంగ్రెస్ పెద్దల వరకు వెళ్లింది. ఈ రిజర్వేషన్ల కేటాయింపుల్లో సీఎంతో సహా ప్రభుత్వ పెద్దలు ఎవరూ జోక్యం చేసుకోలేదని.. స్థానిక అధికారులే రూల్స్ ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఏదేమైనా తెలంగాణలో జరగబోయే స్థానిక సమరంలో.. రిజర్వేషన్ల పంచాయితీ కొనసాగుతోంది. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల అంచనాలు తారుమారు అవుతున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Story By vamsi krishna , Bigtv