CM Revanth Reddy: ఇచ్చిన హామీ, చెప్పిన మాట ఈ రెండూ నిలబెట్టుకునేందుకు ప్రజాప్రభుత్వం ప్రతిదశలోనూ అడుగులు వేస్తోంది. అందుకే సంక్షేమం దగ్గర్నుంచి అభివృద్ధి వరకు, అలాగే అకౌంటబులిటీ పెంచేలా ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తోంది. ఈవారం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రాష్ట్రానికి కీలక అప్డేట్స్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అవేంటో చూద్దాం.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాం.. అంతా అధికారులే చూసుకోండి అని చేతులు దులిపేసుకోకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోళ్లపై గ్రౌండ్ మానిటరింగ్ చేస్తోంది. మంత్రులు పంట కొనుగోలు సెంటర్లకు వెళ్లి ప్రత్యక్షంగా అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నారు. వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు ఇస్తున్నారు. ఓవరాల్ గా రైతులకు ఇబ్బంది రాకుండా చేస్తున్నారు. పంట అమ్మడం, మూడు రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు పడడం, ట్రాన్స్ పోర్ట్ జరిగిపోవడం ఇవన్నీ చకచకా పూర్తయ్యేలా చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా వేపాల సింగారంలో కొనుగోలు సెంటర్ కు వెళ్లిన మంత్రి ఉత్తమ్ కు లారీలు టైమ్ కు రావడం లేదంటూ రైతులు కంప్లైంట్ చేశారు. వెంటనే రియాక్ట్ అయిన మంత్రి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారమయ్యేలా చూశారు.
25-11-2024 ( సోమవారం ) ( పారదర్శకత కోసం )
రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని వేయి సార్లు ఆలోచించి అది మంచికే అనుకుంటేనే ముందుకెళ్తోంది. సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్కిల్ వర్శిటీకి కార్పొరేట్ సంస్థలు సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఫండ్స్ ఇచ్చాయి. ఇందులోనే అదానీ గ్రూప్ కూడా వందకోట్లు ఇచ్చేందుకు అంగీకరించి ముందుకొచ్చింది. అయితే అదానీ గ్రూప్ చుట్టూ వివాదాలు నెలకొనడంతో ఆ వందకోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిది. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్నిలాగవద్దని కూడా సీఎం కోరారు. అంతే కాదు అదానీ గ్రూప్ నుంచి వచ్చిన పెట్టుబడులు రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే జరిగాయని క్లారిటీ ఇచ్చారు.
26-11-2024 మంగళవారం ( కొత్త కొత్తగా ఎయిర్ పోర్టులు )
దేశంలో చాలా రాష్ట్రాల్లో రెండు అంతకంటే ఎక్కువ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. అయితే దేశంలో గ్రోత్ ఇంజిన్ అయిన తెలంగాణలో మాత్రం ఒక్క హైదరాబాద్ కే ఎయిర్ పోర్ట్ పరిమితమైంది. హైదరాబాద్ నుంచి వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడం వంటి ప్రాంతాలు దూరంగా ఉన్నా అక్కడ ఎయిర్ పోర్ట్స్ కలగానే మిగిలిపోయాయి. అయితే ఈ పరిస్థితి మార్చాలని రేవంత్ ప్రభుత్వం సంకల్పించుకుంది. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందుకోసం కొత్తగా ఎయిర్ పోర్టులు వస్తేనే అభివృద్ధి ఊపందుకుంటుందన్న లక్ష్యంతో కేంద్రంతో సంప్రదింపులు మొదలు పెట్టింది.
స్వయంగా సీఎం రేవంత్.. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఢిల్లీలో భేటీ అయి కొత్త ఎయిర్ పోర్టులపై చర్చించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ ను తమ టర్మ్ లో కచ్చితంగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ సహా మిగితా విమానాశ్రయాల విషయంలో భూముల చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం భుజానికెత్తుకుంది. రక్షణరంగానికి చెందిన భూముల బదలాయింపు కోసం రాజ్ నాథ్ సింగ్ ను కూడా సీఎం కలిశారు. బాపూ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం కోసం రక్షణ శాఖ స్థలాలను ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.
26-11-2024 మంగళవారం ( మెట్రో రెండో దశ ఇక రయ్ రయ్)
హైదరాబాద్ మెట్రో రైల్ నెట్ వర్క్ విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏయే రూట్లలో మెట్రో అవసరమో ఆ ప్లాన్స్ రెడీ చేసి పెట్టింది. గతంలో ఉన్న మెట్రో నెట్ వర్కే ఉండడంతో ఆపరేషన్ నెట్ వర్క్ లో హైదరాబాద్ మూడోస్థానానికి పడిపోయింది. అందుకే ఎక్కువ ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో మెట్రో విస్తరణపై దృష్టి పెట్టారు. మెట్రోరైలు రెండోదశలో ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. 54 స్టేషన్లు రాబోతున్నాయి. ఇవన్నీ పూర్తైతే ప్రతిరోజూ 10 లక్షల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది. రెండో దశ మెట్రో ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. గత 10 నెలల్లో సీఎం రేవంత్ 10 సార్లు మెట్రోపై సమీక్షలు నిర్వహించారంటే ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న రద్దీకి తగ్గట్లు అదనపు కోచ్ లు అందుబాటులోకి తీసుకురానున్నారు.
26-11-2024 మంగళవారం ( ధాన్యం సేకరణపైనే ఫోకస్ )
రాష్ట్రంలో ధాన్యం సేకరణపై సీఎం సహా ప్రభుత్వం మొదటి రోజు నుంచి చాలా ఫోకస్డ్ గా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెంటవెంటనే కొనుగోళ్లు జరపడం, అకౌంట్లలో డబ్బులు వేసేయడంతో రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. ఈ వారంలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఢిల్లీ నుంచే ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. ఇన్‌చార్జి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. సన్న రకాలకు బోనస్ కూడా త్వరగా చెల్లించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దన్నారు సీఎం.
26-11-2024 మంగళవారం ( మెరుగువనున్న మౌలికవసతులు )
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లల్లో మౌలిక వసతుల కోసం రేవంత్ సర్కార్ పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేసింది. కేవలం ఇండ్లు నిర్మించి వదిలేయడం, అక్కడ డ్రైనేజ్, తాగునీరు, కరెంట్ వంటి సౌకర్యాలు లేకపోవడంతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే సీఎం చొరవ తీసుకుని 196 కోట్ల 46 లక్షల నిధులను విడుదల చేయించారు.
ఈ మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ 26న జీవో 892 జారీ చేసింది. ఈ నిధులతో డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీల్లో నీటి వసతి, విద్యుదీకరణ, డ్రైనేజ్ కోసం పనులు చేపట్టనున్నారు. గత ప్రభుత్వం నిర్మించి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వదిలేయడంతో రేవంత్ ప్రభుత్వం వాటిని బాగు చేసే పని చేపట్టింది. కొన్నిసార్లు ఎంత మంచి చేయాలని చూసినా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అదే సంక్షేమ హాస్టల్స్ లో జరిగాయి. ఓవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినా ఫుడ్ పాయిజన్ ఘటనలు రిపీట్ అయ్యాయి. అయితే ఆ మాట ఇకపై వినిపించకుండా ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంది. అటు హైదారాబాద్ 2050 మాస్టర్ ప్లాన్ లో అదిరిపోయే అభివృద్ధి పనులు చేసేందుకు ఈ వారం భారీ ముందడుగు పడింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
27-11-2024 – బుధవారం ( మాస్టర్ ప్లాన్ 2050 )
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో చారిత్రత్మాక పనులు మొదలయ్యాయి. మరెన్నో శంకుస్థాపనలు జరిగాయి. కీలక నిర్ణయాలకు వేదికైంది. హైదరాబాద్ దశ దిశలను మార్చేలా మాస్టర్ ప్లాన్ 2050 రెడీ చేస్తున్నట్లు ఈ వారం సీఎంవో వెల్లడించింది. రోజురోజుకు సిటీలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా.. మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఫ్యూచర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సర్కార్ అన్ని రకాలుగా కసరత్తు చేస్తున్నట్లు సీఎంఓ వివరించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో సంవత్సరం పూర్తవుతున్న టైంలో.. ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలేంటో ఓసారి చూద్దాం.
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం నిర్ణయం జరిగింది. అలాగే 24,237 కోట్ల రూపాయలతో మెట్రో రెండో దశ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు 2232 కోట్లతో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్, 1,580 కోట్లతో నాగ్‌పుర్ నేషనల్ హైవేపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు మెహిదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ పర్మిషన్ తెప్పించడం సీఎం పట్టుదలకు నిదర్శనం. 18 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు, కేబీఆర్ పార్క్ చుట్టూ 826 కోట్లతో 6 జంక్షన్ల అభివృద్ధి, మురుగునీటి శుద్ధి కోసం కొత్తగా 39 ఎస్‌టీపీల ఏర్పాటు, ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి.. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం ఇవన్నీ బృహత్తర ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి.
27-11-2024 – బుధవారం ( దివ్యాంగులకు తీపి కబురు )
పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈనెల 27న పెన్షన్‌కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. దివ్యాంగుల పింఛన్‌ని త్వరలోనే 6 వేలకు పెంచుతామని అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులనూ నింపుతామన్నారు.
27-11-2024 – బుధవారం ( మూసీపై కేంద్రం క్లారిటీ )
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ పై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. నిర్వాసితులకు ఏం చేసేది.. ఈ లక్ష్యాన్ని ఎలా అందుకునేది వివరంగా తెలిపింది కేంద్రం. బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోఖన్ సాహు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నదికి పునరుజ్జీవం తేవడం, కాలుష్యాన్ని నివారించడం, హైదరాబాద్ లో వరదలను నియంత్రించడం, లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని, రివర్ బెడ్ సహా బఫర్ జోన్ లో ఉంటున్న వారికి 15 వేల ఇండ్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని కేంద్రం తెలిపింది.
28-11-2024 – గురువారం ( ఫుడ్ పాయిజన్ మాటే వినిపించొద్దు )
సంక్షేమ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరగడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇకపై ఫుడ్ పాయిజన్ అన్న మాటే వినిపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వంటకు ముందు కిచెన్ ఫోటోలు తీయడం, వంట సామాగ్రి ఫోటోలు, అలాగే వంట పూర్తయ్యాక సిబ్బంది తిన్న తర్వాతే పిల్లలకు వడ్డించడం, ఫోటోలను ఎప్పటికప్పుడు యాప్ లో అప్డేట్ చేసేలా కొత్త యాప్ రాబోతోంది. దీంతో ఫుడ్ పాయిజన్ ఎలా అయిందో ఈజీగా గుర్తించడం, అది జరగకుండా సిబ్బందిని అవసరమైతే డిస్మిస్ చేసేలా కఠిన నిర్ణయాలు తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. సాధారణ తనిఖీలతో పని అయ్యేలా కనిపించకపోవడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, సంబంధిత శాఖ HOD లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా ఆఫీసర్ ను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఆర్డర్ ఇచ్చింది. ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, ఇద్దరు సిబ్బందితో ఈ ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది.
28-11-2024 – గురువారం ( ఇథనాల్ ఫ్యాక్టరీకి చెక్ )
ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు కోరుకున్న పనే చేస్తుందని మరోసారి నిరూపించింది రేవంత్ ప్రభుత్వం. గత కేసీఆర్ సర్కార్ హయాంలో దిలవార్ పూర్ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం అనుమతులు ఇవ్వడం, ఆ ఫ్యాక్టరీ తమకు వద్దని స్థానికులు ఆందోళన చేయడంతో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రేవంత్ ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు నిలిపివేసింది. కాలుష్య రహితంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో ఏర్పాటు కావాల్సిన ఇథనాల్ ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించట్లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికులు ఆందోళన చేయడంతో పనులు నిలిపి వేసింది రాష్ట్ర ప్రభుత్వం.
28-11-2024 – గురువారం ( 2026 ఖేలో ఇండియా మన దగ్గరే )
గతంలో నిర్లక్ష్యానికి గురైన స్పోర్ట్స్ ను రేవంత్ ప్రభుత్వం డే వన్ నుంచి పూర్తిస్థాయిలో ప్రమోట్ చేస్తోంది. యువత డ్రగ్స్, మద్యానికి బానిస అవకుండా వారిలో మార్పు తెచ్చేందుకు మొదటి నుంచి ఈ ప్రయత్నం కొనసాగుతోంది. అందులో భాగంగానే చాలా రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఖేలో ఇండియా-2026 పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యేలా సీఎం రేవంత్ కృషి చేశారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. 2025లోనే నిర్వహించాలని సీఎం కోరగా, అప్పటికే బిహార్‌లో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో 2026లో హైదరాబాద్ లో ఖేలో ఇండియా నిర్వహించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో క్రీడల నిర్వహణకు ఉన్న సౌకర్యాలను వివరిస్తూ సీఎం రేవంత్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ సింగ్ మాండవీయకు లేఖ రాశారు. 2002లో హైదరాబాద్ లో 32వ జాతీయ క్రీడలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత ఆఫ్రో ఏషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయన్నారు. సో స్పోర్ట్స్ విషయంలో ఇదో భారీ ముందడుగు.
28-11-2024 – గురువారం ( కుటుంబ సర్వేలో నేను సైతం )
సమగ్రకుటుంబ సర్వేలో నేను సైతం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించుకున్నారు. సీఎం రేవంత్ కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్, అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఇతర అధికారులు, ఎన్యుమరేటర్లు, సిబ్బందితో కూడిన సర్వే బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబ వివరాలను ఈనెల 28న నమోదు చేసుకున్నారు.
29-11-2024 – శుక్రవారం ( రేవంత్ రిక్వెస్ట్, సెంట్రల్ ఓకే )
విభజన చట్టంలోని హామీల అమలుపై మరో ముందడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొస్తోంది. సమస్యలు లేని వాటిని కేంద్రంతో మాట్లాడి మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా షెడ్యూల్ 13లోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ, ఇతర సంస్థల ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించింది. కాజీపేటలో ఏర్పాటు చేసిన ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. విభజన హామీల్లో ఇదే పెద్ద ముందడుగు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి రెండుసార్లు కలిశారు. గతేడాది డిసెంబర్ 26, ఈ ఏడాది జులై 4న ప్రధానితో సమావేశమై విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. కాజీపేటలో ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను 2023లో రైల్వే శాఖ ప్రకటించగా, విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తితో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
29-11-2024 – శుక్రవారం ( సంతోషం నింపిన బోనస్ )
సన్నరకం ధాన్యాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ఇదే తొలిసారి అని సీఎం ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించని సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. సన్న రకం వరి పండించిన రైతులకు ఎకరాకు 20 నుంచి 24 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుందని, ఆ రకంగా బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు అదనంగా ఎకరాకు 10 వేల నుంచి 12 వేల వరకు అదనపు ఆదాయం అందుతోందన్నారు. ఎకరాకు 12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేసే ఈ ప్రయత్నం తనకు తృప్తిని ఇస్తోందన్నారు సీఎం.
29-11-2024 – శుక్రవారం ( ఇందిరమ్మ ఇండ్లపై ముందడుగు )
ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల విషయంపై సీఎం రేవంత్ కీలక రివ్యూ చేశారు. పకడ్బందీగా, అసలైన నిరుపేదలకే ఇండ్లు ఇచ్చేలా కసరత్తు చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తుండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలన్నారు. ఇందిరమ్మ యాప్‌లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
29-11-2024 – శుక్రవారం ( త్వరలో కొత్త నోటిఫికేషన్ )
వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకుంది. త్వరలో మల్టీ మోడల్ ప్రాజెక్టుల కోసం కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఫార్మా కాకుండా ఇతర ఇండస్ట్రియల్ జోన్ అయితే కాలుష్యం ఉండబోదని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలకు అవకాశం ఉండేలా టెక్స్‌టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు.
29-11-2024 – శుక్రవారం ( ఉద్యోగులకు తీపి కబురు )
అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బేసిక్ పే పై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఈనెల 29న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడాది నుంచి ఐఆర్ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. వారి కల నెరవేర్చింది రేవంత్ ప్రభుత్వం. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ భృతి విడుదల చేయడం పట్ల ప్రభుత్వ రంగ సంస్థల సమాఖ్య సంతోషం వ్యక్తం చేసింది.
30-11-2024 ( శనివారం ) ( రైతుల జీవితాల్లో వెలుగులు )
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో రైతులకు కలిగిన మేలుపై స్వయంగా ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. మార్పు కోసం ఓటేసిన రైతు చరిత్రను తిరగరాశారన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాల్ కు 500 బోనస్, 10,444 కోట్ల ఉచిత విద్యుత్, 1433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్ట పరిహారం, 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు.. ఇలా ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
30-11-2024 ( శనివారం ) ( రైతులకు వరాల జల్లు )
రేవంత్ రెడ్డి తొలి ఏడాది పాలనలో రైతులకు పట్టం కట్టారు. అదే విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసిన సీఎం తాజాగా మహబూబ్ నగర్ లో రైతు సదస్సు ముగింపు కార్యక్రమంలోనూ ప్రస్తావించారు. రైతులకు భరోసా ఇచ్చారు. 3 రోజుల పాటు జరిగిన ఈ రైతు సదస్సును బహిరంగ సభ మాదిరి కాకుండా రైతులకు పూర్తిగా అవగాహన కల్పించేలా సదస్సు నిర్వహించారు. చీడపీడలు, కొత్త వంగడాలు, కొత్త టెక్నాలజీ, వాతావరణ మార్పులు ఇవన్నీ తెలిపేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. చివరి రోజు ముగింపు సమావేశానికి హాజరైన సీఎం రైతు రుణమాఫీ, రైతు భరోసాపై కీలక ప్రకటనలు చేశారు.