E-Paper
Advertisement

CM Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఏరియాలపై.. రేవంత్ కీలక నిర్ణయం

CM Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఏరియాలపై.. రేవంత్ కీలక నిర్ణయం
Advertisement

CM Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాలో.. రాబోయే ఐదేళ్లకు అవసరమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతా కలిసి పనిచేస్తేనే.. రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందన్నారు. జీహెచ్ఎంసీతో పాటు పోలీస్ కమిషనరేట్లను సైతం ప్రభుత్వం పునర్‌ వ్యవస్థీకరించింది. ఇక.. కొత్త ఏడాది వేళ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం.. 10 వేల కోట్లకు చేరిన బకాయిల చెల్లింపులో కీలక ముందడుగు పడింది.

సోమవారం, డిసెంబర్ 29 ( మరమ్మత్తుల పరిశీలన )
ఈవారం.. శాసనమండలి భవన పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి.. మండలి సమావేశ మందిర పునరుద్ధరణ, మరమ్మతు పనులను పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో అధికారులకు సూచనలు చేశారు. సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

Advertisement

సోమవారం, డిసెంబర్ 29 ( కొత్త కమిషనరేట్లు )
తెలంగాణ ప్రభుత్వం ఈ వారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు పోలీస్ కమిషనరేట్లను సైతం పునర్‌ వ్యవస్థీకరించింది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను.. నాలుగుకు పెంచింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరితో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ని ఏర్పాటు చేసింది. ఇందుకనుగుణంగా కొందరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు, మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీగా రమేశ్ రెడ్డిని నియమించింది. అదేవిధంగా యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష యాదవ్‌ను నియమించారు. రాచకొండ కమిషనరేట్‌ని పునర్ వ్యవస్థీకరించి.. మల్కాజ్‌గిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ ఏర్పాటు చేశారు. కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి సహా మరికొన్ని ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటిదాకా రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించింది.

నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం.. దశలవారీగా ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించాలన్నారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల దగ్గర.. సీసీ కెమెరాలతో మానిటర్ చేయాలన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదని.. అలాగే గుంతలు కూడా కనిపించొద్దన్నారు. పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు సీఎం. ఎక్కడ సమస్య తలెత్తినా.. దాని పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వీలైనంత తొందరగా స్పందించాలన్నారు. హైదరాబాద్ మహా నగరంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి చర్యల్లో భాగంగా.. కోర్ అర్బన్ ఏరియాలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తీసుకురావాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా.. బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువపత్రాల జారీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా టెక్నాలజీని వాడాలన్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లతో లింక్ ఉండేలా కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలని సూచించారు. నాలాల పూడికతీత పనులు కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టాలన్నారు.

Advertisement

మంగళవారం, డిసెంబర్ 30 ( డెవలప్‌మెంట్ ప్లాన్ )
అందరూ కలిసి పనిచేస్తేనే హైదరాబాద్ భవిష్యత్తు బాగుంటుందన్నారు సీఎం రవేంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో.. హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కోర్-అర్బన్ రీజియన్‌ని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా.. రాబోయే ఐదేళ్లకు అవసరమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. సిటీని.. వివిధ జోన్లుగా విభజించిన క్రమంలో.. కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ఈ వారం ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించారు. తెలంగాణ మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే.. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ రూపొందించుకున్నామని తెలిపారు. అందుకనుగుణంగా అమలు చేయాల్సిన కార్యాచరణపై.. జోనల్ కమిషనర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా.. సిటీలో చెత్త ప్రధాన సమస్యగా మారింది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా.. జోన్ల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్ కమిషనర్లు.. రోజూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలన్నారు.

బుధవారం, డిసెంబర్ 31 ( పెండింగ్ బకాయిలు చెల్లింపు )
కొత్త ఏడాది వేళ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది. దాదాపు 10 వేల కోట్లకు చేరిన బకాయిల చెల్లింపులో కీలక ముందడుగు పడింది. పెండింగ్ బిల్లుల్లో.. డిసెంబర్‌కు సంబంధించిన 713 కోట్లను విడుదల చేసింది. బకాయిలపై ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం నిధులు విడుదల చేసింది. ఉద్యోగులకు కొన్నేళ్లుగా గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్‌ లీవ్‌లు, అడ్వాన్స్‌లకు సంబంధించిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఈ మొత్తం దాదాపు 10 వేల కోట్లకు చేరింది. ఈ విషయమై ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అనేకసార్లు విన్నవించారు. దాంతో.. ప్రతి నెలా 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని చెప్పిన మాటను.. రేవంత్ సర్కార్ నిలబెట్టుకుంది. తొలి విడతగా గతేడాది జూన్‌లో 183 కోట్లు విడుదల చేసింది. తర్వాత.. ఆగస్ట్ నుంచి నెలకు 700 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నారు.

గురువారం, జనవరి 1 ( మన వాటా మనకే! )
కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడటంలో రాజీ పడేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ.. తమ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందని చెప్పారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఈ వారం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి.. ప్రభుత్వం నిబద్ధతతో కార్యక్రమాలు చేపడుతుందని సీఎం రేవంత్ తెలిపారు. నదీ జలాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్న ఆలోచనతో తప్ప.. రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన తమకు లేదన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని.. అప్పటి ప్రభుత్వం అంగీకరించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారం.. నది పరీవాహక ప్రాంతం మేరకు తెలంగాణకు 71 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 29 శాతం మేరకు నీటి వాటా దక్కాల్సి ఉండగా, గత ప్రభుత్వం హయాంలో అందుకు భిన్నంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం జలాలకు అంగీకరించారని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే పాయింట్.. జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చడం వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం ఏపీ 13 టీఎంసీలు తరలిస్తుంటే, తెలంగాణ రెండున్నర టీఎంసీలు మాత్రమే తీసుకోగలుగుతుంది. ప్రాజెక్టు మార్చడం వల్ల లిఫ్టులు, పంపులు పెరిగాయే తప్ప.. ప్రయోజనం లేదన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కనీసం రెండున్నర టీఎంసీల నీటిని తరలించే మౌలిక సదుపాయాలు కూడా తెలంగాణకు లేవన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి.. ఏడేళ్ల దాకా డీపీఆర్ సమర్పించకుండానే 27 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు.. సాగునీటి ప్రాజెక్టు కాదని, 7.15 టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి కోసం నిర్మిస్తున్నట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ నీటి హక్కులు దక్కించుకోవడానికి.. గతంలోనే అనేక వేదికల్లో రాష్ట్ర వాదన బలంగా వినిపించాల్సి ఉండగా, గత పాలకులు ఆ పని చేయలేదని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో.. అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

శుక్రవారం, జనవరి 2 ( మూసీకి పునరుజ్జీవం )
వచ్చే మార్చి పూర్తయ్యే నాటికి అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రేటర్ సిటీ హైదరాబాద్‌కు.. మూసీ నది పునరుజ్జీవం అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. ఈ వారం అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవం అంశంపై.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్‌కు సంబంధించిన విస్తృత లక్ష్యాలు, ఉద్దేశాలను సభ్యులకు వివరించారు. అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేసిన తర్వాతే.. మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే.. మానవ నాగరికత అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌కు సంబంధించి నిజాం హయాంలోనే మూసీ తీరం వెంబడి గొప్ప అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. 1908 వరదల తర్వాతే.. హైదరాబాద్ నగరానికి శాశ్వత పరిష్కారంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు.

మూసీ నది కాలుష్యం వల్ల.. దాని పరివాహక ప్రాంతాల్లో పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. పరిశ్రమల మలినాలు, ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సీఎం. ఇందుకోసం కన్సల్టెన్సీలని నియమించి.. డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. బాపూ ఘాట్ దగ్గర మూసా-ఈసా నదుల సంగమంలో.. ప్రపంచంలోనే ఎత్తైన మహాత్ముని విగ్రహాన్ని నెలకొల్పడంతో పాటు గాంధీ సరోవర్‌ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను తరలించి.. మూసీ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

20 టీఎంసీలలో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు

20 టీఎంసీలలో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలను మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు 4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. కేంద్రప్రభుత్వం నుంచి కూడా అవసరమైన అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి దాకా 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలకు మెరుగైన నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఓల్డ్ సిటీ సహా నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. డీపీఆర్ సిద్ధమయ్యాక.. అసెంబ్లీ ముందు పెడతామని, ప్రజాప్రతినిధులు, నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు..

శుక్రవారం, జనవరి 2 ( వీబీ జీ రామ్ జీ పై ఆగ్రహం )
గ్రామీణ ప్రాంత నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగించే వికసిత్ భారత్.. గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ గ్రామీన్.. వీబీ జీ రామ్ జీ చట్టం 2025‌ని తిరస్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ వారం అసెంబ్లీలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తీర్మానానికి మద్దతు తెలియజేస్తూ.. వీబీ జీ రామ్ జీ చట్టం వల్ల గ్రామీణ ప్రాంత పేదలకు కలిగే నష్టాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను.. తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతథంగా అమలు చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా అంతా మద్దతుగా నిలవాలని కోరారు.

కొత్త చట్టంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న నిబంధన

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన.. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ చట్టం.. పేదల హక్కులను దెబ్బతీసే విధంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళల ఉపాధికి హామీ లేకుండా పోతుందని చెబుతున్నారు. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే విధంగా చేర్చిన కొత్త నిబంధనలు.. పేదల పట్ల శాపంగా మారతాయంటున్నారు. గడిచిన 20 ఏళ్లలో ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిన వారిలో రాష్ట్రంలో 90 శాతం వెనుకబడిన వర్గాల వారుండగా.. అందులో 62 శాతం మహిళలే ఉన్నారు. కొత్త చట్టం.. ఉపాధి హామీ పథకం అసలు ఉద్దేశం దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త చట్టంలో చేర్చిన పరిమిత కేటాయింపులతో.. పేదలకు పని దినాలు తగ్గిపోతాయంటున్నారు. పాత చట్టంలో వంద శాతం నిధులు కేంద్రమే అందిస్తుండగా.. కొత్త చట్టంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న నిబంధన.. రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందనే ఆందోళన ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తోంది.

పాత చట్టాన్నే యథాతథంగా కొనసాగించాలని సీఎం రేవంత్ డిమాండ్ 

మరోవైపు.. ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరుని పునరుద్ధరించాలని.. అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుత ఉపాధి హామీ పథకం ద్వారా.. 266 పనులు చేసే అవకాశం ఉంది. కొత్త చట్టంలో భూమి అభివృద్ధి లాంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడంతో.. చిన్న, సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించడంతో పాటు ఇప్పుడున్న పనుల జాబితాను యాథావిధిగా ఉంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం విధించడం వల్ల.. భూమిలేని కూలీలకు అన్యాయం జరుగుతుందంటున్నారు. ఉపాధి హామీ చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని.. వెనుకబడిన వర్గాలకు చెందిన పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు.. పాత చట్టాన్నే యథాతథంగా కొనసాగించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×