E-Paper
Advertisement

Congress: పల్లె పోరులో హస్తం హవా..

Congress: పల్లె పోరులో హస్తం హవా..

Congress: ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.. జనం అసలే దేకట్లేదన్నారు.. రెండేళ్ల పాలన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందన్నారు. కానీ.. అవేవీ నిజం కాదని నిరూపిస్తూ.. సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ దుమ్మురేపింది. దమ్ము చూపింది. పల్లెలపై తమకెంత పట్టు ఉందో నిరూపించుకుంది. రాష్ట్రంలో మెజారిటీ గ్రామాలు తమతోనే ఉన్నాయని.. స్టేట్ మొత్తం రీసౌండ్ వచ్చేలా చేసింది కాంగ్రెస్. హస్తం పార్టీ మద్దతుదారులు ఇంత భారీ స్థాయిలో గెలవడానికి రీజనేంటి? ఈ ఫలితాలతో వచ్చిన జోష్.. కాంగ్రెస్ పరిషత్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేస్తుందా?

పల్లె పోరులో అధికార కాంగ్రెస్ ప్రభంజనం..
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్నది ఒక్కటే.. కాంగ్రెస్ తీన్‌మార్. విపక్షాల విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్, ప్రజా వ్యతిరేకత ఉందన్న ప్రచారాలన్నింటిని పటాపంచలు చేస్తూ.. పల్లె పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ మద్దతుదారులు తిరుగులేని విజయాలను నమోదు చేశారు. మొత్తం 12 వేల 702 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో.. 7,050 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించి.. గ్రామాల్లో తమకు తిరుగులేదని నిరూపించారు. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన హస్తం పార్టీ.. మూడో విడతలోనూ అదే డామినేషన్ కంటిన్యూ చేసింది. మూడో విడతలో మొత్తం 4 వేల 159 గ్రామాలకు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,286 స్థానాలు గెలిచారు. బీఆర్ఎస్ మూడు విడతల్లో కలిపి.. 3500 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 708 స్థానాల్లో, ఇతరులు.. 1440కి పైగా స్థానాల్లో గెలిచారు. 31 జిల్లాల్లో ఎన్నికలు జరిగితే.. ఒక్క సిద్దిపేట మినహా.. మిగతా 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది.

గ్రౌండ్ లెవల్‌లో ప్రభావం చూపిన సంక్షేమ పథకాలు
రాష్ట్రంలో రెండేళ్ల పాలన తర్వాత.. సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంటుందని భావించినప్పటికీ.. సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. ఈ భారీ విజయం వెనుక కొన్ని కీలక కారణాలు కనిపిస్తున్నాయ్. అందులో మొదటిది.. గ్రౌండ్ లెవెల్‌లో సంక్షేమ పథకాలు చూపిన ప్రభావం ఒకటి. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు.. గ్రామీణ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా మహిళా ఓటర్ల శాతం.. ఈ ఎన్నికల్లో పెరగడం కాంగ్రెస్‌కు బిగ్ ప్లస్ పాయింట్. ఇక.. కాంగ్రెస్ అధికారంలో ఉండటం కూడా కొంత కలిసొచ్చింది. సాధారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కావాలన్నా, పథకాలు అందాలన్నా.. అధికార పార్టీ సర్పంచ్ ఉంటేనే మేలనే భావన ఓటర్లలో బలంగా ఉంది. ఈ తరహా ఆలోచన కూడా గట్టిగానే పనిచేసింది. ఇక.. సామాజిక సమీకరణాలు కూడా కొంత హస్తం పార్టీకి ప్లస్ అయ్యాయ్. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయం కార్డుని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోందనే భావన ప్రజల్లో ఉంది. ఈ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు, దళిత, గిరిజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రాధాన్యత.. ఆయా వర్గాల ఓట్లని భారీగా కొల్లగొట్టేలా చేసింది.

విపక్షాల బలహనీనతతోనూ భారీ స్థాయిలో కాంగ్రెస్‌కు స్థానాలు
ఇక.. విపక్షాల బలహీనత కూడా కాంగ్రెస్ ఈ స్థాయిలో స్థానాలు కొల్లగొట్టేందుకు మరో కారణం. బీఆర్ఎస్‌కు పట్టున్న కొన్ని జిల్లాల్లో మినహాయిస్తే.. మిగిలిన చోట్ల ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం స్పష్టంగా కనిపించింది. ఇక.. బీజేపీ కేవలం అర్బన్ ఏరియాలకే పరిమితం కావడం, గ్రామాల్లో గట్టి క్యాడర్ లేకపోవడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. కాంగ్రెస్ నాయకత్వం సమిష్టి వ్యూహం.. గ్రామాల్లో 3 రంగుల జెండా రెపరెపలాడేలా చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా.. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గ్రామాల్లో తమ పార్టీకి చెందిన వారి మధ్య విభేదాలు తలెత్తకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకున్నారు. రెబల్స్ బెడద తక్కువ ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో.. కాంగ్రెస్ సక్సెస్ అయింది. జిల్లాలవారీగా చూస్తే.. 31 జిల్లాల్లో 30 జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో కాంగ్రెస్ తన పట్టుని మరింత పటిష్టం చేసుకుంది. గతంలో.. బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ.. హస్తం పార్టీ దుమ్మురేపింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ.. కాంగ్రెస్ ఫుల్ స్వింగ్‌లో కనిపించింది.

కాంగ్రెస్ వైపు చూస్తున్న ఓడినవారు, స్వతంత్ర అభ్యర్థులు
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూశాక.. రైజ్ అవుతున్న క్వశ్చన్ ఒకటే. పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే జోష్ కంటిన్యూ అవుతుందా? లేదా? అని! సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కేవలం గ్రామ స్థాయి విజయాలే కాదు.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎగ్జాంపుల్‌గా మారనున్నాయి. మెజారిటీ గ్రామాల్లో విజయాలతో.. కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇది.. పరిషత్ ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక.. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులు.. ఇప్పుడు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో.. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన వారు కూడా.. కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇది.. జిల్లా, మండల పరిషత్ పీఠాలను కైవలం చేసుకునేందుకు.. కాంగ్రెస్‌కు రూట్ క్లియర్ చేస్తుంది. ఈ గెలుపుతో.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి.. ప్రజలు తమవైపే ఉన్నారనే బలమైన నమ్మకాన్నిచ్చింది. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందనే విమర్శలకు.. పల్లె జనం బ్యాలెట్ బాక్సుల ద్వారా.. స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. ఇదే ఊపుని కొనసాగిస్తే.. రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ.. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలుంటాయ్.

తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. కానీ.. కొన్ని చోట్ల మాత్రం ఊహించని ఫలితాలు వచ్చాయ్. ఎమ్మెల్యేల సొంత ఊళ్లలోనే.. కాంగ్రెస్ మద్దతుదారులు ఓటమిపాలయ్యారు. పాలకుర్తి లాంటి చోట్ల.. రెబల్స్ భారీగా విజయం సాధించారు. ఇలాంటి సీన్లు చూశాక.. కాంగ్రెస్‌లో కొందరు నేతలు కచ్చితంగా తీరు మార్చుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఎందుకంటే.. ఈ తరహా పరిస్థితులకు ఇప్పుడే చెక్ పెట్టకపోతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. సర్పంచ్ ఎన్నికల నుంచి కొందరు కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాల్సిన పాఠమేంటి? గెలుపు తమతోనే ఉండాలంటే చేయాల్సిన పనులేంటి?

పాలకుర్తిలో ఎక్కువగా విజయం సాధించిన రెబల్స్
పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంతటి విజయోత్సాహాన్ని ఇచ్చాయో.. అదే సమయంలో కొన్ని హెచ్చరికలను కూడా పంపాయ్. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ.. ఒకరిద్దరు ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే.. ఎదురుదెబ్బలు తగలడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. పాలకుర్తి లాంటి నియోజకవర్గాల్లో.. కాంగ్రెస్ నుంచి రెబల్స్ ఎక్కువగా విజయం సాధించడం.. హాట్ టాపిక్‌గా మారింది. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ సొంత గ్రామం వీర్లపల్లిలో.. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డి గూడలోనూ.. బీజేపీకి బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఇంకొందరు నేతల ఇలాఖాల్లోనూ.. ఇతర పార్టీలకు చెందిన వారు గెలుపొందడం కాంగ్రెస్ శ్రేణులను నిరాశకు గురిచేసింది. అందువల్ల.. క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాల్సిన పాఠాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు చాలానే ఉన్నాయ్. ఎందుకంటే.. సొంత ఇలాకాలోనే పట్టు తప్పితే.. దాని ఎఫెక్ట్ భవిష్యత్తులో మామూలుగా ఉండదు. అది కొట్టే దెబ్బ నుంచి కోలుకోవడం కష్టమవుతుంది. ప్రత్యర్థులకు చేజేతులా ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది.

ఎమ్మెల్యే నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి సంకేతం..
ఏ పార్టీ ఎమ్మెల్యేలకైనా.. సొంత ఊరు అనేది.. బలమైన కోట లాంటిది. అక్కడే.. ఓటమి ఎదురైందంటే.. అది కేవలం సర్పంచ్ అబ్యర్థి ఓటమి కాదు. ఆ ఎమ్మెల్యే నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి సంకేతం. పాలకుర్తి లాంటి నియోజకవర్గంలో.. అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు కాకుండా .. రెబల్స్ గెలవడమంటే.. పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని అర్థం. టికెట్ ఆశించిన వారికి నచ్చజెప్పడంలో గానీ, సరైన అభ్యర్థిని బరిలోకి దించడంలో గానీ.. నేతలు విఫలమయ్యారు. పాలకుర్తి కాంగ్రెస్ మహిళా నేత ఝాన్సీ రెడ్డి.. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నాయకులకు కాకుండా.. తనకు నచ్చినవారికి, తన వర్గం వారిని సర్పంచ్ ఎన్నికల్లో ప్రోత్సహించారు. దాంతో.. ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న నేతలు.. రెబల్స్‌ని బరిలోకి దించారు. దాంతో.. ఫలితాలు తారుమారు అయ్యాయ్. ఇప్పుడు గెలిచినవారు.. తమకు సమయం వచ్చినప్పుడు.. ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో సహకరించకుండా పక్కకు తప్పుకునే వీలుంటుంది. అందువల్ల.. స్థానిక ఎన్నికల్లో.. అన్నీ లెక్కలు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. ఈ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు గట్టిగా తగులుతుంది. ఎమ్మెల్యేలు కూడా సొంత గ్రామాల్లో అభివృద్ధి పనులు కేవలం కాగితాల మీద కాకుండా.. జనం కళ్ల ముందు కనబడేలా చేయాలి. స్థానిక ప్రజలతో నిత్యం టచ్‌లో ఉండాలి. మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని కల్పించాలి. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం వల్ల.. చివరికి అది పార్టీకే నష్టం చేకూరుస్తుంది. అందువల్ల.. ఎన్నికలకు ముందే అసమ్మతి నేతలతో మాట్లాడి.. వారిని బుజ్జగించాలి. పార్టీ క్రమశిక్షణను కచ్చితంగా అమలు చేయాలి.

పార్టీల గుర్తుల మీదే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ఇప్పుడైతే.. సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయ్. వీటికి.. పార్టీల గుర్తులతో సంబంధం ఉండదు కాబట్టి.. ఎవరు గెలిచినా.. తర్వాత వారిని తమ దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే.. రాబోయేవి పరిషత్ ఎన్నికలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. పార్టీల గుర్తుల మీద జరుగుతాయ్. కాబట్టి.. కాంగ్రెస్ నాయకులు.. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయొద్దనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎమ్మెల్యేల గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు సరైన గుర్తింపు లేకపోతే.. వారు రెబల్స్‌గా మారతారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకపోతే.. వారు ఎన్నికల సమయంలో సైలెంట్‌గా ఉండిపోవడం గానీ, ప్రత్యర్థులకు మద్దతివ్వడం గానీ చేస్తారు. దాంతో.. జరిగే నష్టం ఒక్కోసారి ఊహకు కూడా అందదు. కష్టపడే కార్యకర్తలకు.. పదవులు, నామినేటెడ్ పోస్టులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన మద్దతు, సహకారం అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.

Also Read: దారుణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త..!

రాష్ట్రంలో కొన్ని చోట్ల.. అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఏ అభ్యర్థిని పెట్టినా గెలుస్తామనే ధీమా కూడా దెబ్బతీసింది. ప్రజలు ఇప్పుడు పార్టీతో పాటు పోటీ చేసే అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, లోకల్‌గా వారికున్న ఇమేజ్‌ను కూడా చూస్తున్నారు. అన్నిసార్లు.. పార్టీ గుర్తు, మద్దతు మాత్రమే గెలిపించవు. అభ్యర్థి పర్సనల్ ఇమేజ్ కూడా ముఖ్యమే. అందువల్ల.. రాబోయే పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసే ముందు ప్రజాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారెంటీ హామీలు, రైతు రుణమాఫీ లాంటి పథకాలు.. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించాలి. పథకాలు అందుతున్నా.. అందులో వివక్ష, పక్షపాతం ఉందని ప్రజలు భావిస్తే.. అది ఓట్ల రూపంలో వ్యతిరేకతగా మారుతుంది. అందువల్ల.. పార్టీ, వర్గం, గ్రూపు అనేవేవీ చూడకుండా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ.. పథకాలు అందేలా చేస్తే.. ప్రభుత్వంపై జనంలో సానుకూలత పెరుగుతుంది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో అక్కడక్కడా జరిగిన పొరపాట్లు.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఓ వేకప్ కాల్ లాంటిది. ఇప్పుడు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకపోతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి.. చిన్న, చిన్న అసంతృప్తులు.. పెద్ద తుపానుగా మారే అవకాశం ఉంది. నాయకులు.. ఇప్పుడైనా తమ పనితీరు మార్చుకొని ప్రజల్లోకి వెళితే.. మరోసారి విజయం వరిస్తుందనే విశ్లేషణలు.

Story By Anup, Bigtv

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×