BigTV English

IND Vs Pak War: భారత్ బాంబులు ఫర్ సెల్..

IND Vs Pak War: భారత్ బాంబులు ఫర్ సెల్..

IND Vs Pak War: మన ఆయుధాలు కూడా సూపర్ డూపర్ హిట్ అని తేలిందా? నాలుగు రోజుల యుద్ధంలో మన ఆయుధాలు సైతం నాణ్యమైనవని తెలిసాయా? భారత్ బాంబ్స్ సైతం భారీగానే పేలుతాయన్న పేరొచ్చిందా? బ్రహ్మోస్ బ్రహ్మాండమనీ,నాగాస్త్రాలూ నాణ్యమైనవనీ ఈ ప్రపంచానికి తెలిసి వచ్చిందా? ఈ లెక్కన మనం కూడా వెపన్ మార్కెట్లోకి అడుగు పెట్టినట్టేనా? ఆపరేషన్ సిందూర్ లో మన ఆయుధాలు సాధించిన విజయాలు ఎలాంటివి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..


నాగాస్త్రమూ నాణ్యమైనదన్న టాక్

ఇప్పటి వరకూ పరీక్షలు మాత్రమే చేశాం. అంతమాత్రం దానికే ఆహా ఓహో అనుకునేవాళ్లం. మొన్న నాలుగు రోజుల యుద్ధంలో.. భారత్ బాంబ్స్ భారీగా పేలాయ్. బ్రహ్మోస్ బ్రహ్మాండమని తేలగా.. నాగాస్త్రమూ నాణ్యమైనదే అన్న మాట వినిపించింది. ఓవరాల్ గా మన స్వదేశీ ఆయుధాలు సూపర్ డూపర్ హిట్ అన్న టాక్ సైతం స్ప్రెడ్ అయ్యింది.


ఆకాష్ , యాంటీ డ్రోన్ డీ 4 సిస్టమ్.. సూపర్

ఆపరేషన్ సిందూర్ భారత సైనిక శక్తి, స్వదేశీ ఆయుధ యుక్తిని అమాంతం లైమ్ లైట్లోకి తెచ్చింది. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, యాంటీ డ్రోన్ డీ 4 సిస్టమ్ సమర్ధవంతంగా పని చేసినట్టు రుజువైంది. నాగాస్త్ర వన్, స్కై స్ట్రైకర్లను సైతం ఉపయోగించారు. ఇవీ హిట్ అనిపించుకున్నాయ్. ఇక బ్రహ్మోస్ క్షిపణుల వల్ల పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరవలసి వచ్చిందంటే వీటి కెపాసిటీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. దీంతో రక్షణ రంగంలో ఎగుమతులు పెరిగినట్టు తెలుస్తోంది. అనేక దేశాలు ఇండియన్ మేడ్ వెపన్స్ పట్ల ఆసక్తి చూపుతున్నాయి.

రష్యన్, ఫ్రెంచ్, ఇజ్రాయెల్‌తో పాటు స్వదేశీ సైతం పర్ఫెక్ట్

పాకిస్థాన్ స్పాన్సర్డ్ పహెల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా.. భారత్ ఆయుధ బలం అమితంగా గల దేశం. ఈ దేశానికున్న ఆయుధ సంపత్తి అత్యంత ప్రమాదకరం అన్న మాట కూడా వెలుగులోకి వచ్చింది. ఇటు రష్యన్, అటు ఫ్రెంచ్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో పాటు స్వదేశీ పరిజ్ఞానం సైతం పర్ఫెక్ట్ అని తేలింది. అంతేనా మన ఆర్మీ హార్డ్ వేర్ సిస్టమ్ కూడా అదుర్స్ అన్న ప్రశంసలందుతున్నాయ్.

4 రోజుల యుద్ధంలో మన ఆయుధ పటిమ వెలుుగులోకి

ఇప్పటి వరకూ భారత్ దగ్గర ఆ ఆయుధాలున్నాయి. ఈ ఆయుధాలున్నాయని వార్తల రూపంలో మాత్రమే తెలిసేది. అప్పుడప్పుడూ వాటి పరీక్షల సమయంలో మాత్రమే బయట ప్రపంచానికి తెలిసేది. అదే ఇప్పుడు నాలుగు రోజుల యుద్ధంలో అవేంటో వాటి వాటి శక్తియుక్తులేంటో స్పష్టంగా తెలియ వచ్చింది. మన ఆయుధ కర్మాగారం విలువ ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది.

ఇన్నాళ్లూ ఇంపొర్టెడ్ కంట్రీ.. ఇప్పుడు ఎక్స్ పోర్టర్..

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ తయారీ రంగాన్ని కూడా స్వదేశీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఓన్లీ ఇంపోర్టెడ్ గా మాత్రమే ఉన్న మన భారత రక్షణ రంగం ఎక్స్ పోర్టర్ గానూ ఆవిర్భవించింది.

2024లో మన రక్షణ రంగ ఎగుమతులు రూ.23వేల కోట్ల

2024లో మన రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. వీటి విలువ 23వేల కోట్ల రూపాయలు. ఇది 2023 నాటికంటే.. 12 శాతం పైగా వృద్ధి రేటు నమోదు చేసింది.

మేడిన్ ఇండియా వెపన్స్ కోసం ఎగబడుతున్న దేశాలు

మన స్వదేశీ ఆయుధాల ప్రత్యేకతే వేరు. మనం స్పేస్ లో కూడా అంతే. ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ మొత్తంలో రాకెట్లను వదలగలం. ఇది కూడా అంతే.. చిన్న చిన్న దేశాలకు ఆయుధాలు సమకూర్చుకోవాలంటే ఆ ఖర్చు భరించడం కష్టం. ఒక రాఫెల్ డీల్ విలువ యాభై వేల కోట్లకు పైమాట. ఇక రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్లు కావాలంటే ముప్పై వేల కోట్లకు పైగా వెచ్చించాలి. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం అందరి వల్లా అయ్యే పని కాదు. అలాగని పాకిస్థాన్ కి చైనా ఇచ్చినంత ఉచితంగా ఎవరూ ఇవ్వరు. ఈ క్రమంలో చూస్తే.. చోటా మోటా దేశాలకు ఆయుధాల కొనుగోలు అన్నది అతి పెద్ద వ్యవహారం. అదే మన భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు అత్యంత చవక కూడా కావడం వల్ల పలు దేశాలు మేడిన్ ఇండియా వెపన్స్ కోసం ఎగబడుతున్నాయి. ఈ ఆపరేషన్ సిందూర్ లో వాటి టెస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అని తేలడంతో.. భారత్ వెపన్స్ మార్కెట్లోకి భారీగానే అడుగు పెట్టినట్టయ్యింది.

ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం 1980

పాక్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడంలో మన ఆకాశ్ పని తీరు అద్భుతం అన్న పేరొచ్చింది. ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించి క్షిపణి రక్షణ వ్యవస్థ దాని సామర్ధ్యమేంటో తెలియ చెప్పింది. మే 8, 9వ తేదీల రాత్రి సమయాల్లో జమ్మూ కాశ్మీర్ లోని పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ చొరబాట్లను భారత్ విజయవంతంగా తిప్పి కొట్టింది. ఈ కౌంటర్ అటాక్స్ లో మేడిన్ ఇండియా ఆకాశ్ కీ రోల్ ప్లే చేసిందని చెప్పారు మన రక్షణాధికారులు.

DRDO, BEL, BDL సహాయ సహకారాలతో.. నిర్మితం

ఇక మన క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం.. స్వయంసమృద్ధి సాధించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రొగ్రాం ఇప్పటిది కాదు. ఇది 1980ల నాటిది. అగ్ని, పృథ్వి వంటి ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులతో పాటు ఆకాశ్ అనే ఈ మధ్యశ్రేణి క్షిపణులను ఉపరి తలం నుంచి గగనతలానికి ప్రయోగించేలా అభివృద్ధి చేశారు. డీఆర్డీవో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహాయ సహకారాలతో ఈ వ్యవస్థ నానాటికీ అభివృద్ధి చెంది.. ఈనాడు విజయవంతమైనదిగా పేరు సాధించింది.

ఒకే సారి అనేక ప్రమాదాలను ఎదుర్కునే ఆకాశ్

ఆకాశ్ ఏం చేయగలదని చూస్తే.. శతృ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్ల నుంచి ఏర్పడే విపత్తులను ఢీ కొట్టగలదు. మన ఆస్తులను పరిరక్షించగలదు. ఇది ఒకే సారి అనేక ప్రమాదాలను ఎదుర్కోగలదు. దీని రియల్ టైమ్ మల్టీ సెన్సార్ డాటా ప్రాసెసింగ్ ఎంత షార్ప్ అంటే.. ఏ దిశ నుంచి వచ్చే ముప్పునైనా సరే ఇట్టే పసిగట్టగలదు. ఇది నాలుగున్నర కిలోమీటర్ల నుంచి పాతిక కిలోమీటర్ల పరిధి వరకూ వైమానిక ముప్పు ఎదుర్కోగలదు.

2021లో భారత్ ఆకాశ్ వ్యవస్థను తన మిత్ర దేశాలకు ఎగుమతి చేయడానికి ఆమోదం తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలోని అనేక దేశాలు ఆకాష్ పట్ల ఆసక్తి కనబరిచాయి. ఈ వ్యవస్థ తక్కువ ఖర్చు ఈ దేశాలను ఆకర్షిస్తోంది. అంతే కాదు భిన్న భారతీయ భూభాగాల్లో నిరూపితమైన దీని సామర్ధ్యం కూడా కొన్ని దేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాశ్చాత్య దేశాల ధరలతో పోలిస్తే ఇది ఎంతో తక్కువ కావడం. తమ వాయు రక్షణ కోసం చూస్తున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

2022 రూ. 6 వేల కోట్లు ఆర్మేనియా.. ఆకాశ్ డీల్

2022లో ఆర్మేనియా దేశం సుమారు 6 వేల కోట్ల రూపాయల విలువైన 15 ఆకాశ్ క్షిపణులకు ఆర్డర్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాచ్ ని గత నవంబర్ లో డెలివరీ ఇచ్చారు. ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, వియత్నాం, బ్రెజిల్ సైతం వీటిపై ఇంట్రస్ట్ చూపించాయి. ఇది మన భారత స్వదేశీ ఆయుధ రంగ మార్కెట్ విస్తరణకొక మచ్చు తునక.

ఆపరేషన్ సిందూర్.. దేశీయ పరిజ్ఞానాన్ని బయట దేశాలకు తెలిసేలా చేసింది. ఇదీ మన రక్షణ రంగ నిపుణుల మాట. ఈ యుద్ధంలో అనేక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించామంటారు వీరు. ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు.. ఇదొక ఆత్మ నిర్భర్ ఆధారిత యుద్ధంగా అభివర్ణిస్తారు మన రక్షణ రంగ నిపుణులు. అటు నుంచి ఎన్ని డ్రోన్లు వచ్చినా ఇటు నుంచి యాంటీ డ్రోన్లతో మనం విరుచుకుపడగలం. ఇలాంటి ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు ఇతర రక్షణ రంగ నైపుణ్యాలు మన సొంతమంటున్నారు వీరు. ఆ డీటైల్స్ ఏంటో చూద్దాం..

పాక్ సైన్యంతో ఆడుకున్న యాంటీ డ్రోన్

ఇండోనేసియా సైతం బ్రహ్మోస్ పట్ల ఇంట్రస్ట్ప్రస్తుతం భారత్ స్వదేశీ పరిజ్ఞానంలో గొప్పగా పని చేసిన వ్యవస్థల్లో యాంటీ డ్రోన్ D- 4 వ్యవస్థ కూడా ఒకటి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇది పాకిస్థాన్ సైన్యం తో ఆటాడుకుంది. పాక్ టర్కిష్ డ్రోన్ల దాడిని విజయవంతంగా తిప్పి కొట్టింది.

DRDO అభివృద్ధి చేసిన BEL తయారీ

డీఆర్డీవో ద్వారా డెవలప్ అయిన ఇది.. బీఈఎల్ ద్వారా తయారు చేసినది. డ్రోన్- డిటెక్ట్- డిటర్- డెస్ట్రాయ్ అనే నాలుగంచల వ్యవస్థగా ఇది పని చేస్తుంది. ఎగిరే డ్రోన్లను రియల్ టైమ్ సెర్చ్, డిటెక్షన్, ట్రాకింగ్, న్యూట్రలైజేషన్ చేయగల సమర్ధత దీని సొంతం. అంతే కాదు మన వైపునకు దూసుకొచ్చే ఆ ప్రమాదకరమైన వస్తువు ఏది? అని గుర్తించడం మాత్రమే కాదు.. దాని జామింగ్ ఫంక్షన్లను తప్పుదారి పట్టించగలదీ వ్యవస్థ. ఇందులో జీపీఎస్ స్పూఫింగ్, రేడియ ఫ్రీక్వెన్సీ వంటి సదుపాయాలున్నాయి. ఇది కీ కాంప్ ని సైతం కరిగించే లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలను సైతం కాల్చగలదు.

స్వదేశి ఆత్మాహూతి డ్రోన్ నాగాస్త్ర-1

గతేడాది జూన్ లో భారత సైన్యం దేశంలోనే తొలి స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్ర- 1ని ప్రేవేశపెట్టింది. నాగ్ పూర్ కి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ఈ నాగాస్త్ర- 1 ఖచ్చితత్వంతో కూడిన సిస్టమ్. శతృవును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించగలదు. మాన్ పోర్టబుల్ వెపనైజ్డ్ డ్రోన్ సిస్టమ్ ఇది. ఇది ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రి లేదా ఆత్మాహుతి దాడులు చేయగల డ్రోన్లను ఒకేసారి ఉపయోగించగల ఆయుధం. ఇవి లక్ష్యాలపైకి దూసుకెళ్లి ఢీ కొట్టినపుడు పేలిపోతాయి. లక్ష్యం పైన తిరుగుతూ.. దాడి చేయడానికి సరైన సమయం కోసమూ వేచి చూడగలవు. టార్గెట్ ని పర్ఫెక్ట్ గా డిటెక్ట్ చేసే వరకూ ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉండగలవు. లక్ష్య చేధన చేసిన వెంటనే.. వాటిపైకి దూసుకెళ్లగలవు.

2 మీటర్ల లోపు ఖచ్చితత్వ ప్రదర్శన

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వాడిన నాగాస్త్ర- 1 అత్యంత కీలకం.. ఈ డ్రోన్ ఖచ్చితమైన దాడుల కోసం జీపీస్ బేస్డ్ టార్గెట్లతో కూడిన కామికేజ్ మోడ్ ని కలిగి ఉంటాయి. ఇది రెండు మీటర్లలోపు తన ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇక స్కై స్ట్రైకర్ అనేది ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్ తయారు చేసిన మరో మొబైల్ వెహికల్. స్కై స్ట్రైకర్ డ్రోన్లను.. వెస్ట్ బెంగళూరులోని ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో తయారు చేశారు. ఈ ప్రొడక్ట్ బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ కి సంబంధించినది. ఇజ్రాయెల్ కి చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్.. జాయింట్ వెంచర్లో ఒక భాగం. స్కైస్ట్రైకర్ ఇటు మానవ రహిత విమాన వ్యవస్థగా పని చేస్తూనే క్షిపణిలాగా కూడా పని చేస్తుంది. నిశ్శబ్ధ, అదృశ్య, ఆశ్చర్యకరమైన దాడిగా దీన్ని అభివర్ణిస్తారు. మోడ్రన్ వార్ ఫేర్ లో ఇది అత్యంత కీలకం.

బ్రహ్మోస్ సామర్థ్యం అనితర సాధ్యం

మే పదిన భారత వైమానిక దళం పాకిస్థాన్ స్థావరాలపై చేసిన దాడుల్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి సామర్ధ్యం అనితర సాధ్యం. యుద్ధాల్లో దీని తొలి ప్రయోగం జరిగింది ఆపరేషన్ సిందూర్ లోనే. పాకిస్థాన్ లోతట్టు ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్ వైమానిక ప్రయోగం.. అత్యంత కీలకంగా భావిస్తున్నారు అణ్వాయుధ కమాండ్ కి అత్యంత దగ్గరగా వెళ్లగలిగిందీ బ్రహ్మాస్త్రం. అక్కడ బ్రహ్మోస్ దాడులు చేయడం వల్లే ఈ యుద్ధం ఆగింది. అందుకే పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరాల్సి వచ్చింది. దీంతో బ్రహ్మోస్ బ్రహ్మాండం అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు యుద్ధ రంగ నిపుణులు.

వేగం, ఖచ్చితత్వం, బహుముఖ ప్రజ్ఞ బ్రహ్మోస్ సొంతం

బ్రహ్మోస్ భారత్ అత్యంత అధునాతన ఆయుధాలలో ఒకటి. దీన్ని మన భారత్ కి చెందిన డీఆర్డీవో.. రష్యా ఎన్పీవో తో కలసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు. వేగం, ఖచ్చితత్వం, బహుముఖ ప్రజ్ఞ మిళితం చేసిన ఆయుధ పరిజ్ఞానంగా వాసికెక్కింది బ్రహ్మోస్. బ్రహ్మోస్ వేగం మాక్ 2. 8 నుంచి 3. 0 వరకూ ఉంటుంది. ఇది ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ. దీని వేగం శతృవుల గుండెలదిరేలా చేస్తుంది. అంతే కాదు వాయు రక్షణ వ్యవస్థలపై చొచ్చుకుపోతుంది. ఇది ఒక మీటర్ పరిధిలో పర్ఫెక్ట్ గా టార్గెట్ రీచ్ అవుతుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ శౌర్యం స్పష్టమైంది. ఒక వేళ బ్రహ్మోస్ డోస్ సరిపోక పోతే.. పాకిస్థానీయులనే అడగాలంటారు నిపుణులు. కారణమేంటంటే దీని వాడి వేడి రుచి చూసింది వారే కాబట్టి అంటూ చలోక్తులు విసిరారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.

2022లో 375 డాలర్ల ఒప్పందంపై ఫిలిప్పీన్స్ సంతకం

బ్రహ్మాస్త్ర శబ్ధాన్ని కలిగిన బ్రహ్మోస్ క్షిపణులు భారత రక్షణ రంగ ఎగమతుల్లో టాప్ రేంజ్. గత నెలలో బ్రహ్మోస్ రెండో బ్యాచ్ ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేశారు. 2022లో బ్రహ్మోస్ కొనుగోలు చేయడానికి ఫిలిప్పీన్స్ ఏకంగా 375 మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. బ్రహ్మోస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండోనేసియా సైతం వీటిపట్ల ఇంట్రస్ట్ చూపుతోంది. ఇండోనేసియాతో పాటు ఇతర మధ్య ప్రాచ్య దేశాలు కూడా ఉన్నాయి. ఇవీ.. మన స్వదేశీ సైనిక శక్తి సామర్ధ్యాలకు చెందిన ముఖ్యమైన ఆయుధాల వివరాలు. ఇంకా ఎన్నో ఆయుధాలను అభివృద్ధి చేసే దిశగా భారత్ దూసుకుపోతోంది. ఆయుధ విపణిలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది భారత ఆయుధ సామర్ధ్యం.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×