Tirupati Forest: తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రాయలసీమ వ్యాప్తంగా అటవీ భూములను పెద్ద ఎత్తున వైసీపీ పెద్దలు అక్రమించారన్న ఆరోపణలున్నా… కనీసం వాటి వివరాల్ని కూడా ప్రభుత్వానికి అదించలేదంట. ఇప్పటికి గత ప్రభుత్వ వాసనలతోనే క్షేత్ర స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పై నుంచి అదేశాలు వచ్చిన తర్వాతే వాటి వివరాలు డిప్యూటీ సీఎం పేషీకి అదించరంట. ఎట్టకేలకు డిప్యూటీ సియం తిరుపతి అటవీ శాఖ అధికారుల తీరుపై స్పందించడంతో ఇప్పుడు అధికారుల్లో చలనం వచ్చిందంటున్నారు
ఎఫ్‌ఆర్‌ఒలుగా తన వారిని నియమించుకున్న గత అధికారి
తిరుపతి అటవీశాఖ అధికారులు తాము ఎవ్వరికి బాధ్యులం కాదు… మాదో స్వతంత్ర రాజ్యమనే తీరులో వ్యవహారిస్తున్నారంట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పనిచేసిన అధికారి తన మాట జవదాటని వారిని కీలక పోస్టులలో ఎఫ్అర్ఓలుగా నియమించుకున్నారు. అప్పట్లో సదరు అటవీ శాఖ సిబ్బంది మొత్తం వైసీపీ పెద్దలకు ఊడిగం చేశారన్న ఆరోపణలున్నాయి, ప్రస్తుతం కూడా వారే అక్కడ విధుల్లో ఉండటంతో వైసీపీ వారి పెత్తనమే నడుస్తోందంటున్నారు. కీలకమైన అటవీశాఖ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పరిధిలో ఉన్నప్పటికి తాము లెక్క చేయమన్న రీతిలో వ్యవహారిస్తున్నారంట. తాజాగా జరుగుతున్న పరిణామాలు అదే స్పష్టం చేస్తున్నాయి
అటవీ శాఖ పరిదిలోకి వచ్చే తిరుమలలోని పాపవినాశం
తిరుమలలోని పాపవినాశం అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. వాహానాల టోల్ సైతం అటవీ సిబ్బంది వసూలు చేస్తుంటారు. అదే విధంగా శ్రీవారి మెట్ల మార్గంతో పాటు నడక మార్గంలోని దుకాణాలు సైతం అటవీశాఖ పరిధిలోకే వస్తాయి. గతంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ తన అనుచరులకు పెద్ద ఎత్తున దుకాణాల నిర్వహాణకు అనుమతి ఇచ్చారు. వారిలో కొంత మంది అన్య మతస్తులు కూడా ఉన్నారు. వారు ఏకంగా తమ దేవుని ప్రార్థనలు అక్కడ చేస్తుంటారు. వాటిని సోషియల్ మీడియా మాద్యమాలలో ఉంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయం మీడియా పారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఫలితం కనిపించడం లేదు. దాంతో చివరకు టీటీడీ ఎంటర్ అయి అక్కడున్న అన్య మతస్తులను బయటకు పంపింది. ఇంకా కొంతమంది ఉన్నప్పటికి అటవీ శాఖ సిబ్బంది వారిని కాపాడుతున్నారంట…
పాప వినాశం డ్యాంలో బొట్ల షికారుపై విమర్శలు
పాప వినాశం డ్యాంలో ఉన్నట్లుండి ఓ రోజు బొట్లు షికారు చేశాయి. దానిపై అనేక విమర్శలు వచ్చాయి. బోటింగ్ కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా టూరిస్టు బోట్లు తెప్పించారు. బోటింగ్ ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దాని మీదా అనేక విమర్శలు రావడంతో డ్యాం భద్రత కోసం బోట్ల ద్వారా డ్యాంలో తనిఖీలు నిర్వహించాలని జిల్లా పారెస్ట్ అధికారి అయిన డీఎఫ్ఓ ప్రకటన విడుదల చేయించారు. అయితే ఆయనకు మొహం చెల్లక టీటీడీ ద్వారా ఆ ఉత్తర్వులు జారీ చేయించడం విమర్శల పాలైంది. ఈ బోటింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పై విమర్శలు చేసాయి. మొత్తమ్మీదఓ అధికారి అత్యుత్సాహం ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టినట్లైంది.
దివ్యారామాన్ని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు
తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ముఖ్యంగా తిరుపతిలోని దివ్యా రామం అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అలిపిరి పాదాల చెంత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 1985లో ఈ ప్రాంతంలో దివ్యా రామం ఏర్పాటు చేయించారు. అక్కడ స్థానికులతో పాటు భక్తులు విశ్రాంతి తీసుకుంటారనే ఉద్దేశంతో అప్పట్లో దాన్ని ఏర్పాటు చేసారు. 2015లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు దివ్యా రామాన్ని మరింత అభివృద్ది చేయించారు. వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుతో పాటు అక్కడున్న ప్రాంతాన్ని డెవలప్ చేయించారు. దీంతో ప్రతిరోజు ఉదయం వేలాది మంది అక్కడ వాకింగ్ చేస్తున్నారు.
దివ్యారామాన్ని కమర్షియల్‌గా చేయడానికి సిద్దమైన ఫారెస్టు అధికారులు
సెలవురోజల్లో కుటుంబసమేతంగా వచ్చి పిల్లలతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వ్యాపారాల కోసం దివ్యారామాన్ని కమర్షియల్ చేయాడానికి సిద్దమయ్యారు పారెస్టు అధికారులు. ఏకంగా వందల సంవత్సరాల నాటి చెట్లను నరికి క్యాపిటేరియా పేరుతో హోటల్ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ హోటల్ ఏర్పాటు చేయడానికి పదుల సంఖ్యలో చెట్లను నరికించారు. దానిపై పర్యావరణ వేత్తలు అగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసారు. అయితే దానిపై తిరుపతి అటవీ శాఖ అధికారులు తలాతోకా లేకుండా గ్రాంథిక బాషలో ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు
ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోని అటవీ శాఖ సిబ్బంది
ఇక తిరుపతి జిల్లాలో ప్రతి రోజు ఏదో ఓక మూల ఏనుగుల దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ముగ్గురు రైతులు ప్రాణాలు కూడా కోల్పాయారు. ఏనుగులు అడవుల నుంచి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అటవీ శాఖాధికారులు కార్యాలయం నుంచి బయటకు రాకపోతుండటం విమర్శలపాలవుతోంది. ఏనుగుల కారణంగా జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి కూడా అధికారులు రావడం లేదంట.
రాయలసీమ వ్యాప్తంగా అటవీ భూముల అక్రమణలు
గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ వ్యాప్తంగా అటవీ భూముల అక్రమణలు పెద్ద ఎత్తున జరిగినట్లు విచారణల్లో బయటపడుతోంది. వాటిపై వేగంగా స్పందించాల్సిన అటవీ శాఖ అధికారులు మాత్రం తీరిగ్గా రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించిన తర్వాత వస్తున్నారంట. పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. అదే విధంగా వైసీపీ పీఏసీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కూడా కడప జిల్లా చింతకొమ్మ దిన్నెలో 60 ఏకరాలు పైగా అక్రమించారని నిర్ధారించారు.
కాశీనాయన క్షేత్రంలోని అన్నదాన సత్రాల కూల్చివేత
రాజంపేట ఎమ్మెల్యే సైతం 36 ఎకరాల అటవీ భూములు అక్రమించారని ప్రచారం జరుగుతోంది. అలాగే కడప జిల్లా బద్వేలులోని కాశీ నాయన మండల అటవీ ప్రాంతంలో కాశీనాయన క్షేత్రంలోని అన్నదాన సత్రాలను టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నాయని కూల్చి వేసారు. అయితే అదే టైగర్ రిజర్వ్ జోన్‌లో ఉన్న షిరిడిసాయి కంపెనీకి కేటాయించిన భూముల విషయంలో ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే విమర్శలు వచ్చాయి.
కేంద్రంతో మాట్లాడి సత్రాలు నిర్మింపచేసిన ప్రభుత్వం
కాశీ నాయన క్షేత్రానికి సంబంధించిన సత్రాలు పడగోట్టడంతో అది పెద్ద వివాదంగా మారింది. దానికి సంబంధించి ప్రతిపక్షాలు, హిందు సంఘాలు రాష్ట ప్రభుత్వంపై అనేక విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి కేంద్రంతో మాట్లాడి చివరకు సొంత ఖర్చులతో సత్రాల నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే షిర్డి సాయి కంపెనీ విషయంలో ఎందుకు అధికారులు ఉదారంగా ఉన్నారనే చర్చ నడుస్తుంది.
Also Read: POKలో హమాస్ ఉగ్రవాదులు.? కాశ్మీర్‌కు తిరిగి కొత్త కళ ఎప్పుడంటే.?
ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సోదరుడపై ఆక్రమణల ఆరోపణలు
అదే విదంగా కాశీ నాయన మండలంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సోదరుడు కూడా పెద్ద ఎత్తున అటవీ, రెవెన్యూ భూములు అక్రమించారని ఆరోపణలు వచ్చాయి. దానిపై రెవెన్యూ శాఖ స్పందించినా అటవీ శాఖ ఏమాత్రం పట్టించుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో చిరుతపులి వేటగాళ్ల ఉచ్చుకు మరణిస్తే చివరకు రైతుల మీద కేసులు పెట్టి అటవీ శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారు
ఎట్టకేలకు స్పందించి విచారణ ఆదేశించిన డిప్యూటీ సీఎం
తిరుపతి జిల్లా అటవీశాఖలో గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు ఇప్పటికీ పనిచేస్తున్నారంట. అందుకే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై అంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంట. ఆ క్రమంలోఅటవీ శాఖ ఎవరి నియంత్రణలో ఉందనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. ఎట్టకేలకు ఈ వ్యవహారాలపై డిప్యూటీ సీఎం స్పందించి విచారణకు అదేశించడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఆలస్యంగా అయినా నష్ట నివారణ చర్యలకు దిగడంపై విమర్శలు గుప్పిస్తూనే.. ఇకనైనా అటవీ అధికారుల్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నగర వన నిర్మాణాల పేరుతో జిల్లా అటవీ శాఖాధికారులు కోట్లాది రూపాయలు స్వాహా చేసారని వాటిపై కూడా విచారణ జరిపించాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఆ వ్యవహారాలపై డిప్యూటీ సీఎం ఎంత సీరియస్‌గా చర్యలు తీసుకొంటారో