AP DSC Candidates: దేవుడు వరమిచ్చినా పూజారి అనుమతి ఇవ్వలేదన్నట్లు ఉంది ఏపీలో డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి. చాన్నాళ్లు తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి. కాకపోతే వారికి కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ఏంటి ఆ సమస్యలు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్లొద్దాం.
డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులకు కష్టాలు తప్పడంలేదు. విద్యార్హతతోపాటు అన్ని సబ్జెక్టుల్లో మార్కులుంటేనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు తీసుకుంటోంది. లేకుంటే రిజెక్టు చేస్తోంది. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పాలో ఆయా అభ్యర్థులకు అంతుబట్టడం లేదు. చివరకు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. దీనిపై అభ్యర్థులు ఫిర్యాదు చేసినా సాంకేతిక లోపాలను మాత్రం సరి చేయలేదని చెబుతున్నారు. అసలేం జరిగింది?
ఇదీ అసలు సమస్య?
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, తెలుగు ఇతర భాషా సబ్జెక్టుల వారికి డిగ్రీ లేదా పీజీని విద్యార్హతగా నిర్ణయించారు అధికారులు. ఆయా అర్హతలకు సంబంధించి జనరల్ కేటగిరికి 50 శాతం ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉండాల్సిందే. ఈ నిబంధనను పెట్టారు అధికారులు. అయితే అభ్యర్థులు వారి విద్యార్హతల దరఖాస్తు నింపుతుంటే అప్లికేషన్ తీసుకోవడం లేదు.
50 శాతం, 45 శాతం అర్హత ఉన్నవారి దరఖాస్తులను మాత్రమే తీసుకుంటోంది. డిగ్రీ అర్హత ఉన్నవారు పీజీ అర్హతను నమోదు చేస్తున్నారు. అందులో పీజీలో 50 శాతం, 45 శాతం మార్కులుంటేనే అనుమతిస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థులు ఇదే సమస్య వెంటాడుతోంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి ఫలితం లేదని అంటున్నారు.
ALSO READ: భక్తులకు తిరుమల షాకింగ్ న్యూస్, రెండునెలలు తప్పదు
పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్-(PGT) పోస్టులకు పీజీలో 50 నుంచి 45 శాతం మార్కులు అర్హత. అలా ఉంటేనే సాఫ్ట్‌వేర్ దరఖాస్తు తీసుకుంటుంది. లేకుంటే రిజెక్టు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్మల్‌గా చెప్పాలంటే పీజీటీ పోస్టులకు విద్యార్హత పొస్టు గ్రాడ్యుయేషన్. డిగ్రీలో కనీస మార్కుల అర్హత ఉంటేనే దరఖాస్తు తీసుకుంటోంది. ఈ సమస్యను అభ్యర్థులు విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారని, అమలు జరగడం లేదని అంటున్నారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రధానంగా డిగ్రీలో 45 శాతం అర్హత మార్కులు డీఎస్సీ దరఖాస్తుకు ఇబ్బందిగా మారింది. 2024 జూన్‌లో నిర్వహించిన టెట్ పరీక్షకు డిగ్రీలో 40 శాతం మార్కులున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులను అనుమతించారు. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే డిగ్రీలో 45 శాతం మార్కులు ఉండాలని నిబంధన విధించారు.
ప్రభుత్వం దృష్టి
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం చేస్తున్నామన్నది అధికారుల మాట. టెట్ నిర్వహణలో సడలింపు ఇచ్చింది. డిగ్రీలో 40 శాతం మార్కులతో బీఈడీ చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులను విద్యాశాఖ అనుమతిస్తోంది. చాలా మంది బీఈడీ పూర్తిచేశారు కూడా. డీఎస్సీకి మాత్రం 45 శాతం నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ 40 శాతం మార్కులతో అభ్యర్థులను అనుమతి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సాచారం. దీనిపై రేపో మాపో ఉత్తర్వులు రానున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.