BigTV English

Telangana BJP: బీజేపీ ప్లాన్ రివర్స్?

Telangana BJP: బీజేపీ ప్లాన్ రివర్స్?

Telangana BJP: తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవడమే టార్గెట్‌గా అడుగులు వేస్తున్న కమలదళం వ్యూహాలు అంతగా వర్కౌట్‌ అవ్వడం లేదా? కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచనలు.. కార్యరూపం దాల్చడంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? అందుకే ఇప్పుడు కాషాయ నేతలు సరికొత్త స్ట్రాటజీతో ప్రజల ముందుకు వస్తున్నారా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో చూద్దాం.


ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఒక ప్రజా ప్రతినిధి

పులిని చూసి ఇంకేదో వాత పెట్టుకున్నట్టు ఉంది ప్రస్తుత బీజేపీ వ్యవహారం.. బీజేపీ భరోసా పేరుతో ప్రజలకు అండగా నిలవాలని.. ప్రజల నుంచి వారి సమస్యలపై ఫిర్యాదులు తీసుకోవడం మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ప్రతి రోజు ఒక ప్రజా ప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించడం ప్రారంభించారు. దీనికి తగ్గట్టుగానే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఉదయo 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పార్టీ కార్యాలయంలో రోజుకొక ప్రజా ప్రతినిధి అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ బీజేపీ తల పెట్టిన ఈ కార్యక్రమంపై ఇప్పుడు అనేక విమర్శలు వస్తున్నాయట.


గాంధీభవన్ వేదికగా ప్రజలకు అందుబాటులో ఓ మంత్రి

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మంత్రులతో ముఖాముఖి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ప్రజా సమస్యలను తీర్చేందుకు వారంలో ఓ మంత్రి గాంధీభవన్ వేదికగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. వీలైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాదు తాజా ప్రజాప్రతినిధులతో పాటు, పార్టీ కీలక ప్రతినిధులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు పూలే భవన్ వేదికగా వారంలో రెండు రోజులు అంటే.. మంగళవారం, శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీపై వస్తున్న విమర్శలు ఏంటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని.. బీజేపీ కాపీ చేస్తోందని విమర్శిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

బీజేపీ భరోసాకు ప్రజలే కరువయ్యారనే చర్చ

అంతేకాదు బీజేపీ భరోసాకు ప్రజలే కరువయ్యారనే చర్చ మొదలైందట. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు బీజేపీ పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కడం లేదనే టాక్ వినిపిస్తోంది. రోజుకొక ప్రతినిధి పార్టీ కార్యాలయానికి చేస్తూ వెళ్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో చెప్పలేని పరిస్థితుల్లో నాయకత్వం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయట. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి రైతులు, కార్మికులు, వివిధ వర్గాల నుంచి వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి అంటూ బుకాయింపులు తప్పితే బీజేపీ చేపట్టిన భరోసాలో ప్రజలు, ప్రజా సమస్యలపై ఫిర్యాదులు లేవనే కామెంట్లు ఇటు పొలిటికల్ సర్కిల్లో.. అటు కాంగ్రెస్ సర్కిల్లో వినిపిస్తున్నాయట.

రియల్ ఎస్టేట్ దందాలకు సంబంధించిన సెటిల్‌మెంట్ అంశాలే ఎక్కువనే చర్చ

బీజేపీ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది రెండు వారాలు గడుస్తోంది. ఇందులో ప్రజా సమస్యలు కాకుండా రియల్ ఎస్టేట్ దందాలకు సంబంధించిన సెటిల్ మెంట్ అంశాలే ఎక్కువగా వస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు గత బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆగడాలు మినహాయిస్తే… ప్రజా పాలనపై బీజేపీ తలపెట్టిన భరోసా కార్యక్రమానికి ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు రాకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. కాంగ్రెస్ పాలనపై పొద్దున లేస్తే దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నేతలకు ప్రజా పాలనపై క్లారిటీ వచ్చిందనే విమర్శలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి.

ముగియనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అంతేకాదు 9 నెలల్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు కూడా ముగియనుండటంతో బీజేపీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత బలం పెంచుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. పార్టీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో వారిని, కార్పొరేటర్లు లేని చోట డివిజన్ స్థాయి నాయకులు కాస్త ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ఆదేశించినట్లు కాషాయ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజల్లో ఉండాలని చూస్తోంది. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 40కి పైగా సీట్లు సాధించిన బీజేపీ, మజ్లిస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ ప్రజలను అకట్టుకునేందుకు జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్నీ స్థానానికి పోటీ చేసి, హైదరాబాద్‌లో ఎంఐఎంను టార్గెట్ చేస్తూ హిందుత్వ ఎజెండాను సమర్ధంగా వినిపించిందని, భవిష్యత్తులో తమకు కావలసిన మైలేజీని పెంచుకుందంటున్నారు.

నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలే మైనస్

తెలంగాణలో సంస్థాగతంగాపార్టీ బలోపేతమే లక్ష్యంగా కాషాయ పార్టీ అడుగులు వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల జోష్‌ను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో అధిష్టాన పెద్దలు ప్రణాళికలకు పదును పెడుతున్నారంట. కానీ రాష్ట్ర నేతల వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుండటంతో అధిష్టానం తలలు పట్టుకుంటుందంటున్నారు. పార్టీలో ఉన్న నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పార్టీ ఎదుగుదలకు మైనస్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. వీటన్నింటిని కవర్ చేస్తూ కొత్త కొత్త కార్యక్రమాలను డిజైన్ చేస్తోంది కమలం పార్టీ. 11 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడంతో పాటు ఈ 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేటాయించిన నిధులు వంటి వివరాలను ప్రజలకు వివరించేందుకు కాషాయ దళం సిద్ధమవుతోంది.

Also ReadL: పులివెందులలో జెండాల గోల.. వివాదంలో పిల్లలు

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, పథకాలపై చర్చలు

వికసిత్ భారత్ లక్ష్యానికి 11 ఏండ్లు అంటూ ప్రజల్లో మమేకం అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు తెలంగాణలో 8 ఎంపీ, 8 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ లను కైవసం చేసుకున్న కాషాయా పార్టీ పూర్తి స్థాయిలో రాబోయే సమరానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. గెలిచిన వారంతా కూడా తమ తమ అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ లకు తీసుకొచ్చిన నిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టిసారిస్తున్నారు. అందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నా నిధులు, సంక్షేమ పథకాలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లి పార్టీకి మైలేజ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ఏమిచ్చాం? ఎంత మేరకు నిధులు కేటాయించామనే వివరాలు వారికి వివరించేలా బీజేపీ ప్రణాళికలు చేపడుతోందనీ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మొత్తానికి ఇటు తెలంగాణలో బీజేపీ భరోసా, అటు 11 ఏళ్ల మోడీ పాలనా భరోసా రాష్ట్ర బీజేపీకి ఏ విధంగా సహకరిస్తాయి అనేది చూడాలి.

story by Vamshi Krishna, Bigtv Live

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×