YSRCP VS TDP: ప్రభుత్వం ఏదైనా.. పార్టీ ఏదైనా.. సభలు, సమావేశాల సయంలో పార్టీ జెండాలు, తోరణాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. కానీ అక్కడ మాత్రం పది రోజులుగా వివాదం ముదురుతూనే ఉంది. మా పార్టీ సమావేశం సందర్బంగా జెండాలు, తోరణాలు సర్కిల్లలో పెట్టుకున్నాం అని ఒక పార్టీ నేతలు అంటుంటే.. మా నేతను అవమాన పరిచేలా కావాలనే చేశారని మరో పార్టీ ఆరోపిస్తోంది. చివరికి వివాదం దాడులు ,కేసుల వరకు చేరింది.. ఇప్పుడు ఏకంగా మైనర్ పిల్లలను వివాదంలోకి చేర్చి వారి అరెస్ట్ కు దారి తీసింది. ఇంతకీ ఏంటా జెండాల గోల? ఏంటా కథ?
రాజకీయాలకు బలైన పలువురు మైనర్లు
పులివెందులలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి రాజకీయాల్లో ఘర్షణలు, వివాదాలు సర్వ సాధారణమే. కానీ ఈసారి పార్టీల మధ్య జరుగుతున్న పంచాయితీలో పలువరు మైనర్ బాలురు.. అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. జెండాల వివాదం ముదిరింది అనడానికి ఈ అరెస్ట్‌లే సాక్ష్యమనే చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది.
జెండాలు, తొరణాల ఏర్పాటుపై వైసీపీ నేతల అభ్యంతరం
మహానాడు సందర్భంగా పులివెందులను పసుపుమయం చేశారు టీడీపీ నేతలు. భారీగా పసుపు తోరణాలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. పులివెందులలోని అన్ని సర్కిల్లలో టీడీపీ జెండాలే కనిపించాయి. అయితే ఇలా జెండాలు, తొరణాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల చుట్టూ కావాలనే జెండాలు చుట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల వీటిని తొలగించిన వైసీపీ నేతలను అడ్డుకున్నారు కూడా. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల అదుపులో పలువురు మైనర్లు
ఇప్పుడీ జెండాల వివాదంలోకి మైనర్లను కూడా లాగారు. మైనర్ పిల్లలతో టీడీపీ జెండాలు, తొరణాలు తొలగించే ప్రయత్నం జరిగింది. అంతేకాదు ఈ జెండాలను తొలగించి.. వాటికి నిప్పు పెట్టారు. వీటిని వీడియోలు తీసిన టీడీపీ నేతలు.. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు పులివెందుల రాజకీయం మరోసారి హీటెక్కింది. తమ పిల్లలను వదిలిపెట్టాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు మైనర్ పిల్లల తల్లిదండ్రులు.
అసలు చిన్నారులను వాడుకొని రాజకీయం ఏంటనే దానిపై చర్చ
పిల్లలకు ఏమీ తెలియదని.. మీ రాజకీయాలకు తమ పిల్లలను బలి చేయవద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. అసలు చిన్నారులను వాడుకొని రాజకీయం ఏంటనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇది కేవలం జెండాల వివాదం మాత్రమే కాదని.. జెండాలు, తోరణాలను కొందరు యువకులు కావాలనే తొలగించారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. అంతేకాదు.. వారిని అడ్డుకున్న టిడిపి కార్యకర్తలపై రాడ్లతో దాడికి దిగారనేది ఆరోపణ. అందుకే పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ వయసులో మీకేందుకు ఇలాంటి పనులు అని పోలీసులు ప్రశ్నిస్తే.. ఎవరో మద్యం తాగించి తమను ఈ పనులు చేయమని చెప్పారట ఆ పిల్లలు.
Also Read: ఆ 600 మంది ఏమంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వం ఏం చేసిందంటే!
ఈ వివాదానికి తెర లేపింది ఎవరు..?
అసలు ఈ వివాదానికి తెర లేపింది ఎవరు..? అనేది ఇప్పుడు తెలాల్సిన ప్రశ్న. తమ పార్టీ సమావేశం సందర్బంగా జెండాలు, తోరణాలు ఏర్పాటు చేసుకుంటే మీ అభ్యంతరం ఏంటీ అనేది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మున్సిపాలిటి అధికారుల అనుమతితోనే ఏర్పాటు చేశామని టీడీపీ చెబుతోంది. అయితే తమ అభిమాన నాయకుడిని కించపరిచేలా ఆయన విగ్రహం చుట్టు ఎందుకు కట్టారనేది వైసీపీ నేతల ప్రశ్న. ఈ అభిమానం హద్దులు దాటి దాడుల చేసుకునే పరిస్థితి రావడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. అయితే ఇక్కడ అమాయక యువకులను వాడుకొని రాజకీయ దాడులకు ప్రరేపించడం ఓ సంచలనమనే చెప్పాలి. అభం శుభం తెలియని పిల్లలు ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితి. మీ రాజకీయాల కోసం తమలాంటి వారి జీవితాలతో ఆడుకోవద్దని చెబుతున్నారు ఆ తల్లిదండ్రులు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Story By Vamshi Krishna, Bigtv Live