BigTV English

Drone Missile Power Revealed: ఎంటర్ ద డ్రోన్ మిస్సైల్.. స్పెషాల్టీ ఏంటి?

Drone Missile Power Revealed: ఎంటర్ ద డ్రోన్ మిస్సైల్.. స్పెషాల్టీ ఏంటి?

Drone Missile Power Revealed: భారత్ ఇప్పటి వరకూ స్వదేశీ పరిజ్ఞనంతో తయారు చేసిన ఆయుధాలేంటి? వాటి వాటి పనితీరు ఎలాంటిది? భారత్ కి సొంత ఆయుధ సామర్ధ్యం ఎందుకంత అవసరం? మనం ఇప్పటి వరకూ ఎక్కువ శాతం ఆయుధాలను ఎలా సమకూర్చుకుంటున్నాం. రక్షణ రంగంలో భారీగా ఖర్చు చేసే దేశాల్లో ఒకటిగా నిలుస్తోన్న భారత్.. ఈ రంగం నుంచి వచ్చే ఆదాయం ఏ స్థానంలో ఉంది? ఆ వివరాలేంటి?


భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు..

భారత్ తన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు ఏంటని చూస్తే అర్జున్ ట్యాంక్, తేజస్ యుద్ధ విమానం, అస్త్ర క్షిపణి, బ్రహ్మోస్, పృధ్వి, అగ్ని, నాగాస్త్ర, విక్రమ్-I. వీటితో పాటు మరికొన్ని స్వదేశీ ఆయుధాలు కూడా ఉన్నాయి. వీటిలో.. ఘటక్ UCAV, NASM-SR క్షిపణి, మాన్-పోర్టబుల్ ట్యాంక్-యాంటీ గైడెడ్ మిస్సైల్, HAL క్యాట్స్ .. ఇవే కాకుండా, ఇతర ఆయుధాలు, విడిభాగాలను కూడా భారత రక్షణ రంగ సంస్థ, దాని అనుబంధ సంస్థలు.. తయారీతో పాటు అభివృద్ధి సైతం చేస్తున్నాయి. ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా.. స్వదేశీ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి.


మారిన యుద్ధ రీతుల్లో డ్రోన్, యాంటీ మిస్సైల్ సిస్టమ్ కీలకం

దీనంతటికీ కారణమేంటంటే ప్రపంచ ఆయుధాల తీరుతెన్నులు మారిపోతున్నాయి. యుద్ధాలు కూడా కొత్త పద్ధతుల్లోకి రూపాంతరం చెందుతున్నాయి. వీటిలో డ్రోన్, యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ కీలకంగా మారుతున్నాయి. వీటిని బయటి నుంచి ఇంపోర్ట్ చేయడం కన్నా సొంతంగా తయారు చేసుకోవడమే మంచిదంటారు డిఫెన్స్ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ అనిల్ చౌహాన్ వంటి వారు. కారణమేంటంటే.. వాటిని కొని తెచ్చుకోవడం వేరు, వాడ్డం వేరు. మనమే తయారు చేసుకుంటే వాటి వాడకం కూడా ఇట్టే తెలిసి ఉంటుంది కాబట్టి ఇదే సేఫ్. గత ఆపరేషన్ సిందూర్ లో ఇదే నిరూపితమైందని అంటారు. అందుకే భారత్ తన సొంత ఆయుధ తయారీపై దృష్టి సారించింది.

రక్షణ వ్యయంలో యూఎస్, చైనా, రష్యా తర్వాత భారతే

ఇప్పటికే ఆయుధ స్వయం సమృద్ధి సాధించింది చైనా. తనకున్న ఆయుధ సామర్ధ్యాన్ని భారత వ్యతిరేక దేశాలకు వీలైనంతగా సరఫరా చేసేందుకు సిద్ధ పడ్డ విషయం చూస్తేనే ఉన్నాం. అయితే స్వశక్తితో ఆయుధ సామర్ధ్యం చేసుకోగలిగితే.. ఇటు ఖర్చుకు ఖర్చు అటు ఆత్మరక్షణలో భారత్ ఆరితేరి పోవడం ఖాయంగా తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాలేవని చూస్తే అమెరికా, చైనా, రష్యాలే. ఆ తరవాతి స్థానంలో భారత్‌ నిలుస్తోంది. ఇప్పటీకీ అధిక శాతం ఆయుధాలు విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 36శాతం రష్యా నుంచి, 33శాతం ఫ్రాన్స్, 18శాతం ఇజ్రాయెల్, మరో 13శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది భారత్. దేశ రక్షణ బడ్జెట్‌ ఏయేటికా ఏడు పెరుగుతున్నా- అందులో అధిక భాగం జీతభత్యాలు, పింఛన్లకే సరిపోతోంది. ఇక నిర్వహణ వ్యయం ఉండనే ఉంది. చివరికి ఆయుధ ఉత్పత్తి, కొనుగోళ్లకు మిగిలేది కొంచమే. 2013-14లో రూ.2.53లక్షల కోట్లుగా ఉన్న మన రక్షణ బడ్జెట్‌.. 2025-26లో రూ.6.8లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఆయుధాల సేకరణకు కేటాయించింది కేవలం రూ.1.7లక్షల కోట్లని తెలుస్తోంది.

దేశంలో ఆయుధ ఉత్పత్తి చేస్తోన్న 16 రక్షణ రంగ సంస్థలు

దేశంలో 16 ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు ఆయుధోత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడు 430 లైసెన్సుడు కంపెనీలు, 16వేల ఎంఎస్‌ఎంఈలు ఆయుధాలతో పాటు విడిభాగాలను సైతం తయారు చేస్తున్నాయి. 2023-24 చివరి నాటికి, దేశీయ రక్షణోత్పత్తి విలువ.. రూ.1.27లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది పాకిస్థాన్‌ యుద్ధం మొదలైనప్పటికి ఈ విలువ రూ.90వేల కోట్లుగా ఉంది. ఇవే కాకుండా 2024-25లో రూ.2.09లక్షల కోట్ల విలువైన 193 రక్షణ కాంట్రాక్టులను ఇచ్చారు. వీటిలో 92శాతం కాంట్రాక్టులను ప్రభుత్వ రంగ షిప్‌యార్డులకు, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కూ అప్పగించారు. మరోవైపు, రక్షణ సాధనాల సేకరణ బోర్డు.. రూ.4.25లక్షల కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. వీటిలో 90శాతం స్వదేశంలోనే జరుగుతాయి. కొత్త రక్షణ ప్రాజెక్టుల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్, తమిళనాడు కారిడార్లకు కేటాయించారు. గుజరాత్‌లోని వడోదరలో టాటా గ్రూపు రక్షణ పరిశ్రమలను ఏర్పాటుచేసింది. కానీ, దేశీయ అవసరాల్లో ఇదెంతో తక్కువగా కనిపిస్తోంది.

ఇప్పటికే సోవియట్ విమానాలే వాడకం

ఇది ఆధునిక యుద్ధ జమానా. అధునాతన ఆయుధాలతోనే ఈ యుద్ధాలు జరిగే అవకాశమెక్కువ. భారత సాయుధ దళాలు వాడుతున్న ఆయుధాల్లో పాతవి తొలగించి, కొత్త వాటిని సమకూర్చడం తప్పనిసరిగా మారింది. వీటికోసం విదేశాలపై ఆధారపడకుండా పరిశోధన-అభివృద్ధికి, ఆయుధ తయారీ కర్మాగారాల స్థాపనకు పెద్దయెత్తున నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తద్వారా భారత సాయుధ బలగాలను అసమాన పోరాటశక్తిగా తీర్చిదిద్దాల్సి ఉంది. గత అయిదేళ్లలో ఇంటర్నేషనల్ వార్ ఫేర్ లో విశేషమైన మార్పులు వచ్చాయి. మన త్రివిధ బలగాలు వాడుతున్న ఆయుధాల్లో చాలా వరకూ పాతబడిపోయాయి. సైనికులు, ఇతరత్రా రవాణాకు మనం ఇప్పటికీ పాత సోవియట్‌ విమానాలనే వాడుతున్నాం. ఆధునిక యుద్ధాల్లో అవి అంత గొప్పగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే పాతవి పాతవే కాబట్టి. ఏ చిన్న రిపేర్లు వచ్చినా వాటి స్పేర్ పార్ట్స్ కోసం రష్యా వైపు చూడక తప్పదు. అందునా ఇలాంటి యుద్ధ విమానాల రిపేర్ అంటే మొన్నటికి మొన్న కేరళలోని బ్రిటన్ F 35 సంగతి చూసే ఉంటాం. యుద్ధ విమానాల మరమ్మత్తులు అతి పెద్ద సవాలుతో కూడుకున్న అంశం.

ఫైటర్ జెట్‌ల కన్నా, చౌకైన డ్రోన్లే మేలంటోన్న నిపుణులు

ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్ల రూపాయలతో కొనే ఫైటర్ జట్లకన్నా చౌక ధరల్లో వచ్చే డ్రోన్ల వినియోగమే ఎక్కువ మేలు కలిగేలా తెలుస్తోంది. యుద్ధంలో ఇలాంటి డ్రోన్లో పడిపోయినా వచ్చే నష్టమేం లేదు. మొన్న పాకిస్థాన్ రాఫెల్ ని కూల్చిన వార్త టెలిగ్రాఫ్ వంటి పత్రికలు పతకాశ శీర్షికలతో రాశాయి. అదే డ్రోన్లు ఒకటికి పది కింద పడ్డా వచ్చే నష్టం లేదు. అలాంటిది వాటి ద్వారా మిస్సైళ్లను కూడా ప్రయోగించడం అంటే ఆ ఖర్చు ఎంతో తక్కువగా ఉంటుంది. కారణం.. డ్రోన్ కి అంత పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఆయుధాల విషయంలో ఇతరులపై ఆధారపడ్డంకన్నా.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకునే ఆయుధాలతో సౌలభ్యం ఎక్కువ. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 2500 ఆయుధాలు, పరికరాలను ఇప్పుడు స్వయంగా మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. మరో 300 పైగా రక్షణ పరికరాలను కూడా స్వదేశీ పరిజ్ఞానం ద్వారా సాధ్యమయ్యేలా చూస్తున్నాం. భారత ప్రభుత్వం 36 వేల ఆయుధ పరికరాలు, విడి భాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేయడానికి ప్రైవేటు పరిశ్రమలను ఆహ్వానించింది. ఆయుధ ఉత్పత్తిలో భారత్ 2032 నాటికల్లా స్వయం సమృద్ధి కావాలన్న టార్గెట్ పెట్టుకుంది. అదే జరిగితే.. దేశ జీడీపీతో పాటు.. ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా పెరుగుతాయంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

ఇప్పటి వరకూ ఒక లెక్క. ఇకపై మరొక లెక్క కానుందా? డ్రోన్లతో మిస్సైళ్లు ప్రయోగించడంతో టోటల్ ఛేంజ్ కానుందా? ఇదొక గేమ్ ఛేంజర్ అవనుందా? అయితే ఈ డ్రోన్ మిస్సైల్ స్పెషాల్టీ ఏంటి? దీని ద్వారా యుద్ధరంగంలో మారనున్న పరిణామ క్రమాలు ఎలాంటివి? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

బ్రహ్మోస్, ఆకాశ్, అగ్ని, పృథ్వి, వంటి ఎన్నో ఆయుధాలు

భారత్ ఆయుధ మార్కెట్ లో అంతకంతకూ ప్రయోగశీలతను పెంచుతూ పోతోంది. ప్రపంచంలోని ఆయుధ సామర్ధ్యం కలిగిన యూఎస్- రష్యా- చైనా- ఫ్రాన్స్- ఇజ్రాయెల్ సరసన భారత్ కూడా చేరిపోతోంది. ఇప్పటికే ఎన్నో స్వదేశీ పరిజ్ఞానానికి సంబంధించి ఆయుధాలను తయారు చేయడం మాత్రమే కాకుండా.. వాటిని ఆపరేషన్ సిందూర్ లో విజయవంతంగా ప్రయోగించింది భారత్. ఈ క్రమంలో మన ఆయుధాలపై వరల్డ్ వైడ్ గా ఒక నమ్మకం ఏర్పడ్డ పరిస్థితులు. వీటిలో బ్రహ్మోస్, ఆకాశ్, అగ్ని, పృథ్వి, వంటి ఎన్నో ఆయుధాలు భారతీయ ఆయుధ సామర్ధ్యాన్ని తెలియ చేశాయి. తాజాగా మరో ప్రయోగం.. భారతీయ అమ్ముల పొదిలోకి వచ్చి చేరనుంది. అదే డ్రోన్ మిస్సైల్.

కర్నూలు జిల్లా- ఓర్వకల్లు మండలం-పాలకొలను

ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో డ్రోన్ ద్వారా మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది డీఆర్డీవో. భారత రక్షణ సామర్ధ్యాన్ని మరింత పెంచే దిశగా.. ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి ULPGM-V3ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించి చూపించారు మన రక్షణ రంగ నిపుణులు. ఈ ప్రయోగానికి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం పాలకొలను దగ్గర్లోని ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X ద్వారా.. తెలియ చేశారు. భారత రక్షణ సామర్ధ్యాలకు మరింత ఊతమిచ్చేలా ఏపీ కర్నూల్లోని NOAR ప్రయోగించిన యూఏవీ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం గర్వకారణంగా పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్. గతంలో ఇక్కడి నుంచే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ సిస్టమ్ ని పరీక్షించింది డీఆర్డీవో.

DRDO, దాని భాగస్వాములకు రక్షణ మంత్రి అభినందనలు

DRDO, దాని భాగస్వాములైన డిఫెన్స్ క్యాపిటల్ ప్రొక్యూర్‌మెంట్ పార్టనర్స్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్, స్టార్టప్‌లకు రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. దేశీయంగా సరికొత్త టెక్నాలజీతో ఆత్మనిర్భర్ భారత్ ద్వారా సత్తా చాటడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం రక్షణ రంగంలో మరో మైలురాయి లాంటిదన్నారు. దేశంలో అత్యాధునిక రక్షణ ఆవిష్కరణలలో స్వదేశీ టెక్నాలజీ పెరుగుతుందని స్పష్టం చేశారు. గత ఆపరేషన్ సిందూర్ లో టర్కీ డ్రోన్లతో భారత్ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కున్న మాట నిజం. అయితే వీటిని మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ తీర్ అనే వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టాయి. దీనికే టర్కీ షాకై పోయింది. వాటి విశ్వసనీయత సైతం దారుణంగా దెబ్బ తినింది. ప్రపంచ డ్రోన్ మార్కెట్లో వీటి స్థాయి సరిపోదని ప్రూవైంది. ఆకాశ్ తీర్ తోనే మనం ఇచ్చిన జర్క్ కి జడుసుకున్న పాక్ దాని వెనక టర్కీ.. ఇపుడీ కొత్త డ్రోన్ మిస్సైల్ ని చూసి మరింత అదిరిపడుతున్నాయి.

మిస్సైల్‌ని మోయగలిగే డ్రోన్, ఆపరేషన్ సిస్టమ్ ఉంటే చాలు

ఇప్పటి వరకూ డ్రోన్ల ద్వారా మిస్సైల్ ప్రయోగం అంటూ జరగలేదు. ఇదొక గేమ్ ఛేంజర్ కానుందని అంటున్నారు. కారణం.. డ్రోన్ల ద్వారా ఒక మిషిన్ గన్ ప్రయోగించడం వేరు. దాని ప్రభావం వేరు. అదే ఒక డ్రోన్ ద్వారా ఒక మిస్సైల్ ప్రయోగించడం అంటే అది ప్రత్యర్ధుల సైనిక స్థావరాలకే అత్యంత ప్రమాదకరంగా మారనుంది. మాములుగా ఇలాంటి మిస్సైళ్లను ప్రయోగించడానికి పెద్ద పెద్ద ఫైటర్ జెట్లను వాడుతుంటారు. వీటికోసం ఆయా దేశాలు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాఫెల్, F35 వంటి ఈ విమానాల విలువ కొన్ని వందల కోట్లలో ఉంటుంది. ఇపుడీ ఖర్చు మొత్తం తగ్గిపోయినట్టు తెలుస్తోంది. జస్ట్ ఒక మిస్సైల్ ని మోయగలిగే డ్రోన్, దానికంటూ ఒక ఆపరేషనల్ సిస్టమ్. ఆపై దాన్ని ప్రయోగించడంతో ఖేల్ ఖతం.

టర్కీ ప్రభావం పెంచేందుకు డ్రోన్ల వాడకం

ఒకప్పుడు టర్కీ ఉక్రెయిన్, లిబియా వంటి దేశాల్లో బైరక్ తార్ టీబీ 2 డ్రోన్లు కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం చేసుకుంది. ఎప్పుడైతే మన ఆకాశ్ తీర్ వాటిని నేలమట్టం చేసిందో.. టర్కీకి దిమ్మ తిరిగి పోయింది. ఇస్లామిస్ట్ విజన్ కు ప్రతీకగా టర్కీ రక్షణ సామర్ధ్యానికి నిదర్శనంగా ఈ డ్రోన్లను అభివర్ణిస్తూ వచ్చింది టర్కీ. ఇపుడా వ్యవస్థ ఎందుకూ పనికిరాదని తేలిపోయింది. ఒక సమయంలో ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా దేశాల్లో టర్కీ ప్రభావం పెంచేందుకు ఒక సాధనంగా వీటిని వాడుకున్నారు. కానీ టర్కీ డ్రోన్లు ఆపరేషన్ సిందూర్ లో కనీసం ఒక్క లక్ష్యాన్ని కూడా చేరుకోలేక పోవడంతో.. ఏం చేయాలో పాలు పోని పరిస్థితి. వీటికే షాకైన టర్కీ, పాక్.. ఈ తాజా ప్రయోగంతో భారత్ ను ఢీ కొట్టడం ఎంత మాత్రం వీలు కాదన్న విషయం తెలిపోయిందని అంటున్నారు నిపుణులు. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ లేజర్ తో డ్రోన్లను ఇతర యుద్ధ విమానాలు కూల్చడమే అతి పెద్ద ప్రయోగమంటే ఇది అంతకన్నా మించి అని అంటున్నారు మన రక్షణ అధికారులు. ఇదొక గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తున్నారు. ఒక వేళ ఈ డ్రోన్ మిస్సైళ్లుగానీ అనుకున్న విధంగా సక్సెస్ అయితే.. భారత్ యుద్ధ రంగంలో ఖర్చు అమాంతం తగ్గించిన దేశంగా పేరు సాధించడం ఖాయమని చెబుతున్నారు.

Also Read: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

భారత్ ఆయుధ ఉత్పత్లిలో అగ్రగామిగా నిలవాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి పెద్ద ఎత్తున నిధులు వెచ్చంచాలి. భారీ ఎత్తున సైనిక పారిశ్రామిక శక్తిని స్వయంగా నిర్మించుకోవాలి. ఇప్పటికే మనం ఎన్నో రంగాల్లో ప్రపంచ అగ్ర దేశాలతో సమానంగా రాణిస్తూ వస్తున్నాం. ఇప్పటికే అంతరిక్షంలో మనం ఇతర దేశాలతో ఢీ అంటే ఢీ అంటున్నాం. సరిగ్గా అలాగే రక్షణ రంగంలోనూ భారత్ సత్తా చాటడం వల్ల.. ఇటు రక్షణ అటు ఉపాధి ఆపై ఆదాయం సైతం సమకూరడం ఖాయం. కొన్ని రకాల ఆయుధాల తయారీలో 74 శాతం విదేశీ పెట్టుబడనులను ఆహ్వానిస్తోంది కేంద్రం. భారత్ లో మ్యాన్ పవర్ తో పాటు ఎన్నో విషయాల్లో ఖర్చు తక్కువ. కాబట్టి ఈ దిశగా మనతో కలసి వచ్చే రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాల ఆయుధ పరిజ్ఞానంతో మరింత ఆయుధాల తయారీకి భారత్ ప్రయత్నించాల్సి ఉందంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

Story By Adinarayana, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×