పవన్ కల్యాణ్‌కు దైవ భక్తి ఎక్కువ. అందులో వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల్లో ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అనే పేరు పెట్టుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన విషయం అందరికి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించినందుకుగాను జూన్ 25 నుంచి వారాహి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం ద్రవాహారమైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకున్నారు.
తాజాగా తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
ఇప్పటికే తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న విషయంపై మంత్రులు, ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో, ఆగమ శాస్త్ర పండితులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో శ్యామలరావు ఇచ్చిన ప్రాథమిక నివేదికను అందించారు. ఈ నివేదికపై సమావేశంలో చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
అయితే తిరుమల లడ్డూ అపచారం పరిష్కృతిపై ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అపచార పరిహారం చేసేందుకు ఆగమ కమిటీ పలు సూచనలు చేసింది. చర్చల్లో సంప్రోక్షణ యాగం నిర్వహణలపై ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో నేడు మరోసారి ఆగమ సలహాదారులు, అర్చకులతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. భక్తుల దర్శనాలతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో నిర్ణయంపై ఆలస్యం అవుతోందని టీటీడీ వర్గాలు అంటున్నాయి.
Also Read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ
అదలాఉంటే లడ్డూ అపచారానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారని వైసీపీ పెద్దలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదాల్లో వాడింది స్వచ్చమైన నెయ్యి కాదని రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు. అప్పట్లో నెయ్యికి బదులు జంతువుల నూనెలతో ప్రసాదం తయారు చేయించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరికాదన్నారు.
కూటమి ప్రభుత్వం శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బ తీస్తోందని.. ఏదైనా జరిగుంటే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి కాని.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు.
ఈ పొలిటికల్ వార్‌లోకి నేనే సైతం అంటూ పార్టీ టైం పొలిటీషియన్ , నటుడు ప్రకాశ్‌రాజ్ సైతం ఎంటర్ అయిపోయారు. ఎక్స్ వేదికగా పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు. మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన కాబట్టి.. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని ట్వీట్‌లో ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. అనవసర భయాలు కల్పించి.. దీనిని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని.. దేశంలో మతపరమైన ఉద్రిక్తలు చాలు అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తే ఎందుకు మాట్లాడకూడదని ఫైర్ అయ్యారు. ఇంకో మతానికి సంబంధించి అంత అపరాధం జరిగితే ఊరుకునే వారా అని ప్రశ్నించారు. దీక్షలో ఉన్న ఉపముఖ్యమంత్రి అంత ఫైర్ అయింది వైసీపీ నేతలతో పాటు ప్రకాష్‌రాజ్ లాంటి వారిపై కూడా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.