E-Paper
Advertisement

Elon Musk Moon City: చంద్రుడిపై నగరం.. మస్క్ ప్లాన్ వర్క్ఔట్ అవుతుందా..!

Elon Musk Moon City: చంద్రుడిపై నగరం.. మస్క్ ప్లాన్ వర్క్ఔట్ అవుతుందా..!

Elon Musk Moon City:  ఎలాన్ మస్క్ అంటేనే.. ఇంపాజిబుల్ మిషన్‌ని.. ఈజీగా పాజిబుల్ చేసే కటౌట్. అంతా.. ఆకాశం వైపు చూసి మురిసిపోతుంటే.. ఆకాశంలో ఉన్న చంద్రుడిపై ఇళ్లని ఎలా కట్టాలా? అని ఆలోచిస్తున్నాడు మస్క్. చంద్రుడిపై రోవర్ దిగడమే గొప్ప అనుకుంటున్న ఈ కాలంలో, రాబోయే పదేళ్లలో అక్కడ ఏకంగా ఓ స్వయం సమృద్ధితో కూడిన నగరాన్ని నిర్మిస్తానని ప్రకటించడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. మార్స్‌పై మానవ ఆవాసాల ఏర్పాటుని టార్గెట్‌గా పెట్టుకున్న మస్క్.. ఇప్పుడు తన ప్రణాళికల్లో కీలక మార్పు చేసినట్లు తెలిపారు. రాబోయే పదేళ్లలోపే చంద్రుడిపై స్వయం సమృద్ధితో కూడిన నగరాన్ని నిర్మించడంపై.. స్పేస్ ఎక్స్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు. అంగారకుడితో పోలిస్తే చంద్రుడిపై నగరాన్ని నిర్మించడం చాలా వేగంగా సాధ్యమవుతుందని తెలిపారు మస్క్. అసలు.. చంద్రుడిపై నగరం నిర్మించడం సాధ్యమేనా?

భూమి తర్వాతి అడ్రస్ మూన్.. మస్క్ మాస్టర్ ప్లాన్

ఎలాన్ మస్క్.. మనందరికీ ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చూపించాలనుకోవట్లేదు. ఆయన దృష్టిలో భూమి వెలుపల మానవ మనుగడ సాగాలంటే చంద్రుడు ఒక ట్రాన్సిట్ హబ్ కావాలి. అదే.. మూన్. రాబోయే పదేళ్లలో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడమే అతని విజన్. అక్కడి సహజ వనరులను వాడుకుంటూ తనకు తానుగా విస్తరించుకునే నగరాన్ని నిర్మించడమే లక్ష్యం. స్పేస్ ఎక్స్ తయారుచేసిన అతిపెద్ద రాకెట్ స్టార్‌షిప్ ఈ మిషన్‌లో కీలకపాత్ర పోషించనుంది. మానవ నాగరికత భవిష్యత్తును కాపాడటానికి చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయడమే వేగవంతమైన, సులువైన మార్గమని మస్క్ అంటున్నాడు. చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ అంటే.. మామూలు విషయం కాదు. దానిని నిర్మించేందుకు.. భూమి నుంచి ఇటుకలు, సిమెంట్ మోసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే.. మస్క్ ఇన్-సిటు రీసోర్స్ యుటిలైజేషన్ అనే టెక్నాలజీ వాడుతున్నారు. చంద్రుడిపై ఉండే మట్టిని ఉపయోగించి.. త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవాలను నిర్మించే ఆలోచనతో ఉన్నారు. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచుని నీటిగా మార్చడం, ఆ నీటి నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ వేరు చేసి రాకెట్ ఇంధనంగా వాడటం, సోలార్ ఎనర్జీని నిరంతరం ఒడిసిపట్టి, విద్యుత్ తయారు చేసే భారీ సోలార్ ఫామ్స్ ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి.

మస్క్ స్ట్రాటజీ వెనుక లాజిక్ ఇదే

చంద్రుడిపై సిటీ అనేది మస్క్ అసలు లక్ష్యం కాదు. అతని అసలు టార్గెట్ మార్స్. చాలా ఏళ్లుగా.. మస్క్.. మార్స్‌ని ఓ వలసరాజ్యం చేయాలనే ఆలోచనలతో ఉన్నాడు. అయితే.. దానిని చేరుకోవడంలో.. టెక్నికల్, టైమ్ ముఖ్యమైన సవాళ్లుగా ఉన్నాయ్. అంగారకుడి దగ్గరికి వెళ్లాలంటే గ్రహాల అనుకూలత కోసం 26 నెలలు ఆగాలని, ప్రయాణానికి ఆరు నెలలు పడుతుంది. దీనివల్ల టెక్నాలజీని పరీక్షించడం, మౌలిక సదుపాయాలని నిర్మించడం చాలా నెమ్మదిగా, కష్టంగా మారుతుంది. అదే.. చంద్రుడిపైకి అయితే.. అనేక ప్రయోగ అవకాశాలుంటాయి. ప్రతి 10 రోజులకు ఒకసారి.. స్పేస్‌క్రాఫ్ట్ పంపొచ్చని, ప్రయాణానికి కేవలం రెండు రోజులే పడుతుందని అంటున్నాడు. దీనివల్ల.. నగర నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయొచ్చన్నారు. ఇంజనీర్లు వ్యవస్థలను పరీక్షించడానికి, వైఫల్యాల నుంచి నేర్చుకోవడానికి, డిజైన్లని వేగంగా మెరుగుపరచడానికి చంద్రుడే బెటరనే ఆలోచనతో ఉన్నాడు మస్క్.

భూమికి బ్యాకప్‌గా చంద్రుడు? మానవాళి కొత్త ప్లాన్

చంద్రుడిపై నగరం నిర్మిస్తే, అది మార్స్ మిషన్‌కు ఓ ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది. భూమి మీద ఏదైనా విపత్తు సంభవిస్తే, మానవ జాతి అంతరించిపోకుండా ఉండాలంటే.. వేరే గ్రహాలపై నివాసాలు ఉండాలని ఎలాన్ మస్క్ బలంగా నమ్ముతాడు. మానవాళిని బహుళ గ్రహ జాతిగా మార్చే మార్గం ఇప్పుడు చంద్రునిపై ఇంటికి చాలా దగ్గరగా ప్రారంభమవుతుందని మస్క్ చెబుతున్నారు. నాసా నిర్దేశించిన ప్రణాళికల ప్రకారం, ముందుగా చంద్రునిపైకి వెళ్లి.. అక్కడి నుంచి అంగారక గ్రహానికి వెళ్లడానికి మూన్‌ని లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగించాలనేది నాసా ప్లాన్. ఈ మార్పు ప్రధానంగా వేగం, లాజిస్టిక్స్, మానవాళి దీర్ఘకాలిక మనుగడను నిర్ధారించే ఆవశ్యకతతో ముడిపడి ఉంది.

చంద్రుడిపై నగరం.. మస్క్ విజన్‌కు నాసా మద్దతు

ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడూ.. సామన్యులకు అతిగానే అనిపిస్తాయ్. కానీ.. గతంలో అతను సాధించిన విజయాలను చూస్తే.. ఈ మూన్ సిటీ కల కేవలం ఊహ అని కొట్టిపారేయలేం. పైగా.. మస్క్ ఒంటరిగా ఏమీ చేయడం లేదు. నాసా నత ఆర్టెమిస్ మిషన్ కోసం స్పేస్ ఎక్స్‌ని భాగస్వామిగా ఎంచుకుంది. చంద్రుడిపై మనుషులను దించడానికి.. హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ కాంట్రాక్ట్ మస్క్ కంపెనీకే దక్కింది. చంద్రుడిపై నగరం నిర్మించాలంటే టన్నులకొద్దీ సామాగ్రిని అక్కడికి తీసుకెళ్లాలి. స్పేస్ ఎక్స్ తయారు చేస్తున్న స్టార్‌షిప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. ఇది వందల టన్నుల బరువును మోసుకెళ్లగలదు, మళ్లీ మళ్లీ ఉపయోగించడానికి వీలుగా తయారుచేశారు. ఇది విజయవంతమైతే.. రవాణా ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదు. కొన్ని కీలక సమస్యలు ఉన్నాయి. చంద్రుడిపై వాతావరణం ఉండదు, కాబట్టి ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాల నుంచి మనుషులను రక్షించడమే పెద్ద సవాల్. అక్కడ మంచుని నీటిలా మార్చాలి. ఆక్సిజన్ తయారుచేసుకోవాలి. దీనిపై ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. చంద్రుడిపై ఒక నగరాన్ని నిర్మించాలంటే.. బిలియన్ల డాలర్లు అవసరమవుతాయ్.

చంద్రుని అడుగు.. భూమి దగ్గర లైఫ్ సపోర్ట్ టెక్నాలజీ పరీక్ష

డీప్-స్పేస్ రీసెర్చ్‌కు.. చంద్రుడిని ఓ వ్యూహాత్మక మెట్టుగా చూస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. నాసా కూడా ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు, మానవ నివాసం, వనరుల వెలికితీత, శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇచ్చే దీర్ఘకాలిక మూన్ మిషన్లని ప్లాన్ చేస్తున్నాయ్. ఈ క్రమంలో.. స్పేస్ ఎక్స్ టార్గెట్ కూడా మారలేదని మస్క్ చెబుతున్నాడు. చంద్రునిపై శాశ్వత నివాస ప్రయత్నాలు ముందుకు సాగుతున్నప్పటికీ, మార్స్ నగరాన్ని నిర్మించే పని.. ఐదు నుంచి ఏడేళ్లలో ప్రారంభమవుతుందని మస్క్ సూచించాడు. చంద్రునిపై తొలి అడుగు వేయడం అనే వ్యూహం అర్థవంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఇది అంతరిక్ష సంస్థలకు, భూమికి దగ్గరగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్, టెక్నాలజీ, ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌ని డెవలప్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇక్కడ మిషన్లకు మద్దతివ్వడం ఈజీ. అవసరమైతే.. రెస్క్యూ కార్యకలాపాలు కూడా సాధ్యమవుతాయ్.

అంతరిక్ష వ్యాపారంలో పెట్టుబడిదారుల ఆసక్తి

అంతరిక్ష ఆధారిత టెక్నాలజీలకు పెరుగుతున్న కమర్షియల్ మార్కెట్‌తో పాటు శాటిలైట్ ఇమేజింగ్, డేటా సేవలు, కమ్యునికేషన్ వ్యవస్థలకు ప్రభుత్వ డిమాండ్ పెరగడం వల్ల.. అంతిరక్ష సంస్థలపై పెట్టుబడిదారుల ఆసక్తి.. ఈ మధ్యకాలంలో వేగంగా పెరిగింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఉన్న ప్రైవేట్ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. మస్క్ మూన్ ప్లాన్ గనక సక్సెస్ అయితే.. భూమికి ఆవల మానవాళికి చెందిన మొట్టమొదటి శాశ్వత నివాసంగా చంద్రుడి మారొచ్చు. చివరికి.. అంగారక గ్రహం, అంతకుమించి చేరుకునేందుకు అవసరమైన టెక్నాలజీని కూడా డెవలప్ చేయొచ్చు. అయితే.. మార్స్‌పై సిటీ నిర్మించే ప్రణాళికలని కూడా పూర్తిగా విరమించుకోలేదని మస్క్ స్పష్టం చేశారు. రాబోయే.. కొన్నేళ్లలోనే మార్స్ నగరంపైనా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి నాగరికత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, చంద్రుడిపై నగర నిర్మాణానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు మస్క్. స్పేస్ ఎక్స్ టార్గెట్.. ఎప్పటికైనా జీవాన్ని, చైతన్యాన్ని నక్షత్రాలకు విస్తరించడమేనని మరోసారి స్పష్టం చేశారు.

చిన్న అడుగులు, భారీ లక్ష్యాలు.. చంద్రుడి మిషన్ 2027

మార్స్ కంటే ముందు.. చంద్రుడిపై పెద్ద అడుగులు వేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్పేస్‌ఎక్స్‌ పెట్టుబడిదారులకు కూడా ముందుగా చంద్రుడిపై మిషన్లకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. 2027 మార్చిలో చంద్రుడిపై మానవుల్లేని ల్యాండింగ్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మస్క్ హిస్టరీ చూస్తే.. టెస్లాతో ఎలక్ట్రిక్ కార్ల రంగంలో విప్లవం తెచ్చాడు. స్పేస్ ఎక్స్‌తో.. ప్రోటో టైప్ రాకెట్లని పరిచయం చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాబట్టి.. చంద్రుడిపై నగరం అనేది.. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా, రాబోయే కొన్నేళ్లలో ఓ చిన్న రీసెర్చ్ ల్యాబ్‌లా చూడటం కచ్చితంగా సాధ్యమనే టాక్ వినిపిస్తోంది. మస్క్ ఆలోచనలు అంతరిక్ష పరిశోధనల్లో వేగాన్ని పెంచాయ్. మనం ఒకే గ్రహం మీద ఉంటే అంతరించిపోతామని, అదే మల్టీ-ప్లానెటరీ జాతులుగా మారితే చిరకాలం ఉంటామన్నదే.. మస్క్ ఫిలాసఫీ. ఇప్పుడు టార్గెట్ అసాధ్యంగా అనిపించొచ్చు. కానీ.. ప్రయత్నించకపోతే అది ఎప్పటికీ అసాధ్యంగానే మిగిలిపోతుంది. అలా.. ప్రయత్నించి, సక్సెస్ అయ్యేవాడే మస్క్.

Also Read: ఆదిశంకరాచార్యులు శుద్ద వైష్ణవుడా..? చిన్నజీయర్ వ్యాఖ్యల్లో నిజముందా..?

Story by: Anup,  Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×