E-Paper
Advertisement

Chinna Jeeyar Swamy: ఆదిశంకరాచార్యులు శుద్ద వైష్ణవుడా..? చిన్నజీయర్ వ్యాఖ్యల్లో నిజముందా..?

Chinna Jeeyar Swamy: ఆదిశంకరాచార్యులు శుద్ద వైష్ణవుడా..? చిన్నజీయర్ వ్యాఖ్యల్లో నిజముందా..?

Chinna Jeeyar Swamy: జగద్గురు ఆదిశంకరాచార్యులపై చిన్నజీయర్ స్వామి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయ్. ఆదిశంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడని, దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయ్. అద్వైత స్థాపకులు, జగద్గురువు ఆదిశంకరాచార్యులపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు పీఠాధిపతుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయ్. దేశం నలుమూలలా ఉన్న పూరీ, ద్వారక జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను స్థాపించింది ఆదిశంకరాచార్యులు కాదన్నారు. 32 ఏళ్లకే హిమాలయాలకు వెళ్లి అదృశ్యమైన శంకరాచార్యులు.. ఈ మఠాలను ఏర్పాటు చేశారనడం సరికాదని చెప్పడం చర్చనీయాంశమైంది. అసలు.. ఆయనేమన్నారో చూద్దాం..

చిన్నజీయర్ వ్యాఖ్యలతో ఆధ్యాత్మిక వర్గాల్లో కలకలం

సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో జరుగుతున్న సమతాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో.. చిన్నజీయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యులు విష్ణువును మాత్రమే పరదైవంగా నమ్మారని, ఆయన రాసిన స్తోత్రాలు, భాష్యాలు విష్ణు భక్తినే చాటుతాయనేది ఆయన వాదన. చతురామ్నాయ పీఠాలను.. ఆదిశంకరాచర్యులు స్వయంగా స్థాపించలేదని, తర్వాతి కాలంలో అవి ఏర్పడ్డాయని తెలిపారు. జగద్గురువు ఉనికినే ప్రశ్నించేలా ఉన్న ఈ వ్యాఖ్యలు.. భక్తుల మధ్య విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై.. శైవ పీఠాధిపతులు, స్మార్త బ్రాహ్మణ సంఘాలు, ఆధ్యాత్మిక గురువులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఒక్క మాటతో తేల్చేయడం తగదని పండితులు వాదిస్తున్నారు. హిందూ సమాజం మొత్తం ఏకమవుతున్న తరుణంలో.. వైష్ణవులు, శైవుల మధ్య తగాదా పెట్టడమేంటని.. శివ పీఠాధిపతి శివస్వామి ప్రశ్నించారు. చిన్నజీయర్ స్వామి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసానంద సరస్వతి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. చినజీయర్ స్వామి లాంటి వారు అవాస్తవాలు మాట్లాడటం ధర్మానికి మంచిది కాదని, తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

పంచాయతన ఆరాధనపై భిన్న వాదనలు.. విద్యారణ్య స్వామి పాత్రపై ప్రశ్నలు

శంకరాచార్యులవారు పంచాయతనాన్ని ఆరాధన చేయలేదని, ఆయన నారాయణ పరాయణుడని చిన్నజీయర్ స్వామి చెప్పడంపైనా చర్చ మొదలైంది. ఆదిశంకరాచార్యులవారి తత్వం అద్వైత తత్వమే కానీ.. ఆయన ఉత్తమ వైష్ణవుడని చెప్పడంపై వివాదం నడుస్తోంది. మన దేశాన్ని విదేశీయులు ఆక్రమిస్తున్న క్రమంలో.. వారిని ఎదుర్కొనేందుకు అంతా కలిసుంటే బాగుంటుందనే ఆలోచనతో.. విద్యారణ్యస్వామి వివిధ భక్తి మార్గాల్లో ఉండేవాళ్లందరినీ కలిపేందుకు.. పంచాయతనాన్ని పరిచయం చేశారని చిన్నజీయర్ స్వామి చెప్పారు. అయితే.. 13వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారని చినజీయర్‌ చెబుతున్నా.. నాలుగు పీఠాల్లో ఒకటైన శృంగేరి పీఠానికే విద్యారణ్య స్వామి 12వ గురువంటున్నారు. ఆయన 1380 నుంచి 1386 దాకా శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయనకన్నా ముందు.. విద్యారణ్యుల వారి సోదరుడు భారతీ తీర్థ, 1333 నుంచి 1380 దాకా 11వ పీఠాధిపతిగా ఉన్నారు. అలాంటిది.. చతురామ్నాయ పీఠాలను విద్యారణ్య స్వామి ఏర్పాటు చేయడమేమిటంటూ చిన్నజీయర్ స్వామిపై భక్తులు విమర్శలు చేస్తున్నారు.

శంకరాచార్యులు కేవలం వైష్ణవుడేనా? పండితుల ప్రశ్నలు

ఆదిశంకరాచార్యులు మతాలను సంస్కరించి, విగ్రహారాధనలోని గందరగోళాన్ని తొలగించి.. అందరికీ ఒకేతాటిపైకి తెచ్చారంటున్నారు. చిన్నజీయర్ చెప్పినట్లు ఆయన కేవలం వైష్ణవుడే అయితే.. శివునిపై శివానందలహరి, అమ్మవారిపై సౌందర్యలహరి లాంటి అద్భుత గ్రంథాలు ఎందుకు రాస్తారని పండితులు ప్రశ్నిస్తున్నారు. వేల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు, ఆయా పీఠాల గురు పరంపర ప్రకారం.. ఆదిశంకరాచార్యులు.. దేశంలోని నాలుగు దిక్కులా ధర్మాన్ని రక్షించేందుకు.. తన నలుగురు శిష్యులను పీఠాధిపతులుగా నియమించారని తెలుస్తోంది. ఇదంతా.. అద్వైతానికి, విశిష్టాద్వైతానికి మధ్య ఉన్న ప్రాచీన భేదమని, వివాదంగా మార్చడం వల్ల.. హిందూ ధర్మంలో చీలికలి వస్తాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయ్.

సమతా సిద్ధాంతం–వివాదాస్పద వ్యాఖ్యలు.. చిన్నజీయర్ మాటలపై ప్రశ్నలు

జగద్గురు ఆదిశంకరాచార్యుల పీఠాల స్థాపన, ఆయన వైష్ణవతత్వంపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక, ఆధ్యాత్మిక చర్చకు వేదికయ్యాయి. అందరూ సమానమేనని చాటిచెప్పిన రామానుజుల సిద్ధాంతాన్ని ప్రచారం చేసే చిన్నజీయర్ స్వామి, మరో గొప్ప గురువుని తక్కువ చేసేలా మాట్లాడటం వెనుక ఆంతర్యంమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే కులమతాలకు అతీతంగా అందరికీ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి.. సమతా మూర్తిగా నిలిచారు. చిన్నజీయర్ స్వామి కూడా అదే బాటలో హైదరాబాద్‌ సమీపంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి, లోకమంతా ఒక్కటేనని చాటారు. అందరినీ కలుపుకొనిపోయే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ, అద్వైత మత స్థాపకుడైన ఆదిశంకరాచార్యుల ఉనికిని, ఆయన పీఠాల ప్రాశస్త్యాన్ని ప్రశ్నించడం, పరస్పర విరుద్ధమైన ధోరణిని చూపిస్తోందని పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఆదిశంకరాచార్యుల తత్వం కుదింపు ఆరోపణలు..చిన్నజీయర్‌పై విమర్శలు

ఆదిశంకరాచార్యులు కేవలం ఓ మతానికో, కులానికో పరిమితం కాలేదు. పంచాయతన పూజ ద్వారా విష్ణువు, శివుడు, శక్తి అంతా ఒక్కటేనని నిరూపించారు. అలాంటి మహనీయుడిని కేవలం.. శుద్ధ వైష్ణవుడిగా ముద్ర వేయడం, ఆయన విశ్వజనీన తత్వాన్ని కుదించడమేనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నజీయర్ స్వామి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం రేపాయి. కొన్నేళ్ల క్రితం.. ఆయన గిరిజన దేవతలైన సమ్మక్క-సారలమ్మల గురించి మాట్లాడుతూ.. వారు గ్రామ దేవతలు అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గిరాజేశాయ్. ఆదివాసీ సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా మండిపడ్డాయి. గిరిజన సంస్కృతిని అవమానించారని కేసులు కూడా నమోదయ్యాయి. కోట్లాది మంది విశ్వాసాలను అవమానించారని ఆదివాసీలు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. అప్పట్లో ఇది అతిపెద్ద వివాదంగా మారింది. చివరకు ఆయన దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆహారంతో భక్తిని కొలవాలా? చిన్నజీయర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ

మాంసాహారం తినేవాళ్లపైనా చిన్నజీయర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయ్. మాంసం తినేవాళ్లకి బుద్ధి ఉండదని, రాక్షస లక్షణాలు వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలు.. మెజారిటీ ప్రజల ఆహారపు అలవాట్లని కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయ్. భక్తి అనేది మనసులో ఉండాలి కానీ, ఆహారంతో ముడిపెట్టి వివక్ష చూపొద్దని సామాజిక వేత్తలు తప్పుబట్టారు. ఆధ్యాత్మిక గురువులు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలనే సూచనలు వినిపిస్తున్నాయ్. చారిత్రక ఆధారాల ప్రకారం, ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలోనే దేశం నలుమూలలా పీఠాలను స్థాపించి, సనాతన ధర్మాన్ని ఓ క్రమపద్ధతిలోకి తెచ్చారు. శృంగేరి, పూరీ, ద్వారక, జ్యోతిర్మఠం పీఠాల దగ్గరున్న గురు పరంపర రికార్డులు శంకరాచార్యుల పీఠాల స్థాపనని ధ్రువీకరిస్తున్నాయ్. శంకరాచార్యులు.. శివుడిని స్తుతిస్తూ.. శివానందలహరి, విష్ణువుని స్తుతిస్తూ.. గోవిందాష్టకం రాశారు. జగద్గురు దృష్టిలో.. దైవం నిర్గుణమైనది. అంటే.. రూపం లేనిది. అయితే.. భక్తుల కోసం ఏ రూపంలోనైనా కొలవొచ్చని చెప్పారు. చిన్నజీయర్ స్వామి తన సిద్ధాంతాన్ని బలంగా వినిపించే క్రమంలో.. గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇతర వర్గాల మనోభావాలను దెబ్బతీశాయనే విమర్శలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు జరుగుతున్న చర్చ సిద్ధాంతాల మధ్య కాదు. ఓ పీఠాధిపతి హోదాలో ఉండి, మరో సంప్రదాయాన్ని, చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడం సమంజసమేనా? అనేదే.. ప్రధాన ప్రశ్న.

సంప్రదాయ భేదాలు చిచ్చుపెట్టే స్థాయికి చేరాయా?

శంకర సంప్రదాయం, ఇతర శైవ పీఠాలపై చిన్నజీయర్ స్వామి చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదం అవుతుంటాయ్. రామానుజ సంప్రదాయం ప్రకారం కేవలం శ్రీమన్నారాయణుడే పరదైవమని, మిగిలిన వారంతా ఆయన కింద ఉండేవారేనని ఆయన చెబుతుంటారు. ఇది స్మార్త బ్రాహ్మణుల్లోనూ, శివ భక్తుల్లోనూ ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు.. స్మార్తులు, వైష్ణవుల మధ్య అగాధాన్ని పెంచుతాయని, ఇది హిందూ ధర్మానికి క్షేమం కాదని ఆధ్యాత్మిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్నజీయర్ స్వామికి వేదాలపై పట్టు ఉండొచ్చు కానీ.. చారిత్రక వాస్తవాలను తన సిద్ధాంతానికి అనుగుణంగా మార్చుకోవడం సరైంది కాదనేది వాదన బలంగా వినిపిస్తోంది.

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×