AP News: రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో జైల్లో ఉన్న ఏ2 నిందితుడు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అయినా వరుస సెలవల కారణంగా ఆయన వెంటనే బయటకు రాలేకపోయారు. అదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జర్నలిస్టు కృష్ణంరాజుకు మాత్రం బెయిల్ రావడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొమ్మినేని బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నాయ్యమూర్తి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నారు.
వైసీపీ మీడియా డిబేట్‌లో కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు
రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైల్లో ఉన్న ఏ2 నిందితుడు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు శుక్రవారం సుప్రీంకోర్డు బెయిల్ ఇచ్చింది. అయితే ఆయన జైలు నుంచి బయటకు రావడానికి వరుస సెలవులు అడ్డంకిగా మారాయి. దీంతో సోమవారం వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ నెల 6న వైసీపీ మీడియా డిబేట్‌లో రాజధాని ప్రాంత మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎనలిస్టు కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ప్రోత్సహించినట్లుగా మాట్లాడిన కొమ్మినేనిని ఏ2గా, మీడియా యాజమాన్యాన్ని ఏ3గా పేర్కొంటూ తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంలో పిటీషన్
ఈ కేసులో నిందితుడైన కొమ్మినేనిని ఈ నెల 9న పోలీసులు అరెస్టు చేసి 10న మంగళగిరి కోర్టులో హాజరు పరచగా ఆయనకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే, ఆయన దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అది విచారణలో ఉన్న సమయంలోనే.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్ ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు రాకపోవడంతో కొమ్మినేని విడుదల జాప్యమైంది. మరుసటి రోజు రెండవ శనివారం సెలవు అయినప్పటికీ మెజిస్ట్రేట్‌ను ఇంటి వద్ద కలసి బెయిల్ ఆదేశాలు తీసుకోవాలని ఆయన న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో సోమవారం న్యాయవాదులు ట్రయల్ కోర్టులో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులు పొందనున్నారు.
కృష్ణంరాజుకు బెయిల్ అంత ఈజీ కాదంటున్న నిపుణులు
అదలావుంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొమ్మినేనికి వైసీపీకి చెందిన లీగల్ సెల్ న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే, కృష్ణంరాజు మాత్రం సొంతంగా న్యాయవాదిని పెట్టుకున్నట్లు తెలిసింది. అయితే ఇదే కేసులో కృష్ణంరాజుకు బెయిలు అంత వీజీ కాదని అంటున్నారు న్యాయనిపుణులు. కొమ్మినేనికి బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను, ఆయనకు బెయిలు ఇవ్వడానికి సుప్రీం చెప్పిన కారణాలను బట్టి చూస్తే కృష్ణంరాజుకు బెయిలు మంజూరు కావడం అంత ఈజీ కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.
Also Read: కేదర్ యాత్ర స్టార్ అయ్యాక 5 ప్రమాదాలు.! ఆ దోషం వల్లనే.?
మరింత జాగ్రత్తగా ఉండాలని కొమ్మినేనికి హెచ్చరిక
అమరావతిపై, అమరావతి మహిళలపై అసహ్యకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను కొమ్మినేని చేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో సుప్రీం కోర్టులో ఆయనకు బెయిలు దక్కింది. ఒక మీడియా చానెల్ లో ప్రసారమైన డిబేట్ లో యాంకర్ పాత్ర పోషించిన కొమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేయ లేదనీ, ఎనలిస్టుగా ఉన్న కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించలేదు.. నవ్వారు అంతే..నవ్వినంత మాత్రాన అరెస్టు చేయడం సబబు కాదని సుప్రీం అభిప్రాయపడింది. అదే సమయంలో ఇక ముందు ఇటువంటి షోలు నిర్వహించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ కొమ్మినేనిని హెచ్చరించింది.
అభ్యంతరకరంగా ఉన్న కృష్ణంరాజు వ్యాఖ్యలు
అయితే ఇదే కేసులో అరెస్టైన కృష్ణంరాజు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినా బెయిలు దక్కే అవకాశాలు మృగ్య మేనని అంటున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా.. దానిపై ఒకింత నియంత్రణ ఉండాలన్నది కూడా రాజ్యాంగంలో ఉందని అంటున్నారు. ఈ కారణంగానే డిబేట్ లో జర్నలిస్టు అమరావతిపై చేసిన వ్యాఖ్యల తీవ్రత, ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంత మహిళలను అవమానించేలా, కించపరిచేలా ఉన్న ఆయన మాటలు కచ్చితంగా అభ్యంతరకరమేనని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కొమ్మినేనికి బెయిలు ఇస్తూ పరోక్షంగా పేర్కొందనీ అంటున్నారు. అనలిస్టు చేసిన తప్పుకు యాంకర్ ను శిక్షిస్తారా? అన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో కృష్ణంరాజు చేసినవి కచ్చితంగా అనుచిత వ్యాఖ్యలేనని పరోక్షంగా చెప్పడమే అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కృష్ణంరాజుకు బెయిలు మంజూరు కావడం అంత ఈజీ కాదని చెబుతున్నారు.
story by Apparao, Bigtv live