Satyanarayana Rajya Sabha Seat: బీజేపీ అధిష్టానం ఉభయగోదావరి జిల్లాలకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న భూపతి రాజు శ్రీనివాసవర్మ బీజేపీని రాష్ట్రంలోనూ, ఉభయగోదావరి జిల్లాలోనూ బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నారు. ఆ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ పాకా సత్యనారాయణ నేడు ఏకంగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. పాకా సత్యనారాయణకు రాజ్యసభ సీటు దక్కడం లో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చేసిన కృషి పట్ల బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీలో అసలు కంటే కొసరుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే మాట గత కొన్నేళ్లుగా వినిపిస్తూ వస్తోంది. ముఖ్యంగా పారాష్యూట్ నాయకులకే ఎక్కువ టికెట్స్ ఇచ్చి అసలు సిసలు కార్యకర్తలను పక్కన పెడుతున్నారనే అసంతృప్తి పార్టీ క్యాడర్లో ఉంది. దాన్ని పోగొట్టుకునేందుకే అధిష్టానం ముందు నుంచి పార్టీని నమ్ముకున్న వారికి పెద్ద పీట వేస్తోందంట.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి
ఏపీ బీజేపీలో కష్టపడే వారి కంటే వలస నాయకులకే అవకాశాలు వస్తున్నాయన్న అసంతృప్తి కాషాయ శ్రేణుల్లో ఉంది.అప్పట్లో కన్నా లక్ష్మీ నారాయణ, ప్రస్తుతం పురంధేశ్వరిలు వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన ఆరు లోక్ సభ సీట్లలో ఐదు సీట్లను పారాష్యూట్ బ్యాచ్ కే ఇచ్చారు. నర్సాపురం ఎంపీ టికెట్ మాత్రం ఎప్పటి నుంచో బీజేపీని నమ్ముకొని ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ ఇచ్చింది . శీనివాసవర్మ గెలిచాక నరేంద్ర మోడీ క్యాబినేట్‌లో సహాయ మంత్రి పదవి ఇచ్చి గౌరవించి అసలు సిసలు బీజేపీ కార్యకర్తకు ఎప్పటికైనా ప్రాధాన్యత దక్కుతుందన్న నమ్మకాన్ని క్యాడర్‌కు కల్పించగలిగారు. గత ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన సోము వీర్రాజును తాజాగా ఎమ్మెల్సీ చేసి ప్రాధాన్యత ఇచ్చింది
ఆర్‌ఎస్ఎస్ భావజాలం కలిగిన సీనియర్లకు ప్రాధాన్యత
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్న పాకా వెంకటసత్యనారాయణను అనూహ్యంగా రాజ్యసభకు ఎంపిక చేసి అందరినీ ఆశ్యర్య చకితుల్ని చేసింది. అది బీజేపీలో ఓ సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా కాషాయశ్రేణులు భావిస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఈ స్థానంలో పాక వెంకటసత్య నారాయణపేరు ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో ఏపీలోని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కర సేవకులుగా పనిచేసి, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన నేతలకు తగు ప్రాధాన్యత ఇచ్చే పనిలో బీజేపీ పెద్దలు పడినట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే పాకా సత్యనారాయణకి అదృష్టం కలిసి వచ్చింది. ఆర్ఎస్ఎస్‌కు చెందిన సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే కేంద్ర మంత్రిగా వర్మ.. ఎమ్మెల్సీగా వీర్రాజు.. రాజ్యసభ సభ్యుడిగా సత్యనారాయణకు అవకాశాలు దక్కాయంటున్నారు.
నరసాపురం ఎంపీగా 2.75 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన శ్రీనివాసవర్మ
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నుండి కూటమి మద్దతుతో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపతి రాజు శ్రీనివాస వర్మ సుమారుగా రెండు లక్షల 75 వేల ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు. అప్పట్లో ఆయనకు వచ్చిన మెజార్టీ, కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడం సంచలనం అయింది. ఇక తాజాగా చూస్తే సుమారు 45 సంవత్సరాల పాటు బిజెపిలో పలు పదవులను దక్కించుకున్న భీమవరం గౌడ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
సత్యనారాయన విషయంలో పనిచేసిన శ్రీనివాసవర్మ లాబీయింగ్
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి పార్టీ నుండి పాకా సత్యనారాయణకు అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీరా చూస్తే మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి కు చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో పాకా సత్యనారాయణ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బిజెపి శ్రేణులు నిరుత్సాహపడ్డారు. ఇంతలో పాకా సత్యనారాయణకు రాజ్యసభ దక్కింది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఢిల్లీ పెద్దల దగ్గర చేసిన లాబీయింగ్ కారణంగానే పాకా సత్యనారాయణకు రాజ్యసభ సీటు దక్కిందంట. పాకా సత్యనారాయణ 45 సంవత్సరాలుగా బీజేపీలో పనిచేస్తుంటే, శ్రీనివాస వర్మకు బిజెపితో 35 ఏళ్ల అనుబంధం ఉంది.
2019లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాసవర్మ
ఓటమి తప్పదని తెలిసినా కూడా 2019లో నరసాపురం పార్లమెంటు నుండి బిజెపి అభ్యర్థిగా శ్రీనివాస వర్మ పోటీ చేశారు. బీజేపీ అధిష్టానం ఏ పిలుపు ఇచ్చినా శ్రీనివాస వర్మ ఆ కార్యక్రమాన్ని తన భుజం మీద వేసుకొని విజయవంతం చేశారు. అందుకే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను పార్టీ అధిష్టానం నిలబెట్టి, గెలిచాక మంత్రి పదికి సైతం కట్టబెట్టింది. క్షత్రియ వర్గానికి చెందిన శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడం, కాపు వర్గానికి చెందిన సోమువీర్రాజుకి ఎమ్మెల్సీ పదవి, తాజాగా చూస్తే గౌడ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు రాజ్యసభ స్థానం దక్కాయి. దాన్ని బట్టి చూస్తే బీజేపీ ముఖ్యంగా ఉభయ గోదావరి గోదావరి జిల్లాలలో ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని, పార్టీని పటిష్టపరచడానికి ఆర్ఎస్ఎస్ భావజాలం గల సీనియర్ నాయకులకు పదవులు కట్టబెడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read: కేసీఆర్ సభ.. ఆ ఇద్దరిని కలిపింది
భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ సత్యనారాయణ
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా బీజేపీ పునాదులు పటిష్టపర్చుకోవడానికి స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తోంది. భీమవరంకు చెందిన భూపతి రాజు శ్రీనివాసవర్మ పార్టీపరంగా తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో తన హవాను చాటుకుంటున్నారు. ఇదే సమయంలో భీమవరంకు చెందిన పాకా సత్యనారాయణకు కూడా బిజెపి అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో ఉభయగోదావరి జిల్లాలలో బీజేపీ మరింత స్ట్రాంగ్ అయ్యే పరిస్థితి ఉందంటున్నారు
పాకా సత్యనారాయణ ఇంటికి వెళ్లిన పవన్‌కళ్యాణ్
గతేడాది జరిగిన ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలలో భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా పాకా సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే పాకా సత్యనారాయణకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవి దక్కుతుందని అందరు భావించారు. ప్రస్తుతం అదే నిజమైంది. ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని భావించిన పాకా సత్యనారాయణ నేడు ఆయన కూడా ఊహించని విధంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏదేమైనా బీజేపీ పెద్దల అనూహ్య నిర్ణయం హాట్‌టాపిక్‌గా మారిందిప్పుడు.