Nalgonda Politics: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనపడుతుంది . వరంగల్‌లో బీఆర్ఎష్ రజతోత్సవం సందర్భంగా జరిగిన కేసీఆర్ సభ తర్వాత జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఒకటయ్యారు . నేతలందరూ ఒకే వేదిక పంచుకుని గులాబీబాస్‌పై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టడానికి కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడుతున్నారు. అసలు కాంగ్రెస్, సోనియాగాంధీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని ధ్వజమెత్తున్నారు. అసలు కేసీఆర్ సభతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతల మధ్య అంత ఐక్యత ఎందుకు కనిపిస్తోంది?
ఏకతాటిపైకి వచ్చిన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు
ఉప్పు -నిప్పులా ఉండే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు . తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే విలన్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా మంత్రులు కోమటిరెడ్డ వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు భగ్గుమన్నారు . దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టి కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, అలాంటి పార్టిని పట్టుకొని కేసీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతునారని ఫైర్ అయ్యారు.
గతంలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిల మధ్య గ్యాప్
మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతూ వచ్చాయి . ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలందరికీ అడిగిన పనులు చేసి పెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు . తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులను పట్టించు కోలేదు . ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రి అయ్యాక జిల్లాలో అన్ని సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఇరిగేషన్ సంబంధిత పనులు చేయించుకుంటూ ఐక్యంగా ముందుకు పోతున్నారు .
ఉత్తమ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి కూడా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు , నల్లగొండ పరిధిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉత్తమ్ చొరవతో తీసుకొస్తూ ఆయనతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. గతంలో జిల్లా స్థాయి మీటింగుల్లో మంత్రి పాల్గొన్న ఎమ్మెల్యేలు కొందరు హాజరు కాని పరిస్థితి ఉండేది . తాజాగా నల్లగొండలో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల శంకుస్థాపనకు మంత్రి ఉత్తమ్‌ని ఆహ్వానించి సభ ఏర్పాటు చేసారు మంత్రి కోమటిరెడ్డి . నల్లగొండ పట్టణం లో వెలాది మంది తో భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ నేతలో జోష్ పెంచారు . కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఒకే వేదిక పై పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువే. కాని తాజా సభలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు జిల్లాకు చెందినఇద్దరు ఎంపి లు, ఎమ్మెల్యేలుఅంతా ఒకే వేదిక పంచుకొని బీఆర్ఎస్‌పై హాట్ కామెంట్స్ చేసారు. జిల్లాలో 12స్థానాలకు 11గెలిచామని, వచ్చే ఎన్నికలో 12కు 12 గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: చీరాల నుండి కరణం జంప్? ఆయనే కారణమా?
రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ -కోమటిరెడ్డి సీఎం స్థాయి వ్యక్తులని, వారి గురించి మాట్లాడే అర్హత లేని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్‌కు, ఆ పార్టీ నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని మండి పడ్డారు.
కేసీఆర్ సభతో కాంగ్రెస్ నేతలంతా ఒకటయ్యారని జిల్లాలో ప్రచారం
మొత్తమ్మీద కేసీఆర్ సభతో కాంగ్రెస్ నేతలంతా ఒక్కటయ్యారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది . ఇదే ఐక్యత ఇలాగే కొనసాగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని పార్టీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తమకు కలిసి వస్తాయనుకున్న బీఆర్ఎస్‌కి కాంగ్రెస్ నేతలంతా ఒక్కటి కావడం మింగుడుపడటం లేదంట.
కాంగ్రెస్ నేతల విమర్శలకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కౌంటర్
అందుకే కేసీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఉత్తమ్ -కోమటిరెడ్డి సోదరులపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌పై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు, వారికి కౌంటర్ ఇచ్చిన జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా నేతలే అవ్వడం గమనార్హం. గతంలో కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే హరీష్ రావు , కేటీఆర్‌ల కౌంటర్ ప్రెస్‌మీట్లు ఉండేవి అయితే ఈ సారి జగదీశ్‌రెడ్డి మాట్లాడటం వెనుక కేసీఆర్ గైడెన్స్ ఉందంటున్నారు . కాళేశ్వరం లో జరిగిన అవినీతి , NDS రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ నేపధ్యంలో.. తమ బండారం బయటపడుతుందని ఉత్తమ్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది . మొత్తం మీద కేసీఆర్ సభ నల్గొండ జిల్లా రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.