YSRCP: హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అనాధలా తయారైందంట. ఆ సెగ్మెంట్లో వైసీపీకి ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. పార్టీ ఇన్చార్జ్‌ని కూడా జగన్ ప్రకటించారు. ఆ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో వైసీపీకి మంచి కేడర్ కూడా ఉంది. ఎంత మంది నాయకులున్నా వారంతా తమ సొంత లెక్కలతో ఎవరి పనులు వారు చూసుకుంటుండటంతో పార్టీ శ్రేణుల్ని పట్టించుకునే నాయకుడే లేకుండా పోయాడంట. దాంతో పాయకరావుపేటలో ఇక వైసీపీ పని అయిపోయినట్లే అన్న చర్చ జరుగుతోంది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి గడ్డుకాలం నడుస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన కంబాల జోగులు కంటికి కనిపించడం మానేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల ముందు రాజ్యసభకు వెళ్ళిన ఎంపీ గొల్ల బాబురావు నియోజకవర్గంలోని క్యాడర్ వైపు కన్నెత్తి చూడలేదు.. నియోజకవర్గానికి కంబాల జోగులు ఇన్చార్జిగా, గొల్ల బాబూరావు పర్యవేక్షకుడిగా ఉన్నా నడిపించే నాయకుడు లేక చోటా మోటా నాయకులతో సహా కార్యకర్తలు కంగారు పడిపోతున్నారు.
అసలే పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోం మంత్రి కావడం, జనసేన క్యాడర్ మొత్తం హోంమంత్రికి మద్దతుగా ఉండడంతో వైసీపీ క్యాడర్‌కు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.. నియోజకవర్గంలో వైసీపీ అంటే ప్రాణాలు పెట్టే కేడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎంతమంది ఉంటారు, ఎంతమంది పక్క పార్టీల వైపు చూస్తారో అర్థం కావడంకాని పరిస్థితి నెలకొంది.
అనకాపల్లి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం పాయకరావుపేట.. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే ప్లస్ హోం మంత్రి, వైసీపీకి ఓ రాజ్యసభ సభ్యుడు, ఓ ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తొలిసారి టిడిపి నుంచి వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో గొల్ల బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత రాష్ట్ర హోంమంత్రి అయ్యారు.
నాలుగు మండలాలు ఉన్న పాయకరావుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా వైసీపీకి నాయకులతోపాటు కిందిస్థాయి క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది. అయితే 2024 ఎన్నికల్లో టిడిపికి జనసేన బిజెపి మద్దతు ఉండడంతో టీడీపీ గెలుపు సునాయాసం అయింది. టమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచి, నియోజకవర్గానికి హోం మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నా, అక్కడ వైసీపీకి సరైన నాయకుడు లేకపోవడంతో కిందిస్థాయి క్యాడర్ మొత్తం డైలమాలో పడిపోతుంది.
పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట, కోట ఊరుట్ల, నక్కపల్లి, ఎస్. రాయవరం నాలుగు మండలాలు ఉన్నాయి. వైసీపీకి కోటవురట్ల ఎస్.రాయవరం మండలాల్లో బలమైన క్యాడర్ ఉంది. మండల స్థాయిలో ప్రతి మండలానికి బలమైన నాయకులు ఉన్నారు. 024 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా 2014, 19 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన కంబాల జోగులను తీసుకుని వచ్చి పోటీ చేయించారు. సౌమ్యుడుగా పేరున్న కంబాల జోగులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసుకున్న కూటమి బలం ముందు తేలిపోయారు.
Also Read: బాపట్లలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ.. గ్యాప్ ఫిల్ చేసి విమర్శకుల నోళ్లు మూయిస్తారా?
ఎన్నికల్లో ఓటమి తర్వాత కంబాల జోగులు పాయకరావుపేట వైపు చూడటం మానేశారు. విద్యుత్ బిల్లుల పెంపునకు సంబంధించి జగన్ పిలుపు మేరకు నిర్వహించిన నిరసన రోజు తప్ప మళ్లీ పాయకరావుపేటలో కనిపించలేదు. యోజకవర్గంలోని కంబాల జోగులు వైసిపి కార్యాలయాన్ని కూడా ఎత్తేశారు. దాంతో వైసీపీ అధిష్టానం ఆందోళనలకు నిరసనలకు పిలుపునిచ్చినా, ఇతర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశాలిచ్చినా నాలుగు మండలాల నాయకులను నడిపించే వాళ్ళు లేకపోవడంతో అందరూ సందిగ్ధంలో పడుతున్నారు.
2019 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెలిచి 2024 ఎన్నికలకు ముందు రాజ్యసభకు వెళ్ళిన గొల్ల బాబురావు కూడా ఢిల్లీ నుండి ఆంధ్రాకు వస్తే విశాఖలో తన నివాసానికి వెళ్లడం తిరిగి ఢిల్లీ వెళ్లడం తప్ప పాయకరావుపేట నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు. గొల్ల బాబురావు ఎస్సీ సామాజిక వర్గం నాయకుడు కావడంతో 2024 ఎన్నికలకు ముందు రాజ్యసభకు పంపిస్తే ఎస్సీల ఓటు బ్యాంకు వైసీపీకి భారీగా వస్తుందని భావించిన జగన్‌కు సీన్ రివర్స్ అయింది.
వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయాక ఆ పార్టీ పట్ల ఎంపీ గొల్ల బాబురావు వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఎలాగో ఆరేళ్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతాం.. ఎలాంటి వివాదాలు లేవు కాబట్టి పార్టీ మారకపోయినా ఎలాంటి ప్రమాదం లేదు అనే ఆలోచనలో ఉన్న గొల్ల బాబురావు నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేసి తన పనేదో తాను చూసుకుంటున్నారు. ఇక ఇదే నియోజకవర్గ నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యనారాయణ రాజు కూడా వైసీపీతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజుకు బావమరిది అయిన దత్తుడు బాబుకు వైసీపీలో ఇంపార్టెన్స్ పెరుగుతుండడంతో ఆయన పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే సొంత నియోజకవర్గంలో పక్క జిల్లాకు చెందిన కంబాల జోగులు ఇన్చార్జిగా ఉన్నా సూర్యనారాయణ రాజు పట్టించుకోవడం లేదంట. లా ఒకే నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యునిగా గొల్ల బాబురావు, ఎమ్మెల్సీగా సూర్యనారాయణ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే, హోం మంత్రి వంగలపూడి అనితకు ధీటైన నాయకుడు లేకుండా పోయాడు.
ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ అయిన పాయకరావుపేట నియోజకవర్గంపై దృష్టి పెట్టకపోతే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కీలకంగా ఉన్న నాయకులతో పాటు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ సైతం పార్టీ మారితే పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇక ఎప్పటికీ కోలుకోలేదు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. న్నికలు జరిగి ఏడు నెలలు గడిచినా ఇంకా నియోజకవర్గాలపై జగన్ ఎందుకు దృష్టి పెట్టలేక పోతున్నారో అర్థం కావట్లేదని లోకల్ నాయకులు అంటున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.