అటు అమరావతిలో 24 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రభుత్వం ఇటీవలే చేపట్టింది. 36 కోట్ల రూపాయలతో నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ముళ్ల కంపలు, పొదలను తొలగించాలనుకున్నారు. అయితే భారీ వర్షాలు, వరదలతో ఆ పనికి కాస్త ఆటంకాలు వచ్చాయి. బుడమేరు వరద సహాయాల్లో పాల్గొనేందుకు ప్రొక్లెయిన్లను విజయవాడకు తరలించారు. మరికొన్ని రోజుల్లోనే ఈ పనులు పూర్తవనున్నాయి.
2015లో అమరావతి కోసం 34,281 ఎకరాలను రైతుల నుంచి లాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. మరో 4,300 ఎకరాలను సర్కారు ప్రత్యేకంగా సేకరించింది. 15,167 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మొత్తంగా 53 వేల 748 ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిపేలా ప్లాన్ చేశారు. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 6 క్లస్టర్లుగా విభజిస్తూ అమరావతి సిటీ నిర్మాణం ఉండబోతోంది. అయితే గత ఐదేళ్లు అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో భూములు ఇచ్చేందుకు కొందరు వెనుకంజ వేశారు. అయితే వారి డౌట్లను మంత్రి నారాయణ క్లియర్ చేస్తున్నారు. లాండ్ పూలింగ్ తోనే బెనిఫిట్ ఉంటుందని చెబుతున్నారు. రాజధాని రైతులకు కౌలు డబ్బులు జమ చేశారు, ఎవరు ముందు సైట్ ఇస్తే బెస్ట్ ప్లాట్ ఇచ్చేలా చూస్తున్నారు.
ఆంధ్రుల రాజధాని ముందుకు కదలాలంటే మొదటగా కావాల్సింది నిధులే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇస్తామన్నారు. అంతే కాదు జాతీయ, అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు సేకరించుకునేందుకు అవకాశం కూడా కల్పించింది. దీంతో ప్రపంచబ్యాంక్ నుంచి నిధుల సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఇప్పటికే ఏపీలో రెండుసార్లు పర్యటించారు. వారికి సీఎం చంద్రబాబు రాజధాని గురించి పూర్తిగా వివరించారు.
Also Read: సీఎం చంద్రబాబుతో సునీత దంపతులు.. అజ్ఞాతంలో ఆ నేత, రేపో మాపో..
రుణం తీర్చడానికి ఎంత సమయం పడుతుంది? ఎలా తీరుస్తారు తదితర అంశాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. సంతృప్తి చెందిన వరల్డ్ బ్యాంక్ నిధుల మంజూరుకు సానుకూలత వ్యక్తం చేసింది. 2016 అంచనాల ప్రకారం అమరావతి పూర్తిస్థాయి నిర్మాణం, మౌలిక వసతులు, సౌకర్యాలకు ఓవరాల్ గా 1.09 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమన్న అంచనాలు వేశారు. ఇందులో క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఫేజ్ 1 అంచనా వ్యయం 51,687 కోట్ల రూపాయలుగా ఉంది. మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇప్పటికిప్పుడు 40 వేల కోట్ల రూపాయలు అవసరమని లెక్కలేస్తున్నారు.
2050 నాటికి ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని మార్చాలనేది తమ ఉద్దేశమని, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసుకునే విధంగా సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు రుణాలు ఇచ్చే సంస్థలకు వివరిస్తున్నారు. అమరావతికి కేంద్రం నిధులు టైమ్ టూ టైమ్ ఇస్తుందని ఆశిస్తున్నామని, ఏ పనితో వచ్చినా అన్నీ ఒకే చోట ఫైల్ మూవ్ అయ్యేలా ఆఫీసుల డిజైన్ చేస్తున్నామంటున్నారు. ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో అమరావతి ఒకటి అవుతుందన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఉంది. అందుకే రాజధాని పనులు ఎక్కడా ఆగకుండా చూసుకుంటున్నారు.
ఇక అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ క్రమంగా పెంచుతున్నారు. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి 56 కిలోమీటర్ల మేర ట్రాక్ కోసం ఖమ్మం, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇటీవలే అనుమతులు కూడా వచ్చేశాయి. సర్వేలు కూడా పూర్తయ్యాయి. అమరావతిని పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించేందుకు గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు ఉండబోతున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, మెట్రో ట్రైన్ నెట్ వర్క్ , ఐకానిక్ టవర్లు, బిల్డింగ్ ల నిర్మాణాలు, పునరుత్పాదక శక్తి వనరులతో నడిచేలా సిటీ నిర్మాణం జరగబోతోంది. ఎలక్ట్రిక్ బస్సులు, సైకిళ్లు, వాటర్ ట్యాక్సీలు, మెట్రోలు.. ఇలా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంతా అడ్వాన్స్ డ్ గా కొత్త రాజధాని ఉండబోతోంది. టాప్ ఫైవ్ లో ఉండడం ఖాయమే. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ సాక్షాత్కరించడం కూడా ఖాయమే.
అమరావతి ఆంధ్రుల సెంటిమెంట్. రాజధాని త్వరగా కంప్లీట్ కావాలన్న ఉద్దేశంతో జనం ఉన్నారు. అందులో భాగంగానే స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. ప్రజా రాజధాని కోసం మేము సైతం అంటూ చాలా మంది ముందుకొస్తున్నారు. తాము దాచుకున్న మొత్తంలో నుంచి కొంత ఇస్తున్నారు. ఇదంతా అమరావతిపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్ ఏంటో చెబుతోంది.