BigTV English

Independence Day: వెలుగు నీడల స్వాతంత్ర్యం

Independence Day: వెలుగు నీడల స్వాతంత్ర్యం

India: ఒక స్వతంత్ర దేశంగా భారత్ నేటితో.. 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. శతాబ్దాల తరబడి విదేశీయుల పాలనలో మగ్గిపోయిన మన దేశం స్వాతంత్ర పోరాటంతో ఆ బానిస సంకెళ్లను తెంచుకుని సగర్వంగా నిలబడి ప్రపంచ దేశాలను ఆశ్చర్య పరచిన సందర్భం అది. నాటి నుంచి నేటి వరకు సాగిన ప్రస్థానంలో ఎన్నో అవరోధాలొచ్చినా ఒక స్వతంత్ర దేశంగా, సర్వసత్తాక రాజ్యంగా మన భారత్ మనగలిగింది. ఒకవైపు తన బహుళత్వపు విలువలను నిలబెట్టుకుంటూనే, కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పులను స్వాగతిస్తూ సాగిన ఈ ప్రయాణంలో దేశం ఎన్నో సమున్నత ప్రమాణాలను ఆవిష్కరించింది. స్వాతంత్ర్యం వచ్చిన నాడు విదేశాల నుంచి వచ్చే ఆహార ధాన్యాల నౌకల కోసం వేచి చూసిన మన భారతం నేడు ప్రపంచపు అయిదవ ఆర్థిక శక్తిగా సగర్వంగా ప్రపంచం ముందు నిలబడింది.


గతానికీ, వర్తమానానికీ జరిగే అనంత సంభాషణే చరిత్ర అంటాడు ఈహెచ్‌ ‌కార్‌. దేశ చరిత్రలో సముజ్వల ఘట్టమైన స్వరాజ్య పోరాటం గురించి నేడు మననం చేసుకోవటం సముచితం. చరిత్రాత్మకమైన ఆ పోరాటమే కుల, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా జాతిని నాడు ఒక్కటి చేసింది. సాంస్కృతిక ఐక్యతే తప్ప, సామాజిక, రాజకీయ ఐక్యత లేని దేశాన్ని ఒక మాట మీదకు తెచ్చిన ఘనత మన స్వాతంత్ర్య సమర యోధులదే. నాటి పోరాటయోధుల సమున్నతమైన ఆలోచనలు, వారు రూపొందించిన రాజ్యాంగం దేశాన్ని నేటికీ ఐక్యంగా నడిపిస్తున్నాయి. కనుక ఈ 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. ఆ మహనీయులందరినీ స్మరించుకోవడం జాతి ముందున్న బాధ్యత.

సిపాయిల తిరుగుబాటుతో మొదలైన 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర పోరాటం, దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీజీ తిరిగి రావటం, సత్యం, అహింసల శక్తిని అక్షర జ్ఞానం లేని కోట్లాదిమందికి తెలియజేయటం, తిలక్‌ ‌సంపూర్ణ స్వరాజ్య నినాదం, పోరుబాటలో నడిచిన భగత్ సింగ్ వంటి విప్లవ వీరుల త్యాగం, చలో ఢిల్లీ పిలుపు నిచ్చిన నేతాజీ ‌సాహసం, రేపటి భారతపు సమస్యలను ముందుగానే చెప్పి, వాటికి పరిష్కారాలు సూచించిన అంబేద్కర్ దూరదృష్టి జాతి జనులను స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేశాయి. కొన్ని సందర్భాలలో ఆంగ్లేయుల దమనకాండతో ఈ పోరాటం చల్లారిన సమయంలో, ఎందరో వీరులు ఆ స్వాతంత్య్ర ఆకాంక్షలను సజీవంగా ఉంచేందుకు చేసిన పోరాటాలనూ మనం నేడు స్మరించుకోవాల్సి ఉంది. 1885 నాటికే మహారాష్ట్ర, ఉమ్మడి బెంగాల్‌, ‌మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలలో కొన్ని చురుకైన ప్రజా సంఘాలు ఐక్య పోరాటాలే.. భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటుకు భూమికను ఏర్పరచాయి. మరోవైపు.. కాంగ్రెస్‌ ఆవిర్భవించడానికి వందేళ్ల క్రితమే దేశంలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాలు స్వేచ్ఛా నినాదాలతో మారుమోగాయి. గిరిజనోద్యమాలు, రైతాంగ ఉద్యమాలుగా అవి చరిత్రకెక్కాయి. అయితే, తొలినాళ్లలో కాంగ్రెస్‌ చేపట్టిన ‘ప్లీ.. ప్రే.. పిటీషన్’ ధోరణిని కాదని అదే కాంగ్రెస్‌కు చెందిన తిలక్ పూర్ణ స్వరాజ్యం కోసం నినదించారు. తర్వాత అదే కాంగ్రెస్ నడిపించిన ‌బెంగాల్‌ ‌విభజన కారక వందేమాతర ఉద్యమం, 1919 నాటి సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాలు జాతిని ఐక్యంచేసి దేశాన్ని తెల్లవారి పాలన నుంచి విముక్తం చేశాయి.


Also Read: CM Revanth Reddy: సీతారామ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇక వర్తమానానికి వస్తే.. మరోవైపు దేశంలో పేదలకు, పెద్దలకు మధ్య అంతరాలు వేగంగా, ఊహించనంత స్థాయిలో పెరిగిపోతున్నాయి. దేశంలోని 100 మంది వద్ద రూ. 57 లక్షల కోట్ల సంపద పోగుపడిందని నివేదికలు చెబుతుండగా, 18 కోట్ల మంది రెండు పూటలా మంచి ఆహారానికి నోచుకోవటం లేదని తేల్చాయి. 15 – 49 ఏళ్ళ వయసున్న మహిళల్లో దాదాపు 51 శాతం మంది రక్తహీనతతో, ఐదేళ్ళలోపు పిల్లల్లో 35 శాతం మంది ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకుందనే మాట నిజమే అయినా పార్టీలలో పెరుగుతున్న ఏకపక్ష పోకడలు, ఆధిపత్య భావజాలం ఆందోళనను కలిగిస్తున్నాయి. భారీ మెజారిటీలతో గెలిచిన ప్రభుత్వాలు దేశపు బహుళత్వపు విలువలకు విఘాతం కలిగించేలా, చర్చకు అవకాశం ఇవ్వకుండానే చట్టాలు చేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యాంగం ప్రవచించిన విలువలు తరచూ అపహాస్యం పాలయ్యే ఘటనలు రాజకీయాలలో జరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా అందరికీ సమాన అవకాశాలు లేని కారణంగా ఒకే భారత దేశంలో అనేక దేశాలున్నట్లు అనిపిస్తోంది. ఈ వైరుద్ధ్యాలను అర్థం చేసుకుని ఇకనైనా స్వాతంత్ర్య ఫలాలను చిట్టచివరి మనిషి వరకు అందేలా మన పాలకులు ప్రయత్నిస్తేనే.. మన పూర్వీకులు పోరాడి సాధించిన స్వరాజ్యానికి తగిన ఫలితం దక్కుతుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×